2100 నాటికి హిమాలయాల్లో 75 శాతం మంచు మాయం
ఇండియా పర్యావరణ నివేదిక వెల్లడి
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది.
ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది.
నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది.
ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్‌మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు.
ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్
అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు.
ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్‌డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు.
పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment