
హైదరాబాద్: ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది.
ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు.
దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో బోగం వేషాలు వేసే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదంటూ దానం వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment