ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న శిలాజ ఇంధనాల వినియోగం.. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం. వీటివల్ల భూగోళంపై మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం భూమిపై ఉన్న జీవజాలమే కాదు, సముద్రాల్లోని జీవులు సైతం అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు.
► ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేది యథాతథంగా కొనసాగితే అంటార్కిటికాలో మంచు మరింత కరిగి, ఆ మంచినీరంతా సముద్రాల్లోకి చేరుతుంది.
► కొత్త నీటి రాకతో సముద్రాల ఉపరితల జలంలో లవణీయత, సాంద్రత తగ్గిపోతుంది. ఈ పరిణామం సముద్ర ఉపరితలం నుంచి అంతర్భాగంలోకి జల ప్రవాహాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సముద్రాల్లో పైభాగం నుంచి లోపలి భాగంలోకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్భాగంలో కూడా ఒకచోటు నుంచి మరోచోటుకి జల ప్రవాహాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి.
► మంచు కరిగి, కొత్త నీరు వస్తే సముద్రాల పైభాగం నుంచి 4,000 మీటర్ల(4 కిలోమీటర్ల) దిగువన నీటి ప్రవాహాలు తొలుత నెమ్మదిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా స్తంభించిపోతాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది.
► నీటి ప్రవాహం స్తంభిస్తే సముద్రాల్లో లోతున ఉండే ప్రాణవాయువు(ఆక్సిజన్), ఇతర పోషకాలు సైతం అంతమైపోతాయని సైంటిస్టు ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లాండ్ చెప్పారు. దీంతో సముద్రాల్లోని జీవుల మనగడకు అవసరమైన వనరుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఇదంతా మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు.
► సముద్రాల్లో జలమట్టం పెరిగితే ఉపరితలంపై కొత్త నీటి పొరలు ఏర్పడుతాయి. దానివల్ల సముద్రాలు కార్బన్ డయాక్సైడ్‌ను శోషించుకోలేవు. అంతేకాకుండా తమలోని కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సముద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఉధృతమవుతాయి. ఫలితంగా భూగోళం మరింత వేడెక్కుతుంది.
► అంటార్కిటికాలో ప్రతిఏటా 250 ట్రిలియన్ టన్నుల చల్లని, ఉప్పు, ఆక్సిజన్‌తో కూడిన నీరు చేరుతుంది. ఇది ఉత్తర దిశగా విస్తరిస్తుంది. హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోకి ఆక్సిజన్‌ను చేరుస్తుంది. రానున్న రోజుల్లో అంటార్కిటికా నుంచి విస్తరించే ఆక్సిజన్ పరిమాణం తగ్గనుందని అంచనా వేస్తున్నారు.
► ప్రపంచ కర్బన ఉద్గారాలను సమర్థంగా నియంత్రించకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో అంటార్కిటికాలోని సముద్రాల కింది భాగంలో జల ప్రవాహం ఆగిపోతుందని, సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సైంటిస్టులు నిర్ధారించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Global warming: సముద్ర జీవజాలానికి భూతాపం ముప్పు
Published Mon, Apr 3 2023 5:57 AM | Last Updated on Mon, Apr 3 2023 10:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment