Comprehensive Report
-
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
మళ్లీ పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది. ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది. దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం. ఈఎన్సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీసీ లిఫ్టులకు తాళాలు కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్‌లు బాస్‌లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు. ► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది. ► కాళేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి. ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నాగర్‌కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. -
ఉదారంగా సిఫార్సులు చేయండి
సాక్షి, అమరావతి : తుపాను, వర్షాభావ ప్రాంతాల్లో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. తుపాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో తాము చూసిన పరిస్థితులను, గుర్తించిన అంశాలను సమావేశంలో వివరించాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విస్తృత వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి.. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాకుండా వారికి తక్షణ సహాయాన్ని కూడా అందించాం. సహజంగా.. తుపాను ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటుతుంది. కానీ, ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైంది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఏపీలో ఈ–క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతాం. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలుచేస్తున్నాం. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా వారికి చేరుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయండి. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా,డీబీటీ పథకాలు బాగున్నాయి.. రాష్ట్రంలో ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, కంటింజెన్సీ కింద విత్తనాల పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటూ బాగున్నాయి. అలాగే, గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును తాము స్వయంగా చూశామని.. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర బృందం కితాబి చ్చింది. కౌలు రైతులకూ రైతుభరోసా భేష్.. అంతేకాక.. కౌలు రైతులకూ ఎక్కడాలేని విధంగా రైతుభరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. వరి కాకుండా పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ‘ఉపాధి’ పెండింగ్ నిధులు వెంటనే ఇప్పించండి.. మరోవైపు.. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని వారు కోరారు. అలాగే, తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి కూడా వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, వ్యవసాయ శాఖ జేడీ విక్రాంత్సింగ్, డీఏఎఫ్డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుజాగ్రత్తతో నష్టాలనునివారించారు : కేంద్ర బృందం అనంతరం.. కేంద్ర బృందం స్పందిస్తూ.. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని వివరించింది. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించామని అందులోని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్నారు. అలాగే, జలవనరులు, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూడడంతోపాటు ఉపాధి పథకాన్ని పరిశీలించినట్లు కేంద్ర బృందం తెలిపింది. తుపానుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తం కావడంవల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగిందని పేర్కొంది. సచివాలయాల రూపంలో ఇక్కడ గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని ప్రశంసించింది. ఈ–క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడాలేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు వీటిని తెలియజేస్తామని తెలిపింది. అలాగే, తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బృందం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులనూ బృందం అధికారులు వివరించారు. -
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
హ్యాండ్ గ్రెనేడ్లు పేల్చేశారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గతేడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో విధ్వంసాలకు కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదుల నుంచి స్వాదీనం చేసుకున్న హ్యాండ్ గ్రెనేడ్లను పోలీసులు పేల్చేశారు. వీటిని భద్రపరచడం ముప్పుతో కూడిన వ్యవహారం, నిర్విర్యం చేయడం సాధ్యం కాకపోవడంతో సీసీఎస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ బదిలీ కావడంతో ఈ మేరకు ఆ అధికారులకు సమగ్ర నివేదికను అందించింది. చైనా గ్రెనేడ్లు మనోహరాబాద్ మీదుగా... గత ఏడాది అక్టోబర్ 2న అరెస్టయిన ఉగ్రత్రయం అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లు పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్ ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్ ఆదేశాల మేరకు పని చేశారు. దసరా రోజు నగరంలో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమైన వీరికి చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లను వారు పంపారు. డ్రోన్లద్వారా కశ్మీర్‌కు వచ్చిన వాటిని అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చాడు. రెక్కీలు చేస్తుండగానే సిట్ అధికారులకు చిక్కారు. ఈ కేసుల్లో సీజర్ కీలకాంశం... ఈ తరహా ఉగ్రవాద సంబంధ కేసుల్లో నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న సీజర్ ప్రాపర్టీ నేరం నిరూపణలో కీలక ఆధారంగా మారుతుంది. దీంతోనే కోర్టులో నిందితులను దోషిగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఉగ్రత్రయం నుంచి స్వాదీనం చేసుకున్న గ్రెనేడ్స్‌ను తొలుత కోర్టులో దాఖలు చేశారు. ఆ పై న్యాయస్థానం ఆదేశాల మేరకు తమ ఆ«దీనంలోనే భద్రపరిచారు. ఇవి ప్రమాదకరం కావడంతో తొలు త వీటిని నిర్వీర్యం చేసేందుకే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే చైనాలో తయారైనవి కావడంతో ఆ ప్రయత్నం చేస్తే పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో వీటిని పేల్చేయడమే మేలని భావించి, న్యాయస్థానం అనుమతి అనుమతి పొందారు. ఇటీవల బాంబు నిర్విర్యం బృందాల సమక్షంలో ఈ తంతు పూర్తి చేశారు. -
ఈడీ దృష్టికి మార్గదర్శి అక్రమాలు!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీఎఫ్ఎల్) అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నిధులను దారి మళ్లించి చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న మార్గదర్శిపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోపాటు ఇతర రాష్ట్రాల సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలు కూడా విచారణ జరపాలని నివేదించింది. ఈమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని ‘తీవ్రమైన ఆర్థిక నేరాల పరిశోధన విభాగం’(ఎస్ఎఫ్ఐవో)తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల సీఐడీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల విభాగాలకు ఫిర్యాదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పలు రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహిస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుండటంతో చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సీఐడీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో తాము గుర్తించిన అక్రమాలు, అవకతవకలను వివరిస్తూ రూపొందించిన నివేదికను సీఐడీ అధికారులు జత చేశారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఈడీ, ఆదాయపన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు, ఇతర రాష్ట్రాల సీఐడీ విభాగాలు దర్యాప్తు జరపాల్సినంత తీవ్రమైన నేరాలకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ పాల్పడిందని అందులో స్పష్టం చేశారు. సీఐడీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦ మార్గదర్శి చిట్స్ నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతోంది. ♦ చందాదారులకు చెల్లించాల్సిన డబ్బులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇవ్వకుండా రూ.కోట్లలో బకాయిలు పెడుతోంది. ♦ చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డుల నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ♦ చందాదారులకు చిట్ మొత్తం చెల్లించకుండా అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. ఇది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ♦ చందాదారుల సొమ్మును అక్రమంగా బదిలీ చేస్తూ ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది. ♦ ఆదాయపన్ను చట్టాలను ఉల్లంఘిస్తూ చందాదారుల నుంచి పరిమితికి మించి భారీ మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడుతోంది. ♦ చెల్లింపులపై టీడీఎస్ చెల్లించడం లేదు. -
లే ఔట్లు, భవనాలపై సమగ్ర నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రాక ముందు గ్రామాల పంచాయతీలు ఇచ్చిన లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చిన పలు అంశాలపై శుక్రవారం సచివాలయంలోని చాంబర్లో జూపల్లి సమీక్షించారు. హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పంచాయతీ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో పొందుపర్చే దిశగా తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులు, వ్యాపార, వాణిజ్య అనుమతులు వంటి వాటిని ఆన్లైన్లో పొందుపర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్టుగా అధికారులు వివరించారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి సంబంధించి దాదాపు 70 శాతం వరకు ఆన్లైన్లో పొందుపర్చేలా సాఫ్ట్వేర్ సిద్ధమైందని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడంలో జరుగుతున్న జాప్యంపై జూపల్లి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 300 చదరపు అడుగులకన్నా ఎక్కువ స్థలంలో లేదా జీ ప్లస్ 2 కన్నా అదనంగా భవన నిర్మాణ అనుమతులన్నీ హెచ్ఎండీఏ లేదా డీటీసీఏ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, అధికారులతో జూపల్లి చర్చించారు. -
జోనల్ రద్దుకు ‘రూట్ మ్యాప్’
► విధివిధానాలపై నివేదిక ► సీఎస్‌కు ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జోనల్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, దానికి సంబంధించి విధివిధానాలు రూపొందించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. పలు స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు, చర్చలు జరిపి సమగ్ర నివేదిక రూపొందించాలని పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం మూడంచెల విధానం అమల్లో ఉంది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిల్లో పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియ జరుగుతోంది. దీన్ని రద్దు చేసి రెండంచెల విధానమే ఉండేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విధివిధానాలు, మార్గదర్శకాలపై నివేదికను సిద్ధం చేసే బాధ్యతలను సీఎస్‌కు అప్పగిస్తూ సాధారణ పరిపాలన విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1975లో ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్, రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్ అమల్లోకి వచ్చింది. తెలం గాణలోనూ ఇప్పటికీ ఈ ఉత్తర్వులే అమల్లో ఉన్నాయి. పాలనా సౌలభ్యం తదితరాల కోసం పది జిల్లాల తెలం గాణను 31 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించారు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా కొత్తగా ఏర్పడ్డాయి. దాంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడమో, లేక కొత్త ఉత్తర్వులను అమల్లోకి తేవడమో అవసరమని తాజా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. జిల్లా, రాష్ట్ర స్థాయితో రెండంచెల విధానం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత రాష్ట్ర, జోనల్, జిల్లా పోస్టులను తదనుగుణంగా పునర్విభ జించాలని, ప్రజాప్రయోజనాలు, పాలనా అవసరాలకు తగ్గట్టుగా ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది. -
నకిలీ విత్తనాలపై సమగ్ర నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ మిరప విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినందున దానిపై సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ వ్యవసాయ శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాలతో వేలాది మంది రైతన్నలు నష్టపోయారని గత ఆదివారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎస్ పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక పంపించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని ఆదేశించినట్లు తెలిసింది. నకిలీ మిరప విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా, ‘సాక్షి’ కథనం నేపథ్యంలో నకిలీ విత్తన కంపెనీలపై అధికారులు దాడులు చేస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో అనేక కంపెనీల యజమానులు ఆఫీసులను మూసేసి పరారీలో ఉన్నారు. డీఎన్ఏ పరీక్షలతో నాణ్యత గుర్తింపు.. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మిరప విత్తనాల కల్తీపై విచారణకు ఏర్పాటైన రాష్ట్రస్థాయి శాస్త్రవేత్తలు, అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించి తాము రూపొందించిన నివేదికను మంగళవారం వ్యవసాయ కార్యదర్శి పార్థసారథికి అందజేసింది. ఈ సందర్భంగా భారత విత్తన చట్టంలో కల్తీ జరిగితే పరిహారం ఇచ్చే అంశం లేదని వారు ఆయన దృష్టికి తెచ్చారు. ఆ మేరకు రాష్ట్రంలో చట్టాన్ని రూపొందిం చాలని కోరారు. అలాగే నర్సరీ చట్టాన్ని ఏపీ నుంచి అడాప్ట్ చేసుకోవాలని.. కూరగాయలను ఆ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. విత్తనాలను రైతులకు ఇచ్చేప్పుడు వాటి నాణ్యతను మండలస్థాయి ఏవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, దీనికి ఎక్కువ సమయం పడుతున్నందున లేబొరేటరీలోనే డీఎన్ఏ పరీక్ష జరిపి నిర్ధారణ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లకు రూ. 10 కోట్ల జరిమానా.. పదేళ్ల జైలుశిక్ష పడేలా కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు. మిరప విత్తనాలను హైబ్రీడ్‌వి కాకుండా సూటి(దేశీయ) రకాలను రైతులకు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ సిఫారసులపై వెంటనే కార్యాచరణ చేపడతామని పార్థసారథి తెలిపారు. ఈ ఏడాదే విత్తన చట్టాన్ని రూపొందించేలా అధికారులతో మా ట్లాడుతానని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. పార్థసారథిని శాస్త్రవేత్తలు సైదయ్య తదితరులు కలిశారు. -
గ్రేటర్‌కు ఔటర్ హారం
రూ. 1500 కోట్లతో ప్రతిపాదనలు డీపీఆర్ సిద్ధం చేస్తున్న ఏకాం సంస్థ దాదాపు 80 కిలోమీటర్ల నిడివితో ప్రణాళిక జాతీయ రహదారి పరిధిలో 23 కిలోమీటర్లు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ ప్లాన్ - 2030కి అనుగుణంగా నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర నివేదిక రూపొందించే పనులు ఏకాం అనే సంస్థకు అప్పగించారు. హన్మకొండ : వరంగల్ నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ద శాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ‘కుడా’ మాస్టర్ ప్లాన్-2013 ప్రకారం నివేదిక సిద్ధం చేశారు. అయితే, హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం కావడం భవిష్యత్‌లో టెక్స్టైల్స్ పార్కు, ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ పరిశ్రమలు వరంగల్ చుట్టూ నెలకొల్పనున్న నేపథ్యంలో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించే రింగ్ రోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదనే అనుమనాలు వ్యక్తమయ్యాయి. దీంతో కుడా మాస్టర్ ప్లాన్ 2030 ప్రకారం మరో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ పనులు న్యూ ఢిల్లీకి చెందిన ‘ఏ కాం’ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, నర్సంపేట, కరీంనగర్ల నుంచి నగరానికి నిత్యం వచ్చిపోయే వాహనాల రద్దీపై సర్వే నిర్వహించారు. వీటి ఆధారంగా ఆగస్టు చివరికల్లా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కీలకంగా స్థల సేకరణ వరంగల్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మార్గంలో కరుణాపురం - ధర్మసాగర్ శివారు - టేకులగూడెం - ఉనికిచర్ల - దేవన్నపేట - చింతగట్టు - పెగడపల్లి - వంగపహాడ్ - ఆరేపల్లి - మొగిలిచర్ల - కొత్తపేట - గొర్రెకుంట - గీసుకొండ శివారు - స్తంభంపల్లి - వెంకటాపూర్ - బొల్లికుంట - పున్నేలు - ఐనవోలు - తరాలపల్లి శివారు - నష్కల్ - కరుణాపురం వరకు రింగ్ రోడ్డును నిర్మించేం దుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వరంగల్ నగరం చుట్టూ దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్డు మొత్తాన్ని డివైడర్లతో కలిపి ఆరు లేన్ల రహదారిగా నిర్మించనున్నారు. ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణం చేపడితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి 15 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. దీంతో 80 కిలోమీటర్ల రహదారి కోసం దాదాపు 1200 ఎకరాల భూమిని నగరం చుట్టూ సేకరించడం ప్రధానం కానుంది. రూ.1500 కోట్ల వ్యయం వరంగల్ రింగ్ రోడ్డు నిడివి 70 - 80 కిలోమీటర్ల మధ్య ఉండనుంది. ఒక్కో కిలోమీటరు నిర్మాణానికి సగటున రూ.6.5 కోట్ల వ్యయం కానున్నట్లు తెలుస్తోంది. భూసేకరణ, మార్గమధ్యంలో వంతెనల నిర్మాణం కలుపుకుని మొత్తంగా రింగ్ నిర్మాణానికి రూ.1500 కోట్లు ఖర్చు అవనున్నట్లు అంచనా. ఇందులో కరుణాపురం - ఆరేపల్లి వరకు ఉన్న 29 కిలోమీటర్ల బిట్‌ను జాతీయ రహదారి - 163లో భాగంగా ఎన్‌హెచ్ సంస్థ చేపట్టనుంది. మిగిలిన రహదారి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. -
‘డబుల్’పై రెవెన్యూ సర్వే!
మురికివాడల్లో స్థలాల గుర్తింపే లక్ష్యం బిజీగా మారిన అధికారులు త్వరలో సర్కారుకు సమగ్ర నివేదిక సిటీబ్యూరో: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంపై దృష్టి సారించిన ప్రభుత్వం స్థలాల ఎంపికపై మురికివాడల్లో సర్వే నిర్వహిస్తున్నది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 1476 మురికివాడల్లో రెవెన్యూ శాఖ అధ్వర్యంలో తహాశీల్దార్లు, సిబ్బంది మూడు రోజులుగా సర్వే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రకటించటంతోపాటు నగరంలో ఒక మోడల్ కాలనీ కూడా నిర్మించారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి ఆదరణ పెరిగింది. ఫలితంగా హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లతో సహా జీహెచ్ఎంసీ చుట్టూ ప్రజలు, మహిళలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొవటానికి పరుగులు తీస్తున్నారు. గ్రేటర్ లో మొదటి విడతలో 11,500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 46 బస్తీలను గుర్తించిన అధికార యంత్రాంగం...ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నగరంలో లక్ష ఇళ్ల కోసం మరి కొన్ని బస్తీలను గుర్తించాల్సిన అవసరం నెలకొంది. ఈ నేపథ్యంలోనే మురికివాడల్లో స్థలాల గుర్తింపు తదితర అం శాలను పరిశీలించేందుకు సర్వే కార్యక్రమా న్ని రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్నది. ఈ సర్వేలో భాగంగా మురికి వాడ ల్లో నివాసముంటున్న కుటుంబాల సంఖ్యతోపాటు స్థల వైశాల్యం, భూమి వివరాలు, సర్వే నంబర్లు సేకరిస్తున్నా రు. ఈ వాడల్లో గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారా లేదానన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. స్లమ్‌లో డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ఇక్కడి ప్రజలు సానుకూలంగా ఉన్నారా..? లేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారా...అన్న విషయాలను సర్వే సందర్భంగా సిబ్బం ది సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. మురికి వాడల్లో సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని సమగ్ర నివేదిక రూపంలో రెండు రోజుల్లోగా రెవెన్యూ శాఖ జిల్లా అధికారయంత్రాంగానికి నివేదించనుంది. ఇదే నివేదికను మరో మారు జిల్లా స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తున్నది. -
ఫార్మా సిటీపై అధ్యయనం
సమగ్ర నివేదిక తయారీకి సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దాదాపు 12 వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమల వల్ల కాలుష్య సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యర్థాల ట్రీట్మెంట్ సరిగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉండే అమెరికా, జపాన్, యూరప్ దేశాలలో పర్యటించి అక్కడ వ్యర్థాల సమగ్ర నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలన్న సీఎం, సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని శుక్రవారం నిర్ణయించారు. ‘‘హైదరాబాద్‌లో నెలకొల్పే ఫార్మా సిటీపై జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. కాబట్టి ఫార్మా సిటీ నూటికి నూరు శాతం ప్రమాదరహితంగా, వ్యర్థాలు బయటికి వచ్చే వీలు లేకుండా ఉండాల్సిన అవసరముంది. గతంలో నగరంలో నెలకొల్పిన ఫార్మా కంపెనీలతో కొన్ని ప్రాంతాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆ పరిస్థితి పునరావృతం కావద్దు’’ అని అధికారులకు ఆయన సూచించారు. ఏప్రిల్‌లో తొలి దశ! అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మా సిటీ తొలి దశ పనులను ఏప్రిల్‌లో ప్రారంభించాలని అధికారులకు సీఎం సంకేతాలిచ్చారు. ఆ దిశగా మాస్టర్ ప్లాన్‌తో పాటు పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ తయారీకి అంతర్జాతీయ కంపెనీల నుంచి టీఎస్ఐఐసీ ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. మొదటి దశలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ముచ్చర్లలో మొత్తం 12 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలోని 5,000 ఎకరాలకు గాను 3,000 ఎకరాలను ఇప్పటికే సేకరించారు. మార్చి నెలాఖరుకల్లా మిగతా రెండు వేల ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. ఒక్కో పారిశ్రామికవేత్త కనీసం ఎకరం నుంచి గరిష్టంగా 150 ఎకరాలు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. తొలి దశ పనుల మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫార్మా కంపెనీల యాజమాన్యాలు, అసోసియేషన్లు, ఆర్ అండ్ బీ, కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు మరికొన్ని విభాగాలు ఇందులో ఉన్నాయి. ప్రాజెక్టు రిపోర్టుతో పాటు స్థలాల కేటాయింపులు, పర్యావరణ అనుమతులు, లే అవుట్ల తయారీ తదితర అంశాలన్నీ టాస్క్‌ఫోర్స్ అధ్వర్యంలో జరుగుతాయి. -
రాచమార్గాల్లో రక్షణ అడ్డంకులు!
- ఎలివేటెడ్ కారిడార్లకు 250 ఎకరాలు అవసరం - రక్షణశాఖ పరిధిలో 75 ఎకరాలు - భూసేకరణపై దృష్టి సారించిన సర్కార్ - ఆకాశమార్గాలపై తుది దశకు చేరిన అధ్యయనం - త్వరలో సమగ్ర నివేదిక సాక్షి, సిటీబ్యూరో: ఆకాశ మార్గాలపై అధ్యయనం తుది దశకు చేరుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జిల్లా కేంద్రాలకు మధ్య దూరభారాన్ని తగ్గించే లక్ష్యంతో మూడు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వరకు, బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్ ఔటర్ రింగురోడ్డు వరకు, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ఘట్కేసర్ ఔటర్ రింగురోడ్డు మార్గాల్లో ఆకాశ రహదారులను నిర్మిస్తారు. ప్యారడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాలను ఆర్వీ అసోసియేట్స్ అధ్యయనం చేస్తుండగా, ఉప్పల్- ఘట్కేసర్ మార్గాన్ని తాజాగా వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. ఈ మూడు మార్గాల్లో సదరు కన్సెల్టెన్సీలు సమగ్రమైన నివేదికలు అందజేయవలసి ఉంది. అయితే గత ఏప్రిల్‌లోనే అధ్యయనం ప్రారంభించిన ఆర్వీ అసోసియేట్స్ ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల్లో త్వరలో తుది నివేదికను అందజేసే పనిలో ఉంది. ఆ సంస్థ అధ్యయనం మేరకు ఈ రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు 250 ఎకరాల భూమి అవసరం. 20 కిలోమీటర్ల వరకు నిర్మించనున్న శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో 150 ఎకరాలు, 18 కిలోమీటర్ల నర్సాపూర్ ఎలివేటెడ్ మార్గంలో 100 ఎకరాలు సేకరించవలసి ఉంది. శామీర్‌పేట్ మార్గంలో 75 ఎకరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ రక్షణశాఖ పరిధిలో ఉన్న మరో 75 ఎకరాల భూసేకరణ ఇబ్బందిగా మారింది. రక్షణశాఖ నుంచి అనుమతి లభిస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు. కేంద్రానికి లేఖ రాసిన సర్కార్ బాలానగర్-నర్సాపూర్ మార్గంలో భూ సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మార్గంలోని వంద ఎకరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రెవిన్యూ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు జాతీయ రహదారుల సంస్థ దృష్టి సారించింది. శామీర్‌పేట్ మార్గంలో సేకరించవలసిన 75 ఎకరాల రక్షణ శాఖ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదు. ‘ప్రభుత్వం మరింత గట్టిగా చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపితే తప్ప ఈ మార్గంలో భూ సేకరణ సాధ్యం కాదు. అదంతా ఒక కొలిక్కి వ స్తే తప్ప పనులు ప్రారంభం కాబోవు.’ అని నేషనల్ హైవేస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఆరు లైన్ల ఫ్లైఓవర్... సుమారు రూ.1600 కోట్లతో నిర్మించతలపెట్టిన శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో రోడ్డు మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తారు. ఆకాశమార్గంలో 6 లైన్ల రహదారులు నిర్మిస్తారు. దీంతో ఎక్కడా వాహనాల రద్దీ లేకుండా సాగిపోతాయి. బాలానగర్-నర్సా పూర్, ఉప్పల్ - ఘట్కేసర్ మార్గాల్లోనూ 10 నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ మార్గాలు నిర్మితమవుతాయి. దీనివల్ల వాహనాల ఫ్రీ ఫ్లో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లో ప్రతి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్‌హెచ్-202 మార్గంలో ఉన్న ఉప్పల్- ఘట్కేసర్ మార్గంలో వాహనాల రద్దీ నరకప్రాయంగా మారింది. వరంగల్ నుంచి ఘట్కేసర్ వరకు కేవలం గంటన్నర వ్యవధిలో చేరుకొంటే అక్కడి నుంచి ఉప్పల్ రింగురోడ్డుకు వచ్చేందుకే మరో గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఉప్పల్-ఘట్‌కేసర్‌పై తాజా అధ్యయనం ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనం ఆర్వీ అసోసియేట్స్ చేపట్టగా ఉప్పల్- ఘట్కేసర్ మార్గం ప్రాజెక్టును వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. 20 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే నిర్మించే అవకాశం ఉంది. -
లెక్క తేలింది!
- 1,923 ఎకరాలు పరాధీనం భూదాన్ పెద్దలే అక్రమార్కులు చేతులు మారిన పేదల భూములు రూ.కోట్లు విలువ చేసే భూమి ఆక్రమణ ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ భూముల లెక్క తేలింది. అన్యాక్రాంతమైన భూముల చిట్టాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో భూముల వినియోగంపై రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇటీవల శాసనసభా కమిటీ భూదాన్ యజ్ఞబోర్డు భూముల ధారాదత్తంపై లోతుగా చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో పరాధీనమైన భూముల వివరాలను కూడా సేకరించిన రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణల జాబితాను కూడా తయారు చేసింది. అయితే.. భూదాన్ బోర్డు లెక్కలకు, రెవెన్యూ రికార్డులకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో భూములను దానం చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, చాలా చోట్ల ఆ భూములు బోర్డు స్వాధీనంలోకి రాలేదని, కొన్నిచోట్ల ఇప్పటికీ ఆయా కుటుంబాల పొజిషన్లోనే అవి ఉన్నట్లు యంత్రాంగం తేల్చింది. దీంతో 2,673 ఎకరాల మేర తేడా వచ్చింది. భూదాన్‌బోర్డు లెక్కల మేరకు 13693.25 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11020.23 ఎకరాలుగా తేలింది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో పొంతన కుదరకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే.. భూదాన్ బోర్డు పాలకవర్గం పాపాల పుట్టను తవ్విన సర్కారు... చేతులు మారిన భూముల చిట్టాను తయారు చేసింది. పాలకవర్గం ముసుగులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చింది. క్షేత్రస్థాయిలో 10717.34 ఎకరాలున్నట్లు తేల్చిన అధికారులు.. దీంట్లో 6625.08 ఎకరాలు భూమిలేని పేదలకు అసైన్డ్ చే యగా, మిగతా దాంట్లో చాలావరకు పరాధీనమైనట్లు సర్వేలో గుర్తించింది. ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు భూదానోద్యమంలో దాతలు విరివిగా భూ వితరణ చేశారు. వీటిని నిరుపేదలకు పంపిణీ చేయకుండా.. భూములను కాపాడాల్సిన యజ్ఞ బోర్డే కంచే చేను మేసిన ట్లు కొల్లగొట్టింది. అసైన్డ్‌దారుల సాగుబడిలో 4395.18 ఎకరాలుండగా, 1049.24 ఎకరాలు ఇతరులకు అసైన్ చేశారు. కాగా, మిగతాదాంట్లో 1923.13 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తేలింది. రూ.కోట్ల భూములకు ఎసరు! పేదలకు జీవనోపాధి కల్పించాలనే సదుద్దేశంతో దానం చేసిన భూములు ల్యాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయి. భూదాన్ బోర్డే రియల్టర్ అవతారమెత్తడంతో రూ.కోట్ల విలువైన భూములకు రెక్కలొచ్చాయి. శివార్లలో విలువైన భూముల్లో ఆక్రమణలు వెలిశాయి. మరీ ముఖ్యంగా సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 1015.23 ఎకరాలు పరాధీనమయ్యాయి. దీంట్లో కాలేజీలు, ఫాంహౌస్‌లు, గోడౌన్లు, లే అవుట్లు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. బోర్డు సభ్యులు కొందరు సొంత ప్రయోజనాలకు భూములను మళ్లించుకున్నారు. బ డాబాబులు సైతం భూదాన్ భూములపై కన్నేయడం కూడా భూములు కరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా దాదాపు 400 ఎకరాల పైచిలుకు భూములపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం సర్కారుకు తలనొప్పిగా మారింది. ఇటీవల భూదాన్ బోర్డును రద్దు చేసి... రికార్డులను స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అన్యాక్రాంతమైన భూముల విషయంలో మాత్రం ముందడుగు వేయలేకపోయింది. -
భూదానమా.. భూ దాహమా..
రెవెన్యూ భూములుగా ప్రకటించిన సర్కార్ జిల్లాలో ఉన్నవి 265 ఎకరాలు {పభుత్వాధీనంలో 65 ఎకరాలే మెజార్టీ భూముల్లో రైతుల సాగు భూదాన భూములపై ‘అధికారం’ కన్నుపడింది. ఇప్పటికే వీటిని రెవెన్యూ భూములుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఎలాగైనా పాగా వేయాలని అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆచార్య వినోభాబావే ఉన్నత ఆశయాలతో శ్రీకారం చుట్టిన భూదాన ఉద్యమం వీరి చర్యల ఫలితంగా నీరుగారిపోతుంది. విశాఖపట్నం: పరిమితికి మించి ఉన్న భూములను సేకరించి పేదలకు పంచాలన్న సదాశయంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి వినోభా బావే భూములను సమీకరించిన సంగతి తెలిసిందే. రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా సర్కార్ కన్ను ఈ భూదాన భూములపై పడింది. ఏదో విధంగా స్వాధీనం చేసుకుని ఇతరావసరాల కోసం వినియోగంచాలన్న ఆలోచనతో సర్కారీ భూములుగా ప్రకటించింది. జీవో కూడా జారీ చేసింది. దీంతో వీటిని రెవెన్యూ భూములుగా పరిగణిస్తారు. జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాలను సేకరించినప్పటికీ ప్రస్తుతం రికార్డుల ప్రకారం 264.90 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 20.91 ఎకరాలు వెట్, 243.99 ఎకరాలు డ్రై ల్యాండ్స్‌గా రికార్డుల్లో ఉన్నాయి. మొత్తం భూముల్లో 65 ఎకరాలు ప్రభుత్వాధీనంలో ఉండగా మిగిలినవి రైతులు, స్ధానికుల అధీనంలో ఉన్నాయి. సబ్బవరం మండలం దొంగలమర్రి సీతారాంపురంలో సర్వే నెంబర్ 1549లో 52.38 ఎకరాలు వివాదంలో కోర్టులో నలుగుతోంది. మిగిలిన భూముల్లో పరదేశిపాలెంలో సర్వే నెంబర్ 132లో 50.56 ఎకరాలతో పాటు అర్బన్ మండల పరిధిలోని మాధవదారలో సర్వేనెం: 66/1లో ఉన్న 15.45 ఎకరాల్లో 10 ఎకరాలు, గాజువాక మండలం అగనంపూడిలో సర్వే నెం: 56/ఏ,బీలలో ఉన్న 20 ఎకరాల్లో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. మిగిలినవన్నీ స్థానికులు, రైతుల అధీనంలోనే ఉన్నాయి. చాలా భూములు ఆక్రమణలకు గురికాగా, 60 ఏళ్లుగా ఎన్నో చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లో కూడా పెద్ద సంఖ్యలో భూదాన భూములున్నాయి. వీటిలో భారీ భవంతులు.. బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. అసలు ఈ భూములు ఎక్కడ ఉన్నాయో అధికారులకు కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లూ ఏమాత్రం పట్టించుకోని అధికారులు ప్రస్తుతం వీటిని గుర్తించే పనిలో పడ్డారు. ఎవరిఅధీనంలో ఉన్నాయి? ఎన్ని చేతులు మారాయి? వాస్తవస్థితి ఎలా ఉంది ? వంటివిషయాలపై దృష్టిసారించారు. వీటి స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలోపడ్డారు. మార్గదర్శకాలు జారీ అయిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులు..అనుభవిస్తున్న సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ తాతముత్తాల నుంచి అనుభవిస్తున్న వీటిని ఇప్పటికిప్పుడు స్వాధీనం చేసుకోవాలని చూస్తే తామేమైపోతామని వారు ప్రశ్నిస్తున్నారు.