అన్వేషణం: ఎడారి కాదు... నరకానికి దారి!
ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాలు, ఉప్పు మేటలు, లావాగ్ని శిలలు, వేడి వాతావరణం... అక్కడ అడుగుపెట్టింది ఆలస్యం... అనేక రూపాల్లో మృత్యువు వెంటాడుతుంది. అందుకే డనకిల్ డెజర్జ్‌ని ‘నరక ముఖద్వారం’గా అభివర్ణించారు శాస్త్రవేత్తలు.
సముద్రమట్టానికి వంద అడుగుల లోతులో ఉండే డనకిల్ ఎడారి వాతావరణం అత్యంత భయానకంగా ఉంటుంది. జీవి మనుగడకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల లిస్టును తయారు చేస్తే తొలిస్థానం ఈ ఎడారికే దక్కుతుందంటారు శాస్త్రవేత్తలు. ఆఫ్రికాలోని ఇథియోపియా దేశానికి ఉత్తరార్ధభాగంలో ఉన్న ఈ ఎడారి లో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఎప్పుడూ అగ్నిపర్వతాలు బద్ధలువుతూనే ఉంటాయి. ఫలితంగా వెలువడే లావా ప్రవాహంతో ఇక్కడి వాతావరణం విపరీతమైన వేడిని సంతరించుకుంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 60 డిగ్రీల సెంటిగ్రేడ్ స్థాయిలో ఉంటుంది. కొన్ని సమయాల్లో 145 డిగ్రీల సెంటిగ్రేడ్స్‌కు కూడా చేరుతుంటుందని పరిశోధకులు అంటారు.
ఎడారిలో జీవనం కష్టమే కావచ్చు కానీ... ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరు ఎడారే. మైనింగ్ ఇక్కడ ఒక లాభసాటి వృత్తి. ఇక్కడి ముడి ఖనిజాలను ఒంటెల ద్వారా, గాడిదల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ ప్రాంతంలోనే ఒక ఉప్పునీటి సరస్సు కూడా ఉంది. ఇది స్థానిక ప్రజలకు ప్రత్యక్ష్య దైవమే! ఇంత వేడిమి పరిస్థితుల్లోనూ ఈ సరస్సు నుంచి ఉప్పు ఉత్పత్తి చేస్తూ గిరిజన జాతుల వారు మనుగడ సాగిస్తుండటం విశేషం. వాళ్లంతా ఉప్పును ‘తెల్లబంగారం’ అని అభివర్ణిస్తుంటారు. వాతావరణంలోని మార్పుల కారణంగా ఉప్పుమేటలు రంగురంగులుగా మెరుస్తూ ఉంటాయి. వీటి కారణంగానే దూరం నుంచి చూసినప్పుడు ఈ ఎడారి అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలా అని అడుగు పెట్టామా... నరకంలో కాలు పెట్టినట్టే. అందుకే సాహస క్రీడలపై ఆసక్తి ఉన్న వారు... ఇక్కడ ఇంతసేపు ఉండాలి, అంతసేపు ఉండాలి అంటూ పందాలు వేసుకుంటారు!
చైనాలో మృతసముద్రం
మృతసముద్రం (డెడ్ సీ) గురించి విన్నారు కదా! లవణ ఖనిజాలు అత్యధికంగా ఉండటం వల్ల ఈ సముద్రంలో ఏదీ మునగదు. మనం వెళ్లి దూకినా... తేలతాం తప్ప మునిగిపోం. ఇలాంటిదే ఒకటి చైనాలో కూడా ఉంది. అయితే అది నిజంగా సముద్రం కాదు. ప్రత్యేకంగా నిర్మించిన ఓ స్విమ్మింగ్ పూల్. చైనాలోని డేయింగ్ కౌంటీలో, ముప్ఫైవేల చదరపు మీటర్ల స్థలంలో అతి పెద్ద స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. దీని నిర్మాణానికి స్ఫూర్తి మృతసముద్రమే. అందులో ఎలాగైతే మునగరో ఈ పూల్‌లో కూడా మునగరు. ఎందుకంటే, దీనిలో ఉప్పునీటిని నింపారు. దానికి కారణం... ఈత నేర్చుకోవాలనుకునేవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కొలనును నిర్మించడమే. ఇందులో ఒకేసారి పదివేల మంది ఈత కొట్టవచ్చు. కానీ పదిహేను వేల మంది వరకూ వచ్చేస్తుండటంతో కొలను నిండిపోతోంది.