ఇంగ్లండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హ్యారీ కేన్
లండన్: ఈ మధ్యన క్రీడల్లో వర్ణ వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానుల్లో కొంతమంది తమ ఫేవరెట్ జట్టు ఓడిపోతే జట్టులోని కొందరు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూరోకప్ 2020లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆదివారం జరిగిన యూరోకప్ ఫైనల్లో ఇటలీ ఇంగ్లండ్‌ను ఫెనాల్టీ షూటౌట్‌లో ఓడించి 53 ఏళ్ల తర్వాత యూరోకప్‌ను గెలుచుకుంది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉండడంతో ఫెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. అయితే ఫెనాల్టీ షూటౌట్‌లో ఇంగ్లండ్ తమ స్వయంకృత తప్పిదాలతో ఓడిపోవాల్సి వచ్చింది.
అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యారీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్ మూడు పెనాల్టీలు వృథా చేశారు. అయితే మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యరీ కేన్ ఆటగాళ్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటుగా స్పందించాడు. '' మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఈరోజు ఫైనల్లో మేం ఓడిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్‌లను టార్గెట్ చేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. నిజానికి ఆ ముగ్గురికి అనుభవం లేకపోవచ్చు.. కానీ ఒక చారిత్రక ఫైనల్ మ్యాచ్‌ను వారు ఆడారంటే.. వారిలో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇక్కడి వరకు రారు. ఫెనాల్టీ షూటౌట్‌లో వారిపై నమ్మకముంచి అవకాశమిచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ మేము ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంత మాత్రానికే మీలో కొందరు ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగుతారా.. జట్టుకు అవసరం లేదని వారిపై కామెంట్లు చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన మీలాంటి అభిమానులు మాకొద్దు'' అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు.
మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం బాధాకరం. ఇక మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్‌లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment