India China relations
-
సేనల ఉపసంహరణ స్వాగతించదగింది
బ్రిస్బేన్: భారత్, చైనాలు సరిహద్దుల్లో అత్యంత సమీపంలో మోహరించిన బలగాల ఉప సంహరణపై కొంత పురోగతి సాధించడం స్వాగతించదగిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. అనంతర చర్యలకు ఈ పరిణామం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన డెమ్చోక్, డెప్సాంగ్ల నుంచి రెండు దేశాలు ఇటీవల బలగాలను ఉపసంహరణను పూర్తి చేసుకోవడం, అనంతరం భారత్ ఆర్మీ పరిశీలనాత్మక గస్తీ జరుపుతున్న క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి జైశంకర్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వాస్తవా«దీన రేఖ వెంబడి 2020కు ముందు లేని ప్రాంతాల్లో చైనా బలగాలు ముందుకు చొచ్చుకువచ్చాయి. దీంతో మేం కూడా బలగాలను మోహరించాం. కొన్ని ఇతర కారణాలు కూడా ఇందుకు తోడయ్యాయి. దాదాపు నాలుగేళ్లపాటు బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి. ఏదైనా అనూహ్య సంఘటన జరిగే అవకాశమున్న పరిస్థితి అది. తాజాగా భారత్, చైనాలు కొంత పురోగతి సాధించాయి. సేనలను వెనక్కి తీసుకున్నాయి. ఇది స్వాగతించదగిన పరిణామం. ఇది ఇతర సానుకూల చర్యలకు దారి తీసే అవకాశముంది’అని ఆయన అన్నారు. ఉక్రెయిన్, పశి్చమాసియాల్లో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన..ఈ సమస్యల పరిష్కారానికి భారత్ తన వంతు కృషి కొనసాగిస్తోందని వెల్లడించారు. -
'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు
ఢిల్లీ: కొత్త ఏడాది 2024లోనూ ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొనడానికి భారత్ రాజకీయంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందని చెప్పారు. తాను రాసిన నూతన పుస్తకం 'Why Bharath Matters' ఆవిష్కరణ సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు. దేశ స్వాంతంత్య్రం తొలినాళ్లలో మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలను జైశంకర్ విమర్శించారు. భారత ప్రయోజనాలకే నెహ్రూ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే చైనాతో బంధంపై ఆశలు పెంచుకునేవాళ్లం కాదని జై శంకర్ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, పండిట్ నెహ్రూకు మధ్య చైనా అంశంపై జరిగిన లేఖల మార్పిడి ఇందుకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. చైనా అంశంలో నెహ్రూకు, పటేల్‌కు మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని జైశంకర్ తెలిపారు. భద్రతా మండలిలో చైనాకు చోటు దక్కేలా నెహ్రూ వ్యవహరించారని జైశంకర్ అన్నారు. ‘‘భద్రతా మండలిలో ముందుగా చైనా చోటు దక్కించుకోనివ్వండి’’ అని ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖ కూడా ఉందని పేర్కొన్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా సహాయాన్ని నెహ్రూ నిరాకరించారని గుర్తుచేశారు. పటేల్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉందని జై శంకర్ అన్నారు. "మనం అమెరికాపై ఎందుకు అపనమ్మకంతో ఉన్నాం.. మన ప్రయోజనాల దృష్టిలోనే చూడాలి. చైనా-అమెరికా బంధం కోణంలో కాదు." అని పటేల్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..? -
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
గైర్హాజరీ సందేశం!
అనుకున్నదే అయింది. రానున్న ‘జీ20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అసాధారణ రీతిలో హాజరు కాకపోవచ్చంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ సదస్సుకు హాజరవుతారంటూ ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధానులిద్దరూ ఏకకాలంలో విదేశాల్లో ఉండడం, అందులోనూ ఒకే కార్యక్రమంలో ఉండడమనేది చైనా ఎన్నడూ చేయని పని గనక ‘జీ20’కి షీ గైర్హాజరు ఖాయమని తేటతెల్లమైంది. వెరసి, ‘జీ–20’ అధ్యక్ష హోదాలో భారత్ ఈ నెల 9, 10 తేదీల్లో ఆతిథ్యమిస్తున్న 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు కొత్త కారణంతో వార్తల్లో నిలిచింది. ఇంట ఆర్థికవ్యవస్థలో ఇక్కట్లు, బయట అమెరికా – భారత్‌లతో క్షీణసంబంధాలు, పొరుగుదేశాలతో కొనితెచ్చుకున్న తగాదాల మధ్య చైనా అధినేత కావాలనే మొహం చాటేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆహ్వానించినప్పుడు వెళ్ళడానికి కొన్ని కారణాలుంటే, వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళకపోవడానికి అంతకు మించే కారణాలుంటాయి. చైనా అధినేత గైర్హాజరు కథా అంతే! భారత్‌తో చైనా ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. లద్దాఖ్‌లో మూడేళ్ళ క్రితం సైనికుల కొట్లాట నుంచి ఇదే ధోరణి. సరిహద్దుకు ఇరువైపులా మోహరించిన సైన్యం ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. వాణిజ్యంపై విభేదాలు ఉండనే ఉన్నాయి. బద్ధశత్రువైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను భారత్ పెంచు కోవడంతో డ్రాగన్‌కి పుండు మీద కారం రాసినట్టుంది. చైనాను వెనక్కినెట్టి అత్యధిక ప్రపంచ జనాభా గల దేశంగా భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష శోధన, ప్రపంచ వాణిజ్యంలో పోటాపోటీ సరేసరి. ఇవి చాలదన్నట్టు ప్రామాణిక దేశపటమంటూ భారత భూభాగాల్ని కలిపేసుకున్న వక్రీకరించిన మ్యాప్‌ను చైనా తాజాగా విడుదల చేసి కొత్త రచ్చ రేపింది. చైనా అధినేత మొహం చాటేయడానికి ఇలా చాలా కారణాలే! ఈ తాజా పరిణామం చైనా – భారత సంబంధాల మెరుగుదలకు తోడ్పడదు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో షీ సంభాషించే అవకాశం తప్పిపోతోంది. నిజానికి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు ఈ మధ్య బీజింగ్‌కు సందర్శనలు జరిపారు. అయినప్పటికీ అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత క్షీణించి ఉన్నాయి. గత నవంబర్‌లో ఇండొ నేషియాలోని బాలిలో జరిగిన గత ‘జీ20’ తర్వాత షీ, బైడెన్లు కలసి మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ కలసి, సంబంధాలను సరిదిద్దుకొనే అవకాశాన్ని చైనా చేతులారా జారవిడుస్తోంది. బైడెన్ సైతం ఈ పరిణామంతో నిరాశకు లోనయ్యాననడం గమనార్హం. షీ ఒక్క ‘జీ20’నే కాదు, జకార్తాలో జరగనున్న ఏషియాన్ (వాయవ్య ఆసియా దేశాల సంఘం), ఈస్ట్ ఏషియా సదస్సులూ ఎగ్గొడుతున్నారు. వాటికీ చైనా ప్రధానే హాజరు కానున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు భౌతికంగానూ, ఒకసారి వర్చ్యువల్‌గానూ (సౌదీ అరేబియా– 2020) జీ20 సదస్సులు జరిగాయి. వాటిలో మొదటి మూడు మినహా 2010 నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర సదస్సులోనూ అన్ని దేశాల అధినేతలూ పాల్గొన్న దాఖలా లేదు. అయితే, చైనా అధినేత మాత్రం ఏ జీ20 సదస్సుకూ ఇప్పటి దాకా గైర్హాజరవలేదు. కరోనా ఆంక్షలున్న రెండేళ్ళూ వర్చ్యువల్‌గానైనా హాజరయ్యారు. గత నెల దక్షిణాఫ్రికాలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల బృందమైన ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడూ షీ వచ్చారు. మరి, ఇప్పుడు మాత్రం తన బదులు ప్రధానిని పంపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బదులు విదేశాంగ మంత్రినిపంపుతున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అధ్యక్షుడి గైర్హాజరుకు కారణాలు చైనా బయటకు చెప్పక పోయినా, ఇదంతా సహజమేనన్నట్టు భారత అధికార వర్గాలు చిత్రిస్తున్నా... విషయం మాత్రం అసాధారణమే. షీ రాజనీతి పట్ల సందేహాలు రేపుతున్నాయి. మావో తర్వాత మరే ఇతర చైనా నేతకూ లేనంతటి అధికారం షీ సొంతం. ప్రాదేశిక ప్రయో జనాల పేరు చెప్పి, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా అన్నీ చైనావేనంటూ ఆయన అంతకంతకూ దూకుడు చూపుతున్నారు. సహజంగానే పాకిస్తాన్ లాంటి ఒకట్రెండు దేశాల్ని మినహాయిస్తే, పొరుగున మిత్రుల కన్నా ఎక్కువగా శత్రువుల్ని చేసుకున్నారు. నిజానికి, జీ20 దేశాలంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం. ఇంత కీలకమైనా సరే, దీని కన్నా తమ చైనా ఆధిపత్యం ఉన్న ‘బ్రిక్స్’ వగైరాల వైపే షీ మొగ్గుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఆయన ప్రయాణించినదల్లా సౌదీ అరేబియా, రష్యా, సౌతాఫ్రికా లాంటి స్నేహపూర్వక స్వాగతం లభించే దేశాలకే అని విశ్లేషించవచ్చు. అటు అమెరికా, ఇటు భారత్‌లతో ఉద్రిక్తతలు తగ్గించడమూ తన షరతుల ప్రకారమే జరగాలని చూస్తున్నారనుకోవచ్చు. డ్రాగన్ బుసలు కొడుతున్నందునే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన భద్రతా కూటమి ‘క్వాడ్’లో భారత్ చేరిందని గమనించాలి. ఇక, బైడెన్‌తో ఇప్పుడు భేటీ తప్పిందంటే మళ్ళీ నవంబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు దాకా వారు కలిసే ఛాన్స్ లేదు. ప్రస్తుత చైనా వైఖరి చూస్తుంటే, అప్పుడైనా షీ హాజరవుతారన్న గ్యారెంటీ లేదు. జీ20లోనూ దేశాధి నేతలు చేయాల్సిన సమష్టి ప్రకటనకు గండికొట్టి, భారత పాలకుల విశ్వగురు ప్రచారాన్ని దెబ్బ తీశారనుకోవచ్చు. ప్రధానిని పంపుతున్నా, సదస్సులోని నిర్ణయాలకు చైనా కట్టుబడేలా చూసేందుకు సదరు వ్యక్తికి ఏపాటి అధికారం ఉంటుందో చెప్పలేం. వెరసి, షీ గైర్హాజరీ సందేశం సుదీర్ఘమైనదే! -
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సత్సంబంధాలు
న్యూఢిల్లీ: చైనాతో సత్సంబంధాలపై భారత్ మరోసారి స్పష్టతనిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఆ దేశంతో సాధారణ సంబంధాలను సాగించడం వీలుకాదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా తన బలగాలను మోహరించడమే ప్రధాన సమస్య అని ఆయన గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత్ కూడా కోరుకుంటోందన్న ఆయన.. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొన్నప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమని పేర్కొన్నారు. చైనా ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామన్నారు. ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలు, తప్పుడు కథనాలు వంటి వాటికి భారత్ భయపడబోదన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ల పట్ల చైనాకు తన నిరసనను భారత్ పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందన్నారు. ‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులు చైనాకు కూడా ఏమంత మంచివికావు. సరిహద్దుల్లో పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది..ఇంకా చూపుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతత లేనప్పుడు సాధారణ సంబంధాలను ఆశించడం సరికాదు’అని జై శంకర్ అన్నారు. 2020 మేలో సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్తావించగా.. సరిహద్దులకు అత్యంత సమీపంలో రెండు దేశాల బలగాల మోహరింపే అసలైన సమస్య అని మంత్రి బదులిచ్చారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ‘సంబంధాలు మాత్రం తెగిపోలేదు. విషయం ఏమిటంటే..రెండు దశాబ్దాల్లోనే అత్యంత భీకరంగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత రోజు ఉదయం చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడాను కూడా. ఆ తర్వాత కూడా దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాం. అయితే, చైనా మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు దిగుతోంది. అందుకే ఆ దేశంతో సంబంధాలు గాడినపడటం లేదు’అని వివరించారు. ఒక్క చైనాతో తప్ప అన్ని ముఖ్యమైన అన్ని దేశాలు, సమూహాలతో భారత్ సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. -
జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల కోసం భారత్‌కు చైనా కంటే జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయమని మెడికల్ టెక్నాలజీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (ఎంటాయ్) పేర్కొంది. ఇతర దేశాల మాదిరే భారత్ సైతం తన మెడికల్ టెక్నాలజీ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, జపాన్, యూరప్, బ్రిటన్, చైనా, సింగపూర్ దేశాలపై ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేసింది. చైనా నుంచి మెడికల్ టెక్నాలజీ దిగుమతుల విలువ పెరుగుతుండడం ఆందోళనకరమని, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించింది కొన్ని రకాల వైద్య పరికరాలకు భారత్ తగినంత తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకుందని చెబుతూ.. క్లిష్టమైన సాంకేతికతతో కూడిన ఉపకరణాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు తెలియజేసింది. నాణ్యమైన, అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు కష్టమేమీ కాబోదంటూ.. చైనా నుంచి ఈ తరహా ఉత్పత్తుల విలువ పెరగడం ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నట్టు ఎంటాయ్ చెప్పింది. చైనా–భారత్ మధ్య గత మూడేళ్లుగా సరిహద్దు, ద్వైపాక్షిక విభేదాలు నెలకొనడం తెలిసిందే. అయినా కానీ కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల విలువ 2020–21లో 327 బిలియన్ డాలర్ల నుంచి 2021–22లో 515 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ‘‘వైద్య పరికరాలు, విడిభాగాల దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించడం విలువైన చర్యే. కానీ, ఇది ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు భారత్ అత్యవసరంగా చైనాకు ప్రత్యామ్నాయాలను చూడాలి’’అని ఎంటాయ్ చైర్మన్ పవన్ చౌదరి పేర్కొన్నారు. -
భారత సరిహద్దులపై చైనా కొత్త విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: చైనా విదేశాంగ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన క్విన్ గ్యాంగ్ భారత్‌తో సంబంధాలు, సరిహద్దు సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా న్యూఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని బీజింగ్ చూస్తోందని తెలిపారు. వాంగ్ యీ స్థానంలో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే యూఎస్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ‘ప్రపంచం పట్ల చైనా ధోరణి’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ మ్యాగజైన్లో భారత్-చైనా సరిహద్దు అంశాలను ప్రస్తావించారు క్విన్ గ్యాంగ్. సరిహద్దుల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఇరు వర్గాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. అమెరికాపై మండిపడ్డారు క్విన్. తైవాన్ విషయంలో అమెరికా, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులకు జపాన్‌లు కారణమని పేర్కొన్నారు. చైనా అభివృద్ధి అంటే శాంతిని పరిరక్షించేందుకు బలమైన దళాన్ని సిద్ధం చేయటం తప్పా.. వారు చెబుతున్నట్లు భౌగోళిక స్థితిని మార్చే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలకు కారణం చైనా కాదని, తైవాన్ వేర్పాటువాదులు, విదేశీ శక్తులు అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో చైనా రాయబారిగా పని చేశారు 56 ఏళ్ల క్విన్ గ్యాంగ్. విదేశాంగ మంత్రిగా పదోన్నతి కల్పించిన క్రమంలో వాషింగ్టన్ నుంచి చైనాకు పయణమయ్యారు. 13వ జాతీయ ప్రజా కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆయనను విదేశాంగ మంత్రిగా నియమించింది. క్విన్ గ్యాంగ్‌కి అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చైనా నూతన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. వాషింగ్టన్-బీజింగ్ సంబంధాలు, ఇరు దేశాల మధ్య సమచారా మార్పిడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదీ చదవండి: పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి -
భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా కీలక వ్యాఖ్యలు..
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చైనా తొలిసారి స్పందించింది. సరిహద్దులో స్థిరత్వం నెలకొల్పి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని ఆకాక్షించింది. ఈమేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వాస్ అధికారిక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, దౌత్యపరంగా, సైనిక పరంగా రెండు దేశాలు టచ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సరిహద్దులో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దులో శాంతి స్థాపనకు డిసెంబర్ 20న చైనాతో 17వసారి కమాండర్ స్థాయి చర్చలు జరిపింది భారత్. పశ్ఛిమ సెక్టార్లో శాంతియుత వాతావరణానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రకటన విడుదల చేసింది. చదవండి: Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య.. -
అనగనగా ఒక చైనా కథ
పై పటంలోని ఆక్సాయిచిన్ ప్రాంతం ఇప్పటికే చైనా ఆక్రమణలో ఉన్నది. లదాఖ్, గిల్గిట్ – బాల్టిస్తాన్లను కలిపి భారత ప్రభుత్వం ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. కానీ, గిల్గిట్ – బాల్టిస్తాన్ పాక్ ఆక్రమణలో ఉన్నది. మనం కేంద్ర పాలితంగా ప్రకటించుకొన్న ఈ రెండు ప్రాంతాలు చైనాకే చెందుతాయనే తర్కాన్ని ప్రతిపాదించేందుకు చైనా సిద్ధపడుతున్నది. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ కార్యక్రమానికి ఈ ప్రాంతం కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలో చైనా ఓ కొత్త కథానికను రచిస్తున్నది. చైనావాళ్లు ఒక పాత కథను కొత్త పద్ధతిలో ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారు. నవరసాల మేళవింపుతో జనరంజ కంగా ఆ కథను చెప్పాలనుకుంటున్నారు. ఈ కథకు లోకం ఊకొడితే సరిహద్దుల్లో తమ సైనికుల గోడదూకుళ్లకు క్లీన్చిట్ దొరికినట్టే. ఈ కథ చెప్పాలన్న ఆలోచన ఈనాటిది కాదు. ఇంచు మించు ‘చైనా డ్రీమ్’కు ఉన్నంత వయసు ఈ ఆలోచనకు కూడా ఉన్నది. ఐరోపావాళ్లు నల్లమందు యుద్ధాలతో చింగ్ వంశ సామ్రాట్టు మెడలు వంచినప్పుడు చైనా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆ అవమానంలోంచి పుట్టిందే ‘చైనా డ్రీమ్స్’. అప్పటివరకూ ప్రపంచంలో తామే అందరికన్నా గొప్పవాళ్లమనే అభిప్రాయంతో చైనా ప్రజలుండేవారు. వారికి అందుబాటులో ఉన్న చరిత్ర, పుస్తకాలు ఈ అభిప్రాయాన్ని కలిగించాయి. ఐరోపావాళ్లు ఈ అభిప్రాయాన్ని అవహేళన చేశారు. మళ్లీ పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలనే సంకల్పం చైనీయుల మెదళ్లలో మొగ్గతొడిగిందప్పుడే. ఆధునిక చైనా నిర్మాత చైర్మన్ మావో ఝెడాంగ్ ‘చైనా డ్రీమ్’ను పట్టాలెక్కించారు. ఆ తర్వాత ఈ అంశాన్ని బలంగా ముందుకు తెచ్చింది మాత్రం ప్రస్తుత దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిందే తడవుగా ‘చైనా డ్రీమ్’ గురించి భజించడం మొదలుపెట్టాడు. నిజానికి అప్పటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. ప్రపంచపు వస్తూత్పత్తి కార్ఖానాగా అది మారింది. ‘చైనా డ్రీమ్’లో మిగిలిన భాగం అగ్రరాజ్యంగా అవతరించడం. నాలుగువేల సంవత్సరా లకు పైగా అందుబాటులో ఉన్న చరిత్రలో పూర్వపు రాజులు జయించిన, పాలించిన భూభాగాలన్నింటినీ మళ్లీ చైనాలో కలి పేసుకోవడం. ఈ రెండు అంశాల మీదా జిన్‌పింగ్ దృష్టి నిలిపారు. జిన్‌పింగ్ తలకెత్తుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) కార్యక్రమం పూర్తిగా సాకారమైతే ప్రపంచంలోని కీలక భూభాగాల మీద, వనరుల మీద, మార్కెట్ల మీదా చైనాకు ఆధిపత్యం లభిస్తుంది. ఈ ఆధిపత్యమే అగ్రరాజ్య హోదాకు గుర్తు. బీఆర్ఐ పథకంలో అత్యంత వ్యూహాత్మకమైన భూభాగం పూర్వపు ఉమ్మడి జమ్ము–కశ్మీర్ ప్రాంతం. ఇందులో ఐదు ప్రధాన భౌగోళిక ఉపవిభాగాలున్నాయి. జమ్మూ ప్రాంతం, కశ్మీర్ లోయ, లదాఖ్, గిల్గిట్–బాల్టిస్తాన్, ఆక్సాయి చిన్లు ఆ విభాగాలు. కశ్మీర్ లోయలో పడమటి భాగం, గిల్గిట్ బాల్టిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయి. ఆక్సాయి చిన్ చైనా ఆక్రమణలో ఉన్నది. జమ్ము ప్రాంతం, మిగిలిన కశ్మీర్ లోయ, లదాఖ్‌లు భారత్‌లో ఉన్నాయి. ఇటీవలే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము–కశ్మీర్ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం విభజించింది. లదాఖ్‌ను, పాక్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్‌ను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్ము–కశ్మీర్‌లను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఆక్సాయిచిన్‌ను లదాఖ్‌లో అంతర్భాగంగా భారత్ పరిగణిస్తుంది. ఆక్సాయిచిన్ నుంచి దక్షిణంగా కొద్ది మైళ్ల దూరంలోనే ప్యాంగ్యాంగ్ సో సరస్సు ఉంటుంది. ఆ కొద్ది భూభాగాన్ని అదుపులోకి తీసు కుంటే సరస్సుకు ఉత్తర, తూర్పు భాగాలు పూర్తిగా చైనా వశ మవుతాయి. ఈ వ్యూహం ప్రకారం జరిగిందే గల్వాన్ ఘర్షణ. తాజా అనుమానాల ప్రకారం ఇప్పుడు మొత్తం లదాఖ్పైనా, పాక్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్–బాల్టిస్తాన్ పైనా కూడా చైనా కన్నేసింది. ఇప్పుడు మనం రెడీమేడ్‌గా విడగొట్టిన రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకదాని మీద చైనా గురిపెట్టినట్టు కనిపిస్తున్నది. చైనా కొత్తగా చెప్పబోయే కథలో ఈ అంశం ఉండబోతున్నది. టిబెట్‌ను చైనా పశ్చిమ ప్రావిన్స్ షింజియాంగ్ రాజధాని కష్కర్కు అనుసంధానిస్తూ ఆక్సాయిచిన్ మీదుగా ఇప్పటికే భారీ రహదారిని చైనా అభివృద్ధి చేసింది. అక్కడి నుంచి లదాఖ్ మీదుగా కారాకోరం హైవేను కలుపుతూ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే చైనా బీఆర్ఐ కార్యక్రమానికి పెద్ద ఊతం లభిస్తుంది. లదాఖ్, గిల్గిట్–బాల్టిస్తాన్‌ల మధ్య 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల షాక్స్‌గమ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ గతంలోనే ధారాదత్తం చేసింది. ఐనా కూడా ఈ ప్రాంతాన్ని మొత్తంగా కబళించడానికే చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గిల్గిట్ – బాల్టిస్తాన్ నుంచి దక్షిణ ముఖంగా పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రాన్ని చేరుకోవచ్చు. అక్కడ పాక్ తీరంలో గ్వాదర్ నౌకా స్థావరాన్ని కూడా ఇప్పటికే చైనా ఏర్పాటు చేసుకున్నది. హిందూ మహా సముద్రంలోకి వెళ్లడానికి చైనాకు రెండోమార్గం లభ్యమవుతుంది. గిల్గిట్ నుంచి పశ్చిమంగా అఫ్గానిస్తాన్ మీదుగా పశ్చి మాసియా చేరువవుతుంది. ఇరాన్‌తో చైనా సంబంధాలు ఇటీ వల గణనీయంగా మెరుగైన నేపథ్యంలో ఈ వెసులుబాటు చైనాకు లాభిస్తుంది. ఉత్తర దిశలో సెంట్రల్ ఏసియన్ రిపబ్లిక్ లపై కర్ర పెత్తనానికి కూడా ఉపయోగపడుతుంది. షింజియాంగ్ రాష్ట్రంలోని వీగర్ ముస్లింల అసంతృప్తికి సెంట్రల్ ఏసియా ఆజ్యం పోయకుండా చూసుకోవచ్చు. పైగా గిల్గిట్ – బాల్టిస్తాన్ అపారమైన ఖనిజ సంపదకు ఆలవాలమని భావిస్తున్నారు. హిమనీ నదాలకు నిలయం ఈ ప్రాంతం. ఈ నదాల్లో అపా రమైన జలరాశి నిక్షిప్తమై ఉందట! ఈ ప్రాంతంలో సింధు నది, దాని ఉపనదుల మీద జలవిద్యుత్కేంద్రాలను నిర్మిస్తే 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చట. ఇంత కీలకమైన ప్రాంతం కనుకనే చైనా కన్నేసింది. మరి కబళించేదెట్లా? షీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురావస్తు పరిశోధన (ఆర్కియాలజికల్ సర్వే) మీద చైనా ప్రభుత్వానికి ఆపేక్ష పెరిగింది. టిబెట్ ప్రాంతపు ఉజ్వల గతాన్ని వెలికి తీయడానికి పలుచోట్ల తవ్వకాలు మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వం ఐదారు శతాబ్దాల నుంచి సుమారు వెయ్యేళ్లపాటు టిబెట్ భూభాగంలో షాంగ్‌షుంగ్ రాజ్యం ఓ వెలుగు వెలిగిం దనీ, ఆనాటి నిర్మాణ కౌశలం, నాగరికతలపై సర్వే నిపుణులు ఇస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ మీడియాలో అడపాదడపా అచ్చవుతూనే ఉన్నాయి. మూతి ముడుచుకుని బిగదీసుకున్న ట్టుగా ఒక బ్యూరోక్రాట్ మాదిరిగా కనిపించే జిన్‌పింగ్‌కు ఆర్కియాలజీ పట్ల గల మక్కువపై జనం ఆశ్చర్యపోతూనే ఉన్నారు. కాకపోతే తవ్వకాల కేంద్రీకరణ ఎక్కువగా లదాఖ్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ, టిబెట్ – ఇండియా సరిహద్దు ల్లోనూ కేంద్రీకృతం కావడమే మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నది. పశ్చిమ టిబెట్ ప్రాంతంలోనూ, ప్రస్తుత లదాఖ్, గిల్గిట్– బాల్టిస్తాన్ ప్రాంతంలోనూ షాంగ్‌షుంగ్ (ఝాంగ్ ఝుంగ్) రాజ్యం విస్తరించి ఉండేదనీ, క్రమంగా టిబెట్ ప్రాంతమంత టికీ విస్తరించిందనీ చెబుతున్నారు. టిబెట్తోబాటు అరుణాచల ప్రదేశ్, భూటాన్, నేపాల్ ప్రాంతాలు (లదాఖ్ సహా) కూడా ఒక దశలో షాంగ్‌షుంగ్ రాజ్యంలో భాగంగా ఉండేవట! వాటికి శాస్త్రీయ ఆధారాలను ‘సమకూర్చే’ పనిలో ఇప్పుడు చైనా బిజీగా ఉన్నదట! ఆర్కియాలజీ నిపుణులు రేయింబవళ్లు ఈ అంశంపై కృషి చేస్తున్నారు. టిబెట్‌కు బౌద్ధమత సంక్రమణ కూడా షాంగ్‌షుంగ్ ద్వారానే జరిగింది. ఏడో శతాబ్దంలో అప్ప టికే ప్రాభవం తగ్గిన షాంగ్షుంగ్ను టిబెట్ ఆక్రమించింది. 1950వ దశకంలో టిబెట్‌ను దురాక్రమణ గావించక ముందు భారత్‌కు చైనాతో గట్టు్ట పంచాయతీ లేదు. అది మన సరిహద్దు దేశం కాదు. టిబెట్‌తోనే ఉత్తరాన లదాఖ్ నుంచి తూర్పున అరుణాచల్ వరకు సరిహద్దు ఉన్నది. భారత్– టిబెట్ల మధ్యన బ్రిటిష్ వాళ్లు గీసిన మెక్‌మహాన్ సరిహద్దు రేఖ చెల్లుబాటయింది. చైనా దురాక్రమణ తర్వాత ఆ సరిహద్దు రేఖను గుర్తించడానికి అది నిరాకరిస్తున్నది. సరిహద్దు రేఖలు సామ్రాజ్యవాదుల కుట్రగా చైనా అభివర్ణిస్తున్నది. భారత్‌తో పాటు చాలా దేశాల్లో నేటికీ టిబెటన్ల స్వాతంత్య్ర కాంక్ష పట్ల ఇంకా సానుభూతి వ్యక్తమవుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో షాంగ్‌షుంగ్ నాగరికతను తవ్వి తీయడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. షాంగ్‌షుంగ్ నాగరికతకు చైనా ప్రాచీన సామ్రాజ్యాలకు ఉన్న సారూప్యతనూ, సామీప్యతనూ నిర్ధారించడం కోసం చైనా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే షాంగ్‌షుంగ్ రాజ్యం చైనాదవుతుంది. ఈ రాజ్యంలోంచి ఉద్భవించినది గనుక టిబెట్ కూడా తమదే అవుతుంది. టిబెటన్ల స్వాతంత్య్ర కాంక్ష చెల్లదు. టిబెట్‌కు ఆధారం షాంగ్‌షుంగ్ రాజ్యం కనుక ఆ రాజ్యంలో ఉన్న భాగాలన్నీ టిబెట్‌కే చెందుతాయి. ఆ లెక్కన గిల్గిట్– బాల్టిస్తాన్ దగ్గర్నుంచి లదాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్‌ప్రదేశ్‌లు కూడా టిబెట్‌లో అంతర్భాగమవుతాయి. టిబెట్ చైనాలో అంతర్భాగం కనుక సహజంగానే ఇవన్నీ తమ ప్రాంతాలేనని చైనా వాదించబోతున్నది. షాంగ్‌షుంగ్ కథ ద్వారా తన విస్తరణ కాంక్షను హేతుబద్ధం చేసుకోవడానికి చైనా అడుగులు వేస్తున్నది. రానున్న కాలంలో ఈ ప్రాంతాల్లో మరిన్ని ఘర్షణలు, సరిహద్దులు దాటడం వంటి ఘటనలు జరగవచ్చు. పూర్తిస్థాయి యుద్ధానికి మాత్రం చైనా ఒడిగట్టకపోవచ్చు. రెండూ అతిపెద్ద దేశాలైనందువల్ల, మిలిటరీ పరంగా బలమైన దేశాలైనందువల్ల, అణ్వస్త్ర రాజ్యాలైన కారణంగా అటువంటి దుస్సాహసం చేయక పోవచ్చు. వాటికంటే ఆర్థిక కారణాలు మరీ ముఖ్యమైనవి. చైనా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్‌ది ఎనిమిదో స్థానం. చైనా మొత్తం ఎగుమతుల్లో కేవలం మూడు శాతం మాత్రమే. కానీ చైనా – భారత్ వాణిజ్యంలో చైనాకు భారీ మిగులు ఉంటున్నది. చైనావాళ్లు 94 బిలియన్ డాలర్ల కిమ్మత్తయిన సరుకులను ఎగుమతి చేస్తే భారత్ నుంచి 21 బిలియన్ డాలర్లకు సరిపడా దిగుమతులను మాత్రమే చేసుకుంటున్నారు. ఈ ద్వైపాక్షిక వ్యాపారంలో భారత్‌కు 73 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు. ఆ మేరకు చైనాకు లాభం. వాణిజ్యంలో చైనాకు లాభాలు పండించే దేశాల్లో భారత్‌ది నాలుగో స్థానం. భారత పారిశ్రామిక రంగం, వినియోగదారుల మార్కెట్ చైనా మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ అది భారత్‌కే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని నీతిఆయోగ్ మాజీ వైస్‌చైర్మన్ పనగారియా హెచ్చరించడం గమనార్హం. కనుక రెండు దేశాలు యుద్ధానికి సిద్ధపడకపోవచ్చు. కానీ చైనా తన విస్తరణ కాంక్షను సమర్థించుకోవడానికి క్రమంగా చొచ్చుకొని రావడాన్ని హేతుబద్ధం చేసుకోవడానికీ పురావస్తు పరిశోధనలతో ముందుకొస్తున్నది. ఇప్పుడది ఆర్కియాలజికల్ వార్‌ను ప్రారంభించింది. షాంగ్‌షుంగ్ నాగరికతపై అందు బాటులో ఉన్న సమాచారాన్ని చదువుతున్నప్పుడు, చైనా కంటే భారత సంస్కృతితోనే దానికి ఎక్కువ సంబంధం ఉన్నట్టు సాధారణ పాఠకుడికి కూడా అర్థమవుతుంది. కానీ, మన ఆర్కి యాలజీని మనం దేశ సమగ్రత కోసం, జాతి గౌరవం కోసం వాడటాన్ని మానేశాం. ఇప్పుడు మన పురావస్తు పరిశోధనంతా మసీదులకు మాత్రమే పరిమితమైంది. మసీదులను తవ్విపోసి, ఆలయాల ఉనికిని వెలికితీసే పనిలో మునిగి తేలుతున్నది. చైనావాళ్లు వారి జాతీయతను ఇనుమడింపజేసుకోవడానికి మనం మన జాతిని చీల్చడానికి ఆర్కియాలజీని ఉపయోగించు కుంటున్నాము. ఇద్దరి మధ్యన ఇదీ తేడా! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
తీరు మారితేనే సామరస్యం
దౌత్యరంగంలో మాటలకూ, చేతలకూ కాస్తయినా పొంతన ఉండాలి. లేనట్టయితే దేశాల మధ్య పరస్పర విశ్వాసం అడుగంటుతుంది. అవి ఇరుగు పొరుగు దేశాలైనప్పుడూ, వాటిమధ్య తీర్చు కోవాల్సిన జటిల సమస్యలున్నప్పుడూ మరింత జాగ్రత్తగా మెలగాలి. మొదటినుంచీ చైనా ఆ విషయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. అదును చూసి దాడికి దిగటం, ఆ తర్వాత భారత్‌దే తప్ప న్నట్టు మాట్లాడటం, ఏమీ ఎరగనట్టు చర్చలకు రావటం దానికి రివాజుగా మారింది. ఇంతక్రిత మైనా, ఈ రెండేళ్లనుంచైనా ఇదే వరస. సరిహద్దు ఘర్షణలపై ఈ నెల 20న చర్చలు జరుగుతాయన్న అవగాహన చైనాకుంది. అయినా అంతకు రెండు వారాలముందు... అంటే 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో గిల్లికజ్జాలకు దిగింది. దాని తీవ్రత గురించిన స్పష్టమైన సమాచారం విడుదల చేయకపోయినా ‘ఈ ఉదంతంలో ఇరు పక్షాల సైనికుల్లోనూ కొందరు స్వల్పంగా గాయ పడ్డా’రని మన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత్ సైనిక కమాండర్ చొరవ తీసుకుని చైనా కమాండర్‌తో చర్చలు జరపటంతో సామరస్యత నెలకొందని ఆ ప్రకటన సారాంశం. చైనాతో మనకున్న 4,057 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ ప్రస్తుతానికి సరిహద్దుగా ఉంది. రెండేళ్లుగా పశ్చిమ సెక్టార్ (లద్దాఖ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతం)లో తరచుగా చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇంకా చర్చల ప్రక్రియ సాగుతోంది. మూడురోజులనాటి చర్చలు అందులో భాగమే. ఈ చర్చల ప్రక్రియ పర్యవసానంగా ప్యాంగాంగ్ సో ప్రాంతంలో నిరుడు ఫిబ్రవరిలో, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ లోని 17వ పెట్రోలింగ్ పాయింట్ నుంచి నిరుడు ఆగస్టులోనూ, అదే ప్రాంతంలోని 15వ పెట్రో లింగ్ పాయింట్ నుంచి నవంబర్ మొదట్లోనూ రెండు దేశాల సైన్యాలు వెనక్కు తగ్గాయి. ఆఖరికి 20 మంది భారత జవాన్లను బలి తీసుకున్న తవాంగ్ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా నెమ్మ దిగా సామరస్యం నెలకొంది. ఇలా పరిస్థితులు ఎంతో కొంత కుదుటపడుతున్నాయనుకుంటున్న దశలో తాజా చర్చలకు ముందే తూర్పు సెక్టార్లో చొరబాటుకు ప్రయత్నించటం చైనా కపటనీతికి నిదర్శనం. చైనాతో కోర్ కమాండర్ల స్థాయిలో ఇంతవరకూ 16 విడతల చర్చలు జరిగాయి. ప్రతి సంద ర్భంలోనూ మన ప్రభుత్వం చర్చల తేదీని ముందుగానే ప్రకటించటం, ఆ చర్చలు పూర్తయ్యాక అందులోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయటం రివాజు. కానీ ఈసారి మాత్రం 17వ విడత చర్చల విషయంలో ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. చర్చలు పూర్తయిన మూడు రోజుల తర్వాత మాత్రమే ప్రకటన వెలువడింది. కారణాలు ఊహించటం కష్టమేమీ కాదు. తవాంగ్‌లో జరిగిన తాజా ఘర్షణలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ అలజడి రేగటం, ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయటం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇలాంటి సమయంలో చర్చలంటే భావోద్వేగాలు మరింత పెరుగుతాయి. అంతమాత్రాన ఏం జరుగుతు న్నదో దేశ ప్రజలకు వెంటవెంటనే తెలియజేయకపోవటం సరికాదని ప్రభుత్వం గుర్తించాలి. ఆ సంగతలా ఉంచి నిరంతర ఘర్షణ వాతావరణం ఏ దేశానికీ మంచిది కాదు. అయితే ఎల్లకాలమూ ఘర్షణ వాతావరణం ఉండటం సరికాదు. స్పష్టమైన సరిహద్దు లేనిచోట భారీగా సైన్యాలను మోహ రించటం, ఎప్పుడో ఒకప్పుడు ఫలానా ప్రాంతం తమదేనంటూ కయ్యానికి దిగటం, ఘర్షణలు చోటుచేసుకోవటం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. అది చివరకు యుద్ధంగా పరిణమించినా ఆశ్చర్యంలేదు. కనుక ఎంతటి క్లిష్ట సమస్యకైనా చర్చల ప్రక్రియ మాత్రమే పరిష్కార మార్గం. అదే సమయంలో స్నేహం నటిస్తూనే ద్రోహ చింతనతో మెలగుతున్న చైనా కపటనీతిని బయటపెట్టడం కూడా అవసరం. మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే గత నెలలో ఎల్ఏసీ గురించి చెబుతూ అక్కడ పరిస్థితి స్థిరంగానే ఉన్నా అనూహ్యంగా ఉన్నదని వ్యాఖ్యానించిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకపక్క కొవిడ్‌తో చైనా అల్లకల్లోలంగా ఉంది. కఠినమైన ఆంక్షలకు నిరసనగా రోడ్లపైకి వచ్చిన జనమే ఇప్పుడు బయటకు రావటానికి హడలెత్తుతున్నారు. ఏం చేయాలో చైనా సర్కారుకు పాలు బోవటం లేదు. దాన్నుంచి జనం దృష్టి మళ్లించటానికి కూడా ఎల్ఏసీలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి ఉండొచ్చు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తూనే, వాటితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందామని చైనా 80వ దశ కంలో ముందుకొచ్చింది. అందువల్ల గత కొన్ని దశాబ్దాలుగా మనకన్నా ఎక్కువ లాభపడుతున్నది కూడా చైనాయే. కానీ అంతర్గతంగా అవసరం పడినప్పుడల్లా ఎల్ఏసీ వద్ద మంట పెట్టాలని చూస్తోంది. ఈ పోకడలు ఎంత త్వరగా విరమిస్తే చైనాకు అంత మంచిది. ఘర్షణలు ముదురుతున్న తీరు చూశాక మన దేశం ఎల్ఏసీలోని మూడు సెక్టార్లలోనూ చైనాతో సమానంగా మౌలిక సదుపా యాల మెరుగుకు చర్యలు తీసుకోవటం మొదలెట్టింది. నిర్ధారిత సరిహద్దు లేనిచోట ఇరు దేశాలూ సైన్యాలను మోహరిస్తే, ఏదో ఒక పక్షం కయ్యానికి దిగుతుంటే సహజంగానే పరిస్థితులు ప్రమాద కరంగా పరిణమిస్తాయి. కనుక విజ్ఞతతో మెలగటం అవసరమనీ, అంతర్గత విషయాల్లోనైనా, విదేశీ సంబంధాల్లోనైనా శాంతి సుస్థిరతలు ఏర్పడాలంటే కొన్ని విలువలనూ, నియమ నిబంధనలనూ పాటించటం ముఖ్యమనీ చైనా నాయకత్వం గ్రహించాలి. -
ఫలితం లేకుండానే ముగిసిన భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన తొలిగేదిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి. అపరిష్కృత సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలంటూ ఇరు దేశాల నేతలు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దాపరికాలు లేకుండా మరింత వివరణాత్మకంగా చర్చలు జరిపినట్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో సరిహద్దుల్లో భద్రతను, స్థిరతను కాపాడుకోవాలని అంగీకరించినట్లు చెప్పాయి. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తూ, విభేదాలకు ఆమోదయోగ్య పరిష్కారాన్ని త్వరగా కనుగొనాలని పేర్కొన్నాయి. ఈ నెల 20న సరిహద్దుల్లోని చైనా భూభాగంలో చుషుల్–మోల్దో వద్ద 17వ విడత భారత్–చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్‌లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
‘అత్యంత క్లిష్ట దశలో భారత్-చైనా సంబంధాలు’
బ్యాంకాక్: సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు పొరుగు దేశాలు కలిసి పని చేస్తేనే ఆసియా అభివృద్ధి పథంలో వెళ్తుందని సూచించారు. బ్యాంకాక్ చులలాంగ్‌కోర్న్ యూనివర్సిటిలో ఇండో-పసిఫిక్‌లో భారత్ విజన్‌పై మాట్లాడిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్. ‘సరిహద్దులో డ్రాగన్ చేసిన పనికి ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. భారత్, చైనా కలసి నడిచేందుకు ఒక్క శ్రీలంక మాత్రమే కాదు, చాలా కారణాలున్నాయని నేను భావిస్తున్నా. అయితే, అది భారత్, చైనా వ్యక్తిగత నిర్ణయం. చైనా వైపు సానుకూల స్పందన ఉంటుందని మాకు నమ్మకం ఉంది. శ్రీలంకకు అన్ని విధాలా భారత్ సాయం చేసింది. ఈ ఏడాదిలోనే 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఐఎంఎఫ్ వద్ద శ్రీలంకకు అవసరమైన మద్దతును ఇస్తాం.’ అని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్. రోహింగ్యాల సమస్యపై అడిగిన ప్రశ్నకు.. బంగ్లాదేశ్‌తో చర్చిస్తున్నామని సమాధానమిచ్చారు మంత్రి జైశంకర్. వారిని తిరిగి స్వదేశానికి పంపించటమే ప్రధాన అంశమని, ఆ విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు జైశంకర్. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదన్నారు. పలు ఐరోపా దేశాలు సైతం చమురు దిగుమతలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
చైనా సవాలును ఎదుర్కోవాలంటే...
భారత్‌ను తోటి ఆధిపత్య శక్తిగా చైనా చూడటం లేదు. పైగా, శక్తిమంతమైన స్థానంలో ఉన్న చైనా, భారత్‌కు తనతో సమానమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా భావించడం లేదు. బ్రిటిష్ వలసవాద కాలంలో విదేశీ శక్తి పాలనలో ఉంటున్న బానిస జాతిగా భారతదేశాన్ని చైనా చూస్తూ వచ్చింది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, చైనాకు వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యం 19వ శతాబ్దిలో చేసిన పలు దాడుల సందర్భంగా భారతీయ సైని కులు బ్రిటిష్ పాలకులకు షాక్ ట్రూప్‌లుగా సేవ చేశారు. షాంఘై, హాంకాంగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న పట్టణ కేంద్రాల్లో, భారతీయ నల్లమందు వ్యాపారులే తమ సంపదను ప్రదర్శించుకున్నారు. ఇక్కడే భారత్‌పట్ల చైనా వ్యతిరేకతకు మూలం ఉందని చెప్పవచ్చు. సంకుచిత జాతీయవాద పెరుగుదల, మతపరమైన అసమ్మతిని దూకుడుగా అమలు చేయడం, భారత్‌ను విశిష్టమైనదిగా మార్చిన ఆస్తులను అమ్మేయడం వంటి చర్యలకు భిన్నంగా, భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలకు నిబద్ధత పాటించడం ద్వారానే చైనా సవాలును ఎదుర్కోవడానికి భారత్‌కు మెరుగైన అవకాశం ఉంటుంది. చైనా అత్యంత శక్తిమంతమైన మన పొరుగుదేశం. కానీ ఆ దేశం గురించి మనకు తెలిసింది తక్కువే. పైగా ఆ దేశం మనగురించి ఏమనుకుంటుందో మనకు అర్థమయింది మరీ తక్కువే. ఇంతకు మించిన అసంబద్ధత మరొకటి లేదు. గత 12 నెలల కాలంలో ప్రచురితమైన అద్భుత పుస్తకాలు మన కళ్లను బాగానే తెరిపించాయని చెప్పాలి. ఇవి బయటపెట్టిన విషయాలు మనకు అసౌకర్యం కలిగించడమే కాదు... చాలా ఆసక్తిని కలిగించాయి కూడా. కానీ ఈ పుస్తకాలు తమ విలువకు తగిన సావధానతను పొందాయా అని ఆశ్చర్యపడు తున్నాను. ఈ రెండు పుస్తకాల్లో మొదటిది కాంతి బాజ్‌పేయి రాసిన ‘ఇండియా వర్సెస్ చైనా: వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్’. ఈయన సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో ఆసియన్ స్టడీస్ విల్మార్ ప్రొఫెసర్. ఇక రెండో పుస్తకం శ్యామ్ శరణ్ రాసిన ‘హౌ చైనా సీస్ ఇండియా: ది అథారిటేటివ్ అకౌంట్ ఆఫ్ ది ఇండియా–చైనా రిలేషన్షిప్’. ఈయన విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి. ఈ రెండూ ఒకేవిధమైన అంశాలను కలిగి ఉన్నాయి కానీ విభిన్నంగానూ, ఒకదానికొకటి వేర్వేరుగానూ ఉన్నాయి. చైనా కొంచెం ఎక్కువ సమానం? మనం చైనాగురించి ఎంత అజ్ఞానంతో ఉంటున్నాం అనే అంశంతో శరణ్ పుస్తకం మొదలవుతుంది. భారత్, చైనా శతాబ్దాలుగా ఒకదానికొకటి అపరి చితంగానే ఉంటూ వచ్చాయి. మనకు పొరుగునే ఉంటూ, శక్తిమంతమైన ప్రత్యర్థిగా ఉంటూ, బహు ముఖ రూపాల్లో తనను తాను వ్యక్తీకరించుకుంటూ సవాలు విసురుతూ మనతో ఘర్షిస్తున్న దేశం గురించి మనకు ఎంత తక్కువగా తెలుసని శరణ్ ప్రశ్నిస్తారు. ఇకపోతే, చాలామంది పరిశీలకులు అభినందిస్తున్నటువంటి లేదా గుర్తిస్తున్నటువంటి దానికంటే ఎక్కువ సంక్లిష్టంగానూ, మరింత అంధ కారంతోనూ ఉంటున్న చైనా–భారత్ సంబంధాలు ఎంత సంక్లిష్ట సంబంధాలుగా ఉంటున్నాయనే విషయాన్ని బాజ్‌పేయి పరిచయం మరింత గట్టిగా మనకు విడమర్చి చెబుతుంది. చైనా రియర్ వ్యూ మిర్రర్లో భారత్ ఒక తిరోగమిస్తున్న చిత్రంగా ఉంటోందని శరణ్ చెబుతారు. ఒక ఉద్వేగ భరితమైన పదబంధంతో భారత్ వెనుకబడిందని సూచించడమే కాకుండా, మరింత మరింతగా విఫలమవుతోందని చైనా భావిస్తోందని చెబుతారు. తాను ఆధిపత్యం చలా యిస్తున్న ఆసియా ఖండంలో ఒక అధీనతా పాత్రలో భారత్ ఇమిడిపోవడాన్ని చైనా బాగా ఇష్టపడుతోందని శరణ్ చెపుతారు. బాజ్‌పేయి కూడా దీంతో ఏకీభవిస్తున్నారు. భారత్‌ను తోటి ఆధిపత్య శక్తిగా చైనా చూడటం లేదు. పైగా, శక్తిమంతమైన స్థానంలో ఉన్న చైనా, భారత్‌కు తనతో సమాన స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించడం లేదు... పరస్పర దృక్పథాలు, అధికార అసమానత అనేవి రెండు దేశాలమధ్య తీవ్రమైన సమస్యలు కావచ్చని బాజ్‌పేయి చెబుతారు. గెలుపు రుచి చూసిన దేశంగా... భారతదేశం చాలా గొప్ప ప్రభావం చూపుతు న్నప్పుడు, అంటే క్రీ.శ. 1000వ సంవత్సరం వరకు ఇరుదేశాల బాంధవ్యం ఎంత విభిన్నంగా ఉన్నప్ప టికీ, చైనా వైఖరి ఎంతగా మారిపోయిందీ శరణ్ పుస్తకం చెబుతుంది. బ్రిటిష్ వలసవాద కాలంలో విదేశీ శక్తి పాలనలో ఉంటున్న బానిస జాతిగా భారతదేశాన్ని చైనా చూస్తూ వచ్చింది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, చైనాకు వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యం 19వ శతాబ్దిలో చేసిన పలు దాడుల సందర్భంగా భారతీయ సైనికులు బ్రిటిష్ పాలకులకు షాక్ ట్రూప్‌లుగా సేవ చేశారు. షాంఘై, హాంకాంగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న పట్టణ కేంద్రాల్లో, భారతీయ నల్లమందు వ్యాపారులే తమ సంపదను ప్రదర్శించుకున్నారు. ఇక్కడే భారత్ పట్ల చైనా వ్యతిరేకతకు మూలం ఉందని చెప్పవచ్చని శరణ్ పేర్కొంటారు. బాజ్‌పేయి అయితే మరింత కలవరపరిచే అంశాన్ని లేవనెత్తారు. ఒక రంగంలో మనమే ముందున్నామని నమ్ముతుంటాం. కానీ ఇక్కడ కూడా చైనా ఆధిపత్య దేశంగా ఉంటోంది. ఒక సాఫ్ట్ పవర్‌గా సాధారణంగా చెబుతూ వస్తున్న దానికి భిన్నంగా భారత్ కంటే చైనా మెరుగైన స్థానంలోనే ఉంది. ఇది చాలాకాలం కొనసాగేటట్టు కనబడుతోందని బాజ్‌పేయి చెబుతారు. ప్రపంచ కేంద్రస్థానంలో ఉన్నట్లు తనను తాను భావిస్తున్న చైనా దృక్పథాన్ని ఊహాత్మక చరిత్రేనని శరణ్ వివరిస్తారు. అయితే 1962 తర్వాత బీజింగ్‌కు విధేయంగా ఉండే అంచుల్లో భాగంగా భారత్ ఉండేటట్లుగా చైనా తన ఊహా త్మక చరిత్రను కాస్త పొడిగించింది. 1962లో భారత్‌ను చైనా ఓడించాక, భారత్ పొందిన అవమానభారాన్ని చూసిన చైనా తాను ఊహించినంత శక్తిమంతంగా కూడా భారత్ లేదని భావించింది. రాజ్యాంగమే దారి బాజ్‌పేయి ఇక్కడే అసలు విషయం పట్టుకున్నారు. చైనా ఇప్పుడు 15 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదిగింది. భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వెనకనే ఉండిపోయింది. ఈ అంతరం ఇంకా పెరగనుందని ఆయన నాతో అన్నారు. చైనాతో సమానంగా భారత్ ఎదగాలంటే నాగరిక మార్పునకు సన్నిహితంగా ఉండాల్సిన అవసర ముంది కానీ అది సాధ్యం అవుతుందని బాజ్ పేయికి నమ్మకం కలగడం లేదు. పవర్ గ్యాప్‌కు భారత్ దగ్గరగా వచ్చేంతవరకూ చైనాతో సయోధ్య గురించి భారత్‌కు పెద్దగా ఆశలు లేవు. నరేంద్రమోదీ పాలనలో భారత్ ప్రస్తుత గమనం గురించి శరణ్ కలవరపడుతున్నారు. సంకుచిత జాతీయవాద పెరుగుదల, మతపరమైన అసమ్మతినీ, అసహనాన్నీ దూకుడుగా అమలు చేయడం... భారత్‌ను విశిష్టమైనదిగా మార్చిన ఆస్తులను అమ్మేయడం లాంటి చర్యలు మాని భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలకు నిబద్ధత పాటించడం ద్వారానే చైనా సవాలును ఎదుర్కోవడానికి భారత్‌కు మెరుగైన అవకాశం ఉంటుందని శరణ్ నమ్మకం. ఈ రెండు పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి. వీటిని చదవడం చాలా సులభం. ప్రతి పేజీ రివార్డుకు అర్హమైనదే. ఈ రెండు పుస్తకాలను చదివాక, నాకు చైనా బాగా అర్థమైందని భావిం చాను. ఈ ఊహే ఒక రుజువు. ఇది భారీ ప్రభావం కలిగిస్తుంది. వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
పోరు నష్టం... పొందు లాభం
గల్వాన్ లోయ ఘటన తర్వాత దిగజారిన భారత్, చైనా సంబంధాలు మెరుగుపడటానికి ఇదే సమయం. రెండు దేశాలూ బలప్రదర్శనతో ప్రయోజనం లేదని గుర్తించాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన కూడా పెరిగింది. దీనికితోడు, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయక పోవడాన్ని ‘డ్రాగన్’ గమనించకుండా ఉండదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని భారత్, చైనా ఆచరణలో పెట్టాల్సిన తరుణం ఇది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం జోరుగా సాగుతున్న పరిస్థితులు... భారత్–చైనా సంబంధాలు మెరుగు పడేందుకు కారణం అవుతున్నాయి. వ్యూహాత్మక విషయాల్లో స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉన్న భారత్... రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ఒక పక్షం వైపు నిలబడేందుకు నిరాకరిస్తున్న విషయం... అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్లకు లొంగని తత్వం... డ్రాగన్ దృష్టిని మీరి ఉండే అవకాశమే లేదు. కాబట్టి గల్వాన్ ఘటనను గతకాలపు జ్ఞాపకంగా వదిలేసి, ఇరు దేశాలూ తమ సంబంధాలను మళ్లీ దృఢతరం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం. అలాగే భారత్ –చైనా రెండూ కలిసికట్టుగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి తెరదింపగలిగితే యూరప్‌లో శాంతికి ఆసియా దేశాలు కృషి చేసే అపురూప ఘట్టం ఒకటి ఆవిష్కృతమవుతుంది. రెండేళ్లుగా భారత్–చైనా సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయన డంలో ఎలాంటి సందేహమూ లేదు. లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణతో మొదలైన పతనం ఇప్పుడు పుంజుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. సంబంధాలు పూర్వస్థితికి లేదా ఉచ్ఛస్థితికి చేరుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు కానీ... కొత్త పరిణామాలు మాత్రం వైషమ్యం తగ్గుముఖం పట్టే ఆశను కల్పిస్తున్నాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీ నేడు భారత్ రానున్నారు. ఇదే విధంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ బీజింగ్ వెళ్లే అవకాశమూ ఉంది. ఇరు దేశాల మంత్రుల పర్యటన... వచ్చే ఏడాది జరిగే ‘బ్రిక్స్’ సమావేశాల్లో పాల్గొనేందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు రంగం సిద్ధం చేయడం అనేది నిస్సందేహం. భారత ప్రధాని హాజరీ లేకుండా బ్రిక్స్ సమావేశం జరగడం ఊహించలేము. అదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి ఎంతో కొంత చక్కబడకుండా భారత ప్రధాని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో ముఖాముఖి మాట్లాడే పరిస్థితీ ఉత్పన్నం కాదు. ఇరుదేశాల మధ్య మళ్లీ స్నేహపూరిత వాతావరణం ఏర్పడేందుకు కారణాలేమిటి? బలప్రదర్శనతో ప్రయోజనం లేదని ఇరు దేశాలూ గుర్తించడం మొట్టమొదటి కారణం. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... బల ప్రదర్శన నిష్ప్రయోజనమన్న విషయం ముందుగా చైనా వైపు నుంచే వ్యక్తం కావడం. ఈ నెల ఏడవ తేదీన చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ, ‘‘లక్ష్యాల సాధనకు ఒకరి కొకరు సహకరించుకోవాలేగానీ... ఒకరి శక్తిని ఇంకొకరు పీల్చేసు కుంటూ ఉండటం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో యాభై వేలమంది సైనికులను మోహరించడం (శక్తి), ఆయుధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవడం పైనే ఈ వ్యాఖ్య అన్నది అర్థం చేసుకోవాలి. కమాండర్ల స్థాయిలో పదిహేనుసార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతల తగ్గింపు అందని మానిపండులాగే మిగిలింది మరి. రాజ కీయంగానూ పరిష్కారం కానరాని నేపథ్యంలో బల ప్రదర్శన చేయడం తర్కానికి నిలిచేది కాదు. ఆ పరిస్థితి తాలూకూ విపరిణా మాలను ఇరుదేశాలూ అనుభవించాల్సి ఉంటుంది. రెండో కారణం... ఒక చిన్న ఘటనతో ద్వైపాక్షిక సంబంధాలు ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదని ఇరుదేశాలూ గుర్తించడం. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన పెరగడం. ఆర్థిక, వాణిజ్య రంగాలతోపాటు వాతావరణ మార్పులపై పోరు, డిజిటల్ టెక్నా లజీలు, ప్రాంతీయంగా శాంతి వంటి అనేకానేక ప్రయోజనాలు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటేనే సాధ్యమనీ, తద్వారా ప్రపంచస్థాయిలో సరికొత్త భిన్న ధ్రువాత్మక రాజకీయాలకు రూప కల్పన చేయవచ్చుననీ భావించడం. కొన్ని అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలూ, దృక్కోణాలూ వేరుగా ఉన్నప్పటికీ... చాలా అంశాల్లో సారూప్యతా ఉంది. సారూ ప్యతతో వచ్చే ప్రయోజనాలు పొందాలన్నా... భిన్నాభిప్రాయాల పరిణామాలను నియంత్రించాలన్నా రాజకీయంగా అత్యున్నత స్థాయి చర్చలు అత్యవసరం. గల్వాన్ ఘటన కారణంగా ఈ చర్చల ప్రక్రియ ఆగిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ముందు మోదీ, జింగ్పింగ్ దాదాపు 18 సార్లు కలిసినా... ఆ తరువాత మాత్రం ఒక్క సారి కనీసం కలుసుకోలేదు. ఈ స్తబ్ధత ఇరువురికీ మేలు చేసేదేమీ కాదు. భారత్–చైనా మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని చెప్పే ఇంకో కారణం... ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ జరుగుతున్న పరిణామాలు. శాంతి, సుస్థిరతల స్థాపనలో ఇరు దేశా లకూ బాధ్యత, భాగస్వామ్యం ఉంది. అమెరికా బలగాలు వెళ్లిపోయిన తరువాత తాలిబాన్ల చేతిలో చిక్కిన అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంపై కూడా ఇరు దేశాలూ పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదానికీ, మతపరమైన తీవ్రవాదానికీ, వేర్పాటు వాద శక్తులకూ చోటులేకుండా చూడటం కూడా అత్యవసరం. ఈ మూడు లక్ష్యాల సాధనకు పాకిస్తాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని అన్ని దేశాల మ«ధ్యా చర్చలు కచ్చితంగా జరగాలి. చైనా ప్రభావం పాకిస్తాన్‌పై కూడా ఉన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కూడా భారత్, చైనా తమ ఆలో చనలను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. రష్యాతో ఇరుదేశా లకూ మంచి సంబంధాలే ఉండటం దీనికి కారణం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయకపోవడాన్ని చైనా కచ్చితంగా గమనించే ఉంటుంది. ‘‘కొన్ని శక్తులు రెండు ఆసియా దేశాల మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నించాయి’’ అన్న బీజింగ్ వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రపంచస్థాయిలో భారత్ అవసరాన్నీ, ప్రాము ఖ్యతనూ చైనా కూడా పరోక్షంగా గుర్తు చేస్తూనే ఉంది. ‘‘భారత్– చైనా భాగస్వా ములూ, మిత్రులూ కావాల్సిన అవసరం ఉంది. ఒకరికి ఒకరు ముప్పుగా పరిణమించకుండా పరస్పర అభివృద్ధికి అవకా శంగా మారాలి’’ అంటూ వాంగ్ యీ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇందుకు ఒక ఉదాహరణ. ‘‘భారత్, చైనా దేశాలు అతిపురాతన నాగరికతలకు ఆనవాళ్లు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాకుండా... వేరు చేయలేని ఇరుగూ పొరుగూ కూడా. ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగితే ఆ మైత్రికి హిమాలయాలూ అడ్డు కాబోవు’’ అని కూడా వాంగ్ వ్యాఖ్యానించారు. రెండేళ్ల స్తబ్ధతను ఛేదించేందుకు ఈ ఏడాది గట్టి ప్రయత్నమే జరిగింది. ఇరు దేశాల్లోనూ భారత – చైనా నాగరికతలపై చర్చలు చేపట్టాలని చైనా ప్రతిపాదించడం వీటిల్లో ముఖ్యమైనది. 2019 మే నెలలో జింగ్పింగ్ ఆసియా నాగరికతలపై ఓ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారత్ ఆ చర్చల్లో అధికారికంగా పాల్గొనలేకపోయింది. కానీ.. వీటిల్లో నేను పాల్గొ న్నాను. ఆ కార్యక్రమంలో జింగ్పింగ్ ఆసియా నాగరికతలు రూపు దిద్దుకోవడంలో భారత భాగస్వామ్యంపై ప్రశంసల వర్షం కురిపిం చారు. రుగ్వేదం, గంగ, సింధు నదులతోపాటు అమూల్యమైన బౌద్ధం గురించి కూడా ప్రస్తావించారు. ‘‘పరాజితులు లేని... ఇరు పక్షాలూ విజితులుగా నిలిచేదే మేలైన వివాద పరిష్కారం’’ అన్న గౌతమ బుద్ధుడి వ్యాఖ్యను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. భారత్, చైనా కూడా ఈ మాటలకు చెవి ఒగ్గడం ఎంతైనా అవసరం. ఇరు దేశాల సరిహద్దుల్లో ఏర్పడ్డ వివాదం పరస్పరం రాజీ పడటం ద్వారా మాత్రమే పరిష్కారమవుతుంది. ఇందుకు ఇరు పక్షాలూ ముందడుగు వేయాలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ, పునఃసమీక్ష చేసుకుంటూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, హింసను ప్రేరేపించకుండా... భారత్, చైనా ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇది. అలా చేయని పక్షంలో గల్వాన్ లోయ తరహా ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చడం తప్పదు! సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త ఫోరమ్ ఫర్ ఎ న్యూ ఆసియా వ్యవస్థాపకులు (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భారత్–చైనా మధ్య 15వ దఫా చర్చలకు రంగం సిద్ధం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య ఈ నెల 11న జరగబోయే 15వ దఫా చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలకు ముగింపు పలకడమే ఈ ఉన్నత స్థాయి సైనిక చర్చల లక్ష్యమని అన్నారు. శుక్రవారం లద్దాఖ్‌లోని చుషూల్ మాల్డో మీటింగ్ పాయింట్ వద్ద ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. భారత్–చైనా మధ్య పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల్లో శాంతి తప్పనిసరిగా నెలకొనాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. (చదవండి: దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ) -
చైనా నుంచి భారత్‌కు పెను సవాళ్లు
వాషింగ్టన్: భారత్‌కు ప్రధానంగా డ్రాగన్ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్‌కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ శ్వేతసౌధం తన తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని నివేదికలో తెలియజేసింది. రెండు దేశాలు కలిసి పని చేస్తాయని అభిప్రాయపడింది. దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని శ్వేతసౌధం తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో భారత్ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తామని ప్రకటించింది. భారత్ నాయకత్వ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించింది. భారత్ తమ భాగస్వామ్య దేశమని ఉద్ఘాటించింది. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న అని స్పష్టం చేసింది. ఇండియాతో కలిసి పనిచేస్తాం.. ఆస్ట్రేలియా, తదితర దేశాల తరహాలో కాకుండా భారత్ భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందని, పొరుగు దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఏసీ వద్ద చైనా ప్రవర్తన భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న మాట వాస్తమేనని అన్నారు. గత ప్రభుత్వ(డొనాల్డ్ ట్రంప్ సర్కారు) హయాంలో భారత్–అమెరికా మధ్య సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తృతమయ్యాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని బైడెన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. తమలాగే మరో ప్రజాస్వామ్య దేశమైన ఇండియాతో కలిసి పనిచేసే విషయంలో ఎన్నో అవకాశాలు కళ్లెదుట కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇండియాతోపాటు ఇండోనేషియా, మలేసియా, మంగోలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, వియత్నాం, పసిఫిక్ దీవులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ‘క్వాడ్’ మినిస్టీరియల్ సదస్సు జరిగిన రోజే ‘ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యం’పై బైడెన్ ప్రభుత్వం తొలి నివేదికను విడుదల చేయడం విశేషం. -
చైనాతో వాణిజ్యం కొత్త పుంతలు
బీజింగ్: భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో రికార్డు స్థాయిలో 125 బిలియన్ డాలర్లకు (రూ.9.37 లక్షల కోట్లు) విస్తరించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 43 శాతం పెరిగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం వాణిజ్యంపై పడలేదని స్పష్టమవుతోంది. చైనా నుంచి దిగుమతులు పెరిగిపోవడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య లోటు 69 బిలియన్ డాలర్లకు (బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,500కోట్లు) విస్తరించింది. 2021లో చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 46 శాతం పెరిగి 97.52 బిలియన్ డాలర్లకు విస్తరించగా.. భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 34 శాతం వృద్ధితో 28.14 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కస్టమ్స్ విభాగం డేటా ఆధారంగా గ్లోబల్‌టైమ్స్ పేర్కొంది. భారత్ ఆందోళన.. గత దశాబ్దకాలంగా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత ఐటీ, ఫార్మా ఉత్పత్తులకు ద్వారాలు తెరవాలని చైనాను గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయినా బీజింగ్ పట్టించుకోవడం లేదు. కరోనా రెండో విడత ప్రభావంతో వైద్య పరికరాల దిగుమతి, ఫార్మా కంపెనీలు ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడడమే ఆ దేశం నుంచి భారత్‌కు ఎగుమతులు భారీగా పెరిగేందుకు కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. 2021 మే5 న ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. పదుల సంఖ్యలో సైనికులు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్టంగా మారాయి. ఆ తర్వాత నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు చైనా నుంచి దిగుమతులను తగ్గించడంపై దృష్టి సారించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) తీసుకొచ్చింది. ఇప్పటికే 13–14 రంగాలకు దీన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా ఉత్పత్తుల తయారీని స్థానికంగానే పెంచుకుని, ప్రపంచానికి ఎగుమతి కేంద్రంగా మార్చాలన్నది కేంద్ర సర్కారు ప్రణాళిక. ఇది ఆచరణ రూపం దాలిస్తే చైనాపై ఆధారపడడం తగ్గుతుంది. -
సత్సంబంధాలతోనే ప్రయోజనం
భారత్–చైనా సంబంధాలలో ఎన్ని ఘర్షణలు చోటు చేసుకుంటున్నా, ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను వీలైనంతవరకు కొనసాగించడమే ఉత్తమం. ‘హిందీ– చీనీ భాయి భాయి’ అనే నినాదం స్థానంలో ‘హిందీ–చీనీ బైబై’ అనే నినాదానికి ప్రాచుర్యం ఇస్తున్న వారు ఈ ప్రపంచం మొత్తంగా పరస్పరాధారితం అనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ప్రపంచీకరణ ఏదో ఒక రూపంలో దేశాలన్నింటికీ ఏకం చేసింది. ఈ నేపథ్యంలో దేశాల నడుమ పొర పొచ్చాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజల పాలిట శాపాలు కారాదు. ఇరు దేశాల ప్రజల అవసరాలు తీర్చడంలో అవి అడ్డంకులు కారాదు. ఈ ఎరుకతో పరస్పరం ప్రతి దేశం మరో దేశంతో పూర్తి సంయమనంతో అన్నింటా పాటించగలిగితే అది ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, అవసరాల్లో ఆదుకోవడానికి ఎంతైనా దోహదకారి అవుతుంది. స్వతంత్ర దేశంపై మరొక దేశం దురాక్రమణ ఆక్షేపణీయం. దాన్ని ఆయా రీతులలో అన్నివిధాలా ఎదుర్కోవలసిందే. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసినదే. కానీ దాని పేరుతో సమస్త సంబంధాలను విచ్ఛిన్నం చేసుకోనవసరం లేదు. సాకు దొరికింది కదా అని గతంలోని వాటిని తవ్వి తలకెత్తుకుని ఆడిపోసుకోనవసరం లేదు. మానవీయ సంబంధాలకు ఈపేరుతో ఉద్వాసన పలకనవసరం లేదు. దేశాల మధ్య పరస్పర సంబంధాలను కాదనటం, కాలదన్నటం అనైతికం. ఇది అమాయక ప్రజలలో దాగున్న భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. ఇందుకు తాజా తార్కాణం మన దేశం చైనాతో 2021లో విదేశీ వాణిజ్యం 100 బిలియన్లు డాలర్లు దాటుతూ ఉండటం. ఇంత పెద్ద స్థాయిలో పరస్పర వాణిజ్యం జరగడం ఇదే తొలిసారి. చైనా ప్రభుత్వ కస్టమ్స్ పాలనా విభాగం డేటా ప్రకారం చైనా భారత్ మధ్య వాణిజ్యం ఈ తొమ్మిది నెలల్లో గతంలో కన్నా 49 శాతం వృద్ధితో 90.3 బిలియన్లకు చేరింది. చైనా నుండి మన దిగుమతులు గతంలోకన్నా 51.7 శాతం వృద్ధితో 68.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో మన ఎగుమతులు 42.5 శాతం పెరుగుదలతో 21.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మన రెండు దేశాల విదేశీ వాణిజ్యం కరోనా ముందు కాలం నాటి కన్నా గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ గణాంక వివరాలు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు సంకేతం. మన దేశం నుంచి చైనాకు ముఖ్య ఎగుమతులు– ఇనుప ఖనిజం, కాటన్, ఇతర ముడిసరుకులు ముఖ్యమైనవి. మన దిగుమతుల్లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ యంత్రాలు, యంత్ర పరికరాలు, మందులు, వాటికి సంబంధించిన మూలకాలు వగైరా గత రెండేళ్లలో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఒక దేశ అభివృద్ధి ప్రపంచ అవసరాలను తీర్చటంతో కూడా ముడిపడి ఉంటుందని స్పష్టమవుతోంది. వీటిని ఏ రూపంలో ఆటంకపరచినా అదివిశ్వ మానవాళి ప్రయోజనాలకు ద్రోహం చేసినట్లే అవుతుంది. దేశాల నడుమ పరస్పర సత్సంబంధాలు ఏ విధంగా పరస్పర ప్రయోజనకారులో తాజా గణాంకాల వివరాలు తెలుపుతున్నాయి. ‘హిందీ – చీనీ బై బై’ అంటే ఇవన్నీ ఎలా సాధ్యం? సాధ్యం కాకుంటే ఇక్కడ అక్కడ ప్రజ లంతా ఏమయ్యేవారు? వారి అత్యవసరాలు/ ప్రయోజనాలు ఎలా తీరేవి? నెరవేరేవి? చైనా నుంచి యంత్రాలు, పరికరాలు, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, మందులకు సంబంధించిన ఎగుమతులు రెట్టింపుకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆ దేశం నుండి రాకుంటే ఇక్కడి కోట్లాది మంది ప్రజలు ఏమై ఉండేవారు? భారత్– చైనా సంబంధాల పట్ల విషం చిమ్ముతున్న వారు ఒకవిషయం గుర్తించాలి. పరస్పర సంబంధాల విచ్ఛిన్నానికి చిన్న కారణం చాలు. వీటిని గుర్తించి గౌరవించి పాటించడమే వ్యక్తుల, వ్యవస్థల– విజ్ఞత, వివేకం, విచక్షణలకు కొలబద్ధలు. అవి ఎల్ల వేళలా అందరికీ, అందునా జనజీవనంలో ఉన్నవారికి మరింతగా ఉండాలని ఆశిద్దాం. – బి. లలితానంద ప్రసాద్ విశ్రాంత ఆచార్యులు ‘ 92474 99715 -
మరోసారి బయటపడ్డ చైనా దుష్ట పన్నాగాలు.. ఈసారి
న్యూఢిల్లీ: చైనా దుష్ట పన్నాగాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి సుదీర్ఘ కాలం తన సైన్యం పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) మకాం వేసేందుకు వీలుగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వీటిలో తిష్ట వేసి ఉండే బలగాలు అవసరమైన పరిస్థితుల్లో తక్షణమే ఎల్ఏసీ వద్దకు చేరుకునేందుకు వీలవుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కాంక్రీట్ నిర్మాణాలను తాము చూసినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఉత్తర సిక్కింలోని ‘నకు లా’కు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఇటువంటి కాంక్రీట్ క్యాంప్ ఒకటి ఉందని పేర్కొన్నాయి. ఇలాంటి నిర్మాణాలే, భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, తూర్పులద్దాఖ్ సమీపంలోనూ ఉన్నాయని సైనిక వర్గాలు వివరించాయి. కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రహదారులను కూడా చైనా మెరుగుపర్చిందనీ, దీనివల్ల ఎల్ఏసీ వెంట తలెత్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా వేగంగా స్పందించేందుకు పీఎల్ఏకు అవకాశం ఏర్పడుతుందన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన ఈ నిర్మాణాల కారణంగా డ్రాగన్ సైన్యం భారత భూభాగం వైపు వేగంగా కదిలే గణనీయంగా సామర్థ్యం మెరుగైందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దు కొండ ప్రాంతాల్లోని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించే బలగాల్లో 90 శాతం వరకు అతిశీతల పరిస్థితుల కారణంగా చైనా వెంటవెంటనే మార్చాల్సి వస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, అదనపు భద్రత హంగులు సమకూర్చిన కాంక్రీట్ నిర్మాణాలతో ఆ అవసరం తప్పుతుందని అంటున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి, అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని సైనిక వర్గాలు చెప్పాయి. గత ఏడాది నుంచి ఎల్ఏసీ వెంట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత, చైనా బలగాలు సిక్కింలోని నకు లా ప్రాంతంతోపాటు తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో బాహాబాహీ తలపడిన విషయం తెలిసిందే. -
సరస్సు మీద ఎగురుతున్న శాంతి కపోతాలు
తూర్పు లద్దాఖ్ ప్రాంతం లోని పాంగాంగ్ సరస్సు దగ్గర భారత్, చైనా తమ సైన్యాన్ని ఉపసంహరించుకొనే ప్రక్రియ ప్రారంభించడం శుభసూచకం. ఇందుకు కారణమైన ఇరు దేశాల ప్రభుత్వాధినేతలను, దౌత్యవేత్తలను, మిలిటరీ అధి కారులను ప్రత్యేకంగా అభినం దించాలి. గడచిన తొమ్మిది నెలల్లో, తొమ్మిది రౌండ్ల సుదీర్ఘ చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యథాస్థితికి (2020 ఏప్రిల్‌కు పూర్వం స్థితి) తిరిగి రావాలని నిర్ణయించుకొన్నట్లు పార్లమెంటు ఉభయ సభల్లో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే ఈ ఒప్పందం శాంతి, సుస్థిరతలకు ఆశాజనకంగా ఉంటుందని చైనా విదే శాంగ నిపుణుడు వూ కియాన్ వ్యాఖ్యానించారు. ఆగస్టు 29–30 తేదీల్లో భారత సైనికులు కైలాశ్ పర్వత శ్రేణుల వరకూ చొచ్చుకొని పోవటంతో ఇంచు మించు యుద్ధపరిస్థితులకు దారితీసినట్లు కనబడినా ఈ పరిణామం చైనాను చర్చలకు ఉసిగొల్పిందని విశ్లేష కులు భావిస్తున్నారు. మీరు ముందు అంటే, కాదు మీరే ముందు అంటూ, ఉపసంహరణ ప్రక్రియను జాప్యం చేయటం కన్నా ఉభయులు ఒకేసారి ఇరువైపుల నుంచి సైన్యాన్ని, యుద్ధసామగ్రిని వెనక్కి రప్పించుకోవటా నికి ఒప్పందం కుదుర్చుకోవటం ఇరుదేశాల దౌత్య నీతికి నిదర్శనం. మొదటగా చైనా యుద్ధ ట్యాంకులు పాంగాంగ్ సరస్సు ఉత్తర భాగం నుంచి వెనక్కి పయన మవటాన్ని గమనించిన వెంటనే భారత యుద్ధ ట్యాంకులు కూడా వెనక్కి మరలాయి. వాస్తవాధీనరేఖను గౌరవించటం, దానిపై ఇరు పక్షాలు లోగడ చేసుకొన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండటం ప్రధాన ఆశయమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మొత్తం ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన 48 గంటల్లోపే ఇరు పక్షాల కమాండర్ స్థాయి అధి కారులు మరలా సమావేశమై మిగతా వివాదాస్పద కేంద్రాల పరిష్కార మార్గాల గురించి చర్చిస్తారని ఆయన చెప్పారు. గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, డేప్సాంగ్, గల్వాన్ ప్రాంతాలు ఈ చర్చల ఎజెండాలో ఉంటాయి. ఫింగర్ 8, ఫింగర్ 4లకు ఇకపై ఇరువైపుల నుంచీ పెట్రోలింగ్ ఉండదు. ఇరు పక్షాల మధ్య కొన్ని మౌలిక ఒప్పందాలు కుదిరిన తర్వాతనే తిరిగి పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. లోగడ భారత్ ఫింగర్ 8 వరకు, చైనా పాంగాంగ్ సరస్సు ఉత్తరం వైపునకూ ప్రవేశిం చాయి. ఇరుదేశాలు ఇదివరలో ఉన్న శాశ్వత కట్టడా లవైపు (భారత్–ధన్సింహ్ థాపా పోస్టు, చైనా– ఫింగర్ 8కు తూర్పువైపునున్న సిరిజాప్ పోస్టు) వెళ్లి పోయి, ఇటీవల కాలంలో నిర్మించిన నూతన క్యాంపులు, కట్టడాలు తొలగించుకొంటాయి. మనదేశ సరిహద్దు ప్రాంతాన్ని చైనా వశపర్చు కోలేదనీ, 1962 యుద్ధంలోనే 43 వేల చదరపు కిలో మీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వాస్తవానికి ఫింగర్ 8 వరకే ఉందని, ఫింగర్ 4 వరకూ లేదని అన్నారు. సరి హద్దు సమస్యలు ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చు. ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని కోల్పోయి యుద్ధ సన్నా హాలు చేయడం కంటే, అంచెలవారీగా శాంతి సన్నా హాలు చేయడమే ఉత్తమం. ఇరు దేశాల కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని ఇకపై తగ్గించుకోవచ్చు. కారాకోరవ్ు పర్వతశ్రేణుల దగ్గర ప్రారంభమయ్యే ఈ పాంగాంగ్ సరస్సు అనగానే గుర్తొచ్చేది ఆమీర్‌ఖాన్ ‘త్రీ ఈడియట్స్’ చిత్రం. రంగులు మారే ఈ సరిహద్దు సరస్సు రమ్యంగా ఉంటుంది. తూర్పు లద్దాఖ్‌లో ప్రారంభమై, అక్సాయ్‌చిన్ గుండా టిబెట్ వరకూ బూమరాంగ్ ఆకారంలో వ్యాపించి ఉంటుంది. 135 కిలోమీటర్ల పొడవున్న ఈ ఉప్పునీటి సరస్సు ఒక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. సముద్ర మట్టానికి 4,225 మీటర్ల ఎత్తులో ఉండి, ప్రపంచంలో ఎత్తయిన ప్రాంతంలో ఉన్న రెండవ అతిపెద్ద సరస్సుగా ప్రఖ్యాతి గాంచింది. చలికాలంలో ఐస్‌గడ్డగా మారుతుంది. అప్పుడు పోలో, ఐస్హాకీ దీనిపై ఆడతారు. 40 శాతం సరస్సు మనదేశంలో ఉండగా, మిగిలిన 60 శాతం చైనాలో ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే యాత్రికులతో నిత్యం కళకళలాడుతూ ఆకర్షణగా నిలవగలదు. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం మొబైల్ : 98494 91969 -
'ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందని బీజేపీ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రామ్ మాధవ్ అన్నారు. ఇండియా- చైనా మధ్య వివాదం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అనే అంశంపై హోటల్ క్షత్రియాలో అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత రామ్ మాధవ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. కార్యక్రమంలో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. 'చైనా మనకు రెండు విధాలుగా సవాల్ విసురుతోంది. ఒకటి ఆర్థికంగా ఎదిగిన చైనా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందుకే మన దేశంలాంటి దేశాలు అన్నీ కలిసి ఆర్థికంగా ఎదగాలి. అందుకే ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహిస్తున్నాం' అని తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. 'చైనా అనేక కుయుక్తులు పన్నుతోంది. పాకిస్తాన్‌తో ఏకమై పనిచేస్తూ ఆ దేశాన్ని భారత్‌పై ఉసిగొల్పుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో లాబీయింగ్ చేస్తోంది. శ్రీలంకలో చైనా అనేక నిర్మాణాలు చేస్తోంది. ఇది భారతదేశానికి చాలా ఇబ్బంది కలిగించేదే. నేపాల్‌లో చైనా మధ్యవర్తిత్వంలో అక్కడి రాజకీయాల్లో మార్పు వస్తోంది. చైనా వల్ల ఇండియన్ ఓసియన్‌లో ఉన్న అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చైనా వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. చదవండి: (ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్) దేశ విస్తరణ కాంక్షతో చైనా ఇలా వ్యవహరిస్తోంది. భారతదేశం ఏనాడు టెరిటరీ బార్డర్‌ను పెంచుకోవాలని కోరుకోలేదు. చైనా యాప్‌ల బ్యాన్ ద్వారా మన దేశ యువకులకు మంచి అవకాశం వచ్చింది. చైనాను కమ్యూనిస్టు దేశం అనేందుకు ఏ దేశం ఇష్టపడటం లేదు. భారత్ ఎప్పుడూ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదు. కానీ చైనా మన దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఎప్పుడూ స్నేహ హస్తం ఇస్తుంది. కవ్వింపులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం. దేశ వ్యవహారాల్లో ఎవరి ప్రమేయం ఒప్పుకోం. నేపాల్ లాంటి దేశాలు చైనా వలలో పడకూడదు' అని కోరుకుంటున్నట్లు వివరించారు. -
కన్సాలిడేషన్ కొనసాగుతుంది..!
భారత–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలతో పాటు కరోనా వైరస్ సంబంధిత వార్తలు కూడా ఈ వారం మార్కెట్ గమనానికి కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పరిణామాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం... తదితర అంశాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని విశ్లేషకులంటున్నారు. మరోవైపు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ విషయమై తదుపరి విచారణ ఈ నెల 10న జరగనున్నది. దీనికి సంబంధించిన పరిణామాలను బట్టి బ్యాంక్ షేర్ల కదలికలుంటాయి. ఫలితాల సీజన్ ముగింపు...! గత వారం విడుదలైన వివిధ గణాంకాలు ఆర్థిక రికవరీకి చాలా కాలమే పడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి. ఇక ఈ వారంతో జూన్ క్వార్టర్ ఫలితాల సీజన్ ముగియనున్నది. ఈ వారంలో మొత్తం 341 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ వారంలో భెల్, ఐఆర్సీటీసీ, ఫ్యూచర్ కన్సూమర్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తదితర కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తాయి. కన్సాలిడేషన్ కొనసాగుతుంది...! మార్కెట్ కన్సాలిడేటెడ్ మూడ్‌లో ఉందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. లాభాల స్వీకరణ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని వివరించారు. ఆగస్టులో నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత వారంలో మాత్రం రూ.3,800 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారని గణాంకాలు వెల్లడించాయి. -
భారత్ – చైనాలే ఆశాదూతలు!
ఆచరణ యోగ్యమైన వాస్తవికతతో చైనా పట్ల మన విధానాన్ని రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. భారత దేశ భవిష్యత్ అవసరాల దృష్ట్యా పాత సంప్రదాయ ధోరణులకు అతీతంగా మనం అడుగులు వేయవలసి ఉంది. పునరుజ్జీవం పొంది ముందుకు సాగుతున్న చైనా పట్ల సంప్రదాయంగా పేరుకుపోయిన భావాలను, ఊహలను మనం అధిగమించాలి. మన దేశ భవిష్యదవకాశాలను బేరీజు వేసుకుని విమర్శనా దృష్టితో విధాన రూపకల్పన చేసుకోవాలి. అదే సందర్భంలో– గత మూడు దశాబ్దాలలో ఉభయ దేశాల సంబంధాలలో మెరుగైన అభివృద్ధిని చెడగొట్టుకోకుండా ఉండాలంటే భారత–చైనా సరిహద్దులలో శాంతి, సామరస్య వాతావరణం విధిగా ఏర్పడి తీరాలి. రెండు దేశాల మధ్య శాంతి అనివార్యం. – భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ సెప్టెంబర్ 7న విడుదల కానున్న ఇండియా వే అన్న గ్రంథంలో. ఇటీవల భారత–చైనా సరిహద్దులలో సాగుతూ వచ్చిన సైనిక ఘర్షణలు ఇరుదేశాల్లోని 270 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఆసియా ఖండంలోనేగాక, ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో జీవిస్తూ సుదీర్ఘ చారిత్రక, సంప్రదాయాలకు నిలయంగా ఉన్న భారత–చైనాల మధ్య సుస్థిర శాంతి ఇటు ఆసియా ఖండానికేగాక, అటు యావత్ ప్రపంచానికే అవశ్యమని జయశంకర్ నిశ్చితాభిప్రాయం. అటూ ఇటూ పరమ నిర్జన ప్రాంతంలో సైనికుల మోహరింపు వల్ల ఉభయ దేశాలలోనూ, ఇరుగు పొరుగు దేశాలలోనూ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఒక ప్రకటన సంచలనాత్మకంగా మారింది. ‘ఉభయ దేశాల మధ్య సరిహద్దుల్లో ఎలాంటి ఘర్షణా లేదు; ఎవరూ చనిపోలేదు’ అని ఆ ప్రకటన సారాంశం. ఇది మన దేశంలో చాలా ఆశ్చర్యమూ, ఆందోళనా కల్గించింది. వాస్తవాలను మభ్యపరిచి మోదీ ఈ ప్రకటన చేయడం అభ్యంతరకరమని కొన్ని ప్రతిపక్షాలు దండోరా వేయటం మనకు తెలిసిందే. బహుశా మోదీ అభిప్రాయంలో చైనా అంటే సైద్ధాంతికంగా పడకపోవచ్చుగానీ– జయశంకర్ వర్ణించినట్టు భారత–చైనాల మధ్య బ్రిటిష్ వలస పాలకులు, నయావలస సామ్రాజ్యవాద అమెరికా పాలకులు అనుసరిస్తూ వచ్చిన సామ్రాజ్య విస్తరణ విధానాల మూలంగా భారత–చైనాల దేశాల సరిహద్దులు ఏనాడూ శాశ్వతంగా గుర్తించబడలేదన్నది పచ్చి నిజం. ఆ విషయం భారత విదేశాంగ మంత్రులందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. సరిహద్దులు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే రెండు దేశాలు సంప్రదింపులకు కూర్చుని పరిష్కరించుకొనక తప్పదుగాక తప్పదు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రధానులు, విదేశాంగ మంత్రులు, ఆ తర్వాత బీజేపీ(ఎన్డీయే) పాలకులు చైనా నాయకులతో సంప్రదిస్తూనే వచ్చారు. కాని ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇరు దేశాల నాయకులు, విదేశాంగ మంత్రులు సమావేశమైనా–1962 నాటి సరిహద్దు ఘర్షణలను నివారించే పేరిట, సామ్రాజ్యవాద పాలకులు ఆసియాలో తమ విస్తరణవాదానికి అనుకూలంగా భారత–చైనాల మధ్య సరిహద్దులను భూమ్మీద గుర్తించకుండా గాలిలో తేల్చిన గాలి గీతలని చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు. కాని స్వతంత్ర దేశాలుగా అనేక త్యాగాల ద్వారా తమ చారిత్రక నేపథ్యాలను రుజువు చేసుకున్న భారత్–చైనాలు పరస్పర ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా వివాద ప్రాంతాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలి. భౌగోళిక వాస్తవాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవాలంటే ముఖాముఖి ప్రత్యక్ష సంప్రదింపుల కన్నా మరో గత్యంతరం లేదు. ఎందుకంటే జయశంకర్ గుర్తించినట్టు, ఇన్నాళ్లూ ఘర్షణల మధ్యే, పొరపొచ్చాల మధ్యే ఇరు దేశాల సంబంధాలు సాగాయి. కొన్నాళ్లు మెరుగవుతున్నట్టూ, మరి కొన్నాళ్లు బెడిసికొడుతున్నట్టూ కనిపించినా– మొత్తం మీద కనీసం వర్తక వాణిజ్య సంబంధాలలోనూ, దౌత్యపరంగానూ ఉభయత్రా సానుకూలత చాలావరకు స్థిరపడింది. చైనాతో వివిధ రాష్ట్రాలలో కూడా మంచి వర్తక, వాణిజ్యాలకు సానుకూల వాతావరణం ఏర్పడి, కొనసాగుతూనే వచ్చాయి. ఆ మాటకొస్తే మోదీ ఏలుబడిలోని గుజరాత్ ప్రభుత్వంలో చైనీస్ పెద్ద కంపెనీ రూ,12,000 కోట్ల విలువగల భారీ నిర్మాణాన్ని చేపట్టి కొనసాగిస్తోందని మరిచిపోరాదు. అలాగే దేశ వ్యాపితంగానూ పెక్కు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకూ చైనా కంపెనీలతో ఎన్నో ‘పీట ముడు’లున్నాయి. అయినా తాజా సరిహద్దు ఘర్షణల ఫలితంగా, ఆంగ్లో–అమెరికన్, ఇజ్రాయిల్ గుత్త పెట్టుబడులకుగానూ కూపీ సంస్థలు ఇండియాపై ఒత్తిళ్లు పెంచి, సరిహద్దు ఘర్షణల్ని మరింత పెంచడానికి చైనా వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి. చైనాలో ప్రబలిన ‘కరోనా’ మహమ్మారి పేరిట ఇరు దేశాల వర్తక ప్రయోజనాల్ని దెబ్బతీసేలా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా మన మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఇరు దేశాల స్నేహ సంబంధాలకు గండికొట్టి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణాసియాలో ఇదే అదునుగా సైనిక జోక్యాన్ని తీవ్రతరం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అప్పుడే ఈ మేరకు ఆసియాలో తన యుద్ధ సన్నాహాలను బ్రిటన్, మలేసియా, ఫిలిప్పైన్స్ ‘చెవులు కొరికి’ తీవ్రతరం చేస్తోంది. ఈ విషయాన్ని కూడా జయశంకర్ ప్రస్తావించారు. ఈ విషమ ఘడియల్లో మన భారత ప్రభుత్వం ఒక వైపున దేశ పురోగతికి భరోసా కల్పిస్తూనే, మన బలమైన పొరుగు దేశం చైనా విసిరే సవాళ్లను అందుకోగలిగేలా ఉండాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఇందుకుగానూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు చైనా పేరిట మన ప్రజల పైన, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పన్నే కుట్రలకు లోనై మన వర్తక, వాణిజ్యాలను దెబ్బతీసుకోకూడదు. ఈ దృష్ట్యా భారత, చైనాలు ఒకరి ప్రయోజనాలను మరొకరు గౌరవించుకునే పద్ధతుల్లో మెలగాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో రెండు లక్ష్యాలు నెరవేరాల్సి ఉంటుందని ఆయన భావన. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించకూడదు. అలాగే అణుశక్తి సరఫరా దేశాల కూటమిలో ఒక ఎదిగిన సాంకేతిక పరిజ్ఞాన శక్తిగా ఇండియా సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించకుండా ఉంటే బాగుంటుందన్నది ఆయన ఉద్దేశం. ఆయుధాలు అమ్ముకొని దేశాల మధ్య ఘర్షణలు సృష్టించి, దేశాలను, ప్రజలను అస్వతంత్రత వైపు, బానిసత్వం వైపు నెట్టే ధోరణి అమెరికన్ సామ్రాజ్య పాలకులది. భారతదేశ సైనిక స్థావరాలను తాము స్వేచ్ఛగా వాడుకోవాలన్నది అమెరికా లక్ష్యం. ఇలా ఏర్పడిన బంధమే ఇండో–అమెరికా సైనిక సంబంధాలని మరిచిపోరాదు. ఆసియా ఖండం మధ్యలో, భారతదేశ వ్యూహ రీత్యా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న భారత సైనిక స్థావరాలను వాడుకోవాలన్నది అమెరికా అధ్యక్షుడు, కజ్జాకోరైన డోనాల్డ్ ట్రంప్ వ్యూహం. ఇందుకోసం ఆసియా భద్రతకు ముఖ్యమైన భారత, చైనా, రష్యాలు ప్రధాన సభ్య దేశాలుగా ఉన్న షాంగై మిత్ర దేశాల ఐక్య సంఘటనను బద్దలుకొట్టి ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎలా తిష్ట వేయాలా అని అమెరికా చూస్తోంది. దీనివల్ల కూడా భారతదేశం కడు జాగరూకతతో మెలగవలసి ఉంటుంది. సరిహద్దుల్ని సంప్రదింపుల ద్వారా నేలపై నిక్కచ్చిగా గుర్తించకుండా ఉన్నంతకాలం ఉభయ దేశాల సంబంధాలు మెరుగుపడవు సరికదా, మెరుగైన సంబంధాలకు కూడా గండి కొట్టుకోవడమే అవుతుంది. అందుకనే మన రాటుతేలిన మన ఆశాదూతలు మన ఇరుగు పొరుగు మంచి మైత్రి కోసం ఎదురుతెన్నులు చూస్తున్న దేశాలకు తక్షణం కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తలోదిక్కూ ప్రయాణం కట్టాలి. భారత–చైనాలను చుట్టుముట్టి దెబ్బతీయజూస్తున్న ఆంగ్లో, అమెరికన్, యూరోపియన్ సావ్రాజ్యవాదుల వ్యూహానికి ప్రతివ్యూహాన్ని రచించగల శక్తి భారత–చైనాలకు మాత్రమే ఉంది. ఈ రెండు దేశాలు ఒకటిగాకుండా చూడటమే సామ్రాజ్యవాదుల లక్ష్యం. ఇందుకు గిల్లికజ్జాలకు బదులు, జయశంకర్ అన్నట్టు ఇరు దేశాల మైత్రికి ప్రాపంచిక ప్రాధాన్యత ఉన్నందున మైత్రీ బంధం బలపడాల్సిన అవసరం ఉంది. ఇందుకుగానూ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు ‘జీ’ సంయుక్తంగా నిర్వహించిన మల్లాపురం(తమిళనాడు) సమావేశం ఆదర్శం కావాలి. దీనికోసం ఉభయ దేశాల మధ్య ఆశాదూతలు అవసరం. మహాకవి ఆశించినట్టు, ఈ ఆశాదూతలు నాల్గు దిక్కులకు మానవకోటి సామ్రాజ్యదూతలూ, కళాయజ్ఞాశ్వాలుగా సాగి గాలులై, తరగలై, తావులై పుప్పొళ్లుగా కుంకుమలై పొగలై ముందుకు సాగిపోవాలి. పాలకులు బుద్ధిజీవులుగా ప్రవర్తించాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in