
అంటార్కిటికాలో ప్రమాదకర పరిణామం
మంచు కరుగుదలే ప్రధాన కారణం
వాతావరణ సమతుల్యతకు కీలకమైన ఏసీసీ
ఇంకా నెమ్మదిస్తే ప్రపంచమంతా విపత్తులే
‘క్లైమేట్ చేంజ్’ విపరిణామానికి నిదర్శనం
పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు ఎన్నడూ లేనంత వేగంతో కరిగిపోతుండటం కొన్నేళ్లుగా మనమంతా చూస్తున్న భయానక పరిణామమే. ఇది మరో పెను ప్రమాదానికి కూడా దారి తీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటార్కిటికాలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహ గతి కొన్నేళ్లుగా క్రమంగా నెమ్మదిస్తూ వస్తోందని వెల్లడించింది.
అంటార్కిటికా వద్ద భారీ మంచు ప్రమాదకర వేగంతో కరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని క్రమబదీ్ధకరించడంలో ఈ ప్రవాహానిదే అతి కీలకపాత్ర. అంతేగాక మహాసముద్రాల ప్రవాహాల గతి కూడా చాలావరకు ఈ ప్రవాహ గతిమీదే ఆధారపడి ఉంటుంది. ‘‘లక్షలాది ఏళ్లుగా సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రవాహం కూడా పర్యావరణ మార్పుల దెబ్బకు గాడి తప్పుతుండటం అత్యంత ఆందోళనకరం. ఇదిలాగే కొనసాగితే మానవాళి ఊహాతీతమైన పర్యావరణ విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధ్యయనం హెచ్చరించింది.
ఏసీసీ... పెట్టనికోట!
ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు అంటార్కిటికా అత్యంత కీలకమైనది. అంటార్కిటిక్ సర్కంపొలార్ కరెంట్ (ఏసీసీ)గా పిలిచే అక్కడి మహాసముద్ర ప్రవాహం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన సముద్ర ప్రవాహం! పశ్చిమం నుంచి తూర్పుగా అంటార్కిటికా మహాసముద్రం పొడవునా సాగే ఈ ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని, ఇతర సముద్ర ప్రవాహాల గతిని నిత్యం నియంత్రిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రధానంగా వేటాడే తత్వముండే ఇతర ప్రాంతాల్లోని సముద్ర జీవరాశులు అంటార్కిటికా జలాల్లోకి ప్రవేశించకుండా ప్రాకృతిక అడ్డుగోడలా కూడా ఏసీసీ నిలుస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే మానవాళి మనుగడకు ఇది పెట్టనికోట వంటిది. గ్లోబల్ వార్మింగ్ తదితరాల దెబ్బకు అంటార్కిటికాలోని అపారమైన మంచు కొన్నేళ్లుగా శరవేగంగా కరుగుతోంది. దాంతో అపార స్వచ్ఛ జలరాశి నిరంతరం సముద్రంలోకి పోటెత్తుతోంది. దాని దెబ్బకు అంటార్కిటికా మహాసముద్రంలో లవణీయత, నీటి సాంద్రత మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఇదంతా అంతిమంగా ఏసీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ప్రవాహ గతి నానాటికీ నెమ్మదిస్తూ వస్తోంది.
ఇలా చేశారు
ఏసీసీ ప్రవాహ గతిలో మార్పు లపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌కు చెందిన పరిశోధకుల బృందం పరిశోధన చేసింది. అధ్యయనంలో భాగంగా పలు అంశాలపై సైంటిస్టులు లోతుగా దృష్టి పెట్టారు. ఆ్రస్టేలియాలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ జీఏడీఐ సాయంతో సముద్ర ప్రవాహాల్లో మార్పులు తదితరాలను కచి్చతంగా లెక్కగట్టారు. హెచ్చు రెజల్యూషన్‌తో కూడిన సముద్ర, యాక్సెస్–ఓఎం2–01 క్లైమేట్ మోడల్ సేవలను కూడా ఇందుకు వాడుకున్నారు.
మహాసముద్ర ప్రవాహాలపై మంచు, స్వచ్ఛ జలరాశి ప్రభావం, తద్వారా వేడిని మోసుకుపోయే సామర్థ్యంలో హెచ్చుతగ్గులు తదితరాలను నిశితంగా పరిశీలించారు. అంతిమంగా ఇవన్నీ ఉష్ణోగ్రత, లవణీయత, పవనాల గతి తదితరాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో గమనించారు. మంచు కరిగి సముద్రంలోకి చేరే అపార జలరాశి ఏసీసీ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుందన్న గత పరిశోధనల ఫలితాలు సరికావని స్పష్టం చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఏసీసీ ప్రవాహ గతి బాగా నెమ్మదిస్తోందని తేల్చారు. తాజా పరిశోధన ఫలితాలను ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించారు.
పెను విపత్తులే...!
ఏసీసీ ఒకరకంగా ప్రపంచ వాతావరణ సమతుల్యతకు ఇంజిన్ వంటిదని అధ్యయన బృంద సభ్యుడైన అసోసియేట్ ప్రొఫెసర్ భిషగ్దత్త గయేన్ వివరించారు. ‘‘మహాసముద్రాలన్నింటికీ కన్వేయర్ బెల్ట్ మాదిరిగా ఏసీసీ పని చేస్తుంది. వేడిమి, కార్బన్ డయాక్సైడ్‌తో పాటు సముద్రంలోని జీవరాశుల మనుగడకు అత్యంత కీలకమైన పలు పోషకాలు తదితరాలు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ తదితర మహాసముద్రాల మధ్య సజావుగా పంపిణీ అయ్యేలా చూస్తుంది. అది గనక పడకేసిందంటే జరిగే విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు’’ అని ఆయన స్పష్టం చేశారు. అవేమిటంటే...
→ ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు
→ పలు ప్రాంతాల్లో అత్యంత వేడిమి, ఆ వెనకే అతి శీతల పరిస్థితులు
→ సముద్ర జలాల్లో లవణీయత పరిమాణం నానాటికీ తగ్గిపోవచ్చు
→ ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోవచ్చు
→ ఇతర ప్రాంతాల సముద్ర జలాలకే పరిమితమైన నాచు, కలుపు మొక్కలు, మొలస్కా వంటి జీవులు అంటార్కిటికాలోకి ప్రవేశించవచ్చు. అదే జరిగితే అక్కడి జీవావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇవి అంతిమంగా పెంగి్వన్ల వంటి స్థానిక జీవరాశుల ఆహార వనరులకు కూడా ఎసరు పెట్టవచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment