Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మెరుపుదాడి | Iran-Israel war: Iran attacks Israel with over 300 drones, missiles | Sakshi
Sakshi News home page

Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మెరుపుదాడి

Published Mon, Apr 15 2024 5:20 AM | Last Updated on Mon, Apr 15 2024 5:21 AM

Iran-Israel war: Iran attacks Israel with over 300 drones, missiles - Sakshi

ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు జెరూసలేం వైపుగా దూసుకొస్తున్న దృశ్యం

300కుపైగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్‌

దాదాపు అన్నింటిని మిత్రదేశాల సాయంతో కూల్చేశామన్న ఇజ్రాయెల్‌

పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధమేఘాలు !

జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్‌ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.

మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్‌ ప్రయోగించిన క్షిప ణులు ఈ ఇరాన్‌ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్‌ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్‌ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

అయితే కొన్ని బాలిస్టిక్‌ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్‌ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్‌ ఐడీఎఫ్‌ సైనిక స్థావరం దెబ్బతింది. బెడోయిన్‌ అరబ్‌ పట్టణంలో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిందని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగేరీ చెప్పారు. ఇరాన్‌ దాడితో ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు వినిపించాయి. జనం భయంతో వణికిపో యారు.

అండగా ఉంటామన్న అమెరికా
ఇరాన్‌ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడారు. ‘‘ ఉక్కుకవచంలా ఇజ్రా యెల్‌కు రక్షణగా నిలుస్తాం. అన్నివిధాలుగా అండగా ఉంటాం’ అని అన్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచి వివరాలు అడిగి తెల్సుకు న్నారు. అమెరికా స్పందనపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్‌ మిషన్‌ ఘాటుగా స్పందించింది. ‘‘ మా దాడికి ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తే పరిణామాలు దారు ణంగా ఉంటాయి.

ఈ సమస్య పశ్చిమాసి యాకే పరిమితం. ఉగ్ర అమెరికా ఇందులో తలదూర్చొద్దు’’ అని హెచ్చరించింది. ఇంతటితో మా ఆపరేషన్‌ ముగిసిందని ఇరాన్‌ సైన్యం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ బఘేరీ ప్రకటించారు. ‘‘దాడిని మేం అడ్డుకున్నాం. మిత్రదేశాల సాయంతో విజయం సాధించాం’ అని దాడి తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

ఖండించిన ప్రపంచదేశాలు
ఇరాన్‌ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘‘ ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్‌ సహా పలు దేశాలు ఇరాన్‌ సైనికచర్యను తప్పుబట్టాయి.

పౌరుల భద్రతపై భారత్‌ ఆందోళన
ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్‌ చేసుకోండి.

శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. హార్మూజ్‌ జలసంధి వద్ద ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్‌ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్‌ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement