ఇరాన్‌-ఇజ్రాయెల్‌ దాడులు.. వీళ్ల వైరం ఏనాటిది! | weekly roundup: Iran and israel countries conflict Reasons | Sakshi
Sakshi News home page

weekly roundup: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ దాడులు.. వీళ్ల వైరం ఏనాటిది!

Published Sun, Aug 4 2024 8:46 AM | Last Updated on Sun, Aug 4 2024 8:48 AM

weekly roundup: Iran and israel countries conflict Reasons

పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్‌ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్‌–22 ఫైటర్‌ జెట్‌ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. అయితే.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు! దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం మొదలైంది.

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్లో ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్‌ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్‌ నేతలతో పాటు పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్‌ కూడా ధ్రువీకరించింది.

హనియేను ఇజ్రాయెల్‌ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్‌ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్‌ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్‌ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్‌ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్‌ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యొవ్‌ గలాంట్‌ ప్రకటించారు.

గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్‌ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్‌ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్‌ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్‌ నమ్ముతోంది.

హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్‌ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ అన్నారు.

మరోవైపు..  హెజ్బొల్లా మిలిటరీ కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌ను ఇజ్రాయెల్‌ హతమొందించింది. ఇజ్రాయెల్‌ ఆక్రమిత గోలన్‌ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్‌ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్‌ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌ రాకెట్‌ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్‌ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్‌ ఆ దేశ వాంటెడ్‌ లిస్టులో ఉన్నాడు.

హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్‌ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్‌ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్‌ తేలి్చచెప్పినట్లు వివరించింది.  

ఇస్మాయిల్‌ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్‌ సైన్యమేనని ఇరాన్, హమాస్‌ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్‌ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’తో మాట్లాడుతూ చెప్పారు.

హమాస్‌ మిలటరీ విభాగం ‘ఖస్సం బ్రిగేడ్స్‌’ అధి నేత మొహమ్మద్‌ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్‌ దీఫ్‌ మృతిని ఇజ్రాయెల్‌ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య శత్రుత్వం!
గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్‌ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్‌ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్‌ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్‌ చివరి చక్రవర్తి మొహమ్మద్‌ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్‌ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్‌-టెల్‌ అవీవ్‌ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు.

ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది. టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎ‌ల్ఓ)కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్‌లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’ గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ షాడో వార్‌కు లెబనాన్‌, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్‌ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్‌ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు కూడా ఇరాన్‌ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. నాటి నుంచి సిరియా, లెబనాన్‌పై దాడులు జరిపేందుకు గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ ఉపయోగించుకుంటుంది.

1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మకపోవడం గమనార్హం. 

ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానికి కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలిచింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.

గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్‌ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్‌ నగరాలపై హమాస్‌ దాడిని స్వాగతించింది. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1న ఇజ్రాయెల్‌కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్‌ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్‌ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement