
200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయం
పదడుగులు పెరగనున్న సముద్రమట్టం
తీరప్రాంతాలు, మహానగరాలు సర్వనాశనం
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్‌డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి.
అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది.
‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్‌కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది!
అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్‌డే (ప్రళయకాల) గ్లేసియర్‌గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్‌వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్‌ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్‌బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు...
→ డూమ్స్‌డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది.
→ మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది.
→ అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్‌డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది.
→ డూమ్స్‌డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment