కాంగ్రెస్‌లోకి శతృఘ్న | bjp rebel mp shatrughan sinha join in congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి శతృఘ్న

Published Sun, Apr 7 2019 4:11 AM | Last Updated on Sun, Apr 7 2019 4:26 AM

bjp rebel mp shatrughan sinha join in congress - Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో చేరాక మీడియాతో మాట్లాడుతున్న శతృఘ్న సిన్హా

న్యూఢిల్లీ: బీజేపీ తిరుగుబాటు ఎంపీ శతృఘ్న సిన్హా(72) కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ నేతల సమక్షంలో శనివారం కాంగ్రెస్‌ కండువా కప్పుకుని మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ వన్‌మ్యాన్‌ షో– టూ మెన్‌ ఆర్మీ’గా మారిందనీ, పార్టీలో చర్చలకు తావులేదనీ, ప్రశ్నించిన వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ గాంధీజీ, నెహ్రూ వంటి మహామహులున్న పార్టీ అన్నారు.

రాహుల్‌ను ప్రయత్నించిన– పరీక్షకు నిలబడిన– విజయవంతమయిన(ట్రైడ్‌–టెస్టెడ్‌–సక్సెస్‌ఫుల్‌)నేతగా అభివర్ణించారు. ‘బీజేపీ వ్యవస్థాపక దినం ఏప్రిల్‌ 6వ తేదీనే సొంత పార్టీని వీడాల్సి రావడం చాలా బాధాకరం. ఇందుకు కారణాలు మీకందరికీ తెలుసు. బీజేపీ వన్‌మ్యాన్‌ షో– టూమెన్‌ ఆర్మీగా మారిపోయింది’ అంటూ మోదీ, అమిత్‌షాల నాయకత్వాన్ని ఆయన పరోక్షంగా విమర్శించారు. ‘బీజేపీలో చర్చలకు తావులేకుండా పోయింది. ఎల్‌కే అడ్వాణీ, జశ్వంత్‌ సింగ్, యశ్వంత్‌ సిన్హా వంటి కీలక నేతలకు గౌరవం దక్కలేదు.

ప్రశ్నించే సీనియర్‌ నేతలను మార్గదర్శక మండలిలో చేరుస్తోంది. విభేదించే వారు, ప్రశ్నించే వారిపై శత్రువులు, తిరుగుబాటుదారులంటూ ముద్రవేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.  ‘నిజం మాట్లాడినందుకే నేను తిరుగుబాటుదారునైతే, నేను అలాగే ఉంటా. పార్టీలో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వంలోకి మారిపోతోంది. మీరు చెప్పే అబద్ధాలు, నిరర్ధక హామీలను ప్రజలు గ్రహించారు. మీ నిజ స్వరూపం బట్టబయలైంది’ అని మండిపడ్డారు. ‘ప్రతిదీ ప్రధాని కార్యాలయమే నిర్ణయిస్తోంది. మంత్రులకు స్వేచ్ఛలేదు’ అని పేర్కొన్నారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో..‘ మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు మతిలేని చర్య. దీని కారణంగా ఎంతో మంది చనిపోయినా పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం కోసం వెచ్చించే డబ్బును అభివృద్ధిపై ఖర్చుపెడితే దేశం ఎంతో బాగయ్యేది’ అని తెలిపారు.

సిన్హాకు పట్నా సాహిబ్‌ టికెట్‌
శతృఘ్న సిన్హాకు పట్నా సాహిబ్‌ టికెట్‌ కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఆయన పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఈ నిర్ణయం వెలువడింది. ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవి శంకర్‌ప్రసాద్‌తో తలపడనున్నారు. దీంతోపాటు మరికొందరి పేర్లను  కాంగ్రెస్‌ ప్రకటించింది.

రాహుల్‌ ఉత్సాహవంతుడు
‘ఉత్సాహవంతుడు, దేశ భవిష్యత్‌ ముఖచిత్రం అంటూ రాహుల్‌ గాంధీని శతృఘ్న సిన్హా పొగిడారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన న్యాయ్‌ వంటి పథకం దేశంలో ఇంతకుముందెన్నడూ లేదని పేర్కొన్నారు. ‘మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి మహా నేతలు సేవలందించిన గొప్ప పార్టీ కాంగ్రెస్‌. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లో మహాకూటమి విజయం సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. రాహుల్‌ వంటి ఉత్సాహవంతుడి నాయకత్వంలో సరైన దిశగా ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నా. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి. కాంగ్రెస్, లాలూ, తేజస్వీ ఆర్‌జేడీ వర్థిల్లాలి. జైహింద్‌’ అని పేర్కొన్నారు.

దేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాకు కల్పిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నా’ అని అన్నారు. కొంతకాలంగా ఆయన సామాజిక మాధ్యమాల్లో మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాహుల్‌ గాంధీని, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోపాటు ఆపార్టీ నేతలపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో పార్టీ పట్నాసాహిబ్‌ నుంచి ఆయనకు బదులు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు టికెట్‌ కేటాయించింది. దీంతో శతృఘ్న సిన్హా మార్చి 28వ తేదీన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌తో భేటీ అయ్యారు. శనివారం కాంగ్రెస్‌లో చేరిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement