అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండో పర్యాయం పదవీకాలాన్ని వచ్చే జనవరి 20న ప్రారంభించబోతున్నారు.
అమెరికన్లు ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నారు. ఈసారి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన కొంత మందిలో ఉంది. చాలా మంది డెమొక్రాట్ మద్దతుదారులు ఇప్పుడిప్పుడే ఎన్నికల షాక్ నుండి బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ఇటాలియన్ ద్వీపం సార్డినియాలోని ఒక గ్రామం జనాభాను పెంచుకోవడానికి వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది.
వార్తా సంస్థ సీఎన్‌ఎన్ ప్రకారం.. యూఎస్ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన అమెరికన్లకు ఒక డాలర్‌కే గృహాలను అందిస్తోంది. గ్రామీణ ఇటలీలోని అనేక ఇతర ప్రదేశాల మాదిరిగానే ‘ఒల్లోలై’ గ్రామం కూడా తీవ్రమైన జనాభా కొరతను ఎదుర్కొంటోంది. పునరుద్ధరణ కోసం బయటి వ్యక్తులను ఆకర్షించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ ధరకే విక్రయిస్తోంది.
రాజకీయాలతో అలసిపోయారా?
ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికన్ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కొత్త పాలనతో ఆందోళన ఉన్నవారిని తమ గ్రామానికి ఆకర్షిస్తూ చౌకగా గృహాలను అందిస్తోంది. "మీరు ప్రపంచ రాజకీయాల వల్ల అలసిపోయారా? కొత్త అవకాశాలను పొందుతూ మరింత సమతుల్య జీవనశైలిని స్వీకరించాలని చూస్తున్నారా?" అంటూ వెబ్‌సైట్ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబు సీఎన్‌ఎన్‌తో చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చేవారిని కూడా తాము వద్దనమని, అయితే అమెరికన్లకు ఫాస్ట్-ట్రాక్ విధానం ఉంటుందని పేర్కొన్నారు.
క్రూయిజ్ కూడా..
ఈ ఇటాలియన్ గ్రామంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న అమెరికన్లు ట్రంప్ కొత్త పాలన నుంచి దూరంగా వెళ్లేందుకు క్రూయిజ్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. "స్కిప్ ఫార్వర్డ్" పేరుతో సర్వీస్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ట్రంప్ పాలన ముగిసే వరకు 140 దేశాలలో 425 పోర్టులు తిరిగి రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment