Euro 2020, Look At Euro Central Govt Warning On Crowds During Pandemic - Sakshi
Sakshi News home page

Corona Virus: బాధ్యతారాహిత్యం ఎవరిది? వాళ్లను చూసైనా జాగ్రత్త పడండి

Published Sat, Jul 10 2021 8:32 AM | Last Updated on Sat, Jul 10 2021 9:33 AM

Central Govt Warning On Crowds During Pandemic Referred Euro 2020 Surge Cases - Sakshi

కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణ తగ్గి లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సరదాల కోసం పాకులాడేవాళ్లు సైతం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. మాస్క్‌లను మరిచి గుంపులుగా తిరుగుతున్న జనసందోహాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

న్యూఢిల్లీ: తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిస్ట్‌ స్పాట్‌ మనాలిలో గుంపులుగా జనాలు తిరుగుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కార్లు, మంచు రోడ్లపై వెహికిల్స్‌ క్యూ, ముస్సోరీ కెంప్టీ జలపాతం దగ్గర ఆదమరిచి ఆస్వాదిస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్‌ డిస్టెన్స్‌ మాట పక్కనపెట్టినా.. అందులో మాస్క్‌లు లేన్నోళ్లే ఎక్కువ. దీంతో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ పర్వం కొనసాగుతోంది. ‘మెంటల్‌ పీస్‌ కోసం పోతే.. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ అయిపోతారు’ అని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ తరుణంలో ‘యూరో 2020’ ప్రస్తావన తెస్తూ.. ఇకనైనా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

సగం జనాభాకి వ్యాక్సిన్‌, అయినా.. 
కిందటి ఏడాది జరగాల్సిన యూరో 2020 ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఈ ఏడాది జరుగుతోంది. అయితే ఆశగా ఎదురుచూసిన లక్షల మంది సాకర్‌ కోసం.. గేట్లు తెరిచింది లండన్‌ వాంబ్లే స్టేడియం. నాకౌట్‌ టోర్నీల కోసం 2 లక్షల మంది ఫ్యాన్స్‌ స్టేడియంలో అడుగుపెట్టగా.. చివరి రెండు సెమీఫైనల్స్‌ కోసమే లక్షా 22 వేలమంది హాజరుకాగా, ఇక ఆదివారం జరగబోయే ఫైనల్‌ కోసమని 60 వేలమందికి అనుమతి దొరికింది. అయితే ఫ్యాన్స్‌ను పరిమిత సంఖ్యలో అనుమతించాలనే ఆలోచన చేస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే..

 

బ్యాక్‌ టు బ్యాక్‌ వేవ్‌తో, ప్రమాదకరమైన వేరియెంట్లతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడుతోంది కరోనా. జనవరి నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో.. ఆంక్షలు ఎత్తేశాక కేసులు నిదానిస్తూ వచ్చాయి. కానీ, యూరో 2020 మొదలయ్యాక కేసుల సంఖ్యలో స్వల్ఫంగా పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. జులై 8న 30 వేల కేసులు(జనవరి నుంచి ఇదే హయ్యెస్ట్‌?!) నమోదు అయ్యాయి. ఇంగ్లండ్‌లో ఇప్పటికే  51.1 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచంలో ఇదే మెరుగైన వ్యాక్సినేషన్‌ రేటు కూడా. పైగా వ్యాక్సినేషన్‌ తీసుకున్న ఫ్యాన్స్‌నే స్టేడియంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. కానీ.. 

వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. స్టేడియంలోకే కాదు.. స్టేడియం బయట ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. మాస్క్‌లు లేకుండా గుంపులుగా పార్టీలు చేస్తున్న దృశ్యాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అత్యుత్సాహం-అభిమానం మధ్య చివరి మ్యాచ్‌ ఇంకెన్ని కేసులకు దారితీస్తోందో అనే ఆందోళనలో ఉండింది అక్కడి అధికార యంత్రాంగం. మరోవైపు డెల్టా వేరియెంట్‌.. కొనసాగింపుగా వస్తున్న వేరియెంట్ల ముప్పు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం అయ్యింది. యూరో సాకర్‌ అభిమానులు ‘సూపర్‌స్పెడ్రర్లు’గా మారే అవకాశం లేకపోలేదని, వాళ్లను నిశీతంగా పరిశీలించాలని ఇం‍గ్లండ్‌ ప్రభుత్వానికి సూచించింది.  

మరి మన పరిస్థితి.. 
మన దేశంలో జనాభా పరంగా ఇప్పటికే ఐదు శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యింది. సింగిల్‌ డోసుల లెక్కలపై ప్రభుత్వ గణాంకాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పైగా మార్చి-మే మధ్యలో ఎన్నికలు, మహా కుంభమేళా నేపథ్యాలతో కేసులు పెరిగాయనే విమర్శలు ప్రభుత్వాలపై ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి విమర్శలను తట్టుకునే స్థాయిలో ప్రభుత్వం లేన్నట్లుంది. అందుకే గుంపులుగా జనాల కదలికలు, మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉండడంతో అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేసింది కేంద్రం. ‘యూరో 2020 పరిస్థితులు చూస్తున్నాంగా. వాళ్లే భయపడుతున్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.మీరే కాదు.. మీ వల్ల అవతలి వాళ్లూ ఇబ్బందిపడతారని గుర్తించండి. మాస్క్‌లు ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’ అనే సందేశంతో ప్రచారం నిర్వహిస్తోంది. 

 

అసలు కరోనా రెండో వేవ్‌ కథే ముగియలేదన్న ప్రభుత్వ ప్రకటన.. నెలకొన్న ఆందోళన స్థాయిని ప్రతిబింబిస్తోంది. ‘కరోనా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు రెండో వేవ్‌ ఉధృతే అయిపోలేదు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను జాగ్రత్తగా పాటిస్తేనే.. దానిని పూర్తిగా ఎదుర్కొగలిగిన వాళ్లం అవుతాం. సరదాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. మాస్క్‌లు ధరించండి. ’’ అని అని కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ హెడ్‌ వీకే పాల్‌ శుక్రవారం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement