Volcanoes
-
బృహస్పతి చంద్రుడిపై శిలాద్రవ గదులు
సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి ఐదో గ్రహం జూపిటర్(బృహస్పతి). అన్ని గ్రహాల్లోకెల్లా ఇదే పెద్దది. మన భూమికి ఉపగ్రహం చందమామ ఉన్నట్లే బృహస్పతికి కూడా ‘ఐవా’ అనే ఉపగ్రహం ఉంది. మొత్తం సౌర వ్యవస్థలో నిరంతరం జ్వలించే భారీ అగ్నిపర్వతాలు (వాల్కనో) ఉన్న పెద్ద ఉపగ్రహం ఐవా. ఇక్కడ 400 అగ్నిపర్వతాలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం శిలాద్రవాన్ని(మాగ్మా) విరజిమ్ముతూనే ఉంటాయి. అదొక అగ్ని గుండమని చెప్పొచ్చు. సరిగ్గా మన చందమామ పరిమాణంలో ఉండే ఐవాలో ఈ వాల్కనోలకు కారణం ఏమిటన్నది చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉండేది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ’నాసా’ ఈ రహస్యాన్ని ఛేదించే విషయంలో పురోగతి సాధించింది. నాసా సైంటిస్టులు జూనో మిషన్‌లో భాగంగా బృహస్పతిపై పరిశోధనలకు జూనో స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించారు. 2023 డిసెంబర్, 2024 ఫిబ్రవరిలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఐవా సమీపంలోకి వెళ్లింది. ఐవా ఉపరితలం నుంచి 1,500 కిలోమీటర్ల ఎత్తువరకూ చేరుకొని ఫొటోలు చిత్రీకరించింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన డాప్లర్ డేటాను సేకరించింది. ఈ గణాంకాలను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఐవాపై నిప్పుల కొండలకు కారణం ఏమిటన్నది గుర్తించారు. ఐవా ఉపరితలం కింద మాగ్మా ఒక సముద్రం తరహాలో విస్తరించి లేదని, వేర్వేరు చాంబర్ల(గదులు)లో ఉందని కనిపెట్టారు. శిలాద్రవం ఒకదానితో ఒకటి సంబంధం లేదని వేర్వేరు చాంబర్లలో ఉండడం వల్ల అధిక ఒత్తిడితో ఉపరితలంపైకి వేగంగా చొచ్చుకొని వస్తున్నట్లు చెప్పారు. దాంతో విరామం లేకుండా అగ్నిపర్వతాలు జ్వలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సముద్రం తరహాలో మాగ్మా విస్తరించే ఉంటే దానిపై ఒత్తిడి తక్కువగా ఉండేది. అలాంటప్పుడు అది పైకి ఉబికి వచ్చే అవకాశం అంతగా ఉండదు. ఈ అధ్యయనం వివరాలను నేచురల్ జర్నల్‌లో ప్రచురించారు. ఐవా ఉపగ్రహాన్ని తొలిసారిగా 1610లో గలీలియో గలిలీ కనిపెట్టారు. కానీ, అక్కడ భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న సంగతి 1979తో తెలిసింది. నాసా ప్రయోగించిన వోయేజర్–1 స్పేస్‌క్రాఫ్ట్ ఈ విషయం గుర్తించింది. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐవాపైనున్న వాల్కనోల గుట్టు తెలిసింది కాబట్టి గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా, ఎప్పుడు ఏర్పడ్డాయన్నది గుర్తించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రునిపై ఆవలి వైపూ... అగ్నిపర్వతాలు!
న్యూయార్క్: చందమామ ఆవలి వైపు కూడా కొన్ని వందల ఏళ్ల కింద భారీ అగ్నిప ర్వతా లకు నిలయమేనని సైంటిస్టులు తాజాగా తేల్చారు. చంద్రుని ఆవలివైపు నుంచి చైనాకు చెందిన చాంగ్ ఈ–6 వ్యోమనౌక తొలిసారిగా తీసుకొచ్చిన రాళ్లు, మట్టి, ధూళి నమూ నాలను క్షుణ్నంగా పరీక్షించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘‘వాటిలో అగ్నిపర్వతపు రాళ్ల తాలూకు గుర్తులున్నాయి. అవి దాదాపు 280 కోట్ల కిందివని తేలింది. ఒకటైతే ఇంకా పురాత నమైనది. అది ఏకంగా 420 కోట్ల ఏళ్లనాటిది’’ అని వారు వివరించారు. ఆవలి వైపున అగ్నిపర్వతాల పేలుళ్లు కనీసం వంద కోట్ల ఏళ్ల పాటు కొనసాగినట్టు నిర్ధారణ అవుతోందని అధ్యయన సహ సారథి, చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నిపుణుడు క్యూలీ లీ చెప్పారు.ఇప్పటికీ మిస్టరీయే...చంద్రునిపై మనకు కనిపించే వైపు అగ్ని పర్వతాల ఉనికి ఎప్పుడో నిర్ధారణ అయింది. అయితే ఆవలి వైపు మాత్రం సైంటిస్టులకు ఎప్పుడూ పెద్ద మిస్టరీగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా నమూనాలు అందించిన సమాచారం అమూల్యమైనదని విశ్లేషణ లోపాలుపంచుకున్న అరిజోనా యూని వర్సిటీకి చెందిన ప్లానెటరీ వాల్కెనో నిపుణు డు క్రిస్టోఫర్ హామిల్టన్ అన్నారు. -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్ర గర్భంలో ఏకంగా 8 అగ్నిపర్వతాలు
అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్ఐఆర్ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్ఐఆర్ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి. సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ చెబుతున్న వాస్తవం ఏమిటి?
అగ్ని పర్వతం... ఈ మాట వినిగానే భగభగ మండే అగ్నికీలల మధ్య నుంచి ఉబికివచ్చే లావా గుర్తుకువస్తుంది. అగ్ని పర్వత విస్ఫోటనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా అగ్ని పర్వతాలు ఒకే సమయంలో బద్దలయ్యాయని తెలిస్తే.. అది ఊహకు కూడా అందదు. అవును.. ఇది నిజం.. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. తాజాగా మరో మూడు కొత్త విస్ఫోటనాలు ఈ జాబితాలో చేరాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ నూతన విస్ఫోటనాలను ట్రాక్ చేస్తుంది. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ తాజాగా విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతాల జాబితాను అప్డేట్ చేసింది. ఈ జాబితా విడుదల అనంతరం పలువురు సోషల్ మీడియాలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, ఐస్లాండ్, జపాన్, మెక్సికో, రష్యా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఒకేసారి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతుంటాయి. ఇది సాధారణమేనని అగ్నిపర్వత శాస్త్రవేత్త, సైన్స్ జర్నలిస్ట్ రాబిన్ జార్జ్ ఆండ్రూస్ ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంలో తెలిపారు. ప్రస్తుతం పేలుతున్న అగ్నిపర్వతాల సంఖ్య సాధారణమేనని గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ డైరెక్టర్ బెన్ ఆండ్రూస్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 46 విస్ఫోటనాలు కొనసాగుతున్నాయని, గత 30 సంవత్సరాలలో ఇదేవిధంగా నిరంతరం 40 నుంచి 50 విస్ఫోటనాలు జరిగాయన్నారు. 1991 నుండి ప్రతి సంవత్సరం 56 నుంచి 88 వరకూ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 85గా ఉందని బెన్ ఆండ్రూస్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయని ఆయన అన్నారు. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ అందించిన తాజా అప్డేట్లో జపనీస్ ద్వీపం ఐవో జిమాలోని నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం, ఐస్లాండ్లోని ఫాగ్రాడల్స్‌ఫ్జల్, రష్యాలోని క్లూచెవ్స్కోయ్లు చేరాయి. జపనీస్ అగ్నిపర్వత దీవులలోని నీటి అడుగునవున్న అగ్నిపర్వతం అక్టోబరు 30న విస్ఫోటనం చెందింది. దీని శిలాద్రవం నీటి ఉపరితలాన్ని ఛేదించి, కొత్త ద్వీపాన్ని సృష్టించింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ)తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ప్రతి రెండు నిమిషాలకు ఇవో జిమా వద్ద అగ్నిపర్వత ప్రకంపనలు నమోదయ్యాయి. రష్యాలోని క్లూచెవ్స్కాయా సోప్కా అగ్నిపర్వతం ఇటీవలే విస్ఫోటనం చెందింది. సమయంలో సముద్ర మట్టానికి 8 మైళ్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. ఈ నేపధ్యంలో భద్రత దృష్ట్యా పలు పాఠశాలలను మూసివేశారు. కాగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వతం ఇంకా పూర్తిగా విస్ఫోటనం చెందలేదు. అయితే విస్పోటనానికి సంబంధించిన సంకేతాలు వెలువడుతున్నందున స్థానిక అధికారులు గ్రిండవిక్ పట్టణాన్ని ఖాళీ చేయించారు. అగ్ని పర్వతం ఎలా ఏర్పడుతుంది? అగ్ని పర్వతం అంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక చిల్లు లేదా ఒత్తిడి కారణంగా ఏర్పడిన ఒక పగులు. దీని నుంచి వేడి మేగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకు వెలువడుతాయి. సాధారణంగా భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న చోట అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డులో ఇటువంటి ప్రదేశం ఉంది. దానిని మిడ్ అట్లాంటిక్ రిడ్జి అని అంటారు. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు దూరంగా జరగడం వల్ల ఏర్పడింది. అగ్ని పర్వతాలు ఏర్పడడానికి టెక్టోనిక్ ప్లేట్లు కదలిక ఒక్కటే కారణం కాదు. భూమి కింది భాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు సాగిపోయి, పల్చబడటం కారణంగానూ అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. తూర్పు ఆఫ్రికాలో ఉన్న తూర్పు ఆఫ్రికా రిప్ట్, ఉత్తర అమెరికాలో ఉన్న రియో గ్రేండి రిఫ్ట్ ఈ విధమైన అగ్ని పర్వతాలకు ఉదాహరణలు. అగ్ని పర్వతంలో ఏముంటాయి? మాగ్మా చాంబర్: ఇది భూమిలోని అట్టడుగున లావాతో, గ్యాస్ , బూడిదలతో నిండిపోయి ఉంటుంది. సిల్: పర్వతంలోని లోపలి పొరల్లోకి లావాని తీసుకెళుతుంది. డైక్: పైప్ లోని ఒక బ్రాంచ్. ఇది సిల్ వరకు లావాను చేరుస్తుంది. లావా లేయర్స్: ఇవి పర్వతంలో బూడిదతో నిండి ఉంటాయి. వీటి నుంచే బూడిద వెలువడుతుంది. అగ్ని పర్వతం పేలినప్పుడు ఈ లేయర్లలోని లావా బయటకు ఎగజిమ్ముతుంది. పారసైటిక్ కోన్: పర్వతం రగులుతున్నదశలో దీనిద్వారా లావా వెలువడి బయటకు వస్తుంది. లావా ఫ్లో: కోన్ నుంచి బయటకు లావా వెలువడుతుంది. వెంట్: ఇది పర్వతపు ముఖద్వారం. ఇది బయటకు లావాను, బూడిదను విడుదల చేసే భాగం. క్రేటర్: పర్వతం కొనలో ఏర్పడిన గొయ్యి భాగం. యాష్ క్లౌడ్: పర్వతం పేలడానికి ముందుగా వెలువడే బూడిద మేఘం. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
కరిగి, విరిగిన ‘బేబీ’ అగ్ని పర్వతం
అదో కొత్త అగ్ని పర్వతం.. రెండు వారాల కిందే పుట్టింది.. ఇంతలోనే అంతెత్తున పెరిగింది.. లోపలి నుంచి ఉబికివచ్చిన లావా వేడికి అంచులు కరిగి, విరిగి పడింది. లావాను బాంబుల్లా ఎగజల్లింది. ఐస్‌ల్యాండ్‌లోని రేక్జానెస్ ద్వీపకల్పం ప్రాంతంలోని ‘బేబీ’ అగ్నిపర్వతం విశేషమిది. అగ్నిపర్వతాలకు నిలయమైన రేక్జానెస్ ప్రాంతంలో గత నెల రోజుల్లో ఏకంగా ఏడు వేల భూప్రకంపనలు వచ్చాయి. రెండు వారాల కింద ఓ చోట అకస్మాత్తుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున భూమిలో పగుళ్లు వచ్చాయి. అందులో ఓ చోట లావా వెలువడటం మొదలై, మెల్లగా అగ్ని పర్వతంలా ఏర్పడింది. ప్రస్తుతం ‘బేబీ వల్కనో’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం.. రెండు రోజుల కింద తీవ్రస్థాయిలో లావా వెలువరించడం మొదలుపెట్టింది. అది తీవ్ర స్థాయికి చేరి ఓ పక్క విరిగి.. లావా నదిలా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐస్‌ల్యాండ్ యూనివర్సిటీ వల్కనాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్ పరిశోధకుల బృందం విడుదల చేసింది. -
మన గడ్డపై ఇండోనేసియా బూడిద!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఇండోనేసియా పరిధిలోని సుమత్రా దీవుల్లో సుమారు 80 వేల ఏళ్ల కిందట ఓసారి, దాదాపు 75 వేల ఏళ్ల క్రితం మరోసారి అతిభీకరమైన పేలుళ్లతో రెండు సూపర్ వోల్కనోలు బద్దలయ్యాయి. వాటిలో రెండోసారి బద్దలైన టోబా అగ్నిపర్వతం రేపిన ఈ ధూళిని ‘యంగర్ టోబా టఫ్–2’గా ప్రపంచ పరిశోధకులు నామకరణం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆ దుమ్ము, ధూళి, బూడిద రేణువులు వాతావరణంలో వ్యాపించి కొన్నేళ్లపాటు ప్రయాణించి క్రమంగా భూమిపైకి చేరాయి. సముద్రంలో కొన్ని రేణువులు మేటలు వేయగా నదుల్లో పడ్డప్పుడు నీటి ప్రవాహంలో ముందుకు సాగి కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయాయి. ఏపీలోని బనగానపల్లి వద్ద జుర్రేరు సమీపంలోని జ్వాలాపురం, సాగిలేరు, తెలంగాణాలోని ఖమ్మం సమీపంలోని ముర్రేరు, మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పేరుకున్నాయి. తాజాగా హస్తాల్‌పూర్‌లో కనిపించినవి అందులో భాగమే. రంగంలోకి దిగిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం... గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టి ఈ తరహా సుద్దమేటల రహస్యాన్ని ఛేదించగా తాజాగా తెలంగాణ పరిధిలోని హస్తాల్‌పూర్‌లో అదే తరహా సుద్దమేటల రహస్యం వెలుగులోకి వచ్చింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు భద్ర గిరీశ్ ఈ సుద్ద నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరిశీలించగా కిలో సుద్దలో దాదాపు 5 మిల్లీగ్రాముల దాకా గంధకం ఉన్నట్లు తేలింది. అలాగే అగ్నిపర్వత లావాకు సంబంధించిన సూక్ష రేణువులు కనిపించాయి. ఇందులో కర్బనం లేకపోవడంతో ఇది సాధారణ బూడిద కాదని స్పష్టమైంది. ఈ విషయాన్ని జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్లగా ఇది సుమత్రా దీవుల్లో దాదాపు 75 వేల ఏళ్ల క్రితం బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన ధూళికణాలతో ఏర్పడ్డ మేటలేనని నిర్ధారించారు. ఇవి బూడిద మేటలు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం హస్తాల్పూర్ ప్రాంతంలో అర కిలోమీటర్ మేర మేట వేసిన సుద్ద ముద్దలు. మంజీరా తీరంలో ప్రవాహం కోతకు గురైన ప్రాంతంలో ఈ మేటలు కనిపిస్తున్నాయి. ఇందులో పెద్ద విశేషం ఏముందంటారా? ఇక్కడే విస్తు గొలిపే, ఆసక్తిరేపే నేపథ్యం దాగి ఉంది. ఇవి వేల ఏళ్ల కిందట నాటివి!! పైగా సుమారు 3,200 కి.మీ. దూరం నుంచి గాలివాటానికి తరలి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చాయి!! -
రష్యాలో ఒళ్లు విరుచుకున్న అగ్నిపర్వతాలు
మాస్కో: రష్యాలో రాజధాని మాస్కోకు 6,600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో కంచట్కా ద్వీపకల్పంలో రెండు అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితి నుంచి మేల్కొని ఒళ్లు విరుచుకున్నాయి. భారీ పరిమాణంలో లావాను వెదజల్లుతున్నాయి. వాటినుంచి వెలువడుతున్న లావా, ధూళి మేఘాలు సుదూరాల దాకా కన్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అతి త్వరలో పూర్తిస్థాయిలో బద్దలయ్యే ప్రమాదముందన్నారు. శనివారం సంభవించిన గట్టి భూకంపమే ఇందుకు కారణమట. వీటిలో క్లుచెవ్స్కయా స్పోకా అగ్నిపర్వతం నుంచి గంటకు ఏకంగా పదిసార్లు భారీ పేలుళ్లు వెలువడుతున్నాయట! 4,754 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది యురేషియాలోకెల్లా అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. కంచట్కా ద్వీపకల్ప ప్రాంతం ఏకంగా 30కి పైగా చురుకైన అగ్నిపర్వతాలకు నిలయం! -
900 ఏళ్లకు నిద్రలేచి.. వణికించి.. భయపెట్టి
వరుసగా భూకంపాలు.. రాత్రిలేదు, పగలు లేదు.. ప్రతి నిమిషం వణుకే.. ప్రతి క్షణం భయం భయమే. ఒకటీ రెండూ కాదు.. కేవలం మూడు వారాల్లో ఏకంగా 50 వేల ప్రకంపనలు. ఓ రోజు ఉన్నట్టుండి ఆగిపోయాయ్. హమ్మయ్య అనుకోవడానికి లేదు. భూకంపాలు ఆగిపోగానే.. అగ్ని పర్వతం పేలడం మొదలైంది. కుతకుతా ఉడుకుతున్న ఎర్రని లావా పెల్లుబుకుతూ ప్రవహిస్తోంది. అటు యూరప్.. ఇటు అమెరికా ఖండాల మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఐస్‌ల్యాండ్‌లో కొద్దిరోజులుగా పరిస్థితి ఇది. ఇక్కడ 900 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న ఫగ్రడాల్స్జల్ అగి్నపర్వతం తాజాగా బద్దలైంది. సుమారు కిలోమీటరు వెడల్పుతో లావా ఓ నదిలా ప్రవహిస్తోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు ఓ డ్రోన్ సాయంతో అగ్ని పర్వతం పేలుడును చిత్రీకరించారు. ఓ వైపు మంచు గ్లేసియర్లు, వేడి నీటి ఊటలు, మరోవైపు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన ఐస్‌ల్యాండ్‌లో.. ఏకంగా 32 అగి్నపర్వతాలు ఉండటం గమనార్హం. -
ఎక్కడో బద్దలైతే ఇక్కడ కంపిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: వేల మైళ్ల దూరంలో అగ్నిపర్వతం బద్దలైతే మన దగ్గర భూమి కంపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూప్రకంపనలకు అదే కారణమన్న విషయాన్ని కొట్టిపారేయలేమని వారు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఆ ప్రభావం కారణంగా కంపనాలు చోటుచేసుకోవచ్చని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగం విశ్రాంత అధిపతి ప్రొఫెసర్ జి.రాందాస్ అభిప్రాయపడుతున్నారు. ‘కచ్చితంగా అదే కారణం అని చెప్పలేకున్నా.. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూఅంతర్భాగంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమై భూ పొరల్లో చలనం ఏర్పడుతుంది. దీంతో భూ ఫలకాలు కదిలి పరస్పరం ఢీకొని ప్రకంపనలు జరిగే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్భవించిన ప్రకంపనలకు అది కారణం కాదని కూడా చెప్పలేం’అని పేర్కొన్నారు. క్వారీ పేలుళ్ల వల్ల మాత్రం ఈ ప్రకంపనలు ఏర్పడలేదని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రమాదమేమీ కాదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలు భూకంప ప్రభావిత ప్రాంత పరిధిలో ఉన్నాయి. కానీ, ప్రమాదకర జోన్లో మాత్రం లేవు. ప్రస్తుతం భూమి కంపించిన ప్రధాన ప్రాంతమైన సూర్యాపేట పరిసరాలు సహా తెలంగాణ పరిధి భూకంప ప్రభావం అంతగా లేని రెండో జోన్ పరిధిలో ఉండగా, ఏపీ ప్రాంతం రెండో జోన్లో, విజయవాడ పరిసరాలు లాంటి కొన్ని ప్రాంతాలు మూడో జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ, ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు కావటం కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇంత తీవ్రతతో భూమి కంపించలేదు. జోన్ పరిధి మారనుందా.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రమాదం కాని జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ తాజా ప్రకంపనలు కొంత శక్తిమంతమైనవే. అంత తీవ్రతతో మళ్లీ కొన్నిసార్లు ప్రకంపనలు వస్తే మాత్రం కచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గుర్తించాల్సి ఉంటుంది. ప్రమాదం తరచూ సంభవించదు. కానీ ఉన్నట్టుండి భారీ ప్రకంపనలు చోటు చేసుకుంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అలా అని భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. మళ్లీ ఆ స్థాయి ప్రకంపనలు తక్కువ సమయంలో పలుసార్లు ఏర్పడితేనే ఆందోళన చెందాలి. అమరావతి వైపు వస్తే భారీ నష్టమే.. ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా వెల్లటూరు కేంద్రంగా ఏర్పడ్డ భూ ప్రకంపనలు తెలంగాణ వైపు ప్రభావం చూపాయి. కానీ, ప్రకంపనల దిశ అమరావతి వైపు ఉండి ఉంటే అక్కడ కచ్చితంగా నష్టం జరిగి ఉండేది. ఇక్కడ నమోదైన 4.7 ప్రభావం అమరావతి పరిసరాల్లో ఏర్పడితే భవనాలు కూలి ఉండేవి. తెలంగాణ వైపు గట్టి నేల ఉండటంతో పాటు, సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తుతో భూమి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఏర్పడి ఉంది. భూమి పొరల్లో కలిగిన మార్పులే దీనికి కారణం. అవి భూకంప తరంగాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రకృతిసిద్ధ ఏర్పాటు అమరావతివైపు లేదు. ఫలితంగా ప్రకంపనల ప్రభావం తగ్గదు. సాధారణంగా రిక్టర్‌స్కేల్‌పై 4 నమోదైతే భారీ నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఢిల్లీ ప్రమాదకర 4వ జోన్ పరిధిలో ఉన్నా, అక్కడి నేల గట్టిది. ఫలితంగా ఢిల్లీ కంటే విజయవాడ పరిసరాలే ప్రమాదకరంగా మారతాయి. అప్పుడే హెచ్చరించారు ఎన్జీఆర్ఐ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త చడ్డా గతంలోనే విజయవాడ పరిసరాలపై భూకంప ప్రభావం ఉండే అవకాశం ఉండొచ్చని హెచ్చరించారు. గరిష్టంగా రిక్టర్‌స్కేల్‌పై 6.5 వరకు నమోదయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. కానీ అది ఎప్పుడోతప్ప నమోదయ్యే అవకాశం లేదన్నారు. నదీ సంగమాల ప్రభావం కూడా ప్రకంపనాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుందని, మూసీ–కృష్ణా సంగమం ఉండే సూర్యాపేట జిల్లా పరిధిలో భూగర్భంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కృష్ణాతీరం కూడా దీనికి మినహాయింపు కాదు. మేం వజ్రాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పరిశోధన జరిపినప్పుడు, భూమి పొరల్లో భారీ పగుళ్లున్న విషయాన్ని గుర్తించాం. భూగర్భంలోని కోర్ ప్రాంతంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమైనప్పుడు అది ఈ పగుళ్ల నుంచే వెలుపలికి వస్తుంది. అది ప్రకంపనలకు అవకాశం ఇస్తుంది. విజయవాడ చుట్టు ఇలాంటి భారీ పగుళ్లు దాదాపు 22 వరకు ఉన్నట్టు గతంలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడవైపు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన బోరు తవ్వకాలు మంచిది కాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల కోసం 1,200 నుంచి 2 వేల అడుగుల వరకు బోర్లు వేస్తున్నారు. అలాగే నీటి ప్రవాహానికి ఉన్న సహజసిద్ధ మార్గాలను మూసేస్తున్నారు. ఈ రెండు చర్యలు భూమి పొరల్లో మార్పులకు కారణమవుతాయి. అవి కూడా భూకంపాలకు అవకాశం కలిగించొచ్చు. ఈ తీరును నిరోధించే చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ఎప్పటికైనా ప్రమాదాలు తప్పవు. -
అగ్నిపర్వతాల వల్ల కాదు
వాషింగ్టన్: డైనోసార్లు దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల కింద అంతరించిపోవడానికి భారత్‌లో సంభవించిన అగ్ని పర్వతాల విస్ఫోటం కారణం కాదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. క్రిటేషియస్, పేలియోజీన్ కాలాల మధ్య దాదాపు మూడొంతుల వృక్ష, జంతు జాతులు నశించాయని, అందులో డైనోసార్లు కూడా అంతరించి పోయాయనే చర్చ జరుగుతోంది. అయితే భారత్‌లో విస్ఫోటం చెందిన అగ్నిపర్వతాల నుంచి కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల కారణంగానే అలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే కార్బన్‌డై ఆక్సైడ్‌ను శోషించుకున్న సముద్రాల్లో ఎసిడిటీ పెరిగి అది తిరిగి వాతావరణంలోకి కార్బన్‌డై ఆక్సైడ్ పంపటం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల డైనోసార్లు అంతరించిపోయి ఉంటాయని పేర్కొన్నారు. -
అన్వేషణం: ఎడారి కాదు... నరకానికి దారి!
ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాలు, ఉప్పు మేటలు, లావాగ్ని శిలలు, వేడి వాతావరణం... అక్కడ అడుగుపెట్టింది ఆలస్యం... అనేక రూపాల్లో మృత్యువు వెంటాడుతుంది. అందుకే డనకిల్ డెజర్జ్ని ‘నరక ముఖద్వారం’గా అభివర్ణించారు శాస్త్రవేత్తలు. సముద్రమట్టానికి వంద అడుగుల లోతులో ఉండే డనకిల్ ఎడారి వాతావరణం అత్యంత భయానకంగా ఉంటుంది. జీవి మనుగడకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల లిస్టును తయారు చేస్తే తొలిస్థానం ఈ ఎడారికే దక్కుతుందంటారు శాస్త్రవేత్తలు. ఆఫ్రికాలోని ఇథియోపియా దేశానికి ఉత్తరార్ధభాగంలో ఉన్న ఈ ఎడారి లో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఎప్పుడూ అగ్నిపర్వతాలు బద్ధలువుతూనే ఉంటాయి. ఫలితంగా వెలువడే లావా ప్రవాహంతో ఇక్కడి వాతావరణం విపరీతమైన వేడిని సంతరించుకుంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 60 డిగ్రీల సెంటిగ్రేడ్ స్థాయిలో ఉంటుంది. కొన్ని సమయాల్లో 145 డిగ్రీల సెంటిగ్రేడ్స్కు కూడా చేరుతుంటుందని పరిశోధకులు అంటారు. ఎడారిలో జీవనం కష్టమే కావచ్చు కానీ... ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరు ఎడారే. మైనింగ్ ఇక్కడ ఒక లాభసాటి వృత్తి. ఇక్కడి ముడి ఖనిజాలను ఒంటెల ద్వారా, గాడిదల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ ప్రాంతంలోనే ఒక ఉప్పునీటి సరస్సు కూడా ఉంది. ఇది స్థానిక ప్రజలకు ప్రత్యక్ష్య దైవమే! ఇంత వేడిమి పరిస్థితుల్లోనూ ఈ సరస్సు నుంచి ఉప్పు ఉత్పత్తి చేస్తూ గిరిజన జాతుల వారు మనుగడ సాగిస్తుండటం విశేషం. వాళ్లంతా ఉప్పును ‘తెల్లబంగారం’ అని అభివర్ణిస్తుంటారు. వాతావరణంలోని మార్పుల కారణంగా ఉప్పుమేటలు రంగురంగులుగా మెరుస్తూ ఉంటాయి. వీటి కారణంగానే దూరం నుంచి చూసినప్పుడు ఈ ఎడారి అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలా అని అడుగు పెట్టామా... నరకంలో కాలు పెట్టినట్టే. అందుకే సాహస క్రీడలపై ఆసక్తి ఉన్న వారు... ఇక్కడ ఇంతసేపు ఉండాలి, అంతసేపు ఉండాలి అంటూ పందాలు వేసుకుంటారు! చైనాలో మృతసముద్రం మృతసముద్రం (డెడ్ సీ) గురించి విన్నారు కదా! లవణ ఖనిజాలు అత్యధికంగా ఉండటం వల్ల ఈ సముద్రంలో ఏదీ మునగదు. మనం వెళ్లి దూకినా... తేలతాం తప్ప మునిగిపోం. ఇలాంటిదే ఒకటి చైనాలో కూడా ఉంది. అయితే అది నిజంగా సముద్రం కాదు. ప్రత్యేకంగా నిర్మించిన ఓ స్విమ్మింగ్ పూల్. చైనాలోని డేయింగ్ కౌంటీలో, ముప్ఫైవేల చదరపు మీటర్ల స్థలంలో అతి పెద్ద స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. దీని నిర్మాణానికి స్ఫూర్తి మృతసముద్రమే. అందులో ఎలాగైతే మునగరో ఈ పూల్‌లో కూడా మునగరు. ఎందుకంటే, దీనిలో ఉప్పునీటిని నింపారు. దానికి కారణం... ఈత నేర్చుకోవాలనుకునేవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కొలనును నిర్మించడమే. ఇందులో ఒకేసారి పదివేల మంది ఈత కొట్టవచ్చు. కానీ పదిహేను వేల మంది వరకూ వచ్చేస్తుండటంతో కొలను నిండిపోతోంది.