‘కెరటం నాకు ఆదర్శం... ఎందుకంటే, పడిన ప్రతిసారీ అది మళ్ళీ పైకి లేస్తుంది గనక!’ ఆటకైనా, జీవితానికైనా వర్తించే ఈ స్ఫూర్తి వాక్యాన్ని ఇటలీ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఇప్పుడు నరనరాల్లో జీర్ణించుకుంది. ఆ జట్టు అదే పని చేసింది. మూడేళ్ళ క్రితం 2018 ప్రపంచ కప్‌లో ఆడేందుకు కనీసం అర్హత కూడా సాధించని ఓ ఫుట్‌బాల్ జట్టు నేలకు కొట్టిన బంతిలా పైకి లేచి, ఇప్పుడు ‘మినీ సాకర్ ప్రపంచ కప్’గా భావించే ప్రతిష్ఠాత్మక ‘యూరో కప్’ను సాధించడం చూస్తే ఆ స్ఫూర్తి వాక్యమే గుర్తుకొస్తుంది. మూడేళ్ళ క్రితం ఛీ కొట్టి, ఛీత్కరించిన సొంత ప్రజలు, ప్రేక్షకుల నుంచే ఇటలీ జట్టు జేజేలందుకోవడం చిరస్మరణీయ స్ఫూర్తి చరిత్ర. అదీ అప్రతిహతంగా 34 అంతర్జాతీయ మ్యాచ్‌లలో గెలవడం, ఓటమి ఎరుగని ధీరులుగా నిలవడం ఆ జట్టు సమష్టిగా సృష్టించిన మరో చరిత్ర.
యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్‌లో సభ్యులైన పురుషుల జాతీయ జట్ల మధ్య జరిగే ఈ పోటీకి పెద్ద కథే ఉంది. జనబాహుళ్యంలో ‘యూరో కప్’గా ప్రసిద్ధమైన ఈ టోర్నీకి ఎంతో క్రేజ్, ఇమేజ్. నాలుగేళ్ళకొకసారి జరిగే ఈ టోర్నీ గత ఏడాదే జరగాల్సింది. కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడింది. తొమ్మిదేళ్ళ క్రితం 2012లో జరిగిన యూరో కప్ ఫైనల్‌ను ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది వీక్షించారంటే, ఈ పోటీకి ఉన్న విశ్వవ్యాప్త ఆదరణ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్‌లో ఆ దేశపు జట్టే ఫైనల్‌కి రావడంతో లండన్ వింబ్లే మైదానంలో హంగామా అంతా ఇంతా కాదు. మన హీరోలు రణబీర్ కపూర్ నుంచి రానా దాకా ఎంతోమంది ఆసక్తి చూపించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో రోమాంచకంగా సాగిన పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీ జట్టు 3–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
ఇటలీ జట్టు ‘యూరో కప్’ను గెలవడం చరిత్రలో ఇది రెండోసారి. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన తొలి యూరోపియన్ దేశాల్లో ఒకటైన ఇటలీకీ, ఆ దేశప్రజానీకానికీ ఒక రకంగా ఇది కేవలం ఓ ఆటలో విజయమే కాదు. ఏణ్ణర్ధంగా భయపెడుతున్న వ్యాధి భయం నుంచి బయటకొచ్చి, మానవ విజయాన్ని స్వేచ్ఛగా, భావోద్వేగభరితంగా వ్యక్తం చేసే ఒక సువర్ణావకాశం. అందుకే, గెలుచుకున్న కప్పు, దాదాపు రూ. 88 కోట్ల నగదుతో స్వదేశానికి తిరిగొచ్చిన ఇటలీ జట్టును ఆ దేశ రాజధాని రోమ్ నగర వీధుల్లో వేలాది జనం ఊరేగిస్తూ, స్వాగతించారు. కరోనా భయాన్ని పక్కనపెట్టి మరీ 1968 తరువాత 53 ఏళ్ళకు మళ్ళీ దక్కిన విజయాన్ని సామూహిక ఉత్సవంగా ఆస్వాదిస్తున్నారు.
అయితే, ఈసారి కొన్ని అపశ్రుతులూ దొర్లాయి. నిర్ణీత సమయంలో గెలుపోటములు తేలనివేళ పెనాల్టీ షూటౌట్ల ద్వారా విజేతను నిర్ణయించే విధానం ఫుట్‌బాల్‌లో తప్పనిసరి, తప్పించుకోలేని నియమం. ఇప్పటికి అయిదుసార్లు వివిధ టోర్నీల ఫైనల్స్‌లో ఇంగ్లండ్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే, నాలుగుసార్లు చతికిలపడి, ఆయా కప్పులు చేజార్చుకుంది. 1966 ప్రపంచ కప్ విజయం తరువాత మరో భారీ విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ఇంగ్లండ్‌కు ఈసారీ అదే జరిగింది. కానీ, ఓటమి ఎంత జీర్ణించుకోలేనిదైనా, ఎంత హుందాగా స్వీకరిస్తామన్నదే క్రీడాస్ఫూర్తికీ, వ్యక్తిత్వానికీ గీటురాయి. సంగ్రామ స్థాయిలో సాగిన తాజా యూరో కప్ ఫైనల్‌లో తమ సొంత జట్టు ఓటమిని భరించలేని ఇంగ్లండ్ అభిమానులు కొందరు మైదానంలోనూ, బయటా ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం, ఆటకే అవమానకరం.
పెనాల్టీ షూటౌట్లలో విఫలమై, ఓటమికి బాటవేశారంటూ ఇంగ్లండ్ జట్టులోని ముగ్గురు నల్ల జాతి ఆటగాళ్ళపై వెల్లువెత్తిన జాత్యహంకార వ్యాఖ్యలు సభ్యసమాజంలో గర్హనీయం. దురభిమానం పెచ్చరిల్లి విధ్వంసానికి దిగడం, ఇటలీ అభిమానుల్ని అమానుషంగా కొట్టిన దృశ్యాలు, వ్యాఖ్యలను సోషల్ మీడియాలో చూసి, ప్రపంచం విస్తుపోయింది. ఇలా ఆసక్తికరమైన ఆటకు కూడా జాతి వివక్షతో రంగులు పూయడం, ఆటగాళ్ళ చిత్రాలను ధ్వంసం చేయడం క్రీడాలోకంలో చర్చ రేపింది. ప్రతిభాపాటవాలతో అత్యున్నత స్థాయికి చేరుకున్నవారిని నల్లవాళ్ళా, తెల్లవాళ్ళా అనే రంగుల తేడాను బట్టి, బేరీజు వేయడం ఆటలోనే కాదు... ఎక్కడైనా విషాదమే. పైపెచ్చు, కాలం మారినప్పటికీ మారని వికృత స్వభావాలకూ, ఇప్పటికీ ఇంగ్లీషు సమాజంలో పాతుకుపోయిన జాత్యంహంకారానికీ ఇది ఓ తాజా ప్రతీక.
పోటీలకు మచ్చ తెచ్చిన ఈ సంఘటనల్ని ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మొదలు బ్రిటన్ ప్రధాని దాకా అందరూ ఖండించారు. అంతటితో సరిపోదు. జాత్యహంకారానికి తావు లేని ఈ ఆధునిక సమాజంలో నిందితుల్ని గుర్తించి, వాళ్ళను కఠినంగా శిక్షించాలి. పరాజయాన్ని మించి ఇప్పుడు ప్రపంచంలో వచ్చి పడ్డ అగౌరవాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత ఇంగ్లీషు సమాజానిదే. ఈ చేదు ఘటనల్ని అటుంచితే, కరోనా వేళ మానసికంగా కుంగిపోయిన క్షణాల్లో మొన్నటి వింబుల్డన్, నిన్నటి యూరోకప్ ఎంతోమందికి ఉత్తేజాన్నిచ్చే ఉత్ప్రేరకాలయ్యాయి. ఈ క్రీడా సీజన్‌లో ఇక్కడ నుంచి వరుస కట్టనున్న ఒలింపిక్స్ సహా అనేక ఆటల పోటీలు కూడా కాసింత ఊరటనూ, కొత్త ఉత్సాహాన్నీ అందించవచ్చు. ఆటలోనైనా, జీవితంలోనైనా పోరాట స్ఫూర్తిని నింపే అలాంటివే ఇప్పుడు కావాల్సినవి. సమష్టిగా శ్రమిస్తే, ఏ పోరులోనైనా విజయం వరిస్తుందన్న స్ఫూర్తినీ, స్ఫురణనూ మరోసారి కలిగించినందుకు ఇటలీ జట్టుకు అభినందనలు.
పడి లేచే కడలి తరంగం
Published Wed, Jul 14 2021 12:26 AM | Last Updated on Wed, Jul 14 2021 12:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment