తీరు మారితేనే సామరస్యం | Tawang Issue Disrupts Proceedings Again In Lok Sabha | Sakshi
Sakshi News home page

తీరు మారితేనే సామరస్యం

Published Sat, Dec 24 2022 12:24 AM | Last Updated on Sat, Dec 24 2022 1:05 AM

Tawang Issue Disrupts Proceedings Again In Lok Sabha - Sakshi

దౌత్యరంగంలో మాటలకూ, చేతలకూ కాస్తయినా పొంతన ఉండాలి. లేనట్టయితే దేశాల మధ్య పరస్పర విశ్వాసం అడుగంటుతుంది. అవి ఇరుగు పొరుగు దేశాలైనప్పుడూ, వాటిమధ్య తీర్చు కోవాల్సిన జటిల సమస్యలున్నప్పుడూ మరింత జాగ్రత్తగా మెలగాలి. మొదటినుంచీ చైనా ఆ విషయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. అదును చూసి దాడికి దిగటం, ఆ తర్వాత భారత్‌దే తప్ప న్నట్టు మాట్లాడటం, ఏమీ ఎరగనట్టు చర్చలకు రావటం దానికి రివాజుగా మారింది.

ఇంతక్రిత మైనా, ఈ రెండేళ్లనుంచైనా ఇదే వరస. సరిహద్దు ఘర్షణలపై ఈ నెల 20న చర్చలు జరుగుతాయన్న అవగాహన చైనాకుంది. అయినా అంతకు రెండు వారాలముందు... అంటే 9వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో గిల్లికజ్జాలకు దిగింది. దాని తీవ్రత గురించిన స్పష్టమైన సమాచారం విడుదల చేయకపోయినా ‘ఈ ఉదంతంలో ఇరు పక్షాల సైనికుల్లోనూ కొందరు స్వల్పంగా గాయ పడ్డా’రని మన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

భారత్‌ సైనిక కమాండర్‌ చొరవ తీసుకుని చైనా కమాండర్‌తో చర్చలు జరపటంతో సామరస్యత నెలకొందని ఆ ప్రకటన సారాంశం. చైనాతో మనకున్న 4,057 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ ప్రస్తుతానికి సరిహద్దుగా ఉంది. రెండేళ్లుగా పశ్చిమ సెక్టార్‌ (లద్దాఖ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతం)లో తరచుగా చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇంకా చర్చల ప్రక్రియ సాగుతోంది. మూడురోజులనాటి చర్చలు అందులో భాగమే.

ఈ చర్చల ప్రక్రియ  పర్యవసానంగా ప్యాంగాంగ్‌ సో ప్రాంతంలో నిరుడు ఫిబ్రవరిలో, గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌ లోని 17వ పెట్రోలింగ్‌ పాయింట్‌ నుంచి నిరుడు ఆగస్టులోనూ, అదే ప్రాంతంలోని 15వ పెట్రో లింగ్‌ పాయింట్‌ నుంచి నవంబర్‌ మొదట్లోనూ రెండు దేశాల సైన్యాలు వెనక్కు తగ్గాయి.

ఆఖరికి 20 మంది భారత జవాన్లను బలి తీసుకున్న తవాంగ్‌ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా నెమ్మ దిగా సామరస్యం నెలకొంది. ఇలా పరిస్థితులు ఎంతో కొంత కుదుటపడుతున్నాయనుకుంటున్న దశలో తాజా చర్చలకు ముందే తూర్పు సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించటం చైనా కపటనీతికి నిదర్శనం. 

చైనాతో కోర్‌ కమాండర్‌ల స్థాయిలో ఇంతవరకూ 16 విడతల చర్చలు జరిగాయి. ప్రతి సంద ర్భంలోనూ మన ప్రభుత్వం చర్చల తేదీని ముందుగానే ప్రకటించటం, ఆ చర్చలు పూర్తయ్యాక అందులోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయటం రివాజు. కానీ ఈసారి మాత్రం 17వ విడత చర్చల విషయంలో ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. చర్చలు పూర్తయిన మూడు రోజుల తర్వాత మాత్రమే ప్రకటన వెలువడింది. కారణాలు ఊహించటం కష్టమేమీ కాదు.

తవాంగ్‌లో జరిగిన తాజా ఘర్షణలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ అలజడి రేగటం, ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేయటం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇలాంటి సమయంలో చర్చలంటే భావోద్వేగాలు మరింత పెరుగుతాయి. అంతమాత్రాన ఏం జరుగుతు న్నదో దేశ ప్రజలకు వెంటవెంటనే తెలియజేయకపోవటం సరికాదని ప్రభుత్వం గుర్తించాలి. ఆ సంగతలా ఉంచి నిరంతర ఘర్షణ వాతావరణం ఏ దేశానికీ మంచిది కాదు. అయితే ఎల్లకాలమూ ఘర్షణ వాతావరణం ఉండటం సరికాదు.

స్పష్టమైన సరిహద్దు లేనిచోట భారీగా సైన్యాలను మోహ రించటం, ఎప్పుడో ఒకప్పుడు ఫలానా ప్రాంతం తమదేనంటూ కయ్యానికి దిగటం, ఘర్షణలు చోటుచేసుకోవటం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. అది చివరకు యుద్ధంగా పరిణమించినా ఆశ్చర్యంలేదు. కనుక ఎంతటి క్లిష్ట సమస్యకైనా చర్చల ప్రక్రియ మాత్రమే పరిష్కార మార్గం.

అదే సమయంలో స్నేహం నటిస్తూనే ద్రోహ చింతనతో మెలగుతున్న చైనా కపటనీతిని బయటపెట్టడం కూడా అవసరం. మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ మనోజ్‌ పాండే గత నెలలో ఎల్‌ఏసీ గురించి చెబుతూ అక్కడ పరిస్థితి స్థిరంగానే ఉన్నా అనూహ్యంగా ఉన్నదని వ్యాఖ్యానించిన సంగతి గుర్తుంచుకోవాలి. 

ఒకపక్క కొవిడ్‌తో చైనా అల్లకల్లోలంగా ఉంది. కఠినమైన ఆంక్షలకు నిరసనగా రోడ్లపైకి వచ్చిన జనమే ఇప్పుడు బయటకు రావటానికి హడలెత్తుతున్నారు. ఏం చేయాలో చైనా సర్కారుకు పాలు బోవటం లేదు. దాన్నుంచి జనం దృష్టి మళ్లించటానికి కూడా ఎల్‌ఏసీలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి ఉండొచ్చు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తూనే, వాటితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందామని చైనా 80వ దశ కంలో ముందుకొచ్చింది.

అందువల్ల గత కొన్ని దశాబ్దాలుగా మనకన్నా ఎక్కువ లాభపడుతున్నది కూడా చైనాయే. కానీ అంతర్గతంగా అవసరం పడినప్పుడల్లా ఎల్‌ఏసీ వద్ద మంట పెట్టాలని చూస్తోంది. ఈ పోకడలు ఎంత త్వరగా విరమిస్తే చైనాకు అంత మంచిది. ఘర్షణలు ముదురుతున్న తీరు చూశాక మన దేశం ఎల్‌ఏసీలోని మూడు సెక్టార్లలోనూ చైనాతో సమానంగా మౌలిక సదుపా యాల మెరుగుకు చర్యలు తీసుకోవటం మొదలెట్టింది.

నిర్ధారిత సరిహద్దు లేనిచోట ఇరు దేశాలూ సైన్యాలను మోహరిస్తే, ఏదో ఒక పక్షం కయ్యానికి దిగుతుంటే సహజంగానే పరిస్థితులు ప్రమాద కరంగా పరిణమిస్తాయి. కనుక విజ్ఞతతో మెలగటం అవసరమనీ, అంతర్గత విషయాల్లోనైనా, విదేశీ సంబంధాల్లోనైనా శాంతి సుస్థిరతలు ఏర్పడాలంటే కొన్ని విలువలనూ, నియమ నిబంధనలనూ పాటించటం ముఖ్యమనీ చైనా నాయకత్వం గ్రహించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement