వాషింగ్టన్: భూ గోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందుగానే ముంచుకొస్తుందా? హిమానీ నదాలపై తాజా అధ్యయనం ఫలితాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని సదరు అధ్యయనం తేల్చింది! గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు బాగా ఫలించినా 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది.
‘‘సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మటుమాయమవుతాయి’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రౌన్స్ చెప్పారు. ‘‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు. ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్రభావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment