Ice berg
-
చల్లచల్లని కూల్ కూల్
ఈ వేసవిలో ఆకాశానికి ఏసీ బిగిస్తే? మనం నడుస్తూ ఉంటే గాలి గొడుగు పడితే? కూర్చున్న చోటు చల్లని మందిరంగా మారితే? అసలు వేసవి మొత్తం కూల్ కూల్‌గా అనిపిస్తే? నిజంగా ఎలాగూ జరగదు. ఘోరమైన ఎండల్లో మాడక తప్పదు. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగి ఇలాంటి ఊహలు చేసి ఆనందిస్తున్నారు జనం. మార్తాండుడి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే ఎండాకాలంలో. వట్టివేర్లు కిటికీలకు కట్టుకునేవారు, కూల్ పెయింట్ చేయించుకునేవారు, గోతాం పట్టాలు కట్టుకుని నీళ్లు చల్లుకునేవారు, ఏసీలు కొనుక్కునేవారు, కూలర్లు రిపేర్లు చేయించుకునేవారు, కొబ్బరి మట్టలతో పందిరి వేసుకునేవారు... చల్లదనం కోసం ఎన్నో మార్గాలు. అయితే మన నెత్తి మీదే ఎప్పుడూ ఫ్యాన్ ఉండాలని, మనం ఎక్కడ కూచున్నా జిల్లుమనాలని అత్యాశ కూడా ఉండొచ్చు. ‘ఇలాంటి ఆశలు మాకున్నాయి. అవి తీరినట్టుగా ఫొటోలు చేసి చూపించు’ అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగితే అది తయారు చేసిన ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నెత్తి మీద ఐసు గడ్డల హెల్మెట్ ఉన్న అవ్వ, ఐసు బల్ల మీద కూచుని టూరిస్ట్‌లు, ఐసు స్కూటర్ మీద రివ్వున దూసుకెళ్లే అమ్మాయి, ఒళ్లంతా ఫ్యాన్లు మొలిచిన గరీబు... ఇవన్నీ ఏ.ఐ చూపించి ఐసు వాటర్ తాగిన ఫీలింగ్ కలిగించింది. -
తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత?
హిమాలయాల్లో భూమి పొరల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మనల్ని భయపెడుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన నెలకొంది. తుర్కియే, సిరియాల్లో భూకంపం మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్‌లను త్వరలోనే పెను భూకంపం అతలాకుతలం చేస్తుందన్న అంచనాలున్నాయి. ఇంతకీ భారత్‌కి ఉన్న ముప్పు ఎంత ? నేలకింద భూమి ఉన్నట్టుండి కదిలిపోతే, మిన్ను విరిగి మీదపడినట్టు ఆకాశన్నంటే భవనాలు కుప్పకూలిపోతే, మన నివాసాలే సమాధులుగా మారి మనల్ని మింగేస్తే ఆ ప్రకృతి విలయం ఎంత భయంకరం..? తుర్కియే, సిరియాల్లో కుదిపేసిన పెను భూకంపంతో భారత్‌కు భూకంపం ముప్పు ఎంత అనే చర్చ జరుగుతోంది. తుర్కియే భూకంపాన్ని ముందే అంచనా వేసిన డచ్ అధ్యయనకారుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో త్వరలో భూకంపం వస్తుందని హెచ్చరించడం గుబులు రేపుతోంది. మన దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. తీవ్ర ముప్పులో ఢిల్లీ ఢిల్లీ, దాని పక్కనే ఉన్న గురుగ్రామ్‌కు భూకంప ముప్పు అత్యంత ఎక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూపొరల్లో ఫలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్‌గా ఉన్న సొహనా, మథుర, ఢిల్లీ–మొరాదాబాద్ వల్ల కూడా ఢిల్లీ ప్రమాదంలో ఉంది. హిమాలయాలు యమాడేంజర్ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలను పెను భూకంపంతో అతలాకుతలం చేసే భూకంప కేంద్రం హిమాలయాలేనని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాల్లో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయాలే అని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో 2,400 కి.మీ. పొడవునా హిమాలయాల్లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉండే అవకాశం ఉంది. హిమాలయ భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్‌పై 700 ఏళ్లుగా అత్యంత ఒత్తిడి ఉంది. ఫలకాలు కదులుతూ ఉండడం వల్ల అంచులపై ఒత్తిడి పెరిగిపోతూ వస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా భూకంపం రావొచ్చు లేదంటే 200 ఏళ్ల తర్వాత తర్వాతైనా రావచ్చునని, ఇది మధ్య హిమాలయాలపై పెను ప్రభావం చూపిస్తుందని 2016లోనే శాసవ్రేత్తలు హెచ్చరించారు. హిమాలయాల్లో కంగారాలో 1905లో భూకంపం వచ్చింది. 1934లో హిమాలయ కేంద్రంగా నేపాల్, బిహార్‌లో భూకంపానికి 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశిలో వచ్చిన భూకంపంలో 800 మంది మరణించారు. ఇక 2005లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంభవించిన భూకంపానికి 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాలు కాకుండా 2001లో గుజరాత్లో కచ్‌లో వచ్చిన భూకంపంలో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. భారత్, యూరోషియన్ ప్లేట్స్ తరచూ రాపిడి కారణంగా చిక్కుకుపోతూ ఉండడంతో హిమాలయాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోలజీలో జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ వివరించారు. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కశ్మీర్లో హిమపాతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో బుధవారం మంచు చరియల కింద చిక్కుకుని ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంచు కింద చిక్కుకుపోయిన మరో 21 మందిని పోలీసులు కాపాడారు. 21 మంది పోలండ్, రష్యా దేశస్తులు, ఇద్దరు స్థానిక గైడ్లు మూడు బృందాలుగా ఏర్పడి ప్రఖ్యాత స్కై రిసార్ట్ హపట్‌ఖుడ్ కాంగ్డోరి వద్ద ఉండగా భారీ 20 అడుగుల పొడవైన మంచు పెళ్ల వారికిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఈ ఘటనలో మంచు కింద చిక్కుబడిన ఇద్దరు పోలండ్ జాతీయులు చనిపోగా, మిగతా వారినందరినీ కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిషేధ హెచ్చరికలు ఏర్పాటు చేశామన్నారు. -
హిమగర్భంలో భారీ ఉల్క
న్యూఢిల్లీ: అంటార్కిటికాలో దట్టమైన మంచు గర్భంలో 7.6 కిలోల బరువైన ఉల్కను అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వెలికితీసింది. మంచు ఖండంలో ఇంతటి భారీ ఉల్క దొరకడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. గత డిసెంబర్ 11 నుంచి నెల రోజుల పాటు జరిపిన అన్వేషణలో మరిన్ని చిన్న సైజు ఉల్కలు కూడా దొరికాయి. శాటిలైట్ ఇమేజీలు, జీపీఎస్ సాయంతో వీటి జాడను కనిపెట్టారు. ‘‘ఇవి బహుశా ఏదో ఆస్టిరాయిడ్ నుంచి రాలి పడి ఉంటాయి. వేలాది ఏళ్లుగా మంచు గర్భంలో ఉండిపోయాయి. వీటిని పరిశోధన నిమిత్తం బ్రెసెల్స్కు పంపాం. అందులో భూమి ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. -
80 శాతం గ్లేసియర్లు... 80 ఏళ్లలో మాయం!
వాషింగ్టన్: భూ గోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందుగానే ముంచుకొస్తుందా? హిమానీ నదాలపై తాజా అధ్యయనం ఫలితాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని సదరు అధ్యయనం తేల్చింది! గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు బాగా ఫలించినా 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది. ‘‘సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మటుమాయమవుతాయి’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రౌన్స్ చెప్పారు. ‘‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు. ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్రభావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అన్నారు. -
అమెరికాను ముంచేసిన మంచు.. 60 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో హిమోత్పాతం దేశాన్ని గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. One car tried to drive my hill and Queen Anne and hit all these parked cars who clue down the hill… insane. DON’T DRIVE. #seattle pic.twitter.com/wJsor6byDa — Kaybergz (@kay0kayla) December 23, 2022 కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది. ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్ సబ్ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది. My dads places in Crystal Beach after the winter storm pic.twitter.com/BnntAihoMz — Bat Boy Slim (@TerjeOliver) December 26, 2022 -
మంచు గుప్పెట్లోనే అమెరికా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే పౌరులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దారుణమైన వాతావరణ పరిస్థితులను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని న్యూయార్క్‌వాసులు చెబుతున్నారు. బఫెలో తదితర చోట్ల హరికేన్లను తలపించే గాలులు ప్రజల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. రోడ్లు, రన్‌వేలపై ఏకంగా 50 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. దాంతో పలు విమానాశ్రయాలను రెండు రోజుల పాటు మూసేశారు. శని, ఆదివారాల్లో కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. అయితే పలుచోట్ల పరిస్థితిని అధికారులు క్రమంగా చక్కదిద్దుతున్నారు. బహుశా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగు పడొచ్చని భావిస్తున్నారు. -
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
వేసవి గ్లేసియర్
ఇటలీలో మంచుదిబ్బలు, మండుటెండలు జోడీగా ఉంటాయి. ఇప్పుడక్కడ సమ్మర్. కొద్ది కొద్దిగా హీటెక్కుతోంది. జూలైలో నడివేసవి. భగభగలు మొదలౌతాయి. వేడి 42 కి రీచ్ అవుతుంది. అది గరిష్టం. జనం ఏసీలు కప్పుకుంటారు. మంచు దిబ్బలకే ప్రాబ్లమ్. ఎండ తీవ్రతకు కరుగుతుంటాయి పాపం. అవి ఉంటేనే స్కీయింగ్, కేబుల్ కార్ స్వారీయింగ్. ఆటల కోసం కాకున్నా మంచును మంచుగానే ఉంచడం కోసం ప్రతి వేసవిలో ఈ దిబ్బలపై టార్పాలిన్లు కప్పి మంచు కరిగే వేగాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రసేనా గ్లేసియర్ (మంచుదిబ్బ) పై టార్పాలిన్ వస్త్రాన్ని పరుస్తున్నారు. ఈ ఏడాది మరికొంచెం ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. అంత భారీ ఏక వస్త్రం దొరకడమూ కష్టమే, పరవడమూ కష్టమే. అందుకే 70 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండే టార్పాలిన్ షీట్లను కలిపి కుట్టి, ప్రసేనా గ్లేసియర్‌పై పరిచి, పొడిగాలులకు ఎగరకుండా ఇసుక బస్తాల బరువు పెడుతున్నారు. ప్రకృతి నుంచి ప్రకృతిని కాపాడుకోడానికి మనిషి పడుతున్న పాట్లు ఇవి. 1993 నుంచి ఇప్పటివరకు ప్రసేనా గ్లేసియర్‌లో మూడో వంతు భాగం ఎండల వేడికి తగ్గిపోతూ వచ్చింది. -
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
కేప్‌టౌన్‌కు ఐస్‌బర్గ్స్ ఉపశమనం..!!
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఏర్పడిన తీవ్ర నీటి కొరతను తగ్గించేందుకు మెరైన్ నిపుణులు ఆ దేశ ప్రభుత్వం ముందు పరిష్కారాన్ని ఉంచారు. అంటార్కిటికా ఖండం నుంచి భారీ మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకువచ్చి, కరువు ప్రాంతాల్లోని నీటి కుంటలు, సరస్సులు, నదుల్లో వాటిని కరిగించాలనేది ప్రతిపాదన. 20వ శతాబ్దంలోనే అతిపెద్ద కరువుగా కేప్‌టౌన్ కరువును అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే. మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకురావడ తప్ప కరువుకు మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. 2015 నుంచి కేప్‌టౌన్‌లో తీవ్రదుర్భిక్షం నెలకొంది. దీంతో ఈ కరువును దక్షిణాఫ్రికా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కేప్‌టౌన్‌లో ఇప్పటికే నీటిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోతే తాగునీరు పూర్తిగా లేకుండా పోయే ప్రమాదం ఉంది. అనుమతిస్తే అంటార్కిటికా నుంచి మంచు తునకలను త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని కేప్‌టౌన్‌కు తీసుకువస్తామని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నివేదించారు. ఒక భారీ ఐస్‌బర్గ్ ఏడాది పాటు కరుగుతూ రోజుకు 150 మిలియన్ లీటర్ల తాగునీటిని ఇస్తుందని పేర్కొన్నారు.