war clouds
-
అమెరికా రెచ్చగొడుతోంది.. కిమ్ సంచలన ఆరోపణలు
సియోల్: అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తమ దేశం విషయంలో శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికా ముందు స్థానంలో ఉందన్నారు. అలాగే, కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని చెప్పుకొచ్చారు.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. అమెరికా మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతటి ఘర్షణ వాతావరణాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధంలా మారే వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.కొరియా ద్వీపకల్పం ఇప్పటివరకు అణుయుద్ధ ప్రమాదాలే ఎరుగదు. అమెరికాతో చర్చలు జరిపేందుకు నేను ఎప్పుడో ముందుకు వచ్చాను. చర్చల కోసం నేను చాలా దూరం వెళ్లినప్పటికీ అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. అమెరికా.. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో కిమ్ మూడు సార్లు భేటీ అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినా.. సఫలం కాలేదు. అనంతరం, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. North Korean leader says past diplomacy only confirmed US hostilityNorth Korean leader Kim Jong Un says past negotiations with the United States only confirmed Washington's"unchangeable" hostility towardPyongyang and described his nuclear buildup as the only way to counter pic.twitter.com/OenQzQLlu4— Simo saadi🇲🇦🇵🇸🇺🇸 (@Simo7809957085) November 22, 2024 ఇదిలా ఉండగా.. నార్త్ కొరియా కిమ్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కిమ్ అలర్ట్ అయ్యారు. మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్న క్రమంలో నార్త్ కొరియా సైన్యం అలర్ట్‌గా ఉండాలన్నారు. దీంతో, అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. -
Chinese President: తైవాన్‌పై డ్రాగన్ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి
బీజింగ్/తైపీ: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్ చైనా దూకుడుపై తైవాన్ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆ దేశాల అండ తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
Israel-Hamas war: యుద్ధమేఘాలు!
టెల్అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డి్రస్టాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. మిసైల్ డిఫెన్స్ బలగాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్ సమీపంలో భూతల బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించే ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. 40 ఎఫ్ఏ–18 సూపర్ హార్నెట్, ఎఫ్–35 అటాక్ ప్లేన్లతో కూడిన విమానవాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్ అరేబియా తీర సమీపంలో; 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 4,500 మంది మరైన్లు, నావికా దళ సభ్యులతో కూడిన యూఎస్ఎస్ వాస్ప్ కూడా తూర్పు మధ్యదరా సముద్రంలో పహారా కాస్తున్నాయి. మరో హమాస్ నేత హతం శనివారం గాజాపై వైమానిక దాడుల్లో హమాస్ సైనిక విభాగ కీలక నేత హైథమ్ బలిదీతో పాటు డజన్లకొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్టు సమాచారం. వెస్ట్‌బ్యాంక్‌లో 9 మంది పాలస్తీనా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా: అమెరికా ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలిచేందుకు అవసరమైతే మరిన్ని చర్యలూ చేపడతామని పెంటగాన్ తాజాగా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొనడం ఈ ఏడాది ఇప్పటికే ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్త హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఉద్రిక్తలు పెరగడం ఎవరికీ మంచిది కాదని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనాసింగ్ అన్నారు. మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గాలంట్‌తో లాయిడ్సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. -
పశ్చిమాసియా ఓ మందు పాతర!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్ఠవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలవడానికి మోహరింపు మొదలుపెట్టాయి. ఇరాన్లో ఆ దేశపు అతిథిగా ఉన్న సమయంలో హమాస్ రాజకీయ విభాగపు నేతను హతం చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద సవాల్నే విసిరింది. గత అక్టోబర్ మాసంలో ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ దుస్సాహసం కంటే ఈ చర్య తక్కువదేమీ కాదు. ఇది ఇరాన్‌కు విసిరిన సవాల్! ఇజ్జత్ కా సవాల్‌గా ఈ చర్యను ఇరాన్ పరిగణించకుండా ఉంటుందని భావించలేము.ఇజ్రాయెల్ పాల్పడిన దుశ్చర్యకు కఠిన శిక్ష తప్పదనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలో పాల్గొనడమంటే పశ్చిమాసియాలోని పలు ఉగ్రవాద సంస్థలు కూడా దాని వెన్నంటి ఉన్నట్టే! హమాస్‌తో పాటు లెబనాన్‌లో హెజ్బుల్లా, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిషియాలు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. హౌతీ తిరుగుబాటుదారుల తడాఖా ఏమిటో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం చవిచూసింది.గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల తర్వాత ఇరాన్ ఆదేశాల మేరకు యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. యూరప్ – ఆసియా దేశాల మధ్య జరిగే నౌకా వ్యాపారంలో సింహభాగం సూయెజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంలో 30 శాతం. విలువ లక్ష కోట్ల డాలర్లు. యూరప్ వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం నుంచి సూయెజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ‘ఆఫ్రికా కొమ్ము’ (హార్న్ ఆఫ్ ఆఫ్రికా)గా పిలుచుకునే సోమాలీ ద్వీపకల్పానికి – అరబ్ ద్వీపకల్పానికి మధ్యనున్న సన్నని దారిగుండా బంగాళాఖాతంలోకీ, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకీ ప్రవేశిస్తాయి. అరబ్ ద్వీపకల్పానికి బంగాళాఖాతపు అంచున ఉన్న దేశం యెమెన్. యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులనే ‘హౌతీ’లుగా పిలుస్తున్నారు. హౌతీల దాడులకు భయపడి సూయజ్ నౌకా వాణిజ్యంలో 90 శాతం ఆగిపోయింది. యూరప్ నుంచి అట్లాంటిక్ సముద్రం ద్వారా ఆఫ్రికా ఖండపు ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ అంచును చుట్టి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఈ నౌకలకు రెండు వారాల అదనపు సమయం పట్టింది. భారీగా అదనపు వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. వాణిజ్యాల్లోని అదనపు భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారులైన ప్రజలే! హౌతీల దాడుల ప్రభావం 50 దేశాల నౌకా వాణిజ్యంపై పడిందని గత జనవరిలోనే వైట్‌హౌస్ ప్రకటించింది.ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్యన నిజంగానే యుద్ధం ప్రారంభమైతే దాని విధ్వంసకర ప్రభావాన్ని మొత్తం ప్రపంచమే ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆ ప్రాంతపు సంక్షోభం గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఇజ్రాయెల్ జరిపిన గాజా దాడుల్లోనే 40 వేలమంది చనిపోయారు. పుష్కర కాలం కింద ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. తీవ్రమైన మానవతా హననాన్ని ఈ ప్రాంతం చవిచూసింది. ఉన్న ఊరు విడిచిపోయినవారూ, కన్నబిడ్డల్ని అనాథల్ని చేసినవారూ లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక దశలో మధ్యధరా సముద్రపు అలల మీద శవాలు తేలియాడిన విషాద సన్నివేశాలను కూడా ప్రపంచం చూసింది. ఇక ఆర్థిక వ్యవస్థల విధ్వంసం, లక్షలాది ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లడాలు యుద్ధ దేశాల్లో షరా మామూలే!పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతోగానీ ఎటువంటి సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హనియా హత్య జరిగి మూడు రోజులు గడిచినా భారతదేశం నుంచి ఖండన మండనల వంటి అధికారిక ప్రకటనలేమీ రాలేదు. ‘వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని’ పాటిస్తున్నామనుకోవాలి. నిజంగా కూడా భారత్ పరిస్థితి అటువంటిదే! రెండు దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయి. అంతకు మించి రెండు దేశాలతో అవసరాలు కూడా ఉన్నాయి.ఇరాన్‌తో భారత స్నేహ సంబంధాలు తరతరాల నాటివి. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో మిత్రదేశంగా మనం బాసటగా నిలబడనప్పటికీ ‘చాబహార్ పోర్టు’ నిర్మాణ బాధ్యతలను మనకే అప్పగించి సౌహార్దం చాటుకున్న దేశం ఇరాన్. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌తో కూడా భారత్ బంధం బాగా బలపడింది. భద్రత, మిలిటరీ వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య స్నేహ ఒడంబడికలున్నాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియానే తీరుస్తున్నది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్‌కు దౌత్య సంబంధాలున్నాయి.కొన్ని లక్షలమంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రవాసులు భారత్‌కు పంపిస్తున్నారు. ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్‌కు ఆందోళన ఉంటుంది. ఇటీవలనే యూఏఈ, జోర్డాన్, గ్రీస్‌లతో కలిసి ‘ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనామిక్ కారిడార్’ను కూడా భారత్ ప్రారంభించింది. ఉద్రిక్తతల కారణంగా ఈ నడవా ఇంకా నడకను మొదలుపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ‘ఐ టూ – యూ టూ’ ప్లాన్ పరిస్థితి కూడా ఇంతే!ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి రెండు ధ్రువాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఓ కూటమి వైపు మొగ్గవలసిన పరిస్థితులుండేవి. అలీన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏకధ్రువ ప్రపంచంగా కూడా పిలువలేము. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. భౌగోళిక – రాజకీయ, భౌగోళిక – ఆర్థిక అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయుల్లోనూ ఈ వ్యూహాత్మక లేదా కీలక భాగస్వామ్య కూటములు ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్‌కున్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్‌పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్‌కు నిజంగా పీడకలే! కానీ, ఒక దేశపు దుశ్చర్యను ఖండించలేని స్థితిలో ఉన్న భారత్ యుద్ధాన్ని ఆపగలదని ఆశించలేము.ఇజ్రాయెల్... అమెరికా మాట వింటుంది. రష్యా – చైనాల మాటను ఇరాన్ వినే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధాన్ని నివారించేందుకు పూనుకుంటాయా? అది సాధ్యమయ్యే పనేనా? అసలు యుద్ధం జరగకూడదని ఈ మూడు దేశాలు కోరుకుంటున్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం జరిగితే రష్యాకు పోయేదేమీ ఉండకపోవచ్చు. ఇరాన్, సిరియాలు మిత్ర దేశాలు. వాటికి కావలసిన ఆయుధాలను నూటికి నూరు శాతం రష్యానే ఎగుమతి చేస్తున్నది. ఇప్పటికే ఆయుధ ఎగుమతులు తగ్గిపోయిన రష్యాకు ఇదో ఊరటే! కోల్పోయిన ఒకనాటి ప్రాధాన్యత మళ్లీ ఆ ప్రాంతంలో దక్కడం కంటే కావల్సిందేముంది! ఉక్రెయిన్‌కు అండగా నిలబడిన అమెరికాకు పశ్చిమాసియాలో పాఠం చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది?దేశాల మధ్య ఉద్రిక్తతలు, వైషమ్యాలు ఉండే పరిస్థితులపై చైనా, అమెరికాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి యుద్ధాన్ని కోరుకోకపోవచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో సైన్యం ఉన్నది. సైనిక స్థావరాలున్నాయి. ఇజ్రాయెల్ వంటి బలమైన శిష్య దేశాలు, సౌదీ వంటి మిత్ర దేశాలున్నాయి. వాటితో ప్రయోజనాలున్నాయి. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగడం అమెరికాకు అవసరం. ఇక్కడి బలాబలాల సమతూకం చెదిరితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది.యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్‌కు అండగా నిలవక తప్పని స్థితి అమెరికాది. ఒకవేళ అలా నిలబడకపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఇండో – పసిఫిక్‌లో కుదిరిన ఒప్పందాల్లో భాగస్వాములు అమెరికాను విశ్వసించకపోయే అవకాశం ఉంటుంది. సొంత దేశంలోని యూదు లాబీ అభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు అమెరికా తీసుకోగలదా అన్నది కూడా సందేహమే. కనుక యుద్ధంలో అమెరికా పాత్ర ఉంటుంది.ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ తదితర దేశాలు పశ్చిమాసియాలో అమెరికాకు సన్నిహితంగా ఉంటాయి. ఈ దేశాలతో అమెరికాకు బలమైన వాణిజ్య, సహకార సంబంధాలున్నాయి. యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ ఘర్షణగా మారితే ఈ మిత్రదేశాలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. కాన్వొకేషన్ కార్యక్రమాలను పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. దేశంలోని యూదు లాబీకి దీటుగా వ్యతిరేక శక్తులు కూడా బలపడుతున్న సూచనల నేపథ్యంలో ఈ యుద్ధం అధికార పార్టీ డెమోక్రట్ల పుట్టిని ఎన్నికల్లో ముంచినా ముంచవచ్చు.ఏ రకంగా ఆలోచించినా యుద్ధ నివారణే అమెరికాకు ప్రస్తుత అవసరం. అందుకు ఇరాన్‌ను నియంత్రించవలసిన అవసరం ఉన్నది. రష్యా సహకారంతో చైనా ఈ పని చేయాలని అమెరికా కోరిక. చైనాకు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్’లో భాగమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ దేశాల్లో ఒప్పందాలున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక కారణాల రీత్యా చైనాకు కూడా ఆమోదయోగ్యం కాదని అమెరికా అంచనా. పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకొనిపోయినట్లయితే ఇండో – పసిఫిక్‌లో తమను దిగ్బంధం చేసే ప్రయత్నాలు వెనుకడుగు వేస్తాయని చైనా దౌత్య నిపుణులు అంచనా వేసుకుంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇస్మాయెల్ హనియా హత్యను కూడా చైనా గట్టిగానే ఖండించింది. ఈ కోణంలో చూసినప్పుడు యుద్ధ నివారణకు చైనా చొరవ చూపే అవకాశాలు చాలా తక్కువ.పెత్తందారీ దేశాల ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నా పశ్చిమాసియా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక మందుపాతర లాగా కనిపిస్తున్నది. పర్షియా, మెసపుటోమియా, ఫొనీషియన్, ఈజిప్టు నైలునదీ నాగరికతలు విలసిల్లిన చారిత్రక ధన్యభూమి ఇప్పుడు దగ్ధగీతాన్ని వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో పశ్చిమాసియా వాటా రెండున్నర శాతం దాటదు. కానీ 30 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ప్రాంతం ఇదే! సగటున తొమ్మిది శాతం జీడీపీని ఈ దేశాలు ఆయుధాల కోసం తగలేస్తున్నాయి. రష్యా మార్కెట్ ఇరాన్, సిరియాలు మాత్రమే! మిగతా మార్కెటంతా అమెరికాదే! ఈ దేశాలు ఆయుధాల మీద ఏటా వెచ్చిస్తున్న ఐదు లక్షల కోట్ల రూపాయల్లో భీముని వాటా అమెరికాదే. ఒకపక్క తుపాకులు చేరవేస్తూ, ‘కాల్చుకోకండి ప్లీజ్... జస్ట్ ఆడుకోండి’ అంటే కుదురుతుందా? అందుకే అమెరికా శాంతి ప్రబోధాలకు పెద్దగా విలువ ఉండదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం
ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 930 పాయింట్ల 73,315 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 22,339 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 845 పాయింట్లు పతనమై 2 వారాల కనిష్టం దిగువున 73,400 వద్ద నిలిచింది. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఒక్క ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్, సరీ్వసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. ► సెన్సెక్స్ 845 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో రూ.5.18 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.394 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా ఈ సూచీలో 30 షేర్లకు గానూ మారుతీ సుజుకీ (1%), నెస్లే (0.62%), సన్‌ఫార్మా(0.10%) మాత్రమే లాభపడ్డాయి. ► ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.3942 వద్ద నిలిచింది. క్యూ4 ఫలితాలు మెప్పించడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 1.50% పెరిగి రూ.4063 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లో భాగంగా ఈ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లకు కలిసొచి్చంది. ఓఎన్జీసీ 6%, ఐజీఎల్ 2%, ఐఓఎల్, గెయిల్ 1.50% చొప్పున లాభపడ్డాయి. జీఎస్పీఎల్ 1% లాభపడ్డాయి. ► ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదించడంతో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు 7% లాభపడి రూ.523 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడి
జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిప ణులు ఈ ఇరాన్ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ సైనిక స్థావరం దెబ్బతింది. బెడోయిన్ అరబ్ పట్టణంలో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు వినిపించాయి. జనం భయంతో వణికిపో యారు. అండగా ఉంటామన్న అమెరికా ఇరాన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ‘‘ ఉక్కుకవచంలా ఇజ్రా యెల్‌కు రక్షణగా నిలుస్తాం. అన్నివిధాలుగా అండగా ఉంటాం’ అని అన్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచి వివరాలు అడిగి తెల్సుకు న్నారు. అమెరికా స్పందనపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ ఘాటుగా స్పందించింది. ‘‘ మా దాడికి ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు దారు ణంగా ఉంటాయి. ఈ సమస్య పశ్చిమాసి యాకే పరిమితం. ఉగ్ర అమెరికా ఇందులో తలదూర్చొద్దు’’ అని హెచ్చరించింది. ఇంతటితో మా ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ హుస్సేన్ బఘేరీ ప్రకటించారు. ‘‘దాడిని మేం అడ్డుకున్నాం. మిత్రదేశాల సాయంతో విజయం సాధించాం’ అని దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఖండించిన ప్రపంచదేశాలు ఇరాన్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘‘ ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇరాన్ సైనికచర్యను తప్పుబట్టాయి. పౌరుల భద్రతపై భారత్ ఆందోళన ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్ చేసుకోండి. శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
Israel-Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్‌లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. ఆ నౌకలో భారతీయులు 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని, చేజిక్కించుకున్న ఇజ్రాయెల్ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఊహించని దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ తేరుకుని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరువర్గాల ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోరా్టర్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది. తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే’’అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ముందుగా చొరబాటుదారులను ఏరేస్తాం. అనంతరం భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరతాం’’అని ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్నేళ్లలో ఆ దేశంపై జరిగిన అతి తీవ్ర దాడి ఇదే. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 14 చోట్లనుంచి చొరబాటు...! ఇజ్రాయెల్‌లోకి కనీసం 7 నుంచి 14 ప్రాంతాల గుండా మిలిటెంట్లు చొచ్చుకొచి్చనట్టు చెబుతున్నారు. తొలుత వివాదాస్పద గాజా స్ట్రిప్ నుంచి తెల్లవారుజామున రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశమంతటా వాయుదాడి సైరన్లు మోగాయి. ఆ వెంటనే మిలిటెంట్లు దేశంలోకి చొచ్చుకొచ్చారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దక్షిణాన గాజా–ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్‌సైకిళ్లు, వాహనాల్లో, పారా గ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. ప్రతిగా సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది. అల్ హక్సా మసీదుపై ఇజ్రాయెల్ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్ మిలిటరీ వింగ్ నేత మొహమ్మద్ దెయిఫ్ పేర్కొన్నాడు. దీన్ని ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’గా అభివరి్ణంచాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్ దాకా ఉన్న పాలస్తీనియన్లంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఈ దాడి నెతన్యాహూ నాయకత్వ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తింది. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, భారీ ఆందోళనలకు ఆయన కారకుడవడం తెలిసిందే. దాడి నేపథ్యంలో సైనిక ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండ: మోదీ ఇజ్రాయెల్‌పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. బాధిత పౌరులు, కుటుంబాల క్షేమం కోసం ప్రారి్థస్తున్నానంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడిని అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించగా. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పలు ఇతర దేశాలు కోరాయి. అక్కడి భారతీయులకు అడ్వైజరీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయు లు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అ నవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దని పేర్కొంది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఇంగ్లిష్తో పా టు హిందీ, మరాఠా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయె ల్లో 18 వేల మంది దాకా భారతీయులున్నారు. -
అమ్మకాలకే అవకాశం.. మార్కెట్‌పై ఉక్రెయిన్–రష్యా అనిశ్చితి
ముంబై: ఉక్రెయిన్–రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా ఇన్వెస్టర్లు ఈ వారమూ అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో చోటు చేసుకోనున్న అప్రమత్తత విక్రయాలకు ఊతం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్టిమోనీపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. దేశీయంగా ఇదే వారంలో విడుదలయ్యే క్యూ3 జీడీపీ, ఫిబ్రవరి తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి స్టాక్ మార్కెట్‌పై ట్రేడింగ్ ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ప్రభావితం చేసే అంశాలు.. ► ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యాను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అత్యవసర మరోసారి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యుద్ధ పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు. ► నేడు క్యూ3 జీడీపీ గణాంకాల విడుదల కేంద్ర గణాంకాల శాఖ నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైసికం(క్యూ3) జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. సమీక్షిస్తున్న మూడో క్వార్టర్లో జీడీపీ వృద్ధి 6.6% నమోదు అవుతుందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఎస్బీఐ రీసెర్చ్‌లు 5.8 శాతంగా నమోదుకావచ్చని భావిస్తోంది. ఇదే రోజున జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ద్రవ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ► రేపు ఆటో అమ్మక డేటా వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం(రేపు) ఫిబ్రవరి నెల వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. చిప్ కొరత కష్టాలు కాస్త తగ్గడంతో వాణిజ్య, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా ద్విచక్ర, ట్రాక్టర్ విక్రయాల్లో క్షీణత నమోదు కావచ్చని అంటున్నారు. అమ్మక గణాంకాల విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, జజాజ్ ఆటో, ఎస్కార్ట్స్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం తదితర ఆటో కంపెనీల షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ కావచ్చు. ► బుధవారం పావెల్ టెస్టిమోనీ ప్రసంగం ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఉక్రెయిన్ – రష్యా సంఘర్షణ నేపథ్యంలో ద్రవ్యపాలసీపై ఫెడ్ రిజర్వ్ వైఖరి వెల్లడించనున్నారు. ► తయారీ, సేవల రంగ గణాంకాలు ఫిబ్రవరి తయారీ రంగ సేవల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి భయాలు తగ్గడం, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. కావున తయారీ డేటా ఆశించిన స్థాయిలో నమోదుకావచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదేవారంలో శుక్రవారం జనవరి సేవల రంగ గణాంకాలు విడుదల అవుతాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు జనవరిలో కోవిడ్ ఆంక్షలతో సేవారంగం నెమ్మదించి ఉండొచ్చని భావిస్తున్నారు. ► వరుసగా ఐదోనెల అమ్మకాలే... దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఐదో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఫిబ్రవరిలో మొత్తం రూ.35,506 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గడచిన ఐదు నెలల్లో మొత్తం రూ.1.84 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు భయాలకు తోడు తాజాగా ఉక్రెయిన్ రష్యా దేశాల యుద్ధ పరిస్థితులు తోడయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు బేర్స్‌కు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో దేశ ఎక్సే్చంజీలు 4 రోజులకే పనిచేయనున్నాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులను తెలిపే కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అప్రమత్తత ధోరణి ప్రదర్శించవచ్చు. నిఫ్టీకి సాంకేతికంగా దిగువ స్థాయిలో 16,200 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగితే ఎగువస్థాయిలో 16,900 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే... మహాశివరాత్రి సందర్భంగా మంగళ వారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. రష్యా సైనిక చర్యతో గతవారంలో సెన్సెక్స్ 1,974 పాయింట్లు, నిఫ్టీ 618 పాయిం ట్లు చొప్పున నష్టపోయాయి. ఏడు రోజుల వరుస పతనం నేపథ్యంలో వారాంతపు రోజు శుక్రవారం సూచీలు స్వల్పంగా బౌన్స్‌బ్యాక్ కావడం మార్కెట్ వర్గాలకు ఊరటనిచ్చింది. -
మార్కెట్‌పై యుద్ధ మేఘాలు
ముంబై: రష్యా – ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లో కమ్ముకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనాన్ని శాసించాయి. ప్రపంచ చమురు అవసరాలను తీర్చడంతో కీలకపాత్ర పోషిస్తున్న ఈ దేశాల మధ్య ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 95 డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను మార్చి కంటే ముందుగానే పెంచవచ్చనే భయాలు వెంటాడాయి. దీంతో ఆసియా మార్కెట్ల నుంచి యూరప్ సూచీలు, అమెరికా ఫ్యూచర్ల వరకు నష్టాల కడలిలో కుంగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్‌పైనా ఆ ప్రభావం కనిపించింది. ఇక దేశీయ ప్రతికూలతలను పరిశీలిస్తే.., ఇంటర్ బ్యాంక్ పారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు నష్టపోయి 9 వారాల కనిష్ట స్థాయి 75.60కి పడిపోయింది. దేశీయ మార్కెట్లో సోమవారం ఎఫ్ఐఐలు రూ.4,254 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది తొలి నెల జనవరి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,747 పాయింట్లు క్షీణించి 56,406 వద్ద స్థిరపడింది. గతేడాది(2021) ఫిబ్రవరి 26 తరువాత ఈ సూచీకిదే అతిపెద్ద నష్టం. నిఫ్టీ 532 పాయింట్లు పతనమైన ఈ ఏడాదిలో తొలిసారి 17,000 స్థాయి దిగువన 16,843 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలోని మొత్తం 19 రంగాల ఇండెక్సులు నష్టపోయాయి. అత్యధికంగా మెటల్, బ్యాంకింగ్ షేర్ల సూచీలు ఐదుశాతానికి పైగా క్షీణించాయి. విస్తృతస్థాయిలో అమ్మకాలు జరగడంతో స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్సులు నాలుగు చొప్పున నష్టపోయాయి. ఆసియాలో స్టాక్ సూచీలన్నీ ఒకశాతం నుంచి రెండున్న శాతం నష్టపోయాయి. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మార్కెట్లు 1.50%– 3% చొప్పున క్షీణించాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,433 క్షీణించి 56,720 వద్ద, నిఫ్టీ 299 పాయింట్ల పతనంతో 17,375 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ నష్టాల నేపథ్యంలో దిగువస్థాయిల వద్ద కొంత కొనుగోళ్ల మద్దతు లభించినా.., ఆదిలోనే హంసపాదులాగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. ఒక దశలో సెన్సెక్స్ 1,858 పాయింట్ల నష్టంతో 56,295 వద్ద, నిఫ్టీ 565 పాయింట్లను కోల్పోయి 16,810 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలకు దిగివచ్చాయి. లాభాలు ఒక్క షేరుకే... సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఒక్క టీవీఎస్(ఒకశాతం లాభం) మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండెక్సుల్లో దిగ్గజాలైన టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు అత్యధికంగా ఐదున్నర శాతం క్షీణించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, విప్రో షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి. సూచీలో అధిక వెయిటేజీ షేరు రిలయన్స్ షేరు రెండు శాతం నష్టపోయింది. రెండురోజుల్లో రూ.12.43 లక్షల కోట్లు... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, ప్రపంచ ప్రతికూలతలతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీ 2,520 పాయింట్లు, నిఫ్టీ 763 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీల భారీ పతనంతో గడిచిన రెండురోజుల్లో బీఎస్ఈలో రూ.12.43 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. గతవారాంతపు రోజైన శుక్రవారం రూ. 3.91 లక్షల కోట్లు, ఈ సోమవారం రూ.8.47 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.255 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘ఊహించినట్లే ప్రపంచ ప్రతికూలతలు దేశీయ మార్కెట్ పతనాన్ని శాసించాయి. కొన్ని వారాల స్థిరీకరణ తర్వాత మార్కెట్‌పై బేర్స్ పట్టు సాధించాయి. రష్యా – ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. పెరుగుతున్న క్రూడ్ ధరలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రానున్న రోజుల్లో సూచీలకు అంతర్జాతీయ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 23 శాతం ఎగసి 22.98 స్థాయికి చేరుకుంది. ► నష్టాల మార్కెట్లో టీసీఎస్ షేరు మాత్రమే ఒకశాతం లాభపడి రూ.3734 వద్ద ముగిసింది. బైబ్యాక్ రికార్డు తేదీ(ఫిబ్రవరి 23)ని ప్రకటించడం షేరు రాణించేందుకు కారణమైంది. ► స్పైస్‌జెట్ ఆఫర్‌ను కళానిధి మారన్ తిరస్కరించడంతో ఆ షేరు ఐదున్నర శాతం క్షీణించి రూ.59 వద్ద స్థిరపడింది. ► బ్యాంకింగ్ షేర్ల పతనంలో భాగంగా ఐసీఐసీఐ షేరు పదినెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో 5% పతనమై రూ.754 వద్ద ముగిసింది. -
ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా.. ఇదే ఆఖరి హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య పోరు మరింత తీవ్రమైంది. కొత్త డిజిటల్ (ఐటీ) నిబంధనల ప్రకారం దేశంలో భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల్లో అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచిపోయినా ట్విట్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర ఐటీ శాఖ ఆ సంస్థకు చివరి హెచ్చరికగా శనివారం నోటీసులు జారీ చేసింది. ట్విటర్లో నెటిజన్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకి సంబంధించి బ్లూ టిక్స్ బ్యాడ్జ్‌ని ట్విట్టర్ కొద్దిసేపు తొలగించి మళ్లీ పునరుద్ధించింది. ఇది జరిగిన కొద్ది గంట్లోలనే కేంద్రం ట్విటర్‌కి నోటీసులు పంపింది. కొత్త నిబంధనలు పాటించడానికి ట్విట్టర్ విముఖత చూపించడం భారతదేశ ప్రజల పట్ల ఆ సంస్థకు చిత్తశుద్ధి లేకపోవడాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా భారత్ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు సరైన సమయంలో పారదర్శకంగా పరిష్కారమవ్వాలంటే దేశ పౌరులే అధికారులుగా ఉండాలని స్పష్టం చేసింది. ఇదే తాము ఇచ్చే చివరి నోటీసు అని తక్షణమే చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్లుగా భారతీయుల్ని నియమించకపోతే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో హెచ్చరించింది. బ్లూ బ్యాడ్జ్ వివాదం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ అకౌంట్లలో బ్ల్యూ బ్యాడ్జ్‌ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వెరిఫై చేసిన అకౌంట్లకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది. అంటే సదరు వినియోగదారుడే ఈ ఖాతాను వాడుతున్నట్లు అధికారికంగా ధృవీకరించడమన్న మాట. శనివారం ఉదయం తొలుత వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూ బ్యాడ్జ్‌ను తొలగించిన ట్విట్టర్ తర్వాత పునరుద్ధరించింది. ఆరెస్సెస్ చీఫ్ భగవత్ వ్యక్తిగత ఖాతాతో పాటుగా ఇతర ఆరెస్సెస్ నేతలు సురేష్ సోని, అరుణ్‌కుమార్, సురేష్ జోషి, కృష్ణ గోపాల్ ఖాతాల్లో వెరిఫైడ్ బ్లూ టిక్స్‌ను తొలగించింది. ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా జరగడం వివక్షాపూరిత చర్యని ఆరెస్సెస్ ఢిల్లీ యూనిట్ నాయకుడు రాజీవ్ మండిపడ్డారు. టెక్ ఫ్యూడలిజానికి ట్విట్టర్ నిదర్శనంగా మారుతోందని విమర్శించారు. ట్విట్టర్ చర్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆరు నెలల పాటు ఖాతాను వినియోగించకపోతే, ఎలాంటి ట్వీట్లు చేయకపోతే బ్లూ బ్యాడ్జ్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని ట్విట్టర్ తెలిపింది. గత కొద్దికాలంగా వారెవరూ ట్వీట్లు చేయకపోవడంతో బ్ల్యూ టిక్స్ పోయాయని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించామని వివరించింది. -
అగ్ర రాజ్యాల మధ్య వ్యాక్సిన్ వార్
వాషింగ్టన్/ మాస్కో: ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. మొట్టమొదట ఎవరు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తారో వారే కోవిడ్–19 యుద్ధంలో విజేతగా నిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ర రాజ్యాల మధ్య వ్యాక్సిన్ వార్కి తెరలేచింది. అమెరికా, కెనడా, బ్రిటన్ చేస్తున్న టీకా పరిశోధనలకు అడుగడుగునా రష్యా, చైనా అడ్డు తగులుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (24 గంటల్లో 2.6 లక్షల మందికి) అగ్రదేశాల మ«ధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రష్యా ఇంటెలిజెన్స్‌కి చెందిన ఏపీటీ29, కాజీ బేర్ అనే సంస్థ టీకా సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్ చేసిందని అమెరికా, బ్రిటన్, కెనడాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలపై రష్యా ఎదురుదాడికి దిగింది. బ్రిటన్‌లో రష్యా రాయబారి ఆండ్రూ కెలిన్ ఈ ఆరోపణలు మతిలేనివని కొట్టి పారేశారు. ఒక దేశంలో జరిగే పరిశోధన ఫలితాల్ని, మరో దేశం సైబర్ దాడి ద్వారా తస్కరించడం అసాధ్యమని అన్నారు.(కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా..) అగ్రరాజ్యాల మధ్య అంతరాలు చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచంలో అత్యధికంగా అమెరికాకే నష్టం జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య అంతరం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ దశకి వచ్చిన వ్యాక్సిన్లు 25 వరకు ఉంటే, అందులో అమెరికా ఫార్మా కంపెనీలు తొమ్మిదికి పైగా ఉన్నాయి. చైనాకు చెందిన కంపెనీలు నాలుగు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. వ్యాక్సిన్ రేసులో ఎలాగైనా ముందుకు వెళ్లి అధ్యక్ష ఎన్నికల్లో మార్కులు కొట్టేయాలని ట్రంప్ తహతహలాడుతుంటే మరోవైపు చైనా వ్యాక్సిన్ రేసులో విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. వూహాన్లో పుట్టిన కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యు సమాచారాన్ని విశ్లే షించి అందించడంలో చైనా ఉద్దేశపూర్వకంగానే రెండు వారాలు జాప్యం చేసిందన్న అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్ అంశంలో అమెరికా, బ్రిటన్, కెనడా ఒక జట్టుగా పని చేస్తూ చైనా, రష్యాపై ఆరోపణలు చేస్తూ ఉండడంతో వ్యాక్సిన్ వార్ మున్ముందు ఎలా ంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. (ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే) ఆ శాస్త్రవేత్త హత్యతో లింక్ ఉందా ? అమెరికాలో కరోనాటీకాపై పరిశోధనలు చేస్తున్న బింగ్ ల్యూ మేలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై ఎన్నో సందేహాలున్నాయి. చైనాలో పుట్టి పెరిగిన బింగ్ అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కోవిడ్ వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేశారు. అవి కీలక దశకు చేరుకున్న సమయంలో ఆయన శవమై కనిపించారు. ఆయన హత్య వెనుక చైనా హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. -
మార్కెట్లో ‘శాంతి’ ర్యాలీ!
ముంబై: ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశం అమెరికా.. చమురు ఉత్పత్తి పరంగా బలమైన ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తేలికపడడం ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. గత వారం ఇరాక్‌లో ఇరాన్ సైనిక కమాండర్ సులేమానీని అమెరికా దళాలు చంపేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ నష్టాల్లో అధిక శాతం మేర గడిచిన రెండు రోజుల్లో మన ఈక్విటీ మార్కెట్లు తిరిగి పూడ్చుకున్నాయి. ప్రతీకార చర్య కింద ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినా కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తీసుకోకపోవడం, తాము శాంతినే కోరుకుంటున్నామని చెప్పడం పరిస్థితిని కుదుటపరిచింది. ఫలితంగా గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 635 పాయింట్ల లాభాన్ని (1.55 శాతం) నమోదు చేసుకుంది. 41,482 పాయింట్ల గరిష్టస్థాయిని తాకి... చివరకు 41,452 వద్ద క్లోజయింది. అటు నిఫ్టీ సైతం 191 పాయింట్లు పెరిగి (1.58 శాతం) 12,216 వద్ద క్లోజయింది. ట్రంప్ ప్రకటనతో క్రితం రాత్రి యూఎస్ మార్కెట్లు కూడా లాభాలను నమోదు చేశాయి. తమ ఉపాధ్యక్షుడు లీ వచ్చే వారం వాషింగ్టన్‌ను సందర్శిస్తారని, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారంటూ చైనా చేసిన ప్రకటన కూడా ఇన్వెస్టర్లను రిస్క్ తీసుకునే దిశగా ప్రోత్సహించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► అధికంగా లాభపడిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంకు ముందుంది. ఆ తర్వాత ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్బ్యాంకు, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ► నష్టపోయిన షేర్లలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా ఉన్నాయి. ► బీఎస్ఈ రియల్టీ, ఆటో, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, ఎనర్జీ సూచీలు లాభపడ్డాయి. ఐటీ సూచీ నష్టపోయింది. ► బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.55 శాతం వరకు పెరిగాయి. ► షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ 2.31 శాతం వరకు గరిష్టంగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడింగ్ ఆరంభించాయి. ఒక్కరోజులో 2.25 లక్షల కోట్లు గురువారం నాటి మార్కెట్ ర్యాలీ పుణ్యమా అని ఒక్కరోజే ఇన్వెస్టర్ల వాటాల విలువ రూ.2.25 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ముగింపుతో పోలిస్తే.. రూ.2,25,554 కోట్లు పెరిగి మొత్తం రూ.1,57,06,155 కోట్లకు చేరుకుంది. మార్కెట్లపై క్యూ3 ఫలితాల ప్రభావం.. ‘‘వృద్ధిని పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లారడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించే విధానపరమైన చర్యలు, నిర్ణయాలు దీర్ఘకాలంలో ఈక్విటీలకు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్లను మూడో త్రైమాసికం ఫలితాలు నిర్ణయిస్తాయి. తక్కువ బేస్(క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోలిస్తే) కారణంగా డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కొంత పురోగతి ఉంటుందని అంచనా’’ అంటూ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘ఈక్విటీ మార్కెట్లకు అసాధారణ రోజు. ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మరింత ఉత్సాహాన్నిచ్చింది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. చల్లారిన పసిడి.. క్రూడ్ రూపాయికి 48 పైసలు లాభం న్యూయార్క్/న్యూఢిల్లీ: యుద్ధాన్ని కాంక్షించడంలేదంటూ అమెరికా–ఇరాన్ నుంచి వెలువడుతున్న సంకేతాలతో తిరిగి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాలైన బంగారం, క్రూడ్ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కనబడుతోంది. దీంతో అంతర్జాతీయంగా పసిడి, క్రూడ్ ధరలు గురువారమూ తగ్గాయి. ఈ ధోరణి భారత్ రూపాయి బలోపేతం కావడానికీ దోహదపడింది. బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ మార్కెట్ నైమెక్స్‌లో గురువారం ఈ వార్తరాసే 10.30 రాత్రి గంటల సమయానికి క్రితం ముగింపుతో పోల్చిచూస్తే, 10 డాలర్ల నష్టంలో 1,550 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. బుధవారం గరిష్టంతో పోల్చితే ఇది 62 డాలర్లు తక్కువ. ట్రేడింగ్ ఒక దశలో ఈ ధర 1,541 డాలర్ల కనిష్టాన్నీ తాకింది. ► నైమెక్స్ క్రూడ్ పావు శాతం తగ్గుదలతో 59.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ► డాలరుతో రూపాయి విలువ 48 పైసలు లాభపడి 71.21 వద్ద ముగిసింది. ► దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.377 నష్టంతో రూ.39,733 వద్ద ట్రేడవుతోంది. ‘‘యూఎస్–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు బలం చూపిస్తున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్ బలంగా ముగియడం ఆసియాలోనూ కొనుగోళ్లకు దారితీసింది. ఇప్పుడు యూరోప్‌లోనూ బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తోంది. యూఎస్, ఇరాన్ ఇప్పటికీ ఒకరిపట్ల మరొకరు విభేదంగా ఉన్నా, వివాదం ముదరకపోతే మంచి వాతావరణం కొనసాగే అవకాశమే ఉంటుంది’’ అని బ్రిటన్‌కు చెందిన సీఎంసీ మార్కెట్స్ అనలిస్ట్ డేవిడ్ మాడెన్ పేర్కొన్నారు. -
చమురు మంట.. పసిడి పంట
న్యూయార్క్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అటు పసిడిని, ఇటు క్రూడ్‌ను అప్‌ట్రెండ్‌లోనే కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర సోమవారం ఔన్స్ (31.1గ్రా) 1,588 డాలర్లను తాకింది. గత శుక్రవారం ముగింపుతో పోల్చితే ఇది 36 డాలర్లు అధికం. అయితే ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి 14 డాలర్ల లాభంతో 1,566 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఒక దశలో స్పాట్ మార్కెట్లో ధర 10 గ్రాములకు రూ.41,730ని తాకింది. ఇది ఇక్కడ జీవితకాల గరిష్టస్థాయి. పసిడి చివరకు రూ.41,690 వద్ద ముగిసింది. ఇక నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ విషయానికి వస్తే, శుక్రవారం ధరతో పోల్చితే ప్రారంభ ట్రేడింగ్‌లో 2 శాతం పెరుగుదలతో 64.72 డాలర్లకు పెరిగింది. 72 స్థాయికి రూపాయి పతనం.. ముంబై: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, దీనితో క్రూడ్ ధరల భారీ పెరుగుదల, దేశంలో ద్రవ్యోల్బణం భయాలు, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి అంశాలు భారత్ కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 13 పైసలు పతనమై 71.93 వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బలహీనధోరణిలో 72.03 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 72.11 కనిష్టాన్ని కూడా చూసింది. చివరకు గత శుక్రవారం ముగింపు (71.80)తో పోల్చి 13 పైసలు నష్టపోయి 71.93 వద్ద ముగిసింది. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. ఆ తర్వాత పలు సానుకూల అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరినప్పటికీ మళ్లీ పతనబాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో 71–73 శ్రేణిలో ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. పైగా క్రూడ్ అప్‌ట్రెండ్ రూపాయికి ప్రతికూలంగా నిలుస్తోంది. -
క్యూ3 ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ3 (అక్టోబర్ – డిసెంబర్) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–ఇరాన్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. డ్రోన్ దాడి జరిపి తమ మిలటరీ కమాండర్ కాసిం సులేమానీని హతమార్చిన అమెరికాపై ప్రతీకార చర్య తప్పదని తాజాగా ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో సైతం ఒడిదుడుకులకు గురయ్యే ఆస్కారం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే.. కేంద్ర బడ్జెట్ సమీపిస్తుండడం వంటి సానుకూల సంకేతాలు మార్కెట్‌ను భారీ పతనం నుంచి నిలబెట్టేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. భౌగోళిక రాజకీయ ప్రకంపనలు లాభాల స్వీకరణలకు ఆస్కారం ఇవ్వవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. తాజా పరిణామాలతో ముడిచమురు ధరలు పెరిగిపోగా.. ఈ వారంలో కూడా క్రూడ్ ర్యాలీ మరింత కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపేందుకు అవకాశం ఉందని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా అన్నారు. ఫలితాల ప్రభావం... ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఈ వారం నుంచే ప్రారంభంకానుంది. ఇన్ఫోసిస్, అవెన్యూ సూపర్ మార్ట్స్ (డీమార్ట్), ఇమామీ, ఐటీఐ, జీటీపీఎల్ హాత్వే కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థికాంశాలు... గతేడాది డిసెంబర్ సర్వీసెస్ పీఎంఐ ఈ నెల 6న (సోమవారం) వెల్లడికానుండగా.. నవంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 10న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. రూ. 2,418 కోట్ల పెట్టుబడి వెనక్కు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 2,418 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. అమెరికా–ఇరాన్ తాజా పరిణామాల కారణంగా 2020లో జనవరి 1–3 కాలంలో వీరు స్టాక్ మార్కెట్ నుంచి రూ. 524 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,893 కోట్లు వెనక్కు తీసుకున్నారు. -
ఇరాక్‌లో యుద్ధ వాతావరణం
-
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
మాతో పెట్టుకుంటే మటాష్!
వాషింగ్టన్: తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయ మని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య సైనిక పరమైన ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘ఇరాన్ మాతో యుద్ధం చేయాలనుకుంటే అధికారికంగానే ఆ దేశాన్ని తుడిచిపెట్టాల్సి వస్తుంది. మరోసారి అమెరికాను బెదిరించే సాహసం కూడా చేయలేదు..’ అని ట్రంప్ ఆదివారం ట్వీట్లో హెచ్చరించారు. ఇటు ఇరాన్ మిలిటరీ చర్యలపై ట్రంప్ అధికారులతో చర్చించారు. ఆదివారం ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను ఒకరిలా యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఆర్థికంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో మంది మరణించాల్సి వస్తుంది..’ అని చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జవద్ జరీఫ్ స్పందిస్తూ...ట్రంప్ యుద్ధ హెచ్చరికలకు జంకేది లేదన్నారు. ఇరాన్‌ను ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. ‘ఇరానియన్లు దురాక్రమణలను దాటుకొని వేలకొలది మైళ్లు విస్తరించారు. ఆర్థిక ఉగ్రవాదం, యుద్ధ బెదిరింపులతో ఇరాన్‌ను అంతం చేయలేరు.. ఇరానియన్లను గౌరవించే ప్రయత్నం చేయండి.. దాంతో ఏదైనా ఫలితముంటుంది..’ అని అన్నారు. -
అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు
వాషింగ్టన్: అమెరికా–ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్ఎస్ ఆర్లింగ్టన్ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పేట్రియాట్’ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు, బలగాలపై దాడికి ఇరాన్ పూర్తి సన్నద్ధతతో ఉందన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే మోహరించిన యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధనౌక, బీ–52 బాంబర్ విమానాలకు ఇవి జతకలవనున్నాయి. ఇరాన్‌తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదనీ, కానీ తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణశాఖ స్పష్టం చేసింది. ఉ.కొరియాది విశ్వాసఘాతుకం కాదు: ట్రంప్ ‘ఉ.కొరియా స్వల్పశ్రేణి క్షిపణులనే పరీక్షించింది. అవి సాధారణమైన పరీక్షలు. క్షిపణి పరీక్షలు విశ్వాసఘాతుకమని నేను అనుకోవట్లేను. ఉ.కొరియా అధినేత కిమ్‌తో నాకు సత్సంబంధాలు ఉన్నాƇు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. గతేడాది జూన్‌లో ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో అన్నిరకాల అణు, ఖండాంతర క్షిపణి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. ఫిబ్రవరిలో ట్రంప్‌తో రెండో విడత చర్చలు విఫలం కావడంతో ఈ ఏడాది చివర్లోగా పద్ధతిని మార్చుకోవాలని అమెరికాను కిమ్ హెచ్చరించారు. -
యుద్ధ మేఘాల్లో ఎవరిది రాజకీయం?
సాక్షి, న్యూఢిల్లీ : కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి చర్చించేందుకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యాయి. ముందుగా సోనియా గాంధీ మాట్లాడుతూ భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి చర్చించుకోవడం భావ్యం కాదని, చర్చను వాయిదా వేయడం సముచితమని సూచించారు. దానికి 21 పార్టీల నుంచి హాజరైన నాయకులు ఆమోదం తెలిపి ఉద్రిక్త పరిస్థితుల గురించి చర్చించారు. ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జాతి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. కనీసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. (ప్రచారం కోసం ఇంత అబద్ధమా!) పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లి పాక్ సైనికులకు బంధీగా చిక్కిన భారత పైలట్ అభినందన్ పట్ల సానుభూతి ప్రకటించారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాక్షించారు. పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లకు మౌనం పాటించి నివాళులర్పించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా బుధవారం నాడు అహ్మదాబాద్‌లో జరగాల్సిన పార్టీ సమావేశాన్ని, తన ర్యాలీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు. మరోపక్క తెలంగాణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు బుధవారం నాడు, మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన లోక్‌సభ నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. భారత్, పాక్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరి ఆరోజు మోదీ ఏం చేశారు ? పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకుపోయి బాలకోట్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన రోజే (ఫిబ్రవరి 26) ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని చురులో పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. అదే రోజు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సెల్ఫీలు దిగారు. ఇస్కాన్ సాంస్కృతిక కేంద్రానికి వెళ్లి 800 కిలోల బరువున్న భగవద్గీతను ఆవిష్కరించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత ఆ దేశం భూభాగంలోకి చొచ్చుకుపోవడం ఇదే మొదటిసారి. దీనిపై అంతర్జాతీయ ఒత్తిడులను లేదా స్పందనలను ఎదుర్కోవడానికి నరేంద్ర మోదీ తన కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండాల్సిన సమయం. పైగా ఆరోజు ప్రధాని మంత్రి లేదా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కాకుండా విదేశాంగ కార్యదర్శి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సరే, మంగళవారం నాడు భారత వైమానిక దళానిది పైచేయి అవడం వల్ల మోదీ యథాలాపంగా తన షెడ్యూల్డ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని అనుకున్నాం. బుధవారం నాటికి పరిస్థితి తీవ్రమైంది. సరిహద్దుల్లో పరస్పర వైమానిక దాడులు జరగడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ సైనికులకు భారత పైలట్ బంధీ అయ్యారు. ఆరోజు ఉదయం మోదీ ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్’లో పాల్గొన్నారు. అందులో ‘ఖేలో ఇండియా యాప్’ను ప్రారంభించారు. అంతేకాకుండా గురువారం ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ కార్యక్రమం కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడుతూ పాకిస్థాన్, భారతీయులను విడదీయాలని చూస్తోందని కూడా ఆరోపించారు. మరో పక్క కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడ్యూరప్ప బుధవారం చిత్రదుర్గలో మాట్లాడుతూ పాక్‌పై జరిపిన వైమానిక దాడులతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం 22 సీట్లను గెలుచుకుంటామని ప్రకటించారు. దేశ భద్రత గురించి ఢిల్లీలో బుధవారం ఉన్నతాధికారులతో చర్చించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు వెళ్లి పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపగాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాక్, భారత్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకోవడం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. (సర్జికల్ స్ట్రైక్స్-2: మేం 22 సీట్లు గెలుస్తాం!) పొరుగునున్న పాక్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నప్పుడు పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పర భిన్న వైఖరులు అవలంబించాయి. అవలంబిస్తున్నాయి. ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఎవరిది రాజకీయం ? ఎవరిది దౌత్యం ? ఇక ఎవరిది నిజమైన దేశభక్తి ? అని ప్రశ్నించడం చాలా పెద్ద మాట అవుతుందేమో! పాలకపక్షమే తన కార్యక్రమాలను రద్దు చేసుకొని, ప్రతిపక్షం కొనసాగించి ఉంటే సామాజిక మీడియా ఎలా స్పందించి ఉండేది...? -
భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు
-
కొరియాతో తల గోక్కుంటారా?!
-
కొరియాతో తల గోక్కుంటారా?!
- కొరియా ద్వీపకల్పంపై యుద్ధ మేఘాలు - ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై అమెరికా ఆందోళన - నియంత్రించకపోతే ఏకపక్ష చర్యలు చేపడతామన్న ట్రంప్ - ఉత్తర కొరియా దిశగా పయనమైన అమెరికా యుద్ధనౌక - చైనా ఆందోళన.. శాంతియుత పరిష్కారం కోసం పిలుపు - కొరియా సరిహద్దులో భారీగా చైనా సైన్యం మోహరింపు ‘పిచ్చోడి చేతిలో రాయి...’ అనే సామెత అర్థం తెలుసు కదా! ఆ పిచ్చోడు ఒక దేశానికి నియంత అయితే.. అతడి చేతిలో ఓ పది అణ్వస్త్రాలు ఉంటే.. అమెరికా సహా ఏ దేశాన్నైనా మసి చేసేయగలం అంటూ హెచ్చరికలు జారీచేస్తుంటే.. చుట్టూ ఉన్న దేశాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉత్తర కొరియా అణ్వస్త్రాల విషయంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, చైనాలు ఆ పరిస్థితులోనే ఉన్నాయి. కొరియా ద్వీపకల్పం కేంద్రంగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే అణ్వస్త్రాలు సమకూర్చుకున్న ఉత్తర కొరియా త్వరలో ఆరోసారి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్న ఆందోళనలు.. ఆ పొరుగునే దక్షిణ కొరియాతో కలిసి అమెరికా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుండటం.. ఆ విన్యాసాల పర్యవసానాలు విధ్వంసకరంగా ఉంటాయని, అమెరికా కోరుకునే ఏ తరహా యుద్ధానికైనా తాము సిద్ధమని ఉత్తర కొరియా ప్రకటించడం.. ఆ దేశాన్ని చైనా నియంత్రించలేకపోతే తాము ఏకపక్షంగా చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం.. అమెరికా యుద్ధవిమాన వాహక నౌక విన్సన్‌ను ఆ దేశం వైపు పంపించడం.. వరుస పరిణామాలతో పరిస్థితి అకస్మాత్తుగా సంక్షోభం స్థాయికి దిగజారింది. కొరియా ద్వీపకల్పం యుద్ధానికి అతి దగ్గరగా చేరుకుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉత్తర కొరియా అంటే ఎందుకంత భయం? రెండో ప్రపంచ యుద్ధానికి ముందు కొరియా ద్వీపకల్పం జపాన్ వలస పాలనలో ఉండేది. ఆ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత.. ఉత్తర భూభాగాన్ని పొరుగు దేశమైన సోవియట్ రష్యా, దక్షిణ భూభాగాన్ని అమెరికా ఆక్రమించడంతో అది రెండు దేశాలుగా విడిపోయింది. సోవియట్ రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా కొరియా ఏకీకరణ కలగానే మిగిలిపోయింది. అమెరికా సాయంతో దక్షిణ కొరియాలో స్వేచ్ఛా మార్కెట్ ప్రభుత్వం ఏర్పాటైతే.. సోవియట్ రష్యా సాయంతో కొరియాలో కిమ్-2 సంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు అగ్ర దేశాల ప్రచ్ఛన్న యుద్ధం కొరియాలో అగ్గిని రాజేస్తూనే ఉంది. 1950లో ఉభయ కొరియాల మధ్య యుద్ధం చెలరేగినపుడు.. దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగి ఉత్తర కొరియాలోకి చొచ్చుకువచ్చింది. ఉత్తర కొరియాకు రష్యా అండగా నిలిచింది. అమెరికా సైన్యం చైనా సరిహద్దుల వరకూ రావడంతో ఉత్తర కొరియాకు మద్దతుగా కమ్యూనిస్టు చైనా కూడా బరిలోకి దిగింది. ఎట్టకేలకు యుద్ధం ముగిసి ఎవరికి వారు మునుపటి స్థానాలకు వెళ్లారు. (చదవండి: యుద్ధంపై అమెరికా ఆలోచనలేమిటి?) అప్పటి నుంచి కొరియా ద్వీపకల్పం రగులుతూనే ఉంది. అమెరికా, దక్షిణ కొరియాల భయంతో ఉత్తర కొరియా సైనిక దేశంగా కరడుగట్టిపోయింది. సైనిక పాటవాన్ని అణ్వాయుధాలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది. తొలిసారిగా 2009లో విజయవంతంగా అణ్వస్త్రాన్ని పరీక్షించింది. అప్పటి నుంచి ఆ దేశ అణ్వస్త్ర, ఖండాంతర క్షిపణి కార్యక్రమాన్ని నిలువరించేందుకు అమెరికా వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. ఉత్తర కొరియాకు సరఫరాలను అడ్డుకోవడం నుంచి ఖండాంతర క్షిపణులను గాలిలోనే ఛేదించడం వరకూ ఈ వ్యూహంలో భాగం. ప్రస్తుతం ఉత్తర కొరియా వద్ద 8 నుంచి 10 వరకూ అణ్వస్త్రాలు ఉన్నాయని వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనా. ఉత్తర కొరియాకు పాకిస్తాన్ నుంచి అణ్వస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లభించింది. అలాగే పాక్ తన ఖండాంతర క్షిపణుల అభివృద్ధికి ఉత్తర కొరియా నుంచి సాంకేతిక సాయం తీసుకుంది. తమ వద్ద అణ్వస్త్రాలు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయని అమెరికా సహా ఏ దేశాన్నైనా మసి చేయగలమని తరచుగా హెచ్చరికలు జారీచేస్తోంది. అత్యంత క్రూరమైన నియంతగా పేరున్న కొరియా పాలకుడు కిమ్-జోంగ్-ఉన్ చేతిలో ఉన్న అణ్వస్త్రాలతో ఎప్పుడు ఎవరికి మూడుతుందోననే భయం దక్షిణకొరియా, అమెరికా, జపాన్లలో నెలకొంది. పొరుగుదేశమైన చైనా కూడా ఆందోళన చెందుతోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ (ఉత్కంఠపై చైనా ఎలా స్పందిస్తోంది?)