Warplanes
-
ఇజ్రాయెల్ హై అలర్ట్
టెల్ అవీవ్: ఇరాన్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఎప్పుడు, ఎలా దాడి చేయనుందో కచ్చితంగా తెలియనప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం అత్యున్నత స్థాయి అప్రమత్తత ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పైకి విరుచుకుపడటం తెలిసిందే. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా ఇరాన్‌పై రెండు సార్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇజ్రాయెల్‌పైకి దాడి చేసే శక్తి, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే సామర్ధ్యం ఈ దాడులతో దెబ్బతిన్నట్లు రూఢీ అయ్యింది. ‘ఇజ్రాయెల్ చేసిన దాడులను అతిగా చూపలేం, అలాగని తక్కువని చెప్పలేం’అని సాక్షాత్తూ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీయే స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయినప్పటికీ, ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. -
Chinese President: తైవాన్‌పై డ్రాగన్ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి
బీజింగ్/తైపీ: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్ చైనా దూకుడుపై తైవాన్ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆ దేశాల అండ తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. -
తైవాన్ను దిగ్బంధించిన డ్రాగన్
తైపీ: డ్రాగన్ దేశం చైనా సోమవారం తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలకు తెరతీసింది. విమాన వాహక నౌక, యుద్ద నౌకలు, అత్యాధునిక యుద్ధ విమానాలతో తైవాన్ను, చుట్టుపక్కల దీవులను చుట్టుముట్టింది. కమ్యూనిస్ట్ చైనాలో అంతర్భాగమని అంగీకరించబోమంటూ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్–తె ఇటీవల చేసిన ప్రకటనకు సమాధానంగానే విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం జరిగిన జాతీయ ఉత్సవాల్లో అధ్యక్షుడు లాయ్ చింగ్–తె మాట్లాడుతూ.. తైవాన్ తమదేనంటూ చైనా చేస్తున్న వాదనను ఖండించారు. చైనా బెదిరింపులను, దురాక్రమణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం నచ్చని చైనా తాజాగా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. విమాన వాహక నౌక లియోనింగ్ నుంచి జె–15 యుద్ధ విమానం టేకాఫ్ తీసుకుంటున్న వీడియోను అధికార టీవీ ప్రసారం చేసింది. అయితే, విన్యాసాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే విషయం తెలపలేదు. నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, మిస్సైల్ బలగాలు కలిసికట్టుగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతిచ్చే వారికి ఇదో హెచ్చరికని పేర్కొంది. దీనిపై తైవాన్ స్పందించింది. గుర్తించిన ప్రాంతాల్లో యుద్ధ నౌకలను, మొబైల్ మిస్సైళ్లను మోహరించామని, రాడార్లతో గట్టి నిఘా ఉంచామని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. 25 వరకు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను, మరో నాలుగు చైనా ప్రభుత్వ నౌకలను రాడార్లు గుర్తించాయని తైవాన్ పేర్కొంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో చైనా 125 సైనిక విమానాలను విన్యాసాలకు పంపిందని తైవాన్ తెలిపింది. వీటిలో 90 వరకు విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తమ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోనే కనిపించాయంది. చైనా మేలోనూ ఇదే రకంగా మిలటరీ విన్యాసాలను చేపట్టింది. 2022లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ సారథ్యంలోని బృందం తైవాన్ సందర్శన సమయంలో కూడా చైనా భారీ సైనిక విన్యాసాలతో తైవాన్ను దిగ్బంధంలో ఉంచింది. ఇలా ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలో విలీనం కాకమునుపు తైవాన్ జపాన్ వలసప్రాంతంగా ఉండేది. చైనా ప్రధాన భూభాగంపై మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పటయ్యాక 1949లో చియాంగ్ కై షేక్ నాయకత్వంలోని నేషనలిస్ట్ పార్టీ తైవాన్‌లో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం
ఖాన్ యూనిస్ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్‌తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నడుపుతున్న అల్ ఫలా స్కూల్‌పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్ ఫకూరా స్కూల్‌పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ అల్ జాతర్ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది. దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే. ఇంధన సరఫరా తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది. గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి. నోవా ఫెస్ట్ మృతులు 364 మంది ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ను హమాస్ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్‌లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది. పులి మీద పుట్రలా... ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. -
Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం
జెరూసలేం/టెల్ అవివ్/న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు. తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు. బందీలను ఎక్కడ దాచారో? ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య! హమాస్ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది. గాజాలో ఆకలి కేకలు ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది. మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్ అల్ షేక్ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వెల్లడించింది. హమాస్ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయాప్ ఎర్డోగాన్ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం భరోసా ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌దే పైచేయి! హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్ ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్, టెల్ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. -
శవాల దిబ్బలు..శిథిల దృశ్యాలు
జెరూసలేం/లండన్/వాషింగ్టన్/గాజా సిటీ/న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా సిటీ దద్దరిల్లిపోతోంది. వందలాది భవనాలు ధ్వంసమవుతున్నాయి. శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం నాలుగో రోజుకు చేరింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించాయి. గాజాపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరువైపులా ఇప్పటికే దాదాపు 1,800 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో 1,000 మందికిపైగా, గాజా, వెస్ట్‌బ్యాంకులో 800 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శవాల దిబ్బలు కనిపించాయన్నారు. దాడులు, ప్రతిదాడుల్లో వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు వెల్లువెత్తుతోంది. హమాస్ మిలిటెంట్ల ఘాతుకాలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. శత్రువులపై తమ ఎదురుదాడి కొన్ని తరాలపాటు ప్రతిధ్వనించేలా ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. ఆయన తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించారు. తమ లక్ష్యం కేవలం హమాస్ మాత్రమేనని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గనుక తమపై వైమానిక దాడులు ఇలాగే కొనసాగిస్తే.. ఇప్పటికే తమ అ«దీనంలో ఉన్న బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దాడులు వెంటనే ఆపాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. ఇక భూభాగం నుంచి యుద్ధం! దేశ సరిహద్దులపై పూర్తి పట్టు సాధించామని, తీవ్రవాదులు చొరబడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ దేశంలో వందలాదిగా హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించామని తెలియజేసింది. తమ దాడుల్లో వారు మృతిచెందినట్లు పేర్కొంది. హమాస్‌తోపాటు ఇతర మిలిటెంట్ గ్రూప్‌లు తమ దేశం నుంచి 150కిపైగా జనాన్ని బందీలుగా తీసుకెళ్లాయని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో సైనికులు, సాధారణ పౌరులు ఉన్నారని వివరించింది. హమాస్ అ«దీనంలో ఉన్న తమ వారిని వెంటనే విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బందీలను క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్ చెప్పారు. బందీలకు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హమాస్‌ను హెచ్చరించారు. గాజాపై భూభాగం గుండా దాడి చేయాలని ఇజ్రాయెల్ సైన్యం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం 3 లక్షల రిజర్వ్ సైనికులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి దాడి గాజాపై చివరిసారిగా 2014లో జరిగింది. ఇదిలా ఉండగా, శనివారం కారులో పారిపోతున్న ఇద్దరు హమాస్ తీవ్రవాదుల ను ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులు బైక్‌లపై వెంటాడి కాలి్చచంపిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్‌కు భారతీయుల అండదండలు: మోదీ ఉగ్రవాదాన్ని భారత్ బలంగా, నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిందేనని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. తమ దేశంపై హమాస్ మిలిటెంట్ల దాడులు, తదనంతర పరిస్థితుల గురించి వివరించారు. అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో భారతీయులు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. తమ మద్దతు ఇజ్రాయెల్‌కు ఉంటుందని చెప్పారు. తనకు ఫోన్ చేసి, తాజా పరిస్థితిని వివరించిన నెతన్యాహూకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మద్దతు ప్రకటించిన యూకే ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కచి్చతంగా ఉంటుందని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. హమాస్ రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. యూకేలోని యూదుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిషి సునాక్ మంగళవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడారు. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణపై చర్చించారు. వారితో కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. హమాస్ ఉగ్రవాద చర్యలను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. తనను తాను రక్షించుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, ఆ విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు బంద్ ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇజ్రాయెల్ నుంచి తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రకటించాయి. టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం పలు విమానాలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, కాథీ పసిఫిక్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి సంస్థలు ఇజ్రాయెల్‌కు విమానాలు నడపడం లేదని వెల్లడించాయి. యూరప్, ఆసియాలోని వివిధ విమానయాన సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల సాయం గాజాలో యుద్ధంలో చిక్కుకున్న సామాన్య ప్రజలను ఆదుకోవడానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు మందుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ అష్ట దిగ్బంధనం చేయడంతో గాజాకు నీరు, ఔషధాలు, విద్యుత్ వంటి సౌకర్యాలు ఆగిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈజిప్షియన్ రెడ్ క్రాస్ సంస్థ 2 టన్నులకుపైగా ఔషధాలను గాజాకు పంపించింది. ఆహారం, ఇతర నిత్యావసరాలు కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గాజాలోని ఆసుపత్రుల్లో రోగులకు ఔషధాలు అందిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బాధితుల కోసం నిధులు సేకరిస్తున్నామని పేర్కొంది. పాలస్తీనియన్లు చెల్లాచెదురు హమాస్ మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ జనాభా 20.3 లక్షలు. వీరంతా పాలస్తీనా జాతీయులు. ఇజ్రాయెల్‌పై హమాస్ ముష్కరుల దాడి తర్వాత వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హమాస్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులు కొనసాగిస్తోంది. రాకెట్లు, క్షిపణులు ప్రయోగిస్తోంది. దీంతో పాలస్తీనావాసులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వారంతా చెల్లాచెదురవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1,80,000 మందికిపైగా పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు. అక్కడే తలదాచుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హమాస్ దుశ్చర్య తమకు ప్రాణసంకటంగా మారిందని గాజా స్ట్రిప్ పాలస్తీనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కోసం గాజా సిటీలోని పాఠశాలల్లో పదుల సంఖ్యలో తాత్కాలిక శిబిరాలను ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. మరోవైపు నగరంలో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోవడంతో జనం కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఆహారం దొరకడం లేదు. పిల్లల పరిస్థితి చూసి కన్నీళ్లు ఆగడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఐక్యరాజ్యసమితి శిబిరాలు కూడా ధ్వంసమవుతున్నాయి. ఆదివారం, సోమవారం జరిగిన దాడుల్లో ఆరు శిబిరాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. పొరుగుదేశం ఈజిప్టుకు వలస వెళ్లేందుకు కొందరు బాధితులు ప్రయత్నిస్తున్నారు. ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్నవారికే ఈజిప్టు నుంచి అనుమతి లభిస్తోంది. మరోవైపు తమ లక్ష్యం హమాస్ మిలిటెంట్లు మాత్రమేనని, సామాన్య ప్రజలు కాదని ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఆపరేషన్ కొనసాగిస్తున్నామని అంటోంది. -
దూకుడు పెంచిన చైనా.. తైవాన్‌కు యుద్ధ విమానాలు
తైపే: ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 20 యుద్ధ విమానాలు స్వైరవిహారం చేశాయి. ఎదో కుట్రపూరిత ఆలోచనతోనే అవి తైవాన్ జలసంధిలోని మధ్యస్థ రేఖను దాటినట్లు తైపీ అధికారులు తెలిపారు. కుట్రపూరితమైన ఆలోచనలతోనే.. స్వీయ పాలిత దేశం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనాకు తమదేశానికి మధ్యలో ఉండే జలసంధిలో చానాకు చెందిన సుమారు 20 యుద్ధ విమానాలు రెండు దేశాలను వేరుచేసే మధ్యస్థ రేఖను దాటి దేశ ఆగ్నేయ నైరుతి వాయు రక్షణ జోన్లోకి ప్రవేశించాయన్నారు. చైనా దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఇటువంటి ట్రైనింగ్ మిషన్లను నిర్వహిస్తోందని దానికోసమే పెట్రోలింగ్ విమానాలతోనూ నౌకలతో ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వారి జోక్యాన్ని సహించలేక.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతోనే బీజింగ్ డెమోక్రటిక్ తైవాన్ను తన స్వంత భూభాగంగా ప్రకటించుకుంటోందని వారు దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు కూడా సాహసిస్తుందని అందులో భాగంగానే సైనికపరమైన, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచిందన్నారు. ఇదే నెలలో అమెరికా, కెనడాకు చెందిన రెండు నౌకలు ఈ నెలలో తైవాన్ జలసంధి వద్ద విహరిస్తూ ద్వీపదేశానికి అండగా నిలిచే ప్రయత్నం చేయడంతో చైనా దళాలు అప్రమత్తమయ్యాయని తైపే రక్షణశాఖ తెలిపింది. ఇదేమీ కొత్త కాదు.. ఈ వారంలోనే ద్వీపం చుట్టూ విహరిస్తున్న 68 విమానాలను 10 యుద్ధ నౌకలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో కొన్ని విమానాలు మరియు యుద్ధనౌకలు చైనా షాన్డాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ద్వారా కొన్ని యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు సముద్రంలోనూ గాలిలోనూ శిక్షణ పశ్చిమ పసిఫిక్ వైపుగా వెళ్లాయని తెలిపింది తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే చైనా ఇంత వరకు ఈ చొరబాటు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ నెలలో బీజింగ్ ఇటువంటి మిలటరీ విన్యాసాలే చేయగా తైవాన్ అధ్యక్షుడు సై ఇంగ్ వెన్ విషయాన్ని కాలిఫోర్నియా వెళ్లి యూఎస్ హౌస్ సభాపతి కెవిన్ మెక్ కార్తీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తైవాన్ కేవలం 24 గంటల్లో ఏకంగా 71 చైనాకు చెందిన యుద్ధ నౌకలను గుర్తించింది. #China is moving military equipment to ports near Taiwan, raising fears of an invasion. #Taiwan says it has detected 57 Chinese warplanes and 10 warships in the past 24 hours. Is this a drill or a threat? pic.twitter.com/2O7eFroJ2d — News Hrs (@newshrstweet) September 14, 2023 ఇది కూడా చదవండి: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి -
తైవాన్ సమీపంలో భారీగా చైనా విమానాలు, నౌకలు
తైపీ: చైనా మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం అమెరికా నేవీకి చెందిన పి–8ఏ పొసెడాన్ యాంటీ సబ్మెరీన్ గస్తీ విమానం చైనా– తైవాన్లను విడదీసే తైవాన్ జలసంధి మీదుగా చక్కర్లు కొట్టడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. దీంతో, శుక్రవారం యుద్ధ విమానాలను, నేవీ షిప్‌లను పెద్ద సంఖ్యలో తైవాన్ సమీపంలోకి పంపించి, బెదిరింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన 38 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు తమ భూభాగానికి అత్యంత సమీపంలోకి వచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రి శుక్రవారం తెలిపారు. ఈ నెలారంభంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో విమానాలు, నౌకలను తైవాన్ సమీపంలోకి తరలించడం ఇదే మొదటిసారి. -
యూఎస్ విమానం Vs చైనా యుద్ధ విమానం
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్ దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనా జే–11 యుద్ధ విమానం వెంబడించడం కలకలం సృష్టించింది. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే క్షిపణులున్న ఈ విమానం పరాసల్ ద్వీప సమూహం దగ్గర అమెరికా పీ–8 పోసీడాన్ విమానాన్ని 21,500 అడుగుల ఎత్తులో వెంబడించింది. ‘‘చైనా గగన తలానికి 12 నాటికల్ మైళ్ల దాకా వచ్చారు. ఇంకా ముందుకొస్తే తీవ్ర పరిణామాలంంటాయి’’ అని హెచ్చరించింది. కాసేపటికే అమెరికా విమానం రెక్కలకు కేవలం కొన్ని వందల అడుగుల దూరం వరకు వెళ్లింది! ఇలా 15 నిమిషాలు వెంబడించాక వెనుదిరిగింది. పరాసల్ ద్వీపాలపై చైనా హక్కులను అమెరికా అంగీకరించడం లేదు. దీనిపై విభేదాలు నెలకొన్నాయి. -
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జపాన్ తీరంలో భారత్ నౌక ఫ్లీట్ రివ్యూ
మల్కాపురం(విశాఖ పశ్చిమ): సముద్ర తీరం మధ్యలో నౌక అగ్నిప్రమాదానికి గురైతే ఆ నౌకలో ఉన్న వారిని ఎలా కాపాడాలి? ఆ నౌక మరింత ప్రమాదానికి గురికాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అన్న అంశంపై భారత్ నౌకా సిబ్బంది చేసిన విన్యాసం ఆకట్టుకుంది. జపాన్‌లోని యోకోసుకా సముద్ర తీరం వద్ద కొద్ది రోజులుగా ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. మంగళవారం యోకోసుకా తీరం వద్ద భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ కమోర్జా నౌకా సిబ్బంది విన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పది దేశాల నుంచి సుమారు 23 యుద్ధ నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో యుద్ధ విమానాలు కూడా పాల్గొని తీరంపై విన్యాసాలు చేశాయి. -
ఉభయ కొరియాల మధ్య...ఉద్రిక్తతలు మరింత తీవ్రం
సియోల్: ఉభయకొరియాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తరకొరియా శనివారం సరిహద్దు ప్రాంతాల్లోకి 180 యుద్ధ విమానాలను తరలించింది. దక్షిణ కొరియా కూడా దీటుగా అత్యాధునిక ఎఫ్–35 ఫైటర్ జెట్లు సహా 80 మిలటరీ ఎయిర్ క్రాఫ్టులను మోహరించింది. ఉత్తర కొరియా బుధవారం రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించడం, వాటిలో ఒకటి దక్షిణకొరియా సరిహద్దుల్లో పడటం తెలిసిందే. ప్రతిగా దక్షిణ కొరియా కూడా మూడు గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించింది. గురువారం కూడా ఉత్తరకొరియా ఆరు క్షిపణులు ప్రయోగించడంతో జపాన్ అప్రమత్తమైంది. అమెరికా, దక్షిణ కొరియా 240 యుద్ధ విమానాలతో చేస్తున్న సంయుక్త విన్యాసాలు శుక్రవారంతో ముగియాల్సి ఉంది. తాజా పరిణామాలతో వాటిని శనివారమూ కొనసాగించనున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ తప్పిదానికి పశ్చాత్తాప పడతాయంటూ బెదిరించింది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించలేదు. అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందడంతోపాటు ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఇటువంటి తెగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
భారత్–పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి మీ వంతు కృషి చేస్తున్నార్సార్!!
భారత్–పాక్ మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడానికి మీ వంతు కృషి చేస్తున్నార్సార్!! -
దేశీయంగా 100 యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల మేకిన్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్‌లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి. -
ఉప్పొంగిన తూర్పుతీరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారతదేశ నౌకాదళ శక్తి సామర్థాల్ని చూసి సంద్రం ఉప్పొంగింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ రక్షణ విషయంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ.. తన పాటవాన్ని భారత నౌకాదళం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. సమరానికి ఏ క్షణమైనా సన్నద్ధమంటూ సంద్రంలో సవాల్ చేస్తూ నాలుగు వరుసల్లో నిలుచున్న యుద్ధ నౌకలు.. త్రివర్ణ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేస్తూ శత్రు సైన్యాన్ని జలసమాధి చేసేందుకు సిద్ధమంటూ సబ్మెరైన్లు.. గాలికంటే వేగంగా దూసుకెళ్తూ మిగ్ విమానాలు హోరెత్తించాయి. గగన తలంలో దేశ గర్వానికి ప్రతీకలుగా యుద్ధ విమానాల విన్యాసాలు.. సముద్ర కెరటాలతో పోటీపడుతూ చేతక్ హెలికాప్టర్లు అలరించాయి. యుద్ధమైనా, సహాయమైనా క్షణాల్లో వాలిపోతామంటూ మెరైన్ కమాండోలు చేసిన విన్యాసాలు.. వెరసి భారత నౌకాదళ సర్వ సంపత్తి ఒకేచోట చేరి నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలు మొత్తం విశాఖ వైపు చూసేలా చేసింది. మొత్తంగా త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్వహించిన భారత యుద్ధ నౌకల సమీక్ష ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్–2022) ఆద్యంతం ఆకట్టుకుంది. గౌరవ వందనం భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరుగుతున్న పీఎఫ్ఆర్ సోమవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి హార్బర్‌కు రాకముందు 150 మంది సెయిలర్స్ గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. 9 గంటలకు రాష్ట్రపతి హార్బర్ చేరుకున్నారు. ఈయనకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్ల చీఫ్‌లు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, వైస్ అడ్మిరల్ హంపిహోలి, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ తదితరులు స్వాగతం పలికారు. ముందుగా 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్ యాచ్‌గా సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు. నౌక ముందుభాగంలో ప్రత్యేకంగా సిద్ధంచేసిన డెక్‌పై రాష్ట్రపతి దంపతులు ఆశీనులు కాగా.. రెండువైపులా రక్షణ మంత్రి, గవర్నర్, నౌకాదళాధిపతి కూర్చున్నారు. నౌకాదళ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి హరికుమార్ నౌకాదళ పాటవాల్ని సమీక్షించిన రాష్ట్రపతి ఈ ఏడాది పీఎఫ్ఆర్కు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రపతిని తీసుకుని ప్రెసిడెన్షియల్ యాచ్ ఐఎన్ఎస్ సుమిత్ర ముందుకు సాగుతుండగా.. సుమిత్ర కాన్వాయ్‌గా ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సావిత్రి, టాంగో–39, టాంగో–40 యుద్ధనౌకలు బయల్దేరాయి. బంగాళాఖాతం సముద్ర జలాల్లో నాలుగు వరుసల్లో లంగరు వేసిన యుద్ధనౌకల మధ్యగుండా సాగుతూ వాటిపై నుంచి నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని త్రివిధ దళాధిపతి స్వీకరించారు. యుద్ధ నౌకల సిబ్బంది ప్రతి వార్ షిప్ ముందు నిల్చుని టోపీలని చేతితో తిప్పుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. మొత్తం షిప్‌లను సమీక్షించిన తర్వాత సబ్‌మెరైన్ కాలమ్‌లో ఉన్న ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ సింధుకీర్తి, ఐఎన్ఎస్ సింధురాజ్ జలాంతర్గాముల్ని ఆయన సమీక్షించారు. అబ్బురపరిచిన విన్యాసాలు ఇక రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన చేతక్ హెలికాప్టర్లతో పాటు సీకింగ్స్, కామోవ్, యుటిలిటీ హెలికాఫ్టర్ (యూహెచ్)–త్రీహెచ్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్)లతో పాటు డార్నియర్స్, మిగ్–29కే, హాక్స్, మల్టీ మిషన్ మేరీటైమ్ ఎయిర్క్రాఫ్టŠస్ పీ8ఐ, ఐఎల్ 38 మొదలైన యుద్ధ విమానాలు నిర్వహించిన విన్యాసాలు ఉత్కంఠగా సాగాయి. యుద్ధ నౌకల సమీక్ష అనంతరం ఒకేసారి అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాల్లోకి దూసుకుపోతూ ఫ్లై పాస్ట్ నిర్వహించాయి. ఈ యుద్ధ విమానా విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ సందర్భంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల డెమోతో మెరైన్ కమాండోలు నిర్వహించిన వాటర్ పారా జంప్స్, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తపాలా బిళ్ల విడుదల చేసిన రాష్ట్రపతి ప్రతి పీఎఫ్ఆర్ లేదా ఐఎఫ్ఆర్ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం పీఎఫ్ఆర్–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్ కవర్ని నేవల్ బేస్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జె చౌహాన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం
గాజా సిటీ: దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాజాలో ఓ కారుపై క్షిపణి పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ చానళ్లు ప్రత్యక్షప్రసారంచేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్ దేశస్తుడు మరణించాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ దేశస్తులు, ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం తెలిపింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది. భద్రత అనేదే లేదిక్కడ ‘ మేం చూస్తుండగానే మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రాణం పోయినంత పనైంది. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని వెంటనే అపార్ట్మెంట్ మెట్లు దిగి అపార్ట్మెంట్ వాసులమంతా బయటికొచ్చాం. ఏడుపులు, భయాందోళనలతో పరిస్థితి దారుణంగా ఉంది. గాజాలో ఎక్కడా భద్రత అనేదే లేదు’ అని సమాహ్ హబౌ అనే మహిళ ఏడుస్తూ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉగ్రసంస్థ గాజా సిటీ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్ బసీమ్ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడారు. ‘ మా వైపు తీవ్రమైన నష్టం జరిగితే ఊహించని స్థాయిలో దీటైన సమాధామిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H — Abier-Almasri (@abier_i) May 12, 2021 -
లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంట గస్తీ నిర్వహించేందుకు భారతీయ నౌకాదళానికి చెందిన పొసీడాన్ 8ఐ జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాన్ని భారత్ రంగంలోకి దింపింది. చైనా దళాల కదలికను గమనించేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. అలాగే, మరికొన్ని ఎంఐజీ –29కే జెట్ విమానాలను కూడా త్వరలో నార్తర్న్ సెక్టార్‌లోని పలు కీలక వైమానిక కేంద్రాలకు తరలించనుంది. వీటి మోహరింపుతో వైమానిక దళ సామర్థ్యం, గగనతల ఆధిపత్యం మరింత మెరుగుపడుతుందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం నౌకాదళం వద్ద 40 ఎంఐజీ–29కే జెట్ విమానాలున్నాయి. ఇప్పటికే తూర్పు లద్దాఖ్, తదితర ప్రాంతాల్లోని కీలక ఎయిర్‌బేసెస్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ, జాగ్వార్, మిరేజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది. ఆగస్ట్ చివరినాటికి ఐదు రఫేల్ ఫైటర్ జెట్స్‌ను కూడా లద్దాఖ్‌లో సిద్ధంగా ఉంచాలని భారత్ భావిస్తోంది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో భారత నౌకాదళం, అమెరికా నేవీతో కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో మిలటరీ డ్రిల్స్ నిర్వహించింది. ఈ డ్రిల్స్‌లో పాల్గొన్న అమెరికాకు చెందిన యూఎస్ఎస్ నిమిజ్ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. మరోవైపు, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) దేశీయంగా రూపొందించిన డ్రోన్‌ను త్వరలో తూర్పు లద్దాఖ్‌లోని ఆర్మీ బేస్‌లకు పంపించనున్నారు. ఈ డ్రోన్‌కు ‘భారత్’ అని డీఆర్డీఓ నామకరణం చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో, కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇది గస్తీ విధులు నిర్వహించగలదని డీఆర్డీఓ పేర్కొంది. -
వాయుసేన వ్యూహాత్మక కేంద్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: భారతదేశ తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన నిర్ణయించింది. విపత్తు నిర్వహణ, నిఘా, రక్షణ అవసరాల కోసం మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో యుద్ధవిమానాల బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వ్యూహాత్మక ప్రణాళికను భారత వాయుసేన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించింది. బంగాళాఖాతంలో పటిష్ట నిఘా ప్రస్తుతం దేశ తూర్పు తీరంలో చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానిక దళ స్థావరం ఉంది. యుద్ధ విమానాలను అక్కడ మొహరించారు. ఎక్కడైనా విపత్తులు సంభవించినా, రక్షణ అవసరాల కోసం అక్కడి నుంచే యుద్ధ విమానాలను పంపిస్తున్నారు. కాగా తూర్పు తీరంలో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడంతోపాటు బంగాళాఖాతంలో చైనా ఆధిపత్యంపై కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని భారత వాయుసేన గుర్తించింది. అందుకోసం బంగాళాఖాతంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉంది. ఇక ఎక్కువుగా తుఫాన్ల ముప్పు ఎదుర్కొంటున్న తూర్పుతీర ప్రాంతంలో విపత్తుల నిర్వహణ కూడా వాయుసేన ప్రాధాన్య అంశంగా ఉంది. అందుకోసం తూర్పుతీరంలో మరో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అతి పొడవైన తీరప్రాంతం ఉన్న ఏపీని అందుకు అనువైనదిగా ఎంపిక చేసింది. ఇప్పటికే విశాఖలో భారత నావికాదళ వ్యూహాత్మక కేంద్రం ‘ఐఎన్ఎస్ డేగా’ ఉంది. దాంతో రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాలను తమ వ్యూహాత్మక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన భావించింది. ఇందుకుగాను యుద్ధవిమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా విజయవాడ– రాజమండ్రి మధ్య ఉన్న జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఉత్తర భారత దేశంలో ఆగ్రా–లక్నో జాతీయరహదారిని అదే విధంగా యుద్ధ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌కు వీలుగా అభివృద్ధి చేశారు. యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా జాతీయ రాహదారులు ఆరులేన్లుగా ఈ జాతీయరహదారిని అభివృద్ధి చేసిన తరువాత యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఈమేరకు ప్రతిపాదనలకు కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో రక్షణ మౌలిక వసతులను అభివృద్ధికి ప్రణాళికను రూపొందించనున్నారు. యుద్ధవిమానాల మొహరింపు, రోజువారీ విన్యాసాలు, శిక్షణ తదితర అవసరాలకు అనుగుణంగా రక్షణ మౌలిక వసతులను తీర్చిదిద్దుతారు. దాంతో తూర్పుతీరంలో భారత వాయుసేన నిఘా మరింత పటిష్టమవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
నగరంపై ఎన్ఐఏ నిఘా
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌పై భారత వాయుసేన సర్జికల్ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా కీలక, సున్నిత ప్రాంతమైన తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. బుధవారం మాత్రం కేవలం తనిఖీలకే పరిమితమయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామంటున్న పోలీసులు.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్లతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో 6 కమిషనరేట్లలోనూ ఎప్పటికపుడు నివేదికలు డీజీపీ కార్యాలయానికి, ఐబీకి అందజేస్తున్నారు. అనుమానితుల కోసమే..: కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు నగరంలో సంచరిస్తున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వీరి నిఘా పెరిగింది. స్లీపర్ సెల్స్‌పై పూర్తి సమాచారం లేకున్నా.. నగరంలోని కొందరు ఉగ్రమూకలకు ఆర్థికసాయం చేస్తున్నారన్న విషయం వెలుగుచూడటంతో ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే వారి పనివారు చేసుకెళ్తున్నారు. నగరంలో ఉగ్రసానుభూతిపరులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎన్ఐఏ నిఘా వేసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయంతో అనుసంధానమై పనిచేస్తున్నారు. తనిఖీ చేశాకే అనుమతి నగరంలోని పలు ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. పౌర, సైనిక విమానాశ్రయాల వద్ద భద్రత రెట్టింపు చేశారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం రాత్రి పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నగరంతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో వాహన తనిఖీలు, రాత్రిపూట గస్తీని ముమ్మురం చేశారు. గురువారం కూడా కార్డన్ సెర్చ్‌లు, వాహన తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
‘రాఫెల్’.. భారీ కుంభకోణం: ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కేంద్రంలోని పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, దేశ భద్రత విషయంలో రాజీ పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. యుద్ధవిమాన పైలట్‌గా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాల కొనుగోలు ధరను రహస్యంగా ఉంచడం దేశ చరిత్రలో లేదని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా, కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీఎంపీ వీహెచ్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిలతో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ధర రహస్యమ ని ప్రధాని, రక్షణమంత్రులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. యుద్ధవిమానాలను ఉపయోగించే తీరు, శక్తిసామర్థ్యాలను రహస్యంగా ఉంచుతారని చెప్పారు. తాను కూడా మిగ్–21, మిగ్–23 విమానాలను నడిపానని, గతంలో ప్రభుత్వాలు జాగ్వార్, మిరాజ్ లాంటి యుద్ధవిమానాలను కొనుగోలు చేసినప్పుడు కూడా పార్లమెంటులో వాటి ధరలను చెప్పాయని గుర్తు చేశారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను 2,330 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టు 2010 మార్చి 15న లోక్‌సభలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని చెప్పారన్నారు. ఫ్రాన్స్ కంపెనీ నివేదికలో ధర వెల్లడి రాఫెల్ యుద్ధవిమానాలను సమకూర్చిన ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌తో యూపీఏ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.526 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుందని, అయితే, బీజేపీ ప్రభుత్వం దాన్ని మూడింతలు చేసి ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లు పెట్టి 36 విమానాలు కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ ధరలను కేంద్రం వెల్లడించకపోయినా, డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ 2016లో ఇచ్చిన తన వార్షిక నివేదికలో చెప్పిందన్నారు. ఏవియేషన్ కంపెనీ తన నివేదికలో ధరలను బహిర్గతం చేసినప్పుడు కేంద్రం ఎందుకు దాచిపెడుతుందో అర్థం కావడం లేదన్నారు. అసలు ఈ ధరను నిర్ణయించేందుకు గాను సంప్రదింపుల కమిటీని వేయలేదని, రాఫెల్ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు లోక్‌సభలో ప్రధాని చెప్పే నాటికి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి కూడా తీసుకోలేదని ఆరోపించారు. యుద్ధవిమానాల కొనుగోలు ధరలను అడ్డగోలుగా పెంచడంతోపాటు వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే కాంట్రాక్టును అనిల్అంబానీకి చెందిన ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారన్నా రు. రక్షణ సామగ్రిని తయారు చేసిన చరిత్ర లేని ప్రైవేటు కంపెనీకి 36 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కుంతియా మాట్లాడుతూ రాఫెల్ కుంభకోణానికి, అమిత్‌షా కుమారుడి ఆస్తులు పెరగడానికి సంబంధం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నివేదికలివ్వండి ఏఐసీసీ కార్యదర్శుల ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శులు ఆదేశించారు. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రభుత్వ పథకాల అమలు, రాజకీయ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలపై నిర్వహించిన సమీక్షలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి ఎన్.బోసురాజులు పాల్గొని మాట్లాడారు. -
కొరియాపై అమెరికా విమానాల చక్కర్లు
వాషింగ్టన్: అమెరికా, ఉ.కొరియాల మధ్య నెలకొన్న అణు ఉద్రిక్తతల నేపథ్యంలో జపాన్ భూభాగం, కొరియా ద్వీపకల్పంపై అమెరికా యుద్ధ విమానాలు శుక్రవారం విన్యాసాలు నిర్వహించాయి. జపాన్, దక్షిణ కొరియా యుద్ధ విమానాలు వెంట రాగా అమెరికా సూపర్ సోనిక్ బీ–1బీ లాన్సర్ విమానాలు కొరియా గగనతలంపై చక్కర్లు కొట్టాయి. ఆదివారం నుంచి జపాన్, దక్షిణ కొరియాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు సన్నాహకంగా నిర్వహించిన ఈ డ్రిల్‌ను ‘ఆకస్మిక అణు దాడి విన్యాసాలు’గా ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుపట్టింది. అణ్వాయుధాల్ని మోహరించడం ద్వారా సామ్రాజ్యవాద అమెరికా అణు యుద్ధానికి ఆజ్యం పోసేందుకు చూస్తోందని, అమెరికా చర్యలకు బెదిరే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. గ్వామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రెండు బీ–1బీ లాన్సర్ యుద్ధ విమానాలు పశ్చిమ జపాన్‌లో ఆ దేశ ఎయిర్ ఫోర్స్ విమానాలతో కలిసి సంయుక్త విన్యాసాలు జరిపాయని అమెరికా పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతరం లాన్సర్ విమానాలు యెల్లో సీపై కొరియా యుద్ధ విమానాలతో కలిసి విన్యాసాల్లో పాల్గొని.. గ్వామ్‌లోని యుద్ధ విమానాల స్థావరానికి తిరిగి చేరుకున్నాయని తెలిపింది. పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాల్లో భాగంగానే ఇవి కొనసాగాయని, కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో వీటికి ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో అమెరికా స్పష్టం చేసింది. -
హైవేపై యుద్ధవిమానాల ల్యాండింగ్
లక్నో: అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేం దుకు లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) నిర్వహించిన ‘టచ్ అండ్ గో’ కసరత్తులు కళ్లుచెదిరేలా సాగాయి. ఐఏఎఫ్ యుద్ధ, రవాణా విమానాలు మంగళవారం ఎక్స్‌ప్రెస్‌వేపై దిగి అనంతరం గాల్లోకి ఎగురుతూ తమ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. లక్నోకు 65 కి.మీ. దూరంలోని ఉన్నావ్ జిల్లా బంగర్మౌ సమీపంలో చేపట్టిన కసరత్తుల్లో 12కు పైగా మిరేజ్–2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో పాటు 35 వేల కిలోల బరువైన సీ–130జే సూపర్ హెర్క్యులస్ విమానం పాలుపంచుకున్నాయి. విన్యా సాలు కొనసాగిన ప్రాంతానికి ఐఏఎఫ్ ప్రత్యేక బలగాలైన గరుడ్ కమాండోలు భద్రత కల్పించారు. ఈ డ్రిల్‌లో ముందుగా సీ–130జే రవాణా విమానం తాత్కాలిక రన్‌వేపై దిగగా అందులో నుంచి గరుడ్ కమాండోలు తమ వాహనాలతో బయటకు వచ్చి హైవేకు ఇరువైపులా రక్షణ కవచంలా నిలబడ్డారు. అనంతరం ప్రధాన ఆకర్షణగా నిలిచిన సుఖోయ్ 30, మిరేజ్ 2000లు ఎక్స్‌ప్రెస్‌వేపై దిగుతూ కళ్లు చెదిరే వేగంతో గాల్లోకి ఎగిరాయి. వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ రక్షణ, సహాయక చర్యల కోసం సీ–130జే విమానం సాయపడుతుందని రక్షణ శాఖ(సెంట్రల్ కమాండ్) పీఆర్వో గార్గి మాలిక్ సిన్హా చెప్పారు. ‘ఈ విమానం పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని మోసుకెళ్లగలదు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగించవచ్చు’ అని ఆమె తెలిపారు. యుద్ధం, విపత్తుల సమయాల్లో వాయుసేన సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ కసరత్తులు నిర్వహించినట్లు సిన్హా వెల్లడించారు. ప్రధాన ఆకర్షణగా సీ–130జే సీ–130జే విమానాలు 2010లో వాయుసేనకు అందుబాటులోకి రాగా.. ఎక్స్‌ప్రెస్ వేపై దిగడం మాత్రం ఇదే మొదటిసారి.. ఒకేసారి 200 మంది కమాండోలను తరలించే సామర్థ్యం దీని సొంతం. ధర దాదాపు రూ. 900 కోట్లు. ఇక 2015, 16ల్లో మిరేజ్–2000 విమానాలు యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ‘టచ్ అండ్ గో’ డ్రిల్‌లో పాలుపంచుకోగా.. గత నవంబర్‌లో లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఆరు సుఖోయ్–30 జెట్లు యుద్ధ సన్నద్ధతను చాటిచెప్పాయి. -
ఉత్తర కొరియాపై అమెరికా విమానాలు
న్యూయార్క్: ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించట్లేదు. బలప్రదర్శనలో భాగంగా ఉత్తరకొరియా తూర్పు తీరం మీదుగా తమ యుద్ధ విమానాలను పంపినట్లు అమెరికా రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. ఎలాంటి ముప్పునైనా దీటుగా ఎదుర్కొనే సత్తా అమెరికాకు ఉందన్న అధ్యక్షుడు ట్రంప్ మాటలు నిజమని చూపేందుకే ఈ కసరత్తు చేసినట్లు అమెరికా రక్షణ కార్యాలయ అధికార ప్రతినిధి డానా వైట్ చెప్పారు. అమెరికా వైమానిక దళానికి చెందిన బీ–1బీ లాన్సర్ బాంబర్లు, ఎఫ్–15సీ ఈగల్ ఫైటర్ విమానాలు ఉత్తరకొరియా జలాల మీదుగా అంతర్జాతీయ గగనతలంపై వెళ్లాయని చెప్పారు. -
కొరియా’పై యుద్ధవిమానాలు
సియోల్: దక్షిణ కొరియా, జపాన్‌తో సంయుక్తంగా అమెరికా సైనిక బలగాలు సోమవారం శక్తిమంతమైన అత్యాధునిక యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి. కొరియా ద్వీపకల్పం, జపాన్ సమీప ప్రాంతాల మీదుగా ఈ విన్యాసాలు కొనసాగాయి. ఈ విన్యాసాల్లో అమెరికా సైన్యానికి చెందిన రెండు బీ–1బీలు, నాలుగు ఎఫ్–35బీ యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వీటితోపాటు దక్షిణ కొరియా బలగాలకు చెందిన నాలుగు ఎఫ్–15కే యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని దక్షిణ కొరియా, అమెరికా బలగాలు తెలిపాయి. క్యూషూ ద్వీపకల్ప ప్రాంతంలోని సముద్రం మీదుగా కూడా యుద్ధ విమానాలు విన్యాసాలు చేసినట్లు వెల్లడించాయి. జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించిన మూడు రోజుల తర్వాత అమెరికా ఈ విన్యాసాలు నిర్వహించడం గమనార్హం. ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినప్పటి నుంచి తరచూ అమెరికా పలు శక్తిమంతమైన యుద్ధవిమానాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినప్పటికీ సెప్టెంబర్ 3వ తేదీన ఉత్తర కొరియా ఆరోసారి అణు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అమెరికాకు సమానంగా సైనిక శక్తిని కూడగట్టుకోవాలన్న లక్ష్యంతో ఉత్తర కొరియా ఉందని ఆ దేశ అధికార మీడియా పేర్కొంది. -
సియాచిన్‌పై పాక్ యుద్ధ విమానాలు!
► మన గగనతల ఉల్లంఘనేం జరగలేదు: భారత్ ► శత్రువు గుర్తుంచుకునే జవాబిస్తాం: పాక్ హెచ్చరిక ఇస్లామాబాద్: భారత్ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్ వద్ద పాకిస్తాన్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వె ల్లడించింది. ఇరుదేశాల మధ్య తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువం టి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంది. అయితే.. సియాచిన్‌లో పాక్ యుద్ధ విమానాల చక్కర్లు, ఉద్రిక్త పరిస్థితి అంటూ ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని భారత్ స్పష్టం చేసింది. ‘భారత గగనతల పరిధి ఉల్లంఘనేదీ జరగలేదు’ అని భారత వైమానిక దళం వెల్లడించింది. ఏ పరిస్థితుల్లోనైనా తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమేనని సంకేతాలిచ్చింది. వారం క్రిత మే సరిహద్దుల్లోని ఎయిర్‌బేస్‌లను భారత్ అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. తరతరాలు గుర్తుంచుకునేలా..: పాక్ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ సొహైల్ అమన్ సరిహద్దుల్లోని స్కర్దు సమీపంలోని ఖాద్రీ ఎయిర్‌బేస్‌ను బుధవారం సందర్శించారు. మిరేజ్ యుద్ధ విమానంలో పర్యటించి సరిహద్దుల్లో భద్రత పరిస్థితి సమీక్షించారు. శత్రువు తమ జోలికొస్తే తరతరాలు గుర్తుంచుకునేలా గట్టిగా బదులిస్తామని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. సరిహద్దుల్లోని పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లన్నీ అప్రమత్తంగా ఉన్నాయని.. తమ దేశ సరిహద్దులను కాపాడుకోవటంలో ఎలాంటి ఎదురుదాడికైనా దిగుతామని స్పష్టం చేశారు. అటు, ‘పాక్ సముద్ర తీరాన్ని కాపాడుకునేందుకు మన నేవీ సిద్ధంగా ఉంది. భారత్ రెచ్చగొట్టే చర్యలకు సరికొత్త యుద్ధ సాంకేతికతతో సమాధానమిస్తాం’ అని లాహోర్‌లోని నౌకాదళ యుద్ధ కాలేజీలో పాక్ నేవీ చీఫ్ అడ్మిరల్ ముహమ్మద్ జకావుల్లా హెచ్చరించారు. కాగా, పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో సరైంది కాదని.. పాత వీడియోకు ఎన్నో కత్తిరింపులు (ఎడిట్) చేశారని భారత్ పేర్కొంది. భారత పోస్టుల ధ్వంసం: పాక్ ఇస్లామాబాద్: కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట భారత ఆర్మీ పోస్టులకు నష్టం చేకూర్చుతున్నట్లు చూపుతున్న వీడియోను పాకిస్తాన్ సైన్యం విడుదల చేసింది. పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు చేశామంటూ భారత్ మంగళవారం వీడియో విడుదల చేయడానికి ప్రతిగానే పాక్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ 87 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. దాంతోపాటు మే 13న భారత సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని ఆరోపించారు. గట్టి బదులిచ్చేందుకే నౌషేరాలోని భారత శిబిరాలను పాక్ సైన్యం నేలమట్టం చేసిందన్నారు. భారీ ఫిరంగులు భారత స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లు వీడియోలో ఉంది.