
అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోకి వెళ్లి ఉంటామంటే చాలు. మీకు కావాల్సిన ఇంటిని, కావాల్సిన రీతిలో ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. అది కూడా ఉచితంగా.. అర్జెంటుగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కూడా అవసరమైన డబ్బు కూడా ఇస్తుంది. అది కూడా అంతా ఇంతా కాదు, దాదాపు రూ. 94 లక్షలు.
నిజం, ఉత్తర ఇటలీలోని ట్రెంటినో ప్రాంత గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి లక్ష యూరోలు (సుమారు రూ. 94 లక్షలు) ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎందుకంటే, అక్కడి గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో, ప్రస్తుతం అక్కడ అన్నీ పాడుబడిన ఇళ్లే కనిపిస్తున్నాయి తప్ప, జనాలెవరూ లేరు. దీంతో, ఇప్పుడు ఆ గ్రామాలన్నీ జనాభా తగ్గి.. ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇలా దాదాపు 33 గ్రామాలు ఉన్నాయి. అందుకే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటలీ ప్రభుత్వం ఆ గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ నజరానా ఇస్తోంది. అయితే ఈ డబ్బును వారు కేవలం, అక్కడ ఉండే ఇల్లు కొనుక్కోవడానికి లేదా మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యాపారం, వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. అయితే, 45 ఏళ్ల లోపు ఉన్న ఇటలీవాసులతోపాటు విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమే దీనికి అర్హులు.