మాట్లాడుతున్న హీరో తనీష్
సాక్షి, విశాఖపట్నం : సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం పోర్టు స్టేడియంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మనిషిలో లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉండాలని, అది సీఎం వైఎస్ జగన్‌లో పరిపూర్ణంగా ఉందని చెప్పారు. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదురొడ్డి ముందుకు సాగుతూ తన లక్ష్యాన్ని సీఎం చేరుకున్నారని గుర్తు చేశారు. నేటి యువత సీఎం వైఎస్ జగన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో రాణించాలనే విశాఖ యువత అభిలాషను సాకారం చేసేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. వజ్ర సంకల్పంతో కృషి చేస్తే యువత తమ లక్ష్యాన్ని సాధించగలరని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా సౌకర్యాలు, వనరులు కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
అలరించిన సినీ హీరో తనీష్
సినీ హీరో తనీష్ వేదికపై యాంకరింగ్ చేస్తూ అలరించారు. పంచ్ డైలాగ్‌లతో యువతలో ఉత్సాహం నింపారు. 422 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో విజేత జట్టుకు రూ.50 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. 20 రోజుల పాటు 14 వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడా జ్యోతితో స్టేడియంలో ఎంపీ విజయసాయిరెడ్డి నడవగా.. మంత్రులు ముత్తంశెట్టి, కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎన్‌సీసీ క్యాడెట్లు వెంట పరుగులు తీశారు. జట్ల కెప్టెన్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. అరకులోని 18 గిరిజన తెగల మహిళలు ధింసా నృత్యంతో అలరించారు.
మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విశాఖలో మరిన్ని క్రీడా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇటీవలే క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి రూ.3కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ విశాఖను క్రీడా రాజధానిగా తీర్చిదిద్దాలన్నారు. వైఎస్సార్ అనే పదంలోనే వైబ్రేషన్ ఉందన్నారు. ఈ టోర్నీ విశాఖలో యువత కెరీర్‌కు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. విశాఖను క్రీడా హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక రచిస్తే ముఖ్యమంత్రి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా యువత విస్తృతంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమన్నారు.
టోర్నీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి
కలెక్టర్ వినయచంద్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నీలో పోటీ పడాలన్నారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ యువతను మహాశక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. జీవీఎంసీ కమిష నర్ జి.సృజన మాట్లాడుతూ మనిషి సంపూర్ణ అభివృద్ధిలో విద్యే కాకుండా ఆటలు కూడా దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా సృజనాత్మకత, విద్య, వినోదానికి దూరంగా ఉన్న యువతకు ఈ టోర్నమెంట్ మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు, అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఎస్.ఎ.రెహమాన్, సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్, నగర మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజుబాబు, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణబాబు, వీఎంఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ప్రగతి భారతి ఫౌండేషన్ సభ్యులు గోపీనాథ్ రెడ్డి, మావూరి వెంకటరమణ, ఉమేష్‌కుమార్, బాలాజీ, ముఖ్య నాయకులు ఫరూఖీ, రవిరెడ్డి, కొండా రాజీవ్, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, గెడ్డం ఉమ, వార్డు అధ్యక్షు లు, కార్పొరేట్ అభ్యర్థులు, క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment