హెచ్‌పీఎస్ జట్టుకు టైటిల్
క్రికెట్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్‌ఈ–ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. మీట్‌లో భాగంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి టైటిల్‌ను సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో గీతాంజలి స్కూల్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గీతాంజలి స్కూల్ 62 పరుగులకు ఆలౌటైంది.
అర్జున్ (21) ఒక్కడే రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అనిరుధ్ 3 వికెట్లు పడగొట్టగా, అజీమ్, శార్దుల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆతిథ్య హెచ్‌పీఎస్ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లకు 63 పరుగులు చేసింది. అజీమ్ (27) ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో గీతాంజలి 12 పరుగుల తేడాతో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, హెచ్‌పీఎస్ 80 పరుగుల తేడాతో సుజాత స్కూల్‌పై గెలుపొందింది.
వాలీబాల్‌లోనూ శుభారంభం
ఐసీఎస్‌ఈ–ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ వాలీబాల్ ఈవెంట్‌లోనూ హెచ్‌పీఎస్ జట్టు శుభారంభం చేసింది. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ సీనియర్ బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 15–8, 15–5తో షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్‌పై గెలిచి శుభారంభం చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఎస్‌డీఏ సెకండరీ స్కూల్ 15–11, 15–8తో ఫ్యూచర్‌కిడ్స్‌పై, హెరిటేజ్ వ్యాలీ 12–15, 14–4, 15–8తో సెయింట్ జోసెఫ్ కింగ్ కోఠిపై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–4, 15–2తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై గెలుపొందాయి.
జూనియర్ బాలుర లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు
హెచ్‌పీఎస్ కడప 15–11, 15–5తో లిటిల్ ఫ్లవర్ స్కూల్‌పై, షేర్‌వుడ్ 15–5, 15–11తో ఇంటర్నేషనల్ స్కూల్‌పై, ఇండియన్ బ్లోసమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 15–11, 15–5తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ 15–7, 15–9తో సెయింట్ మేరీస్‌పై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–12, 15–11తో అభ్యాస స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ మలక్‌పేట్ 15–3, 15–5తో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠిపై, సెయింట్‌ఆన్స్ 15–13, 15–13తో ఫ్యూచర్‌కిడ్స్ జట్లపై గెలిచి ముందంజ వేశాయి.