అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్‌ఐఆర్‌ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది.
3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్‌ఐఆర్‌ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు.
ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్‌ఐఆర్‌ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి.
సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment