Chinese President: తైవాన్‌పై డ్రాగన్‌ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి | Getting Ready To Attack Taiwan, Chinese President Xi Jinping | Sakshi
Sakshi News home page

Chinese President: తైవాన్‌పై డ్రాగన్‌ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి

Published Mon, Oct 21 2024 4:59 AM | Last Updated on Mon, Oct 21 2024 5:24 AM

Getting Ready To Attack Taiwan, Chinese President Xi Jinping

సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపు  

తైవాన్‌ సమీపంలో యుద్ధ విమానాలు, నౌకలు 

బీజింగ్‌/తైపీ: చైనా, తైవాన్‌ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్‌ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. 

జిన్‌పింగ్‌ తాజాగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్‌ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే.

 ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్‌ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్‌ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్‌ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. 

హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్‌ 
చైనా దూకుడుపై తైవాన్‌ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది.

 యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్‌ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్‌ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్‌ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

తైవాన్‌కు ఆ దేశాల అండ 
తైవాన్‌ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్‌–హమాస్, రష్యా–ఉక్రెయిన్‌... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్‌ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement