England Batsman Dan Lincoln Stormy Century Of 31 Balls: డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఎలెవెన్, ఇటలీ జట్ల మధ్య జరిగిన టీ10 మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఇంగ్లీష్ ఆటగాడు డ్యాన్ లింకన్ 31 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో మెరుపు శతకం(105 నాటౌట్) సాధించాడు. 26 ఏళ్ల లింకన్ 338.70 స్ట్రయిక్ రేట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతని విధ్వంసం ధాటికి ప్రత్యర్ధి నిర్ధేశించిన 142 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది.
వివరాల్లోకి వెళితే.. యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గ్రూప్ సి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఇటలీ కెప్టెన్ బల్జిత్ సింగ్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ డ్యాన్ లింకన్ ప్రత్యర్ధి బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సూపర్ విక్టరీని నమోదు చేసింది. లింకన్ బుల్లెట్ ఇన్నింగ్స్‌లో 98 పరుగులు సిక్సర్లు, బౌండరీల రూపంలో రావడం విశేషం.
చదవండి: వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..!
Comments
Please login to add a commentAdd a comment