Glaciers
-
గ్లేసియర్ టూరిజం... ప్రాణాంతకం!
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది. హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...! వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు. కరిగే మంచు.. పెను ముప్పు సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్‌జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్‌కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు! ఎన్నెన్ని విషాదాలో...! → 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్‌లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్. → 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు. → 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు. → 2023లో ఐస్లాండ్లోని ఓ గ్లేసియర్‌లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్లాండ్లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ITGC Thwaites Glacier: ‘ప్రళయ’ గ్లేసియర్తో... విలయమే!
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్‌డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది. ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్‌కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది! అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్‌డే (ప్రళయకాల) గ్లేసియర్‌గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్‌వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్‌బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు... → డూమ్స్‌డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. → మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది. → అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్‌డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది. → డూమ్స్‌డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
India Environment Report – 2024: హిమగిరులకు పెనుముప్పు!
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది. నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్ అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్‌డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిమానీ నదాలు శరవేగంగా కనుమరుగు! విస్మయకర వాస్తవాలు వెలుగులోకి
హిమాలయాల్లో హిమానీ నదులు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఎంతగా అంటే, గత 20 ఏళ్లలో కరిగిపోయిన హిమానీ నదాల పరిమాణం ఏకంగా 57 కోట్ల ఏనుగుల బరువుతో సమానమట! అంటే హీనపక్షం 170 కోట్ల టన్నుల పై చిలుకే...! ఈ ప్రమాదకర పరిణామాన్ని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అతి తొందర్లోనే హిమాలయాల్లో పెను మార్పులు చూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు... 2000 నుంచి 2020 మధ్య కేవలం 20 సంవత్సరాల్లో హిమాలయాల్లో ప్రోగ్లేషియల్ సరస్సులు ఏకంగా 47 శాతం పెరిగాయి. సరస్సుల సంఖ్య పెరిగితే మంచిదే కదా అంటారా? కానే కాదు. ఎందుకంటే హిమానీ నదాలు కరిగిపోయి కనుమరుగయ్యే క్రమంలో ఏర్పడే సరస్సులివి! ఇవి ఎంతగా పెరిగితే హిమానీ నదాలు అంతగా కుంచించుకుపోతున్నట్టు అర్థం! ఈ పరిణామామంతా చాలావరకు భూమి పై పొరకు దిగువన జరుగుతుంది గనుక ఇంతకాలం పర్యావరణవేత్తల దృష్టి దీనిపై పడలేదు. కానీ ఈ సరస్సుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ఈ పరిణామంపై వాళ్లు ఇటీవలే దృష్టి సారించారు. హిమాలయాల్లో కరిగిపోతున్న హిమనీ నదాల పరిమాణాన్ని తొలిసారిగా లెక్కగట్టగా ఈ విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లోని సెయింట్ ఆండ్రూస్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కార్నిగీ మెలన్ వర్సిటీలకు చెందిన రీసెర్చర్ల బృందంలో ఇందులో పాల్గొంది. అధ్యయన ఫలితాలను నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘హిమాలయాల వద్ద భూ ఫలకాలు అత్యంత చురుగ్గా ఉంటాయి. నిత్యం కదలికలకు లోనవుతూ ఉంటాయి. దాంతో హిమానీ నదాల ప్రవాహ మార్గాలు తరచూ మారిపోతున్నాయి’’ అన్నారు. హిమాలయాల్లో 6.5 శాతం తగ్గిన మంచు ♦ తాజా అధ్యయనం పలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైనవి... ♦ కనుమరుగవుతున్న హిమానీ నదాల రూపంలో గ్రేటర్ హిమాలయాలు ఇప్పటికే తమ మొత్తం మంచులో 6.5 శాతాన్ని కోల్పోయాయి. ♦ మధ్య హిమాలయాల్లో హిమానీ నదాల అంతర్థానం చాలా వేగంగా కొనసాగుతోంది. ♦ గాలోంగ్ కో హిమానీ నదం ఇప్పటికే ఏకంగా 65 శాతం కనుమరుగైంది. ♦ హిమాలయాల్లో 2000–2020 మధ్య ప్రోగ్లేషియల్ సరస్సుల సంఖ్యలో 47 శాతం, విస్తీర్ణంలో 33 శాతం, పరిమాణంలో 42 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది ♦ ఇందుకు కారణం హిమాలయాల్లోని హిమానీ నదుల పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 1.7 గిగాటన్నుల మేరకు తగ్గిపోవడమే. అంటే 1.7 లక్షల కోట్ల కిలోలన్నమాట! ఇది భూమిపై ఉన్న మొత్తం ఏనుగుల బరువుకు కనీసం 1,000 రెట్లు ఎక్కువ!! ♦ ఈ ధోరణి 21వ శతాబ్దం పొడవునా కొనసాగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ♦ ఫలితంగా హిమాలయాల్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా హిమానీ నదాలు ప్రస్తుతం భావిస్తున్న దానికంటే అతి వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
80 శాతం గ్లేసియర్లు... 80 ఏళ్లలో మాయం!
వాషింగ్టన్: భూ గోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందుగానే ముంచుకొస్తుందా? హిమానీ నదాలపై తాజా అధ్యయనం ఫలితాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని సదరు అధ్యయనం తేల్చింది! గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు బాగా ఫలించినా 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది. ‘‘సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మటుమాయమవుతాయి’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రౌన్స్ చెప్పారు. ‘‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు. ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్రభావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అన్నారు. -
ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లండ్‌తో పాటు పలు యూరప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది! 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు! సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్‌లోని కోస్టా డెల్‌సోల్‌తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ అర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. అతి సున్నిత ప్రాంతం నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది. పెను ప్రమాదమే...! సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు... ► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి ► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి ► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. ► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది ► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి ► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది ► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది ► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం.. వైరల్ వీడియో
-
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
అతిపెద్ద ఐస్‌బర్గ్ అంతర్ధానం!
వాషింగ్టన్: భూతాపానికి ఫలితం ఈ ఉదాహరణ. అంటార్కిటికాలోని అట్లాంటిక్ తీరప్రాంతంలో ఉన్న రొన్నే మంచు పలక నుంచి విడివడిన ఒక భారీ ఐస్‌బర్గ్ త్వరలోనే కనుమరుగు కానుంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఐస్‌బర్గ్ 2021 మేలో విడిపోయాక మరో మూడు ముక్కలైంది. అమెరికాకు చెందిన టెర్రా ఉపగ్రహం ఈ ఐస్బర్గ్లోని అతిపెద్ద భాగం ఫొటో తీసింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం పయనించిన ఈ ఐస్‌బర్గ్ భారీ శకలం ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలోని కేప్ హార్న్‌కు, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్ దీవులు, ఎలిఫెంట్ దీవులకు మధ్యలోని డ్రేక్ పాసేజీలో ఉంది. ఎ–76ఎ గా పిలుస్తున్న దీని పొడవు 135 కిలోమీటర్లు కాగా వెడల్పు 26 కిలోమీటర్లు.. లండన్ నగరానికి ఇది రెట్టింపు సైజు అని అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది తన ఆకారాన్ని కోల్పోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, భూమధ్య రేఖ వైపు పయనించి అక్కడి సముద్ర జలాల వేడికి త్వరలోనే అంతర్థానం కానుందని అంటున్నారు. ఐస్‌బర్గ్‌లను సర్వసాధారణంగా బలమైన ఆర్కిటిక్ ప్రవాహాలు డ్రేక్ పాసేజ్ గుండా ముందుకు తోసేస్తాయి. అక్కడి నుంచి అవి ఉత్తర దిశగా భూమధ్య రేఖ వైపు పయనించి వేగంగా కరిగిపోతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
Virus spillover: తర్వాతి వైరస్ మహమ్మారి రాక...హిమానీ నదాల నుంచే!
లండన్: వాతావరణ మార్పులు ప్రపంచమంతటా కనీవినీ ఎరగని ఉత్పాతాలకు దారి తీస్తున్న వైనం కళ్లముందే కన్పిస్తోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో ఎన్నడూ చూడనంతటి వరద విల యం సృష్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, వాతావరణ మార్పుల దుష్ప్రభావం మరో తీవ్ర ప్రమాదానికి కూడా దారితీసే ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత స్థాయి శరవేగంగా పెరుగుతుండటంతో హిమాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలన్నీ అంతే వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. ‘‘ఈ హిమానీ నదాల గర్భంలో బహుశా మనకిప్పటివరకూ తెలియని వైరస్‌లెన్నో దాగున్నాయి. హిమానీ నదాల కరుగుదల వేగం ఇలాగే కొనసాగితే భూమిపై విరుచుకుపడబోయే తర్వాతి వైరస్ మహమ్మారి వచ్చేది గబ్బిలాల నుంచో, పక్షుల నుంచో కాక.. నదాల గర్భం నుంచే అది పుట్టుకురావచ్చు’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే వైరస్లు వన్యప్రాణులకు, అక్కణ్నుంచి మనుషుల్లో ప్రబలుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని వైరస్ స్పిలోవర్గా పిలుస్తున్నారు. ఇందుకోసం ఆర్కిటిక్‌లోని మంచినీటి సరస్సు లేక్ హాజెన్ తాలూకు మన్ను, మడ్డి తదితరాలను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. అవశేషాల తాలూకు ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలను వైరస్‌లతో జతపరిచి చూశారు. హిమానీ నదీ గర్భాలు బయటికి తేలే పక్షంలో, అక్కడి కళేబరాల నుంచి తెలియని తరహా వైరస్లు వచ్చి పడే ప్రమాదముందని తేల్చారు. అధ్యయన ఫలితాలను రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించారు. -
‘థ్వాయిట్స్ హిమానీనదం’.. కరిగిపోతే ప్రళయమే!
సాక్షి, నేషనల్ డెస్క్: థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. ఈ గ్లేసియర్తోపాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరిగి, తీర ప్రాంతాలు చాలావరకు నీట మునిగి నామరూపాల్లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. థ్వాయిట్స్ తాజా స్థితిగతులపై అమెరికా, యూకే, స్వీడన్ సైంటిస్టులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత 200 ఏళ్లలో కరిగిన దానికంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువ వేగంగా కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ జియోసైన్స్’ పత్రికలో ప్రచురించారు. సైంటిస్టులు అత్యాధునిక పరికరాలతో థ్వాయిట్స్ గ్లేసియర్ పరిమాణాన్ని గణించారు. ప్రతిఏటా 1.3 మేళ్లకుపైగా(2.1 కిలోమీటర్ల) కరిగిపోతున్నట్లు తేల్చారు. ‘‘గ్లేసియర్ చివరి దశకు చేరుకుంటోందని చెప్పొచ్చు. సమీప భవిష్యత్తులో పెద్ద మార్పులను మనం అంచనా వేయొచ్చు’’ అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన మెరైన్ జియోఫిజిసిస్ట్ రాబర్ట్ లార్టర్ చెప్పారు. ఐరాస సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం సముద్ర తీరాలకు 60 మైళ్ల పరిధిలోనే నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరిగితే సమీపంలోని ఆవాసాలు మునిగిపోతాయి. మనుషులకు, ఇతర జీవజాలానికి పెను ముప్పు తప్పదు. గ్రేట్ బ్రిటన్ అంత పెద్దది! ► పశ్చిమ అంటార్కిటికాలోని థ్వాయిట్స్ గ్లేసియర్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మొత్తం పరిమాణం కంటే కొంత తక్కువ పరిమాణంలో ఉంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంతో దాదాపు సమాన పరిమాణంలో ఉంటుంది. ► గ్లేసియర్ మొత్తం చుట్టుకొలత 74,131 చదరపు మైళ్లు(1,92,000 చదరపు కిలోమీటర్లు). అంటే గ్రేట్ బ్రిటన్ చుట్టుకొలతతో సమానం. ► ఇక దీని మందం ఎంతంటే 4,000 మీటర్లు (13,100 అడుగులు). ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో థ్వాయిట్స్ వాటానే అధికం. ► థ్వాయిట్స్ మొత్తం మందం 4 కిలోమీటర్లు కాగా, ఇందులో రెండు కిలోమీటర్లకు పైగా సముద్ర ఉపరితలం నుంచి దిగువ భాగాన ఉంది. ► థ్వాయిట్స్ హిమానీనదం పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటిమట్టం దాదాపు మూడు మీటర్ల మేర(10 అడుగులు) పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇదీ చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం -
మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే!
వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. పాకిస్తాన్లో వరద బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్‌లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ అదే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది. గత జూన్‌లో ఏర్పాటు చేసిన డిశ్చార్జ్ మెజరింగ్ వ్యవస్థ ఆగస్టుకల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్ట్ మహమ్మద్ ఫరూక్ ఆజం చెప్పారు. ‘‘గత మార్చి, ఏప్రిల్‌లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. గత వారం మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీక్షించాం. మంచు భారీగా కరిగిపోతోంది’’ అంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అరేబియా సముద్రంలో అత్యధిక వేడిమి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి పాక్‌ను అతలాకుతలం చేస్తోంది’’ అన్నది శాస్త్రవేత్తల వివరణ. హిమాలయాలు కరిగిపోతే...? గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింది! దక్షిణాసియా దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేనంటున్నారు. కారకోరం, హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 55 వేల హిమానీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయి. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్ స్టేషన్లున్నాయి. హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో పాకిస్తాన్ వాటా కేవలం 1 శాతమే. కానీ వాతావరణ మార్పులు ఇప్పుడు ఆ దేశాన్ని బలి తీసుకుంటున్నాయి. చైనాలో కరువు సంక్షోభం ► 17 ప్రావిన్స్‌లలో వరసగా 70 రోజుల పాటు ఎండలు దంచిగొట్టాయి. వడగాడ్పులకి 90 కోట్ల మంది అవస్థలు పడ్డారు ► చైనాలో ఏకంగా సగ భాగంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి ► చైనాలో అతి పెద్ద నది యాంగ్జె ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. 1865 తర్వాత ఈ నది నీటిమట్టం బాగా తగ్గిపోవడం మళ్లీ ఇప్పుడే. ► చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లైన హుబై, జియాంగ్జీ, అన్‌హుయాయ్, సిచుయాన్‌లలో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి ► చైనాలో జల విద్యుత్‌లో 30శాతం సిచుయాన్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది ► చైనాలో కరువు పరిస్థితులు 25 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తే, 22 లక్షలకు పైగా హెక్టార్లలో వ్యవసాయ భూమి ఎండిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంచుకొస్తున్న మరో ముప్పు.. పాక్ జలసమాధి కానుందా?
దాయాది దేశం పాక్‌కు మరో ఉపద్రవం వచ్చి పడనుంది. ఇది ఊహ కాదు.. తీవ్ర హెచ్చరికలు. ఇప్పటికే తీవ్ర వర్షాలు, భారీ వరదలతో మూడింట వంతు పాక్ నీటిలోనే ముగినిపోయి ఉంది. వెయ్యి మందికిపైగా ప్రాణాలు.. మూడు కోట్ల మంది నిరాశ్రయలు అయ్యారు. అయితే.. రాబోయే రోజుల్లో మరో భారీ ముప్పు పాక్‌కు పొంచి ఉందని భారత సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది భారత్‌కు సైతం పరోక్ష హెచ్చరికగా పేర్కొంటున్నారు. సాధారణంగా వర్షాకాలపు సీజన్ కంటే.. ఈసారి పదిరెట్లు అధికంగా అక్కడ వర్షాలు కురిశాయి. దీంతో పాక్ సగానికి కంటే ఎక్కువ భాగం నీటమునిగింది. సహాయక చర్యల్లో భాగంగా.. హెలికాఫ్టర్లు ల్యాండ్ అయ్యేందుకు భూభాగం కూడా దొరకట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలడం.. ఇతర సమస్యలతో పాక్ ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇప్పట్లో కోలుకోలేనంతగా నష్టం వాటిల్లింది అక్కడ. అలాంటిది పుండు మీద కారంలాగా.. ఇప్పుడు హిమనీ నదాలతో పెను ప్రమాదం పొంచి ఉంది ఆ దేశానికి!. ఇండోర్ ఐఐటీ పరిశోధకుల ప్రకారం.. ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్టుల బృందం వెల్లడించిన నివేదికల ప్రకారం.. గత వందేళ్ల రికార్డును తుడిచిపెట్టేసి మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతల కారణంగా వేడి గాలులు సంభవించాయి. ఈ ప్రభావంతో.. హిమాలయాల్లో రికార్డుస్థాయిలో హిమానీనదం కరిగిపోయి.. ఇప్పటికే వరదల్లో మునిగి ఉన్న పాక్‌ను ప్రళయ రూపేణా మరింతంగా ముంచెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఎల్ నినా ప్రభావం పాకిస్తాన్లో తీవ్రమైన రుతుపవనాల కారణంగా పరిస్ధితి దారుణంగా మారింది. వేడెక్కుతున్న అరేబియా సముద్రం, లా నినా ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. హిమాలయ హిమానీనదం కరిగిపోయే ప్రభావం.. పాక్ భూభాగంలో ఉన్న 7,000 హిమానీనదాలపై ప్రభావాన్ని చూపెట్టనుందని అంటున్నారు. ఆ వెంటనే మరొకటి వరదల రూపంలో మహా ప్రళయం ముంచెత్తి.. పాక్‌ను ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలియదు. కానీ, ఆ తర్వాత తీవ్రమైన కరువు కచ్చితంగా పాక్‌ను మరింతగా దిగజారస్తుంది అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో పాక్ ప్రతినిధి మోషిన్ హఫీజ్. క్లైమేట్ చేంజ్ విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదవ దుర్బలమైన(హాని పొందే అవకాశం ఉన్న) దేశం. అలాంటి భూభాగంలో.. వాతావరణ మార్పులతో వరదలు, కరువు వెనువెంటనే సంభవించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ► హిమాచల్ ప్రదేశ్‌లో హిమాలయాలపై ఛోటా షిగ్రీ గ్లేసియర్‌పై అధ్యయనంలో భాగంగా.. గత పదిహేను సంవత్సరాల పరిస్థితులను ఆధారంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు ఇండోర్ ఐఐటీ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. హిమానీనదం కరిగిన ప్రభావంతో.. పరిశోధనా కేంద్రం కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఈ కేంద్రాన్ని జూన్‌లో ఏర్పాటు చేస్తే.. ఆగస్టులో వరదలకు నామరూపాలు లేకుండా పోయింది. ► గ్లోబల్ వార్మింగ్.. ఊహించని స్థాయిలో వడ గాల్పుల ప్రభావం యూరప్ ఆల్ఫ్స్‌తో పాటు హిమాలయ పరిధిలోని మంచును సైతం కరిగించేస్తోంది. అయితే హిమాలయాల్లో గ్లేసియర్లు సైంటిస్టుల ఊహకంటే దారుణంగా కరిగిపోతూ వస్తున్నాయి. ► ఈ ప్రభావం పాక్‌పైనే ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే నగరాలు, పంటపొలాలతో సహా అంతా ముగినిపోగా.. రాబోయే విపత్తులను తల్చుకుని పాక్ ప్రజలు వణికిపోతున్నారు. ► హిమాలయాల నీరు.. ఎనిమిది దేశాలు.. 1.3 బిలియన్ల ప్రజలకు తాగు-సాగు నీటిని అందిస్తోంది. ► టిబెట్ నుంచి మొదలయ్యే సింధు నదీ పరీవాహక ప్రాంతం.. పాక్ గుండా ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది ఫ్రాన్స్ కంటే రెండింతల పరిమాణంలో ఉండి.. పాక్‌కు 90 శాతం ఆహారోత్పత్తులను అందిస్తోంది. ► బేసిన్ వరదలు వచ్చినప్పుడు, చాలా నీరు మట్టిలోకి ప్రవేశించకుండా సముద్రంలోకి ప్రవహిస్తుంది. కాబట్టి.. నీటి కొరత ఏర్పడుతుంది. 2050 నాటికి దక్షిణాసియాలో 1.5 బిలియన్ల నుండి 1.7 బిలియన్ల మంది ప్రజలకు నీటి సరఫరా క్షీణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యయనం అంచనా వేసింది. ► వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించేందుకు పాకిస్థాన్ మరింత మెరుగ్గా వ్యవహరించాలి. విపత్కర పరిస్థితుల్లో స్పందించేందుకు కఠిన చర్యలు చేపట్టాలి. అయితే తనంతట తానుగా వ్యవహరించే సత్తా పాక్‌కు లేదని మోషిన్ హఫీజ్ చెప్తున్నారు. ► వరదలు, కరువు ఏనాటి నుంచో మనిషి మనుగడపై ప్రభావం చూపెడుతున్నాయి. కానీ, భూమి వేడెక్కడం అనే వ్యవహారంతో పెరిగిపోవడం మాత్రం మానవ తప్పిదాలతోనే అనే వాదనను మరింతగా వినిపిస్తోంది. ► ప్రకృతి విపత్తుల నుంచి ఉపశనమం పొందేందుకు పాక్‌కు సాయం అందొచ్చు. కానీ, ఆర్థిక సమస్యలు మాత్రం ఇప్పట్లో వీడే అవకాశాలు కనిపించడం లేదు. ► ఈ సంవత్సరం వేడిగాలుల ప్రభావం, పాకిస్తాన్లో భారీ వరదలు.. ఒక హెచ్చరిక లాంటిది.. మనిషి వెనక్కి తిరిగి చూస్కోవాల్సిన తరుణం అని భారత్‌కు చెందిన హిమానీనద శాస్త్రవేత్త(గ్లేసియోలజిస్ట్) ఆజం చెప్తున్నారు. ► నేపాల్‌లో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటీగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ కేంద్రం.. 2100 సంవత్సరాల నాటికి హిమాలయాలు 60 శాతం కరిగిపోతాయని అంచనా. ► భారత దేశంలో 16 శాతం హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 33% థర్మల్ విద్యుత్, 52% జలవిద్యుత్ హిమాలయలో పుట్టే నదుల నీటిపై ఆధారపడి ఉంది. మంచు కరగడం వల్ల ఈ నదులు తమ నీటిలో గణనీయమైన భాగాన్ని పొందుతున్నాయి, హిమానీనదాలు భారతదేశ ఇంధన భద్రతలోనూ అనివార్యమైన భాగంగా ఉన్నాయి. అలాంటిది హిమాలయాలు మాయమైపోతే!.. నష్టం ఊహించనిదిగా ఉండనుంది. ► గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో.. అడవులు తగలబడిపోవడం, మంచు కరిగిపోవడం.. భారీ వర్షాలు, చైనా కరువుకాటకాలు.. ఇవన్నీ ప్రపంచ దేశాలకు మేలు కొలుపు. 1.1 డిగ్రీ సెల్సియెస్ ఉష్ణోగ్రత పెరగడం.. లో-మీడియం ఇన్కమ్ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపెడుతుందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. -
ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక
లండన్: పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్లు) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్ధకం కానుందని తెలిపింది. లండన్‌కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. 400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం (లిటిల్ ఐస్ ఏజ్)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్‌లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది. అప్పట్లో ఇవి 28 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా, ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40 శాతం మేర కుచించుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జొనాధన్ కార్విక్ చెప్పారు. మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు. మూడో అతిపెద్ద గ్లేసియర్ సముదాయం అంటార్కిటికా, ఆర్కిటికా తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను థర్డ్ పోల్ (మూడో ధృవం)గా పిలువడం కద్దు. ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. వీటి క్షీణత కోట్లాది మందిపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్ చిత్రాలను, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించింది. గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా వీటి క్షీణతను లెక్కించారు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత వేగంగా ఉంది. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాం తాల్లో వీటి క్షీణత అధికంగా ఉంది. ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణ యత్నాలు ఆరంభించాలని నివేదిక పిలుపునిచ్చింది. -
ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ..
పై రెండు ఫొటోల్లో తేడా గమనించారా? ఏం లేదే మామూలుగానే ఉందని అనుకుంటున్నారా? మళ్లీ ఓ పాలి.. ఓ లుక్కెయ్యండి.. అర్థమైందా.. అవును! పై ఫొటోలో దట్టంగా ఉన్న మంచు కాస్తా.. కింది ఫొటోలో అట్టడుగుకు చేరిపోయింది. ఐతే ఏంటట.. అంటారా? దీనికి ఈ భూమిపై తలెత్తనున్న పెను ప్రమాదాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది మరీ! అందుకే ఈ వివరణంతా... ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. 100 సంవత్సరాల తేడాతో వేసవికాలంలో తీసిన ఫొటోలివి. పై ఫొటో దాదాపు 105 సంవత్సరాలనాటిది. కింది ఫొటో తాజాగా తీసింది. కేవలం వందయేళ్ల కాలంలో ఆర్కిటిక్ ప్రాంతంలో మంచంతా ఇలా నీరుగారిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నెమ్మదిగా దెబ్బతింటున్న ఆర్కిటిక్కి సంబంధించిన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యమిది. వాతావరణ మార్పులు తీవ్ర వానలు, వరదల వెనుక దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం ఇది. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. ‘గ్లేసియర్ కంపారిజన్ - స్వాల్బార్డ్’ క్యాప్షన్‌తో క్రిస్టియన్ అస్లాండ్ అనే ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆర్కిటిక్‌లోని వాతావరణ మార్పుల గురించి డాక్యుమెంటరీ తయారు చేశాడు. ఈ స్వీడిష్ ఫోటో జర్నలిస్ట్ 2017లో నేషనల్ జియోగ్రాఫిక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నాడు- ‘నేను ఈ ఫొటోను 2003లో తీశాను. వాతావరణ మార్పు పట్ల నా వైఖరి భిన్నంగా ఉంది. చాలా యేళ్ల తర్వాత సరిగ్గా అదే లొకేషన్ నుండి ఫొటో షూట్ చేయడం ఆనందాన్నిచ్చింది. వాతావరణ మార్పు సమస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలనే ఈ ఫొటో షూట్ చేశాన’ని చెప్పుకొచ్చాడు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? This is Arctic 105 years apart. Both picture taken in summer. Do you notice anything special. Courtesy Christian Åslund. pic.twitter.com/9AHtLDGKRb — Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2021 -
వందేళ్లలో కరిగిపోయిన కొండ
గ్లోబల్ వార్మింగ్‌తో ప్రళయం ముంచుకొస్తోందంటూ నలువైపుల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. క్రమంగా పెరుగుతున్న భూతాపంతో మంచు కొండలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఉష్ణోగ్రతల ధాటికి గ్లేసియర్లు కరిగిపోతున్నాయి. వందేళ్లలో ఓ పెద్ద గ్లేసియర్‌లో చోటు చేసుకున్న మార్పులను తెలియజేస్తూ ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామన్ ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారింది. రష్యాలోని స్వాల్బార్డ్లోని మంచు కొండల దగ్గర 103 ఏళ్ల గ్యాప్‌లో తీసిన రెండు ఫోటోలను పోస్ట్ చేశారు సుధా రామన్. మొదటి ఫోటోలో ఎత్తైన మంచు కొండలు ఉండగా... తర్వాత తీసిన ఫోటోలో మంచు కొండలు దాదాపుగా కరిగిపోయిన ఉన్నాయి. Two photos taken at the same spot with a 103 years difference. What do you see here? pic.twitter.com/rcSCnEgrj0 — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) June 16, 2021 చదవండి : Apps: గోప్యత, భద్రతపై యూజర్లలో ఆందోళన -
షాకింగ్: హిమనీనదాల్లో రక్తం.. ఇదీ అసలు విషయం!
ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత శిఖరాల నుంచి ప్రవహించే హిమనీనదాల్లో ఇటీవల చిక్కని రక్తవర్ణపు చారలు జాలువారడం అక్కడి ప్రజలను, పరిశోధకులను షాక్‌కి గురిచేసింది. దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం దాన్ని హిమనీనదం రక్తంగా పేరుపెట్టారు. వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రస్తుతం భూమి, వాతావరణం ప్రతిరోజూ సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో హిమనీనదం ప్రవాహంలో రక్తవర్ణపు చారలు ఎలా వచ్చాయా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధన ప్రారంభించారు. మంచుతో కప్పబడి ఉండే ఆల్ఫ్స్ పర్వతాల శిఖర భాగంలో పెరుగుతున్న ఒక రకమైన మైక్రో ఆల్గే వల్లే ఈ రక్తవర్ణపు చారలు ఏర్పడుతున్నాయని నిర్ధారించారు. ఈ మైక్రో ఆల్గే సాధారణంగా సముద్ర గర్భంలో పెరుగుతుంది. అలాంటిది సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఆల్ఫ్స్ పర్వత శిఖరాల్లో ఇది ఎలా నిక్షిప్తమయింది? అది ఎరుపు రంగులోకి ఎలా మారింది? అనేది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడంలేదు. రానున్న రోజుల్లో వాతావరణంలో పెనుమార్పులకు ఇది సంకేతమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ చదవండి: బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం -
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచు చరియలు
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లో మరోసారి హిమానీనద ఉత్పాతం బీభత్సం సృష్టించింది. చమోలీ జిల్లాలోని సుమ్నా ప్రాంతం నీతి వ్యాలీలో మంచు చరియలు విరిగిపడి ధౌలి గంగ ఉప్పొంగడంతో పది మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఒ) సిబ్బంది మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 31 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో పని చేస్తుండగా ఒక్కసారిగా భారీ వరద వారిని ముంచేసిందని అధికారులు వెల్లడించారు. మంచు చరియలు విరిగిపడినప్పుడు బీఆర్ఓకు చెందిన 430 మంది వర్కర్లు సుమ్నా రిమ్ఖుమ్ రహదారి పనుల్లో నిమగ్నమై ఉన్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. 430 కార్మికుల్లో ఆర్మీ 400 మందిని రక్షించింది. శుక్రవారం రాత్రి రెండు మృతదేహాలు లభ్యమైతే, ఆదివారం ఉదయం మరో ఆరుగురి మృతదేహాలను సహాయ సిబ్బంది కనుగొన్నారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్ ద్వారా జోషి మఠ్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరిలో చమోలీలోనే భారీగా మంచు చరియలు విరిగిపడడంతో 80 మంది మరణించారు. మరో 126 మంది గల్లంతైన విషయం తెలిసిందే. చదవండి: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం -
ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో హిమానీనదం కారణంగా వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో అత్యంత ప్రమాదకరమైన భారీ సరస్సు ఏర్పడిందని ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. నదీ ప్రవాహ మార్గంలో భారీగా రాళ్లు, మట్టి పడడంతో ప్రవాహం పాక్షికంగా ఆగి కృత్రిమంగా ఓ సరస్సు తయారైంది. ఈ సరస్సుతో మళ్లీ ముప్పు రాకుండా ఉండడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఒ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ ఎన్డీటీవీతో చెప్పారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించిన ప్రాంతంలో సరస్సు ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో తెలుసుకోవడం కోసం ఇప్పటికే కొన్ని బృందాలు హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాయి. డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని కూడా ఆ ప్రాంతానికి పంపించి అవి తీసిన చిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్టుగా ప్రధాన్ వెల్లడించారు. ఆ సరస్సు మహోగ్రరూపం దాల్చకుండా నిరోధించేలా డీఆర్డీఓ, ఎన్డీఆర్ఎఫ్లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఈ సరస్సు వల్ల కలిగే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ‘‘ఇప్పుడు మనం ఆందోళన పడకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొన్ని బృందాలు ఆ సరస్సు గురించి తెలుసుకునే పనిలో ఉన్నాయి’’అని రావత్ చెప్పారు. ఫుట్‌బాల్ స్టేడియం కంటే మూడింతలు పెద్దది డ్రోన్లు, ఇతర విమానాలు తీసిన చిత్రాల్లో సరస్సు చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ గ్రౌండ్ కంటే మూడు రెట్లు పొడవున సరస్సు ప్రవహిస్తోంది. 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 10 డిగ్రీల లోతు ఉన్న ఈ సరస్సు నుంచి మంచు పెళ్లలు, బురద, రాళ్లతో కూడిన నీళ్లు రిషిగంగ నదిలోకి ప్రవహించి రెండు విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఏర్పడిన కృత్రిమ సరస్సుని మట్టి పెళ్లలు, రాళ్లతో కూడిన శిథిలాలు అడ్డుగోడగా ఉన్నాయి. అయితే బుధవారం నాడు తీసిన శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ అడ్డుగోడని ఛేదించుకొని సరస్సు ప్రవహిస్తే ఏ స్థాయిలో ముప్పు జరుగుతుందో ఎవరి అంచనాకి అందడం లేదు. ఆ సరస్సు చాలా ప్రమాదకరంగా మారుతోందని శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేను రిషిగంగ నదికి ఈశాన్యంవైపు ఉన్నాను. ఆ పై నుంచే నీటి ప్రవాహం ముంచుకొస్తోంది. ప్రస్తుతానికి రాళ్లు ఒక గోడలా అడ్డుగా ఉండడం ఊరట కలిగించే అంశం. కానీ ఏ క్షణంలోనైనా అది కొట్టుకుపోతే చాలా ప్రమాదం. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది’’అని చెప్పారు. 38కి చేరుకున్న మృతుల సంఖ్య ఉత్తరాఖండ్‌లోని తపోవన్ సొరంగ మార్గం దగ్గర వరుసగా ఆరో రోజు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న 30–35 మందిని కాపాడడానికి సహాయ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. సొరంగానికి అడ్డంగా కొట్టుకొచ్చిన రాళ్లను డ్రిల్లింగ్ చేయడం, బురదని తోడడం వంటి పనులు ఏక కాలంలో నిర్వహిస్తున్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. మరోవైపు శుక్రవారం నాడు మరో రెండు మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. మరో 166 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రిషిగంగ హైడల్ ప్రాజెక్టు దగ్గర ఒక మృతదేహం లభిస్తే, మైథన ప్రాంతంలో మరొకటి గుర్తించినట్టుగా సహాయ బృందాలు తెలిపాయి. సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల ఆవేదనకు అంతే లేదు. లోపల వాళ్లు ఏ స్థితిలో ఉన్నారో ఊహించుకోవడానికే వారు భయపడుతున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు తమ ప్రాంతానికి ఒక శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రాంతానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తపోవన్ గ్రామ సభకు చెందిన మహిళలు అత్యధికులు వచ్చి తమ నిరసన తెలిపారు. మొదట మా పొలాలను పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా ప్రియమైన వారినే పోగొట్టుకున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. -
జల విలయం నేర్పుతున్న గుణపాఠం
అరుణాచల్ ప్రదేశ్ నుంచి కశ్మీర్ వరకు అభివృద్ధి పేరిట హిమాలయా నదీప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రతిచోటా విధ్వంసాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం సాగుతున్న అభివృద్ది నమూనా వల్ల స్థానిక ప్రజలు హిమాలయ ప్రాంతం నుంచి వలస వెళ్లిపోతున్నారు. పైగా పర్యావరణ వ్యవస్థ కూడా ధ్వంసమైపోతోంది. అందుకే భారతీయ హిమాలయ ప్రాంతంలో పూర్తిగా విభిన్నమైన అభివృద్ధి నమూనా ఎంతైనా అవసరం. వేగంగా లాభాలు సాధించడానికి ప్రాజెక్టులను ముందుకు నెడుతున్నారు తప్పితే దాని పరిణామాలను పట్టించుకోవడం లేదు. కేంద్రప్రభుత్వం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టి కోసం వెంపర్లాడుతుండటంతో అనేక తప్పుడు ప్రాజెక్టులు చలామణిలోకి వస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ సమతుల్యత దెబ్బతినడమే కాదు.. భవిష్యత్తుతో పూర్తిగా రాజీపడిపోవడం కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో రిషి గంగా, ధౌలి గంగా ప్రాంతంపై విరుచుకుపడిన మెరుపు వరదలు ఏ రకంగా చూసినా అకాల వరదలేనని చెప్పాలి. అందుకే తాజా విధ్వంసాన్ని అర్థం చేసుకోవాలంటే హిమాలయాలు, టిబెటన్ పీఠభూమికి చెందిన జల భౌగోళిక లక్షణాలను లోతుగా అవగాహన చేసుకోవలసిన అవ సరముంది. విషాదమేమిటంటే ఫిబ్రవరి 7న సంభవించిన విషాదానికి సంబంధించిన వాస్తవ సమాచారం చాలా తక్కువగా లభ్యమవడమే. ఒక అతిభారీ మంచుగడ్డ ఎక్కడినుంచి విరుచుకుపడింది, ఊహించని వి«ధంగా కిందికి దూసుకొచ్చిన జలప్రవాహం ధాటికి తాత్కాలికంగా ఏర్పడిన ధౌలిగంగా ముఖద్వారం ఎలా తుడిచిపెట్టుకుపోయింది అనే విషయాలపై భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇప్పటికీ అంచనా వేస్తూనే ఉన్నారు. ఇటీవలే కొంతమంది శాస్త్రజ్ఞులు ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ దుర్ఘటనకు దారితీసిన వాస్తవ ప్రక్రియపై ఈ సర్వే కాస్త వెలుగును ప్రసాదించింది. అకాలంలో సంభవించిన ఈ జలవిలయానికి దారితీసిన ఘటనల క్రమాన్ని పునర్నిర్మించడానికి షెఫీల్డ్ యూనివర్సిటీ జియాలజిస్ట్ డేవ్ పెట్లీ గట్టి ప్రయత్నం చేశారు. 1. కొద్ది నెలలక్రితం హిమాలయ పర్వత శిఖరాగ్రంలో ఒక అతిపెద్ద భూఖండ విచ్ఛిత్తి సంభవించింది. 2. ఫిబ్రవరి 7 ఉదయం ధౌలిగంగా సమీపంలో అతిపెద్ద మంచుదిబ్బ విరుచుకుపడింది. 3. ఈ కొండచరియ భారీ మొత్తంలో మంచును, హిమనదీయ శి«థిలాలను కిందికి నెట్టుకుంటా వచ్చింది. 4. ఈ మంచు ప్రవాహం పశ్చిమ ప్రాంత లోయలోకి శరవేగంతో ప్రవహించి జనాభాతో కిక్కిరిసి ఉన్న ఆవాసాలపై విరుచుకుపడింది. ఊహించని విధంగా విరుచుకుపడిన ఈ ఉత్పాతం దుర్బలమైన, పెళుసైన హిమాలయా పర్యావరణ వ్యవస్థపై జరుగుతున్న పరిశోధనలకు, పరిశీలనలకు ఎంత తక్కువ మదుపు పెట్టారనేందుకు భీతిగొల్పించే జ్ఞాపికగా మిగిలింది. ఇప్పటికీ హిమాలయ పర్వతాలు సంవత్సరానికి 1–10 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయని (మన చేతివేళ్లు పెరిగే వేగం అన్నమాట) ఒక సమతుల్యతా స్థితిని పొందడానికి నిత్యం ప్రయత్నిస్తున్నాయని ప్రపంచానికి తెలుసు, 5 కోట్ల సంవత్సరాల క్రితం భారత భూఖండం, యూరేసియన్ భూఖండంతో ఢీకొన్న తర్వాత భూ ఉపరితలం ఒక్కసారిగా పైకి ఎగిసి హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ రెండు భూఖండాల కింద ఇప్పటికీ తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడుతూ వస్తోందని శాస్త్రజ్ఞుల అంచనా. రెండు భూఖండాల కిందిభాగంలో చెలరేగుతున్న ఈ బిగువును లేదా రెండు భూఖండాలను నొక్కిపెట్టడానికి జరుగుతున్న ప్రాకృతిక ప్రయత్నం కారణంగానే పర్వతప్రాంతం పైభాగంలో తీవ్ర చలనాలు ఎప్పటికప్పుడు ఏర్పడుతున్నాయి. కానీ కింది భాగంలో మాత్రం ఘర్షణ శక్తి పెరగడం కొనసాగుతూనే ఉంది. దీనివల్లే ఈ ప్రాంతం మొత్తంలో సూక్ష్మస్థాయిలో భూకంపాలు నిరంతరం ఏర్పడుతూ వస్తున్నాయి. అందుకే హిమాలయ పర్వత నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి చిన్న స్థాయిలో జరిగే విశ్లేషణలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయనే చెప్పాలి. చాలా స్థిరత్వంతో కనిపించే టిబెటన్ పీఠభూమితో పోలిస్తే భారత హిమాలయాలు అత్యంత పెళుసుగా ఉండి సులువుగా విరిగిపడే స్వభావంతో ఉంటున్నాయి. అందుకే ఈ ప్రాంతంపై దీర్ఘకాలి కంగా సాగాల్సిన పరిశోధనలకు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో హిమాలయ ప్రాంతాన్ని ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉండిపోతున్నాయి. అన్నిటికంటే మించి పెద్ద సమస్య ఏదంటే శాశ్వత డేటా సేకరణ వ్యవస్థల నెట్వర్క్ ఈ ప్రాంతంలో దాదాపుగా లేకపోవడమే. లభ్యమవుతున్న కాస్త డేటా తాత్కాలికమైనదే. హిందూ కుష్ హిమాలయా, టిబెటన్ పీఠభూమి ప్రాంతంలో జరుగుతున్న విభిన్న పర్యావరణ మార్పులకు సంబంధించిన పలు అంశాలను అర్థం చేసుకోవడం కష్టమైపోతోంది. ప్రకృతి సహజ కారణాలకు మించి ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మన పేలవమైన పథకరచన, నిర్వహణనే ఎక్కువగా వేలెత్తి చూపాల్సి వస్తుంది. అందువల్లే భూగర్భ సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినప్పుడు, వారి సంఖ్యను కచ్చితంగా నిర్ధారించడం అసంభవమైపోతోంది. గల్లంతైన కార్మికులు, ప్రజల కుటుం బాల వేదనను చూస్తే మనం మన కార్మికులను ఎంతగా పీడిస్తున్నామో అర్థమవుతుంది. ఇలాంటి ఉత్పాతాలలో చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలీకపోవడం, వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం వింత గొలుపుతుంది. మన పాలకులు వేగంగా లాభాలు సాధించడానికి ప్రాజెక్టులను ముందుకు నెడుతున్నారు తప్పితే వాటి పరిణామాలను పట్టించుకోలేదు. అధికారం, రిబ్బన్ కటింగ్‌తో సంతృప్తి పడిపోవడం అనేవి మన రోడ్లు, బ్రిడ్జీలు వంటి వాటిలో నాణ్యత పూర్తిగా దెబ్బతినేలా చేస్తున్నాయి. ఇటీపలి కాలంలో జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం సొరంగాలు, డ్యామ్‌ల నిర్మాణం ఎక్కువగా సాగిస్తున్నారు. హిమాలయ పర్వతాలపై రాళ్లను పేల్చే ప్రక్రియ యుద్ధ స్థాయిలో జరగటం కూడా పర్యావరణ విధ్వంసాన్ని మరింతగా పెంచుతోంది. భారీగా విద్యుత్ లభ్యత, విద్యుత్ రంగంలో పోగుపడే సంపదలు, ఈ రంగాన్ని బంగారు బాతుగుడ్డుగా చూసే పరిస్థితులు వంటివి ఈ ప్రాంతంలో ఆర్థిక, పర్యావరణ విధ్వంసానికి బాటలేస్తున్నాయి. ఒక్క ఉదాహరణ చూద్దాం. కిన్నార్ ప్రాంతంలో జేపీ ఇండస్ట్రీస్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించి 50 కోట్ల డాలర్ల లాభాన్ని ఎగురేసుకుపోయింది. కానీ దాని దుష్ఫలితాలను తర్వాత కిన్నార్ గ్రామస్తులు అనుభవిస్తున్నారు. ఇదేవిధంగా దేశంలో సమృద్ధిగా లభిస్తున్న సిమెంట్, ఉక్కు నిల్వల సామర్థ్యం కూడా దేశ వ్యాప్తంగా మతిహీనమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు పరుగు తీసేలా చేస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతంలో డ్యాములు లేక రహదారులకు చెందిన పర్యావరణ నిర్వహణ ఘోరంగా తయారవడం విషాదం. అయితే వాటి దుష్ఫలితాలకు ప్రత్యక్షంగా గురవుతున్న ప్రజలు, సామాజిక బృందాలు పదే పదే చేస్తున్న ఆందోళనల కారణంగా కాస్త మార్పు వస్తోంది. మన సరిహద్దుల్లో చైనా సాగిస్తున్న మౌలిక సదుపాయాల కల్పనతో పోటీపడటంవల్ల ప్రజలకు ఉపయోగం లేని, భూగర్భ పరిస్థితులను కుదుటపరిచేందుకు వీలులేని వివిధ రకాల నిర్మాణ పనులను భారత సరిహద్దుల్లోనూ వేగవంతం చేస్తున్నారు. పైగా కేంద్రప్రభుత్వం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టి కోసం వెంపర్లాడుతుండటంతో అనేక తప్పుడు ప్రాజెక్టులు చలామణిలోకి వస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కూలిపోవడమే కాదు.. భవిష్యత్తుతో పూర్తిగా రాజీపడిపోవడం కూడా జరుగుతుంది. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి కశ్మీర్ వరకు అభివృద్ధి పేరిట హిమాలయా నదీప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రతిచోట విధ్వంసాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం సాగుతున్న అభివృద్ది నమూనా వల్ల స్థానిక ప్రజలు హిమాలయ ప్రాంతం నుంచి వలస వెళ్లిపోతున్నారు. పైగా పద్ధతి ప్రకారం పర్యావరణ వ్యవస్థ కూడా ధ్వంసమైపోతోంది. అందుకే భారతీయ హిమాలయ ప్రాంతంలో పూర్తిగా విభిన్నమైన అభివృద్ధి నమూనా ఎంతైనా అవసరం. పైగా వాణిజ్య కార్యకలాపాల నుంచి దూరం జరిగిపోవాలని భారత ప్రభుత్వం భావిస్తున్నందువల్ల కార్పొరేట్ లాభాలు, దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్లకే ప్రాధాన్యత లభిస్తూ ప్రజలు దుష్పరిణామాల బారిన పడుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పలు ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడాన్ని చూస్తే దారిమళ్లుతున్న పెట్టుబడులపట్ల ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమవుతున్నట్లు బోధపడుతుంది. -ఆర్. శ్రీధర్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త (ది వైర్ సౌజన్యంతో) ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియవల్ల మారిన ప్రవాహ గతి -
అన్వేషణలో డ్రోన్లు, భారీ యంత్రాలు
డెహ్రాడూన్: హిమానీనదం వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో ఇంకా 174 మంది ఆచూకీ లభించడం లేదు. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగ ముఖద్వారం మట్టి, రాళ్ల పెళ్లలతో మూసుకుపోవడంతో సహాయ చర్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. భారీ యంత్రాల సాయంతో వాటిని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సొరంగంలో చిక్కుకుపోయిన 25–35 మంది కార్మికుల్ని కాపాడడానికి డ్రోన్లను, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను మోహరించి గాలిస్తున్నారు. ‘‘సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. లోపలికి వెళ్లడానికి భారీగా పేరుకుపోయిన రాళ్లతో కూడిన బురద అడ్డంగా ఉంది. దానిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’అని ఉత్తరాఖండ్ డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నె చెప్పారు. సొరంగ మార్గంలో శిథిలాలతో కూడిన బురద ఎండిపోవడంతో గట్టిపడి లోపలికి వెళ్లడానికి వీల్లేకుండా ఉంది. ఇప్పటివరకు 80 మీటర్ల లోపలికి తవ్వకాలు జరిపారు. 100 మీటర్ల వరకు వెళితే లోపల చిక్కుకున్న వారీ ఆచూకీ తెలియవచ్చు’’అని వెల్లడించారు. అలుపెరుగని సాయం.. కేవలం సొరంగ మార్గం వద్ద సహాయ చర్యల కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సహస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది 600 మందికి పైగా నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. పెద్ద పెద్ద మంచుపెళ్లల్ని పెకిలించడం, నీటిని భారీ యంత్రాలతో తోడుతున్నప్పటికీ ఇంకా బాగా వస్తూనే ఉంది’’అని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. అయితే సొరంగానికి అడ్డంగా ఉన్న శిథిలాల తొలగింపు ఆలస్యమవుతున్న కొద్దీ లోపలున్న వారి పరిస్థితి ఎలాగ ఉందోనన్న ఆందోళన పెరుగుతోంది. ‘‘కాలం గడుస్తున్న కొద్దీ ఆ కార్మికులు సజీవంగా ఉంటారన్న నమ్మకం పోతోంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే వారిని కాపాడుకోవచ్చు’’అని రాష్ట్ర సహాయ బృందం సభ్యుడు పీయూష్ అన్నారు. ‘రేయింబగళ్లు శిథిలాలను తొలగిస్తున్నా పని పూర్తి అవడం లేదు. సొరంగం వెలుపల ఆక్సిజన్ సిలండర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు’ అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే అన్నారు. -
జల విలయం: ఆ రాళ్ల కుప్ప కుప్పకూలిందా ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జల విలయంలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. విద్యుత్ ప్రాజెక్టు సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి సహాయ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాడు మరో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 175 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. రైణి గ్రామంలోని శిథిలాల్లో రెండు మృతదేహాలు లభించినట్టుగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధి కారి ఒకరు చెప్పారు. గల్లంతైన వారంతా ఎన్టీపీసీకి చెందిన నిర్మాణంలో ఉన్న తపోవన్–విష్ణుగఢ్, రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నవారు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలే ఉన్నారు. శిథిలాలు తొలగించడానికి భారీ మిషన్లు 12 అడుగుల ఎత్తు, 2.5 కి.మీ. పొడవైన సొరంగ మార్గంలో వరద నీటిలో కార్మికులు చిక్కుకొని ఉండడంతో సహాయ చర్యలు క్లిష్టంగా మారాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఫ్లతో పాటు రాష్ట్ర సహాయ సిబ్బంది ఆ సొరంగ మార్గంలోని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను తీసుకువచ్చి విరామమెరుగకుండా పని చేస్తున్నారు. ‘‘రాత్రి నుంచి నిరంతరాయంగా పని చేస్తూ ఉంటే సొరంగ మార్గంలో 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించగలిగాం’’అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే చెప్పారు. ఇక వంతెనలు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. మొత్తం 13 గ్రామాలకు చెందిన 2,500 మంది బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. వారందరికీ హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు. సీఎం ఏరియల్ సర్వే వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆస్పత్రిని సందర్శించారు. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వచ్చిన 12 మంది కార్మికులతో మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా సీఎం తెలిపారు. వరద ప్రాంతాల్లో చికక్కుకున్న కొన్ని గ్రామాల్ని కూడా సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆ పరికరమే కొంప ముంచిందా ..? 1960 దశకంలో చైనాపై నిఘా కోసం నందాదేవి పర్వత ప్రాంతాల్లో అమర్చడానికి తీసుకువెళ్లిన అణు ధార్మిక పరికరం ఇప్పుడు జలవిలయానికి దారి తీసిందని రైణి గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన రోజు భయంకరమైన వాసన వచ్చిందని, ఆ సమయంలో ఊపిరి తీయడం కష్టంగా మారిందని వరద బీభత్సంలో అత్యధికంగా నష్టపోయిన రైణి గ్రామవాసులు చెబుతున్నారు. కేవలం మంచుపెళ్లలు, శిథిలాల వల్ల అంత ఘాటైన వాసన రాదని ఆ పరికరం నందాదేవి పర్వత ప్రాంతాల్లోనే ఎక్కడో ఉందని తమ పెద్దలు చెబుతూ ఉండేవారని, బహుశా దాని కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని దేవేశ్వరి దేవి అనే మహిళ అనుమానం వ్యక్తం చేశారు. నందాదేవి పర్వత ప్రాంతాల్లో ఇలాంటి పరికరం ఏదో ఉందని ఇప్పటికే పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా కదలికలపై నిఘా ఉంచడానికి సీఐఏ, ఐబీలు సంయుక్తంగా అణు శక్తి కలిగిన ఒక పరికరాన్ని నందాదేవి పర్వతాల్లో అమర్చడానికి 1965లో తీసుకువెళ్లారని, అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ పరికరాన్ని అక్కడే వదిలేసి వచ్చారని అంటారు. ఏడాది తర్వాత ఒక పర్వతారోహక బృందం అక్కడికి వెళ్లి చూస్తే ఆ పరికరం కనిపించలేదు. గల్లంతైన ఆ పరికరం జీవిత కాలం వందేళ్ల వరకు ఉంటుందని అంచనా. అయితే దీనిపై అధికారికంగా వివరాలు లేవు. రాళ్ల కుప్ప పడిపోయిందా ? ఉత్తరాఖండ్‌లో నందాదేవి పర్వత శ్రేణుల్లోని రాళ్ల కుప్ప బలహీనపడి కుప్పకూలిపోవడంతో ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చిక్కుకొని ఉండవచ్చునని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జువాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ) అంచనా వేసింది. పర్వతంలోని రాళ్లు ఏళ్ల తరబడి మంచుతో కప్పబడి ఉండడంతో బాగా నాని బలహీనపడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు రాళ్ల కుప్ప బలహీనపడడమే వరదలకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కలచంద్ సెయిన్ చెప్పారు. ఈ పర్వత ప్రాంతం అత్యంత లోతున ఏటవాలుగా ఉంటుందని అందువల్ల మంచు చరియలు కరిగి పడిపోగానే వరదలు పోటెత్తాయని తెలిపారు. చదవండి: (విలయం మిగిల్చిన విషాదం) -
ఉత్తరాఖండ్ విలయానికి కారణం ఆ పరికరమేనా?!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. మంగళవారం (ఫిబ్రవరి 9) మరో ఐదు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతయ్యారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు చెందిన రెండో టన్నెల్లో 30 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని కాపడటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొదటి టన్నెల్ నుంచి 12 మందిని సురక్షితంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు హిమనీనదం పేలుడు కారణం కాదని రైనీ గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాక వారు మరో సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 56 ఏళ్ల కిందట అధికారులు నందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ (రేడియోధార్మిక పదార్థం) పరికరాన్ని ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఆ పరికరం మిస్సైందని తెలిపారు. తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘సీఐఏ, ఐబీ అధికారులు 1965లో నందాదేవి శిఖరంపై అణుశక్తితో కూడిన న్యూక్లియర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. చైనాపై నిఘా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో పర్వత శిఖరాన్ని పరిశీలించానికి వెళ్లిన అధికారుల బృందం ఊహించని ప్రమాదం బారిన పడింది. దాంతో ప్రాణాలతో బయటపడే క్రమంలో ఆ రేడియో యాక్టివ్ డివైస్‌ను అక్కడే వదిలేశారు. మరుసటి సంవత్సరం అధికారులు అక్కడికి మళ్లీ వెళ్లారు.. అయితే ఆ పరికరం మాత్రం కనిపించలేదు’’ అని గ్రామస్తులు తెలిపారు. రేడియో యాక్టీవ్ పరికరం జీవిత కాలం వందేళ్లు. ఇప్పటివరకు అది ఆ మంచు కొండల్లో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని తాము భావిస్తున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో ఘాటైన వాసన..! ప్రమాదం జరిగిన నందాదేవి పర్వత శిఖరానికి సమీపంలోనే రైనీ గ్రామం ఉంది. ప్రమాదాన్ని కొంత మంది గ్రామస్తులు దగ్గరి నుంచి చూశారు. ఆ రోజు ప్రమాదం జరిగిన తీరును వారు వివరించారు. ‘‘పర్వత శిఖరం పైనుంచి మంచు కొండ ఒక్కసారిగా విరిగి కుప్పకూలింది. అందులోంచి ఉప్పెనలా నీరు పొంగి రిషిగంగా నదిలోకి దూకింది. దీంతో వరద ఉధృతి పెరిగింది. ఆ ప్రవాహం.. అడ్డుగా ఉన్న రాళ్లను, డ్యామ్‌లను నాశనం చేస్తూ ముందుకు సాగింది. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది’’ అని గ్రామస్తులు నాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. అలానే శిఖరం పైనుంచి భారీ శబ్దంతో మంచు కొండ విరిగిపడిన వెంటనే అక్కడ ఘాటైన వాసన వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ‘‘ఆ వాయువు చాలా ఘాటుగా ఉంది. మేం కొద్దిసేపు ఊపిరి పీల్చుకోలేకపోయాం. ఇది మంచు కొండ విరిగిపడటం, శిథిలాల కారణంగా వచ్చి ఉంటుందని మేం భావించడం లేదు. ఆ వాసన చాలా వేరుగా ఉంది. దాంతో మాకు రేడియో యాక్టీవ్ పరికరం మీద అనుమానం వచ్చింది. మా పెద్దలు తరచూ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి. నందాదేవి శిఖరంపై రేడియో యాక్టివ్ పరికరం మిస్సైన ఘటన గురించి మా పెద్దలు మాకు అనేక సార్లు చెప్పారు’’ అని గ్రామస్తులు తెలిపారు. 1965లో నందాదేవి శిఖరంపైకి వెళ్లిన అధికారుల బృందానికి కొంత మంది గ్రామస్తులు సహకరించారు. వారిలో ఒక వ్యక్తి భార్య అయిన ఇమర్తి దేవి(90) ఆదివారం నాడు జరిగిన ప్రమాదంలో మృతి చెందడం మరో విషాదకర అంశం. సంగ్రామ్ సింగ్ రావత్ అనే మరో గ్రామస్తుడు కూడా ఆ రేడియోధార్మిక పరికరంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆదివారం నాటి ఘటన అనంతరం భయంతో అతడు తన కుటుంబంతో కలిసి ఊరికి దూరంగా అడవిలో ఉంటున్నాడు. 2018లో పర్యాటక మంత్రి సప్తాల్ మహరాజ్ ఆ రేడియోధార్మిక పరికరం గురించి ప్రస్తావించడం గమనార్హం. ‘నందాదేవి శిఖరంపై మిస్సైన ఆ పరికరం.. ఆ మంచు కొండలను కలుషితం చేస్తోంది. దాన్ని వెలికితీయడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రధాని మోదీ ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు. ఏది ఏమైనా ప్రమాదానికి గల కారణాలను అధికారులు తేల్చాల్సి ఉంది. -
ఉత్తరాఖండ్ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా
ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడి గంగానది ఉపనది అయిన ధౌలి గంగ పోటెత్తి ఒక పవర్‌ప్రాజెక్ట్‌ని ముంచెత్తింది. అందులో పని చేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు. పెను విషాదాన్ని కలిగించిన ఈ ఉత్పాతంపై సెలబ్రిటీలు సానుభూతి వ్యక్తం చేస్తున్నా దియా మిర్జా మాత్రం దిగులును, నిస్సహాయతను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ‘హిమాలయాల్లో చెట్లను కొట్టేయడం, కొండలను తొలిచేయడం, ఆనకట్టలు, పవర్ ప్రాజెక్టులు నిర్మించడం... ఇవన్నీ పర్యావరణానికి హాని చేస్తున్నాయి. అంతేకాదు అమాయకుల ప్రాణాలు బలిగోరుతున్నాయి’ అని దియా మిర్జా గట్టిగా గొంతెత్తింది. గతంలో కూడా చాలాసార్లు పర్యావరణం గురించి మాట్లాడింది ఆమె. ‘గతంలో పుట్టినరోజు ఎవరిదైనా వస్తే ఏం బహుమతి ఇవ్వాలా అని నేను తెగ హైరానా పడేదాన్ని. తర్వాత ఎవరి పుట్టినరోజు ఆహ్వానం నాకు అందినా వారి పేరు మీద 11 చెట్లు నాటి ఆ చెట్లు నాటిన స్థలాన్ని చూసి రమ్మని చెప్పేదాన్ని. అలా ఒక సంవత్సరంలో నేను దాదాపు 18 వేల చెట్లు నాటాను’ అని చెప్పుకుందామె. చెట్లు కూల్చి గోడలు కట్టుకోవాలనుకునే సమాజం మీద కట్టలు తెంచుకున్న నదులు విరుచుకు పడతాయని ఎంత తొందరగా మనం అర్థం చేసుకుంటే అంత మేలు. చదవండి: అనుబంధాల అంతరాలు త్రిభంగ -
విలయం మిగిల్చిన విషాదం
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ జల విలయానికి సంబంధించి ఇప్పటివరకు 26 మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో 171 మంది ఆచూకీ కోసం సహాయ దళాలు కృషి చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన 30 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మరోవైపు, ఈ విలయానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చమోలీ జిల్లా, జోషిమఠ్ దగ్గర్లోని నందాదేవి హిమనీనదం వద్ద అనూహ్యంగా భారీ ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా కిందకు విరుచుకుపడడంతో ఈ జల ప్రళయం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సోమవారం తెలిపారు. అంతకుముందు, ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలు తనకు చూపించిన చిత్రాల్లో.. వరద ఉధృతి ప్రారంభమైన చోట హిమనీనదం ఏదీ కనిపించలేదని, మంచు అంతా కిందకు జారిపడిపోయిన ఒక పర్వతం మాత్రం ఉందని తెలిపారు. ఆ పర్వత శిఖరంపై నుంచే పెద్ద ఎత్తున మంచు కిందకు జారిపడి ఉంటుందని, దాంతో ధౌలి గంగ, రిషి గంగ నదులకు మెరుపు వరదలు వచ్చాయని భావిస్తున్నామని వివరించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష, పరోక్ష కారణాలను గుర్తించిన తరువాత, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని వివరించారు. అభివృద్ధి నిరోధక కధనాలకు అవకాశంగా ఈ దుర్ఘటనను తీసుకోవద్దని సూచించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా రాష్ట్రంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తామని సోమవారం తనను కలిసిన ఉత్తరాఖండ్ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. చదవండి: (తెలిసే వచ్చిన జలవిలయం ఇది) ముమ్మరంగా సహాయ చర్యలు వరదల్లో చిక్కుకుపోయి, ఇంకా ఆచూకీ లభించని సుమారు 170 మందిలో జల విద్యుత్కేంద్రంలో పనిచేస్తున్నవారు, నదీ తీరం వెంట ఇళ్లు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారు ఉన్నారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. 480 మెగావాట్ సామర్ధ్యమున్న, ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం, 13.2 మెగావాట్ల సామర్ధ్యమున్న రిషి గంగ జల విద్యుత్ కేంద్రం తాజా వరదలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ.. పదుల సంఖ్యలో కార్మికులు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో చిక్కుకుపోయారు. దాదాపు 13 గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాయి. ఆర్మీ మెడికల్ కార్ప్స్, వైమానిక దళ బృందాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. చదవండి: (స్వయంకృతం) తపోవన్– విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం టన్నెల్లో చిక్కుకుపోయిన సుమారు 35 మందిని రక్షించేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి. పెద్ద ఎత్తున బుల్డోజర్లు, జేసీబీలు ఇతర యంత్ర సామగ్రిని అక్కడికి తరలించారు. 250 మీటర్ల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ సొరంగ మార్గం కొద్దిగా వంపు తిరిగి ఉన్న కారణంగా సహాయ చర్యలకు సమయం పడుతోందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. సొరంగంలోపల పెద్ద ఎత్తున బురద పేరుకుపోయిందని, ఇప్పటివరకు సుమారు 100 మీటర్ల మేర బురదను తొలగించగలిగామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌కుమార్ పాండే వెల్లడించారు. సుమారు 300 మంది ఐటీబీపీ సిబ్బంది ఈ విధుల్లోనే ఉన్నారన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన అందరినీ రక్షించగలమనే ఆశిస్తున్నామన్నారు. అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. ఈ వరదల్లో విద్యుత్ కేంద్రాల సిబ్బందిలో 202 మంది గల్లంతయ్యారని, వారు ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వారని పాండే వివరించారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల సూపర్వైజర్లు కూడా గల్లంతు కావడంతో ఉద్యోగులు/కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం లభించడం లేదన్నారు. మరో చిన్న సొరంగంలో.. తపోవన్– విష్ణుగఢ్ కేంద్రానికి సంబంధించిన మరో చిన్న సొరంగంలో చిక్కుకుపోయిన 12 మందిని, రిషిగంగ కేంద్రం వద్ద వరదల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించగలిగామని తెలిపారు. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను కూడా సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు రంగంలోకి దింపారు. ఈ సొరంగానికి ఒకవైపే మార్గం ఉందని విద్యుత్ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. సోమవారం మరిన్ని బలగాలను జోషిమఠ్‌కు పంపించామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. వరద ఉధృతికి మేటవేసిన బురదతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. పలు నిర్మాణాలు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయాయి. కచ్చితమైన కారణమేంటి? ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలు ఇప్పటికే చమోలీ చేరుకున్నాయి. డీఆర్డీవోలోని ‘ద స్నో అండ్ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్మెంట్’సభ్యులు రంగంలోకి దిగారు. వాతావరణ మార్పు, లేదా ఆకస్మిక శీతాకాల వర్షాలు ఈ విలయానికి కారణం కావచ్చని నిపుణులంటున్నారు. హిమనీనద సరస్సు ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల కానీ, మంచు చరియలు విరిగి నదీ మార్గాన్ని అడ్డుకుని, ఆ తరువాత ఒక్కసారిగా ఆ మార్గం తెరుచుకోవడంతో కింది ప్రాంతాలకు విరుచుకుపడిన వరద వల్ల కానీ ఈ జల ప్రళయం చోటు చేసుకుని ఉండవచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది.