భారత, చైనా సైనికుల మధ్య తవాంగ్ ప్రాంతంలో జరిగిన ఘటన అనూహ్యమేమీ కాదు. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దూకుడుగా వ్యవహరిస్తుందన్నది నిర్వివాదాంశం. చైనా దృష్టిలో ఆసియాలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. అందుకే తన షరతులతోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా నాయకత్వం భావిస్తోంది.
అయితే భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి. చైనా మన మాటలు వినాలంటే, మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలి. యాంగ్సీలోనూ చైనా దళాలు వెంటనే వెనక్కు తగ్గడమూ ఈ విషయాన్నే సూచిస్తోంది!
అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమభాగంలో... భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నెల తొమ్మిదిన తవాంగ్ ప్రాంతంలోని యాంగ్సీ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటన అనూహ్యమేమీ కాదు. ఏదో ఒక రోజు తప్పదన్న అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖ వెంబడి చాలాకాలంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూండటం ఇందుకు కారణం.
ఈ ఘర్షణకు ముందస్తు సూచన ఏదైనా ఉందీ అంటే... అది భారత – అమెరికా మిలటరీ ప్రదర్శనలకు పొరుగుదేశం చైనా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం! వాస్తవాధీన రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ సెంట్రల్ సెక్టర్‌లో భారత, అమెరికా మిలటరీ దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేసిన విషయం తెలిసిందే.
యాంగ్సీ వద్ద చెలరేగిన ఘర్షణలు తూర్పు లదాఖ్ ఘటనల తరువాత రెండేళ్లకు జరిగాయి. ఈ రకమైన తోపు లాటలు, ఘర్షణలు, పరస్పర దాడులు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల లోని వివాదాస్పద ప్రాంతాల్లో చాలాకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2020 జూన్‌లో గల్వాన్ లోయలో రెండుపక్కల సైనికులకు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో తాజా ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) సైనికులు ఈ మధ్యకాలంలో వీధిపోరాటల విషయంలో బాగా ఆరితేరినట్లు కనిపి స్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి వీరు ముళ్ల్లతో కూడిన కర్రలతో, టేజర్లతో(కరెంట్ షాక్ కొట్టే ఆయుధం) ప్రత్యర్థులపైకి విరుచుకుపడు తున్నారు. మందు గుండు ఆయుధాలు వినియోగించడం ఇక్కడ సాధ్యం కాదు మరి!
గల్వాన్ ఘర్షణ... ఫలితంగా జరిగిన ప్రాణనష్టం... భౌతిక దాడుల విషయంలో పీఎల్‌ఏ చేసుకున్న మార్పుల తీవ్రత ఎలాంటిదో తెలిపింది. అయితే తవాంగ్ ఘటనకు భారతీయ సైనికులు సర్వసన్న ద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యర్థి బలగాల మోహరింపును అడ్డుకోవడం, అదనపు సిబ్బందితో తమ స్థానాన్ని పదిలపరచు కోవడం, తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
చలికాలంలో తేమతో కూడిన దుస్తులపై టేజర్లు ప్రయోగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పో వచ్చు. కాబట్టి... భారతీయ సైనికుల కోసం పెద్ద పెద్ద ఆయుధాలు, ఇతర వ్యవస్థలను సమకూర్చడంతోపాటు ఘర్షణలను ఎదుర్కొ నేందుకు ఉపయోగించే పరికరాలనూ అందించాల్సిన అవసర ముంది. పిడిగుద్దులు, ఘర్షణలతో బెదిరించాలని చూస్తున్న శత్రు వును ఎదుర్కునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
వ్యూహాత్మక సంకేతం
అగ్రరాజ్యాల్లో ఒకటైన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం... తన సరిహద్దుల్లో వీధిపోరాటాల స్థాయికి దిగజారడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ... ఇవన్నీ తమ అసలు ఉద్దేశాలను వ్యక్తం చేసేందుకు వ్యూహాత్మకంగా ఇస్తున్న సంకేతాలుగా పరిగ ణించాలి. చైనా నాయకత్వం మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పడం! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ రెండు నెలల క్రితం బీజింగ్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులోనే ప్రపంచ వేదికపై చైనా వ్యవహారశైలి ఎలా ఉండబోతోందో స్పష్టమైంది. ఇండోనేసియాలో జరిగిన జీ20 సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వైఖరి కూడా చైనా ఆధిపత్య ధోరణికి అద్దం పట్టేదే.
సుదీర్ఘ శత్రుత్వం
కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో స్థానిక సరిహద్దు వివాదాలతో ఎలా వ్యవహరించబోయేదీ అధికారికంగానే వివరించారు. సౌత్ చైనా సముద్రంలో తైవాన్‌తో ఉన్న వివాదాలు... కొన్ని ద్వీపాల విషయంలో జపాన్‌తో ఉన్న చిక్కులు, హిమాలయా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ విషయంలోనూ తమ వైఖరి ఏమిటన్నది అక్కడే నిర్ణయమైంది. తైవాన్, ఇతర సముద్ర సంబంధిత సమస్యలను ఆర్థిక ప్రభా వంతో లేదా బలవంతంగానైనా పరిష్కరించాలని చైనా భావిస్తోంది. అయితే... భారత్ విషయంలోనే చైనా ఆందోళన. ఏకంగా 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖతో కూడిన సరిహద్దు.... దాని వెంబడే గుర్తించిన వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఈ సరిహద్దుపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. సద్దుమణిగేందుకు చైనా ఏ రకమైన అవకాశమూ ఇవ్వలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్గి రాజేస్తూ వివాదాన్ని కొనసాగిస్తోంది. ‘సెంట్రల్ టిబెటెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సైల్’, దలైలామా భారత నేలపై ప్రవాసంలో ఉండటం భారత, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో వివాదాస్పదమైన అంశంగా నిలుస్తోంది. అంతేకాకుండా... చైనా దృష్టిలో ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. తద్వారా భారత్ అగ్రరాజ్యం స్థాయిని అందుకోగలదని చైనా భావిస్తోంది. అందుకే తన షరతులతోనే భారత్‌తో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఇప్పుడప్పుడే సమసేది కాదు
తూర్పు లదాఖ్ ప్రాంతంలో పీఎల్‌ఏతో 2020 మే నెల నుంచి వివాదం మొదలైంది. పలు దఫాలు చర్చలు నడిచినా సాధించింది ఏమీ లేదు. ఫలితంగా భారత సైనికులు దీర్ఘ కాలంపాటు అననుకూల వాతావరణంలో గస్తీ నిర్వహించాల్సి వస్తోంది. భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి అని చెప్పవచ్చు.
ఈ పరిణామంతో చైనా ఖంగుతింది. వెంటనే తాము నిర్మించిన ఆవాసాలను, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించింది. పాంగ్‌యాంగ్ సో ఉత్తరభాగ తీరం వెంబడి తన దళాలను ఉపసంహరించుకుంది కూడా. చైనా మన మాటలు వినాలంటే... మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలని చెబుతోంది ఈ ఘటన. యాంగ్సీలోనూ చైనా దళాలు వెనువెంటనే వెనక్కు తగ్గడం కూడా ఈ విషయాన్నే సూచిస్తోంది!
ఒక్క విషయమైతే స్పష్టం. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయన్నది మనమూ అంగీకరించాల్సి ఉంటుంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు పీఎల్‌ఏ దూకుడుగా వ్యవ హరిస్తుందన్నదీ నిర్వివాదాంశం. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలనూ, సరిహద్దు వివాదాలనూ వేర్వేరుగా చూడాలని చైనా ఒత్తిడి తీసుకువస్తుంది.
ప్రతిగా భారత్ సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షించవచ్చునని అంటోంది. అయితే ఈ పరిస్థితి వల్ల భారత ఆర్మీ ఏడాది పొడవునా... అననుకూల పరిస్థితుల్లో గస్తీ కాయాల్సిన పరిస్థితి కొనసాగనుంది. చైనా ఒకవైపు తన మిలిటరీ దూకుడును కొనసాగిస్తూనే... భారత్‌తో సరిహద్దు వివాదాలను దీర్ఘకాలం నాన్చే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా అంచనా కట్టవచ్చు. ఇందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. దౌత్యం, మిలిటరీ రెండింటిలోనూ అన్నమాట. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుంటే... యాంగ్సీ, గల్వాన్ లాంటి ఘటనలు జరక్కుండా ముందస్తుగానే నివారించడం ఎంతైనా అవసరం.
వ్యాసకర్త మిలిటరీ వ్యవహారాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment