సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రైల్వేస్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) రాణించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఎస్‌సీఆర్ 39 పరుగుల తేడాతో నార్త్ వెస్ట్రన్ రైల్వేస్, జైపూర్ జట్టుపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో వెస్ట్రన్ రైల్వేస్‌పై గెలుపొందిన ఎస్‌సీఆర్ జట్టు...సెమీస్‌లో సెంట్రల్ రైల్వే చేతిలో పరాజయం పాలై మూడోస్థానం కోసం నార్త్ వెస్ట్రన్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌సీఆర్ 49.5 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ ఎం. సురేశ్ (95 బంతుల్లో 51; 2 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. జగదీశ్ కుమార్ (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), కపిల్ (33) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో వినీత్ 4 వికెట్లతో చెలరేగగా... గజేంద్ర సింగ్, మధుర్ ఖత్రి చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 207 పరుగుల సాధారణ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నార్త్ వెస్ట్రన్ జట్టును ఎస్‌సీఆర్ బౌలర్లు సురేశ్ (5/45), సుధాకర్ (4/64) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి ఆ జట్టు 42.4 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. వినీత్ (52), నిఖిల్ (43) పోరాడారు. శరత్ బాబు ఒక వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment