పశ్చిమాసియా ఓ మందు పాతర! | Sakshi Editorial On War Clouds Between Israel and Iran By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా ఓ మందు పాతర!

Published Sun, Aug 4 2024 12:36 AM | Last Updated on Sun, Aug 4 2024 12:36 AM

Sakshi Editorial On War Clouds Between Israel and Iran By Vardhelli Murali

జనతంత్రం

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్ఠవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలవడానికి మోహరింపు మొదలుపెట్టాయి. ఇరాన్‌లో ఆ దేశపు అతిథిగా ఉన్న సమయంలో హమాస్‌ రాజకీయ విభాగపు నేతను హతం చేయడం ద్వారా ఇజ్రాయెల్‌ పెద్ద సవాల్‌నే విసిరింది. గత అక్టోబర్‌ మాసంలో ఇజ్రాయెల్‌ పౌరులపై దాడి చేసిన హమాస్‌ దుస్సాహసం కంటే ఈ చర్య తక్కువదేమీ కాదు. ఇది ఇరాన్‌కు విసిరిన సవాల్‌! ఇజ్జత్‌ కా సవాల్‌గా ఈ చర్యను ఇరాన్‌ పరిగణించకుండా ఉంటుందని భావించలేము.

ఇజ్రాయెల్‌ పాల్పడిన దుశ్చర్యకు కఠిన శిక్ష తప్పదనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ ఇరాన్‌ సుప్రీమ్‌ లీడర్‌ ఆయతుల్లా ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్‌ యుద్ధంలో పాల్గొనడమంటే పశ్చిమాసియాలోని పలు ఉగ్రవాద సంస్థలు కూడా దాని వెన్నంటి ఉన్నట్టే! హమాస్‌తో పాటు లెబనాన్‌లో హెజ్బుల్లా, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిషియాలు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. హౌతీ తిరుగుబాటుదారుల తడాఖా ఏమిటో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం చవిచూసింది.

గాజాపై ఇజ్రాయెల్‌ ప్రారంభించిన ప్రతీకార దాడుల తర్వాత ఇరాన్‌ ఆదేశాల మేరకు యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. యూరప్‌ – ఆసియా దేశాల మధ్య జరిగే నౌకా వ్యాపారంలో సింహభాగం సూయెజ్‌ కెనాల్‌ ద్వారానే జరుగుతుంది. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంలో 30 శాతం. విలువ లక్ష కోట్ల డాలర్లు. యూరప్‌ వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం నుంచి సూయెజ్‌ కెనాల్‌ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ‘ఆఫ్రికా కొమ్ము’ (హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా)గా పిలుచుకునే సోమాలీ ద్వీపకల్పానికి – అరబ్‌ ద్వీపకల్పానికి మధ్యనున్న సన్నని దారిగుండా బంగాళాఖాతంలోకీ, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకీ ప్రవేశిస్తాయి. 

అరబ్‌ ద్వీపకల్పానికి బంగాళాఖాతపు అంచున ఉన్న దేశం యెమెన్‌. యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులనే ‘హౌతీ’లుగా పిలుస్తున్నారు. హౌతీల దాడులకు భయపడి సూయజ్‌ నౌకా వాణిజ్యంలో 90 శాతం ఆగిపోయింది. యూరప్‌ నుంచి అట్లాంటిక్‌ సముద్రం ద్వారా ఆఫ్రికా ఖండపు ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌’ అంచును చుట్టి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఈ నౌకలకు రెండు వారాల అదనపు సమయం పట్టింది. భారీగా అదనపు వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. వాణిజ్యాల్లోని అదనపు భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారులైన ప్రజలే! హౌతీల దాడుల ప్రభావం 50 దేశాల నౌకా వాణిజ్యంపై  పడిందని గత జనవరిలోనే వైట్‌హౌస్‌ ప్రకటించింది.

ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ల మధ్యన నిజంగానే యుద్ధం ప్రారంభమైతే దాని విధ్వంసకర ప్రభావాన్ని మొత్తం ప్రపంచమే ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆ ప్రాంతపు సంక్షోభం గురించి చెప్పవలసిన అవసరమే లేదు.  ఇజ్రాయెల్‌ జరిపిన గాజా దాడుల్లోనే 40 వేలమంది చనిపోయారు. పుష్కర కాలం కింద ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. 

తీవ్రమైన మానవతా హననాన్ని ఈ ప్రాంతం చవిచూసింది. ఉన్న ఊరు విడిచిపోయినవారూ, కన్నబిడ్డల్ని అనాథల్ని చేసినవారూ లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక దశలో మధ్యధరా సముద్రపు అలల మీద శవాలు తేలియాడిన విషాద సన్నివేశాలను కూడా ప్రపంచం చూసింది. ఇక ఆర్థిక వ్యవస్థల విధ్వంసం, లక్షలాది ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లడాలు యుద్ధ దేశాల్లో షరా మామూలే!

పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతోగానీ ఎటువంటి సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. హమాస్‌ నాయకుడు ఇస్మాయెల్‌ హనియా హత్య జరిగి మూడు రోజులు గడిచినా భారతదేశం నుంచి ఖండన మండనల వంటి అధికారిక ప్రకటనలేమీ రాలేదు. ‘వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని’ పాటిస్తున్నామనుకోవాలి. నిజంగా కూడా భారత్‌ పరిస్థితి అటువంటిదే! రెండు దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయి. అంతకు మించి రెండు దేశాలతో అవసరాలు కూడా ఉన్నాయి.

ఇరాన్‌తో భారత స్నేహ సంబంధాలు తరతరాల నాటివి. ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో మిత్రదేశంగా మనం బాసటగా నిలబడనప్పటికీ ‘చాబహార్‌ పోర్టు’ నిర్మాణ బాధ్యతలను మనకే అప్పగించి సౌహార్దం చాటుకున్న దేశం ఇరాన్‌. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌తో కూడా భారత్‌ బంధం బాగా బలపడింది. భద్రత, మిలిటరీ వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య స్నేహ ఒడంబడికలున్నాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియానే తీరుస్తున్నది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్‌కు దౌత్య సంబంధాలున్నాయి.

కొన్ని లక్షలమంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రవాసులు భారత్‌కు పంపిస్తున్నారు. ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్‌కు ఆందోళన ఉంటుంది. ఇటీవలనే యూఏఈ, జోర్డాన్, గ్రీస్‌లతో కలిసి ‘ఇండియా – మిడిల్‌ ఈస్ట్‌ – యూరోప్‌ ఎకనామిక్‌ కారిడార్‌’ను కూడా భారత్‌ ప్రారంభించింది. ఉద్రిక్తతల కారణంగా ఈ నడవా ఇంకా నడకను మొదలుపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ‘ఐ టూ – యూ టూ’ ప్లాన్‌ పరిస్థితి కూడా ఇంతే!

ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి రెండు ధ్రువాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఓ కూటమి వైపు మొగ్గవలసిన పరిస్థితులుండేవి. అలీన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏకధ్రువ ప్రపంచంగా కూడా పిలువలేము. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. భౌగోళిక – రాజకీయ, భౌగోళిక – ఆర్థిక అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయుల్లోనూ ఈ వ్యూహాత్మక లేదా కీలక భాగస్వామ్య కూటములు ఏర్పాటవుతున్నాయి. 

ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్‌కున్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్‌పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్‌కు నిజంగా పీడకలే! కానీ, ఒక దేశపు దుశ్చర్యను ఖండించలేని స్థితిలో ఉన్న భారత్‌ యుద్ధాన్ని ఆపగలదని ఆశించలేము.

ఇజ్రాయెల్‌... అమెరికా మాట వింటుంది. రష్యా – చైనాల మాటను ఇరాన్‌ వినే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధాన్ని నివారించేందుకు పూనుకుంటాయా? అది సాధ్యమయ్యే పనేనా? అసలు యుద్ధం జరగకూడదని ఈ మూడు దేశాలు కోరుకుంటున్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం జరిగితే రష్యాకు పోయేదేమీ ఉండకపోవచ్చు. 

ఇరాన్, సిరియాలు మిత్ర దేశాలు. వాటికి కావలసిన ఆయుధాలను నూటికి నూరు శాతం రష్యానే ఎగుమతి చేస్తున్నది. ఇప్పటికే ఆయుధ ఎగుమతులు తగ్గిపోయిన రష్యాకు ఇదో ఊరటే! కోల్పోయిన ఒకనాటి ప్రాధాన్యత మళ్లీ ఆ ప్రాంతంలో దక్కడం కంటే కావల్సిందేముంది! ఉక్రెయిన్‌కు అండగా నిలబడిన అమెరికాకు పశ్చిమాసియాలో పాఠం చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది?

దేశాల మధ్య ఉద్రిక్తతలు, వైషమ్యాలు ఉండే పరిస్థితులపై చైనా, అమెరికాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి యుద్ధాన్ని కోరుకోకపోవచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో సైన్యం ఉన్నది. సైనిక స్థావరాలున్నాయి. ఇజ్రాయెల్‌ వంటి బలమైన శిష్య దేశాలు, సౌదీ వంటి మిత్ర దేశాలున్నాయి. వాటితో ప్రయోజనాలున్నాయి. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగడం అమెరికాకు అవసరం. ఇక్కడి బలాబలాల సమతూకం చెదిరితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది.

యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్‌కు అండగా నిలవక తప్పని స్థితి అమెరికాది. ఒకవేళ అలా నిలబడకపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఇండో – పసిఫిక్‌లో కుదిరిన ఒప్పందాల్లో భాగస్వాములు అమెరికాను విశ్వసించకపోయే అవకాశం ఉంటుంది. సొంత దేశంలోని యూదు లాబీ అభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు అమెరికా తీసుకోగలదా అన్నది కూడా సందేహమే. కనుక యుద్ధంలో అమెరికా పాత్ర ఉంటుంది.

ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్‌ తదితర దేశాలు పశ్చిమాసియాలో అమెరికాకు సన్నిహితంగా ఉంటాయి. ఈ దేశాలతో అమెరికాకు బలమైన వాణిజ్య, సహకార సంబంధాలున్నాయి. యుద్ధం ఇజ్రాయెల్‌ వర్సెస్‌ అరబ్‌ ఘర్షణగా మారితే ఈ మిత్రదేశాలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. 

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. కాన్వొకేషన్‌ కార్యక్రమాలను పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. దేశంలోని యూదు లాబీకి దీటుగా వ్యతిరేక శక్తులు కూడా బలపడుతున్న సూచనల నేపథ్యంలో ఈ యుద్ధం అధికార పార్టీ డెమోక్రట్ల పుట్టిని ఎన్నికల్లో ముంచినా ముంచవచ్చు.

ఏ రకంగా ఆలోచించినా యుద్ధ నివారణే అమెరికాకు ప్రస్తుత అవసరం. అందుకు ఇరాన్‌ను నియంత్రించవలసిన  అవసరం ఉన్నది. రష్యా సహకారంతో చైనా ఈ పని చేయాలని అమెరికా కోరిక. చైనాకు ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌’లో భాగమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ దేశాల్లో ఒప్పందాలున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక కారణాల రీత్యా చైనాకు కూడా ఆమోదయోగ్యం కాదని అమెరికా అంచనా. 

పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకొనిపోయినట్లయితే ఇండో – పసిఫిక్‌లో తమను దిగ్బంధం చేసే ప్రయత్నాలు వెనుకడుగు వేస్తాయని చైనా దౌత్య నిపుణులు అంచనా వేసుకుంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇస్మాయెల్‌ హనియా హత్యను కూడా చైనా గట్టిగానే ఖండించింది. ఈ కోణంలో చూసినప్పుడు యుద్ధ నివారణకు చైనా చొరవ చూపే అవకాశాలు చాలా తక్కువ.

పెత్తందారీ దేశాల ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నా పశ్చిమాసియా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక మందుపాతర లాగా కనిపిస్తున్నది. పర్షియా, మెసపుటోమియా, ఫొనీషియన్, ఈజిప్టు నైలునదీ నాగరికతలు విలసిల్లిన చారిత్రక ధన్యభూమి ఇప్పుడు దగ్ధగీతాన్ని వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో పశ్చిమాసియా వాటా రెండున్నర శాతం దాటదు. 

కానీ 30 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ప్రాంతం ఇదే! సగటున తొమ్మిది శాతం జీడీపీని ఈ దేశాలు ఆయుధాల కోసం తగలేస్తున్నాయి. రష్యా మార్కెట్‌ ఇరాన్, సిరియాలు మాత్రమే! మిగతా మార్కెటంతా అమెరికాదే! ఈ దేశాలు ఆయుధాల మీద ఏటా వెచ్చిస్తున్న ఐదు లక్షల కోట్ల రూపాయల్లో భీముని వాటా అమెరికాదే. ఒకపక్క తుపాకులు చేరవేస్తూ, ‘కాల్చుకోకండి ప్లీజ్‌... జస్ట్‌ ఆడుకోండి’ అంటే కుదురుతుందా? అందుకే అమెరికా శాంతి ప్రబోధాలకు పెద్దగా విలువ ఉండదు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement