'టాప్' లేపిన హైదరాబాద్
వడోదర:రంజీ ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. గ్రూప్-సిలో జమ్మూ కశ్మీర్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 286 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. 404 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్మూ కశ్మీర్ను 117 పరుగులకే కుప్పకూల్చి మరో ఘన విజయాన్ని చేజిక్కించుకుంది. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ నాలుగు వికెట్లతో జమ్మూ పతనాన్ని శాసించగా, ఆకాశ్ భండారీ మూడు వికెట్లతో సత్తాచాటాడు.
42/4 ఓవర్ నైట్ స్కోరు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన జమ్మూ వరుస వికెట్లను చేజార్చుకుని ఓటమి పాలైంది. నిన్నటి ఆటలో 17.0 ఓవర్లు ఆడిన జమ్మూ.. ఈరోజు ఆటలో దాదాపు 20.0 ఓవర్లు మాత్రమే ఆటను కొనసాగించింది. జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో రామ్ దయాల్(33)దే అత్యధిక స్కోరు.
ఈ మ్యాచ్ లో విజయంతో హైదరాబాద్ గ్రూప్లో టాప్ స్థానాన్ని ఆక్రమించింది. జమ్మూపై విజయంతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న హైదరాబాద్.. ఇప్పటివరకూ గ్రూప్లో టాపర్గా ఉన్న ఆంధ్రను వెనక్కునెట్టింది. ఇది హైదరాబాద్ కు వరుసగా మూడో విజయం కావడం విశేషం. హైదరాబాద్ రెండు ఇన్నింగ్స్ల్లో శతకాలు నమోదు చేసిన తన్మయ్ అగర్వాల్ కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 328 ఆలౌట్(తన్మయ్ అగర్వాల్ 119), రెండో ఇన్నింగ్స్ 244/2 డిక్లేర్(తన్మయ్ అగర్వాల్ 103 నాటౌట్)
జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ 169 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 117 ఆలౌట్