55 ఏళ్ల తర్వాత దక్కిన ఛాన్స్, ఐదేళ్ల క్రితం ప్రపంచ కప్ క్వాలిఫై కాకుండా పోయిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం.. ఈ రెండింటికీ ఒకేసారి సమాధానం, అదీ సొంతగడ్డపై చెప్పే వీలు దొరికింది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకి. అలాంటిది కాలిదాకా వచ్చిన అవకాశాన్ని.. చేజేతులారా పొగొట్టుకుంది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీం. యూరో 2020 ఫైనల్‌లో ఇటలీ చేతిలో అదీ షూట్‌అవుట్(మ్యాచ్ 1-1 డ్రా అయ్యింది) ఓటమి ద్వారా బాధాకరమైన నిట్టూర్పును విడిచింది.
వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన Euro 2020 కప్ సందర్భంగా చర్చించుకోదగ్గ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఐదు దశాబ్ధాల తర్వాత గెలుపు అంచుదాకా చేరిన సొంత జట్టును ప్రోత్సహించేందుకు రాజకుటుంబం సైతం వెంబ్లేకి కదిలింది. సెలబ్రిటీలు, సగటు సాకర్ అభిమానులంతా స్టేడియం బయట, లండన్ వీధుల్లో గుంపులుగా చేరారు. భారీ అంచనాల నడుమ జరిగిన మ్యాచ్ డ్రా కావడం, పెనాల్టీ షూట్‌అవుట్ వీరుడిగా పేరున్న బుకాయ సకా అతితెలివి ప్రదర్శించి చేయాలనుకున్న గోల్ సైతం మిస్ కావడం, వెరసి.. ఇంగ్లండ్ ఓటమి పాలవ్వడాన్ని ఇంగ్లీష్ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఓవర్ కాన్ఫిడెన్స్
1996 వరల్డ్ కప్ తర్వాత ఒక మేజర్ టైటిల్ ఇంత చేరువలో రావడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అయితే అతి ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాకర్ నిపుణులు. 2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఫర్‌ఫార్మెన్స్ మెరుగైందనే అంచనాకి వచ్చేశారు. ఇక ఈ ఏడాది సొంతగడ్డ మీద వరుస విజయాలు.. యూరో 2020 ఫైనల్ దాకా చేరుకోవడంతో అభిమానుల్లోనే కాదు.. ఆటగాళ్లలోనూ ఆత్మ విశ్వాసం నింపింది. ఈ క్రమంలో ఇటలీని చాలా చిన్నచూపు చూసింది ఇంగ్లండ్. రాబర్టో మన్‌సినీ ఆధ్వర్యంలో వరుసగా 33 మ్యాచ్‌లు గెలిచి యూరప్‌లోనే బెస్ట్ టీంగా ఉన్న ఇటలీ బలాబలాలను తక్కువ అంచనా వేసి ఘోర తప్పిదం చేసింది. వెరసి బెస్ట్ ప్లేయర్లు ఉండి కూడా కప్ కొట్టలేకపోయింది ఇంగ్లండ్.
అచ్చీరాని షూట్‌అవుట్‌లు
ఇంగ్లండ్‌కు ఇలా షూట్‌అవుట్‌లతో ఝలక్‌లు తగలడం కొత్తేంకాదు. 1990, 1996, 1998, 2004, 2006, 2012లలో మెగా టోర్నీలలో ఇంగ్లండ్ షూట్‌అవుట్ పెనాల్టీల ద్వారానే నిష్క్రమించాల్సి వచ్చింది.
అభిమానుల అతి.. వ్యతిరేకత
ఇంగ్లండ్ ఓటమికి ఇది ఒక కారణం కాకపోవచ్చు. కానీ, ఇటలీని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఇవే కారణాలు అయ్యాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, మద్దతు ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ నింపింది. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసుకునే అవకాశం ఇవ్వలేకపోయింది. పైగా సెమీ ఫైనల్‌లో డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ కళ్లలో అభిమానులు లేజర్ లైట్లు కొట్టడం, అభిమానులపై దాడులు చేయడం ఘటనలు విపరీతమైన చర్చకు దారితీసింది. ఇక ఫైనల్‌కు ముందు ఇటలీ పట్ల ప్రదర్శించిన వివక్ష కూడా ఓ కారణంగా మారింది. అంతెందుకు ఫైనల్‌లో షూట్‌అవుట్ పెనాల్టీ మిస్ చేసినందుకు బుకాయో సకాపై సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు, మిగతా ఇద్దరిపై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారంటే.. అక్కడి అభిమానుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రియల్ విన్నర్
జార్జియో చియెల్లిని సారథ్యంలోని ఇటలీ ఫుట్‌బాల్ టీం 2020 యూరో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. సుమారు మూడువందల కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ గెల్చుకుంది. ఇటలీకి ఇది రెండో యూరోపియన్ ఛాంపియన్‌షిప్ టైటిల్. 2006 ఫిఫా వరల్డ్ కప్ విజయం తర్వాత గెలిచిన మేజర్ టోర్నీ. కానీ, 2018లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(ఫిఫా)కు కనీసం అర్హత సాధించలేకపోయింది. దీంతో అరవై ఏళ్ల ఇటలీ ఫుట్‌బాల్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది. అయితే ఆ అవమానం నుంచి కోలుకోవడానికి ఇటలీకి ఎంతో టైం పట్టలేదు.
ఆరు నెలల తర్వాత రాబర్టో మన్‌సినీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి మొదలైన వరుస క్లీన్ విక్టరీలు, హుందాగా వ్యవహరించే జట్టు, వాళ్ల ఫ్యాన్స్.. ఇదీ ఇటలీ టీం పట్ల ఫాలోయింగ్ పెరగడానికి కారణం అయ్యాయి. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల రెండు పెనాల్టీ షూట్ అవుట్‌లను అడ్డుకోవడంతో(మూడోది గోల్ రాడ్‌కి తగిలి మిస్ అయ్యింది) రియల్‌హీరోగా మారిపోయాడు గియాన్లుయిగి డొన్నారుమ్మ. Euro 2020 Final లో ఇంగ్లండ్ ఓటమిపై స్పందిస్తూ.. ‘ఇటలీ మిమ్మల్ని ఓడించలేదు. కానీ, మీరే వాళ్లకు తలొగ్గారు’ అంటూ డచ్ సాకర్ దిగ్గజం జోహన్ క్రుయఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటలీది భయంకరమైన డిఫెన్స్ ఆట, ఆ మంత్రం సింపుల్‌ది. అది అందరికీ తెలుసు. అయినా ఇంగ్లండ్ ఓడిందంటే అది వాళ్ల నిర్లక్క్ష్యమేనని పేర్కొన్నాడు ఆయన. ఇక యూరో 2020 రన్నర్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు 267 కోట్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment