China War-Gamed Arunachal With Drones, Jets After Tawang Clash - Sakshi
Sakshi News home page

తవాంగ్‌ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..

Published Tue, Dec 20 2022 5:20 AM | Last Updated on Tue, Dec 20 2022 1:05 PM

China War-Gamed Arunachal With Drones, Jets After Tawang Clash - Sakshi

కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్‌ ఐటీ కంపెనీ మక్సర్‌ తీసిన హై రిజల్యూషన్‌ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్‌ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి.    

బాంగ్డా వైమానిక కేంద్రం
డబ్ల్యూజెడ్‌–7 ‘‘సోరింగ్‌ డ్రాగన్‌’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్‌ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్‌ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్‌ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్‌ వద్ద లేవు. ఇక డిసెంబర్‌ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్‌ టైప్‌ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్‌ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి.  

లాసా  వైమానిక కేంద్రం  
అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకి 260 కి.మీ. దూరం
నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్‌ బోన్‌ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది.  

షిగాట్సే వైమానిక కేంద్రం
సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం  
ఇక్కడ చైనా అన్‌మాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి.  

బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు
2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్‌ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్‌ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్‌ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్‌ చేసే మిలటరీ అనలిస్ట్‌ సిమ్‌ టాక్‌ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్‌ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్‌ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్‌లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్‌డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్‌ వైమానిక స్థావరాల నిర్వహణలో  చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement