మధ్యప్రాచ్యంలో అమెరికా భారీ మోహరింపులు
భారీ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్ల తరలింపు
టెల్‌అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డి్రస్టాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది.
పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. మిసైల్ డిఫెన్స్ బలగాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్ సమీపంలో భూతల బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించే ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. 40 ఎఫ్‌ఏ–18 సూపర్ హార్నెట్, ఎఫ్–35 అటాక్ ప్లేన్లతో కూడిన విమానవాహక నౌక థియోడర్ రూజ్‌వెల్ట్ అరేబియా తీర సమీపంలో; 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 4,500 మంది మరైన్లు, నావికా దళ సభ్యులతో కూడిన యూఎస్‌ఎస్ వాస్ప్ కూడా తూర్పు మధ్యదరా సముద్రంలో పహారా కాస్తున్నాయి.
మరో హమాస్ నేత హతం
శనివారం గాజాపై వైమానిక దాడుల్లో హమాస్ సైనిక విభాగ కీలక నేత హైథమ్ బలిదీతో పాటు డజన్లకొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్టు సమాచారం. వెస్ట్‌బ్యాంక్‌లో 9 మంది పాలస్తీనా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా: అమెరికా
ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలిచేందుకు అవసరమైతే మరిన్ని చర్యలూ చేపడతామని పెంటగాన్ తాజాగా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొనడం ఈ ఏడాది ఇప్పటికే ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్త హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఉద్రిక్తలు పెరగడం ఎవరికీ మంచిది కాదని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనాసింగ్ అన్నారు. మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గాలంట్‌తో లాయిడ్‌సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment