Euro 2020
-
నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్.. అయినా మళ్లీ దూరం!
పాలెర్మో: నాలుగుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్ ఇటలీ మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ప్లే–ఆఫ్ సెమీఫైనల్లో ఇటలీ 0–1తో నార్త్ మెసెడోనియా చేతిలో పరాజయం చవిచూసింది. ఇటలీ ఫుట్‌బాల్ ప్రియుల్ని అత్యంత నిరాశపరిచే ఫలితమిది. ‘యూరో చాంపియన్’ అయిన ఇటలీ వరుస ప్రపంచకప్‌లకు దూరమవడం అభిమానుల్ని నిర్ఘాంతపరుస్తోంది. 2018లోనూ ఈ మేటి జట్టు క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. నార్త్ మెసెడోనియాతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగింది. అయితే మ్యాచ్ ముగిసే దశలో ఎమరుపాటుగా ఉన్న ఇటలీ డిఫెన్స్‌ని ఛేదించి ట్రాజ్కొవ్స్కీ ఇంజ్యూరీ టైమ్ (90+2వ ని.)లో చేసిన గోల్‌తో నార్త్ మెసెడోనియా విజయం సాధించింది. దీంతో ఇటలీ శిబిరం నిరాశలో కూరుకుపోయింది. ఈక్వెడార్, ఉరుగ్వేలకు బెర్త్ మరోవైపు అర్జెంటీనా, బ్రెజిల్ తర్వాత దక్షిణ అమెరికా జోన్ నుంచి తాజాగా ఈక్వెడార్, ఉరుగ్వే ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. పరాగ్వేతో మ్యాచ్‌లో ఈక్వెడార్ 1–3తో ఓడిపోగా... మరోమ్యాచ్‌లో ఉరుగ్వే 1–0తో పెరూపై విజయం సాధించింది. ఉరుగ్వే, ఈక్వెడార్ 25 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. చదవండి: IPL 2022:క్రికెట్ పండగొచ్చింది.. కోల్‌కతా, చెన్నై సమరానికి సిద్దం -
వర్ణ వివక్ష: మీలాంటి అభిమానులు మాకొద్దు
లండన్: ఈ మధ్యన క్రీడల్లో వర్ణ వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానుల్లో కొంతమంది తమ ఫేవరెట్ జట్టు ఓడిపోతే జట్టులోని కొందరు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూరోకప్ 2020లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆదివారం జరిగిన యూరోకప్ ఫైనల్లో ఇటలీ ఇంగ్లండ్‌ను ఫెనాల్టీ షూటౌట్లో ఓడించి 53 ఏళ్ల తర్వాత యూరోకప్ను గెలుచుకుంది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉండడంతో ఫెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. అయితే ఫెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ తమ స్వయంకృత తప్పిదాలతో ఓడిపోవాల్సి వచ్చింది. అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యారీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్ మూడు పెనాల్టీలు వృథా చేశారు. అయితే మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యరీ కేన్ ఆటగాళ్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటుగా స్పందించాడు. '' మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఈరోజు ఫైనల్లో మేం ఓడిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్ఫోర్డ్లను టార్గెట్ చేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. నిజానికి ఆ ముగ్గురికి అనుభవం లేకపోవచ్చు.. కానీ ఒక చారిత్రక ఫైనల్ మ్యాచ్‌ను వారు ఆడారంటే.. వారిలో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇక్కడి వరకు రారు. ఫెనాల్టీ షూటౌట్లో వారిపై నమ్మకముంచి అవకాశమిచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ మేము ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంత మాత్రానికే మీలో కొందరు ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగుతారా.. జట్టుకు అవసరం లేదని వారిపై కామెంట్లు చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన మీలాంటి అభిమానులు మాకొద్దు'' అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం బాధాకరం. ఇక మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఇంగ్లండ్‌కు తగిన శాస్తే జరిగిందా?
-
Euro 2020: ఇంగ్లండ్‌కు తగిన శాస్తే జరిగిందా?
55 ఏళ్ల తర్వాత దక్కిన ఛాన్స్, ఐదేళ్ల క్రితం ప్రపంచ కప్ క్వాలిఫై కాకుండా పోయిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం.. ఈ రెండింటికీ ఒకేసారి సమాధానం, అదీ సొంతగడ్డపై చెప్పే వీలు దొరికింది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకి. అలాంటిది కాలిదాకా వచ్చిన అవకాశాన్ని.. చేజేతులారా పొగొట్టుకుంది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీం. యూరో 2020 ఫైనల్లో ఇటలీ చేతిలో అదీ షూట్అవుట్(మ్యాచ్ 1-1 డ్రా అయ్యింది) ఓటమి ద్వారా బాధాకరమైన నిట్టూర్పును విడిచింది. వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన Euro 2020 కప్ సందర్భంగా చర్చించుకోదగ్గ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఐదు దశాబ్ధాల తర్వాత గెలుపు అంచుదాకా చేరిన సొంత జట్టును ప్రోత్సహించేందుకు రాజకుటుంబం సైతం వెంబ్లేకి కదిలింది. సెలబ్రిటీలు, సగటు సాకర్ అభిమానులంతా స్టేడియం బయట, లండన్ వీధుల్లో గుంపులుగా చేరారు. భారీ అంచనాల నడుమ జరిగిన మ్యాచ్ డ్రా కావడం, పెనాల్టీ షూట్అవుట్ వీరుడిగా పేరున్న బుకాయ సకా అతితెలివి ప్రదర్శించి చేయాలనుకున్న గోల్ సైతం మిస్ కావడం, వెరసి.. ఇంగ్లండ్ ఓటమి పాలవ్వడాన్ని ఇంగ్లీష్ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ 1996 వరల్డ్ కప్ తర్వాత ఒక మేజర్ టైటిల్ ఇంత చేరువలో రావడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అయితే అతి ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాకర్ నిపుణులు. 2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఫర్ఫార్మెన్స్ మెరుగైందనే అంచనాకి వచ్చేశారు. ఇక ఈ ఏడాది సొంతగడ్డ మీద వరుస విజయాలు.. యూరో 2020 ఫైనల్ దాకా చేరుకోవడంతో అభిమానుల్లోనే కాదు.. ఆటగాళ్లలోనూ ఆత్మ విశ్వాసం నింపింది. ఈ క్రమంలో ఇటలీని చాలా చిన్నచూపు చూసింది ఇంగ్లండ్. రాబర్టో మన్సినీ ఆధ్వర్యంలో వరుసగా 33 మ్యాచ్‌లు గెలిచి యూరప్‌లోనే బెస్ట్ టీంగా ఉన్న ఇటలీ బలాబలాలను తక్కువ అంచనా వేసి ఘోర తప్పిదం చేసింది. వెరసి బెస్ట్ ప్లేయర్లు ఉండి కూడా కప్ కొట్టలేకపోయింది ఇంగ్లండ్. అచ్చీరాని షూట్అవుట్లు ఇంగ్లండ్‌కు ఇలా షూట్అవుట్లతో ఝలక్‌లు తగలడం కొత్తేంకాదు. 1990, 1996, 1998, 2004, 2006, 2012లలో మెగా టోర్నీలలో ఇంగ్లండ్ షూట్అవుట్ పెనాల్టీల ద్వారానే నిష్క్రమించాల్సి వచ్చింది. అభిమానుల అతి.. వ్యతిరేకత ఇంగ్లండ్ ఓటమికి ఇది ఒక కారణం కాకపోవచ్చు. కానీ, ఇటలీని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఇవే కారణాలు అయ్యాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, మద్దతు ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ నింపింది. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసుకునే అవకాశం ఇవ్వలేకపోయింది. పైగా సెమీ ఫైనల్లో డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ కళ్లలో అభిమానులు లేజర్ లైట్లు కొట్టడం, అభిమానులపై దాడులు చేయడం ఘటనలు విపరీతమైన చర్చకు దారితీసింది. ఇక ఫైనల్‌కు ముందు ఇటలీ పట్ల ప్రదర్శించిన వివక్ష కూడా ఓ కారణంగా మారింది. అంతెందుకు ఫైనల్లో షూట్అవుట్ పెనాల్టీ మిస్ చేసినందుకు బుకాయో సకాపై సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు, మిగతా ఇద్దరిపై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారంటే.. అక్కడి అభిమానుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ విన్నర్ జార్జియో చియెల్లిని సారథ్యంలోని ఇటలీ ఫుట్‌బాల్ టీం 2020 యూరో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. సుమారు మూడువందల కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ గెల్చుకుంది. ఇటలీకి ఇది రెండో యూరోపియన్ ఛాంపియన్షిప్ టైటిల్. 2006 ఫిఫా వరల్డ్ కప్ విజయం తర్వాత గెలిచిన మేజర్ టోర్నీ. కానీ, 2018లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(ఫిఫా)కు కనీసం అర్హత సాధించలేకపోయింది. దీంతో అరవై ఏళ్ల ఇటలీ ఫుట్‌బాల్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది. అయితే ఆ అవమానం నుంచి కోలుకోవడానికి ఇటలీకి ఎంతో టైం పట్టలేదు. ఆరు నెలల తర్వాత రాబర్టో మన్సినీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి మొదలైన వరుస క్లీన్ విక్టరీలు, హుందాగా వ్యవహరించే జట్టు, వాళ్ల ఫ్యాన్స్.. ఇదీ ఇటలీ టీం పట్ల ఫాలోయింగ్ పెరగడానికి కారణం అయ్యాయి. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల రెండు పెనాల్టీ షూట్ అవుట్లను అడ్డుకోవడంతో(మూడోది గోల్ రాడ్‌కి తగిలి మిస్ అయ్యింది) రియల్‌హీరోగా మారిపోయాడు గియాన్లుయిగి డొన్నారుమ్మ. Euro 2020 Final లో ఇంగ్లండ్ ఓటమిపై స్పందిస్తూ.. ‘ఇటలీ మిమ్మల్ని ఓడించలేదు. కానీ, మీరే వాళ్లకు తలొగ్గారు’ అంటూ డచ్ సాకర్ దిగ్గజం జోహన్ క్రుయఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటలీది భయంకరమైన డిఫెన్స్ ఆట, ఆ మంత్రం సింపుల్ది. అది అందరికీ తెలుసు. అయినా ఇంగ్లండ్ ఓడిందంటే అది వాళ్ల నిర్లక్క్ష్యమేనని పేర్కొన్నాడు ఆయన. ఇక యూరో 2020 రన్నర్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు 267 కోట్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రెండో వేవ్ ముగియలేదు.. కాస్త తగ్గండి, ముందుంది అసలు కథ!
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గి లాక్డౌన్ ఎత్తివేయగానే.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సరదాల కోసం పాకులాడేవాళ్లు సైతం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మాస్క్‌లను మరిచి గుంపులుగా తిరుగుతున్న జనసందోహాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీ: తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్ మనాలిలో గుంపులుగా జనాలు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కార్లు, మంచు రోడ్లపై వెహికిల్స్ క్యూ, ముస్సోరీ కెంప్టీ జలపాతం దగ్గర ఆదమరిచి ఆస్వాదిస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్ మాట పక్కనపెట్టినా.. అందులో మాస్క్‌లు లేన్నోళ్లే ఎక్కువ. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పర్వం కొనసాగుతోంది. ‘మెంటల్ పీస్ కోసం పోతే.. రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు’ అని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ తరుణంలో ‘యూరో 2020’ ప్రస్తావన తెస్తూ.. ఇకనైనా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Tourists ‘watering down’ all #COVID19 norms at kempty Falls Mussorie … A steep fall straight into the ‘deep waters’ of #ThirdWave !#Covididiots #coronavirus #Covid #Mussorie Video- Scoopwhoop pic.twitter.com/LBruU0k3Xp — RAHUL SRIVASTAV (@upcoprahul) July 7, 2021 సగం జనాభాకి వ్యాక్సిన్, అయినా.. కిందటి ఏడాది జరగాల్సిన యూరో 2020 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఏడాది జరుగుతోంది. అయితే ఆశగా ఎదురుచూసిన లక్షల మంది సాకర్ కోసం.. గేట్లు తెరిచింది లండన్ వాంబ్లే స్టేడియం. నాకౌట్ టోర్నీల కోసం 2 లక్షల మంది ఫ్యాన్స్ స్టేడియంలో అడుగుపెట్టగా.. చివరి రెండు సెమీఫైనల్స్ కోసమే లక్షా 22 వేలమంది హాజరుకాగా, ఇక ఆదివారం జరగబోయే ఫైనల్ కోసమని 60 వేలమందికి అనుమతి దొరికింది. అయితే ఫ్యాన్స్‌ను పరిమిత సంఖ్యలో అనుమతించాలనే ఆలోచన చేస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వేవ్‌తో, ప్రమాదకరమైన వేరియెంట్లతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడుతోంది కరోనా. జనవరి నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో.. ఆంక్షలు ఎత్తేశాక కేసులు నిదానిస్తూ వచ్చాయి. కానీ, యూరో 2020 మొదలయ్యాక కేసుల సంఖ్యలో స్వల్ఫంగా పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. జులై 8న 30 వేల కేసులు(జనవరి నుంచి ఇదే హయ్యెస్ట్?!) నమోదు అయ్యాయి. ఇంగ్లండ్‌లో ఇప్పటికే 51.1 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచంలో ఇదే మెరుగైన వ్యాక్సినేషన్ రేటు కూడా. పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న ఫ్యాన్స్‌నే స్టేడియంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. స్టేడియంలోకే కాదు.. స్టేడియం బయట ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. మాస్క్‌లు లేకుండా గుంపులుగా పార్టీలు చేస్తున్న దృశ్యాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అత్యుత్సాహం-అభిమానం మధ్య చివరి మ్యాచ్ ఇంకెన్ని కేసులకు దారితీస్తోందో అనే ఆందోళనలో ఉండింది అక్కడి అధికార యంత్రాంగం. మరోవైపు డెల్టా వేరియెంట్.. కొనసాగింపుగా వస్తున్న వేరియెంట్ల ముప్పు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం అయ్యింది. యూరో సాకర్ అభిమానులు ‘సూపర్స్పెడ్రర్లు’గా మారే అవకాశం లేకపోలేదని, వాళ్లను నిశీతంగా పరిశీలించాలని ఇంగ్లండ్ ప్రభుత్వానికి సూచించింది. మరి మన పరిస్థితి.. మన దేశంలో జనాభా పరంగా ఇప్పటికే ఐదు శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. సింగిల్ డోసుల లెక్కలపై ప్రభుత్వ గణాంకాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పైగా మార్చి-మే మధ్యలో ఎన్నికలు, మహా కుంభమేళా నేపథ్యాలతో కేసులు పెరిగాయనే విమర్శలు ప్రభుత్వాలపై ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి విమర్శలను తట్టుకునే స్థాయిలో ప్రభుత్వం లేన్నట్లుంది. అందుకే గుంపులుగా జనాల కదలికలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉండడంతో అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేసింది కేంద్రం. ‘యూరో 2020 పరిస్థితులు చూస్తున్నాంగా. వాళ్లే భయపడుతున్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.మీరే కాదు.. మీ వల్ల అవతలి వాళ్లూ ఇబ్బందిపడతారని గుర్తించండి. మాస్క్‌లు ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’ అనే సందేశంతో ప్రచారం నిర్వహిస్తోంది. అసలు కరోనా రెండో వేవ్ కథే ముగియలేదన్న ప్రభుత్వ ప్రకటన.. నెలకొన్న ఆందోళన స్థాయిని ప్రతిబింబిస్తోంది. ‘కరోనా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు రెండో వేవ్ ఉధృతే అయిపోలేదు. కొవిడ్ ప్రొటోకాల్‌ను జాగ్రత్తగా పాటిస్తేనే.. దానిని పూర్తిగా ఎదుర్కొగలిగిన వాళ్లం అవుతాం. సరదాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. మాస్క్‌లు ధరించండి. ’’ అని అని కొవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. -
అభిమానానికి గుర్తుగా గిఫ్ట్; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్‌షిప్ యూరోకప్ 2020లో ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ మాసన్ మౌంట్ మ్యాచ్ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించి 55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఈ వీడియోనూ రెమ్ విలియ్స్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్ వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జూలై 11న ఇటలీతో టైటిల్ పోరుకు తలపడనుంది. This moment had me 🥺 @masonmount_10 👏🏾 pic.twitter.com/tzWWlPijW6 — Rem Williams (@remmiewilliams) July 8, 2021 -
ఏం యాక్టింగ్‌రా బాబు; నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు
యూరోకప్ 2020 చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఇటలీ, బెల్జియం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ జట్టు స్ట్రైకర్ సిరో ఇమ్మొబైల్ చేసిన పని అభిమానులను ఆశ్చర్యం కలిగించింది. ఆట 31వ నిమిషంలో ఇమ్మొబైల్ తనకు బంతిని పాస్ చేయాలని మిడ్ ఫీల్డర్‌కు సైన్ ఇచ్చాడు. బంతి తన వద్దకు చేరడంతో ఇమ్మొబైల్ గోల్ కొట్టేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో బెల్జియం డిఫెండర్ బంతిని తన్నే ప్రయత్నంలో ఇమ్మొబైల్ కాలికి తగిలింది. దాంతో అతను కింద పడిపోయి నొప్పితో విలవిలలాడాడు. అయితే ఉద్దేశపూర్వకంగా ఇది జరగకపోవడంతో మ్యాచ్ రిఫరీ దీన్ని పట్టించుకోలేదు. అయితే ఆ వెంటనే ఇటలీ మిడ్‌ఫీల్డర్ నికోలో బారెల్లా గోల్‌తో మెరిశాడు. దీంతో హాఫ్‌టైమ్ ముగిసేలోపే ఇటలీ భోణీ కొట్టడంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అప్పటివరకు నొప్పితో విలవిలలాడుతున్నట్లు కనిపించిన ఇమ్మొబైల్ పైకిలేచి చిరునవ్వుతో జట్టు దగ్గరికి చేరుకొని చీర్ చెప్పాడు. ఇదంతా చూసిన అభిమానులు ఇమ్మొబైల్ చేసిన పనికి నోరెళ్లబెట్టారు. ' ఏం యాక్టింగ్‌రా బాబు.. నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు' అని కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇమ్మొబైల్ చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. '' రగ్బీ గేమ్ ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఇలాంటి ట్రిక్స్ నేర్పించి ఉంటారు. ఈ పనికి రగ్బీ వారికి ఎక్కువ మొత్తం చెల్లించాలి'' అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్‌లో బెల్జియంను 2-1 తేడాతో ఓడించిన ఇటలీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్ సాధించారు. కాగా సెమీస్ పోరులో ఇటలీ స్పెయిన్లు వెంబ్లే స్టేడియం(లండన్)లో తలపడనున్నాయి. 🚨⚽️ | NEW: Injured Italian player suddenly recovers when Italy scores #Euro2021 pic.twitter.com/bdEWYMCFAw — News For All (@NewsForAllUK) July 2, 2021 -
యూరో కప్ 2020: సెమీస్ పోరులో తలపడేది వీళ్లే!
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మూడు సార్లు చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్విట్జర్లాండ్‌పై గెలుపొందింది. ఆట 8వ నిమిషంలో డేనిస్ జకారియా సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్‌కు గోల్ అందించాడు. 68వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ షాకిరి గోల్ చేయడంతో స్కోర్ 1–1తో సమమైంది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు కూడా ఒక్కో గోల్ సాధించడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్ (అదనపు సమయం)కు దారి తీసింది. 30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్లు మరో గోల్ సాధించడంలో విఫలమవ్వడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక పెనాల్టీ షూటౌట్లో ఎటువంటి తడబాటుకు గురవని స్పెయిన్ విజేతగా నిలిచింది. మరో పోరులో బెల్జియం, ఇటలీ మధ్య జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇటలీ పైచేయి సాధించింది. బెల్జియంను 2-1 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్ సాధించారు. ఇక సెమీస్ పోరులో ఇటలీ స్పెయిన్లు వెంబ్లే స్టేడియం(లండన్)లో తలపడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు చెక్ రిపబ్లిక్ డెన్మార్క్‌లు తలపడనున్నాయి. చదవండి: ఆడకుంటే జీతం లేదు.. మెస్సీకి షాకిచ్చిన ఆ క్లబ్