వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది.
పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది.
‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్‌జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది.
మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్‌ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది.
చైనా వద్ద 500 అణు వార్‌హెడ్లు!
ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్‌హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది.
‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment