సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఇండోనేసియా పరిధిలోని సుమత్రా దీవుల్లో సుమారు 80 వేల ఏళ్ల కిందట ఓసారి, దాదాపు 75 వేల ఏళ్ల క్రితం మరోసారి అతిభీకరమైన పేలుళ్లతో రెండు సూపర్ వోల్కనోలు బద్దలయ్యాయి. వాటిలో రెండోసారి బద్దలైన టోబా అగ్నిపర్వతం రేపిన ఈ ధూళిని ‘యంగర్ టోబా టఫ్–2’గా ప్రపంచ పరిశోధకులు నామకరణం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆ దుమ్ము, ధూళి, బూడిద రేణువులు వాతావరణంలో వ్యాపించి కొన్నేళ్లపాటు ప్రయాణించి క్రమంగా భూమిపైకి చేరాయి. సముద్రంలో కొన్ని రేణువులు మేటలు వేయగా నదుల్లో పడ్డప్పుడు నీటి ప్రవాహంలో ముందుకు సాగి కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయాయి. ఏపీలోని బనగానపల్లి వద్ద జుర్రేరు సమీపంలోని జ్వాలాపురం, సాగిలేరు, తెలంగాణాలోని ఖమ్మం సమీపంలోని ముర్రేరు, మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పేరుకున్నాయి. తాజాగా హస్తాల్‌పూర్‌లో కనిపించినవి అందులో భాగమే.
రంగంలోకి దిగిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం...
గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టి ఈ తరహా సుద్దమేటల రహస్యాన్ని ఛేదించగా తాజాగా తెలంగాణ పరిధిలోని హస్తాల్‌పూర్‌లో అదే తరహా సుద్దమేటల రహస్యం వెలుగులోకి వచ్చింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు భద్ర గిరీశ్ ఈ సుద్ద నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరిశీలించగా కిలో సుద్దలో దాదాపు 5 మిల్లీగ్రాముల దాకా గంధకం ఉన్నట్లు తేలింది.
అలాగే అగ్నిపర్వత లావాకు సంబంధించిన సూక్ష రేణువులు కనిపించాయి. ఇందులో కర్బనం లేకపోవడంతో ఇది సాధారణ బూడిద కాదని స్పష్టమైంది. ఈ విషయాన్ని జీఎస్‌ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్లగా ఇది సుమత్రా దీవుల్లో దాదాపు 75 వేల ఏళ్ల క్రితం బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన ధూళికణాలతో ఏర్పడ్డ మేటలేనని నిర్ధారించారు.
ఇవి బూడిద మేటలు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం హస్తాల్‌పూర్ ప్రాంతంలో అర కిలోమీటర్ మేర మేట వేసిన సుద్ద ముద్దలు. మంజీరా తీరంలో ప్రవాహం కోతకు గురైన ప్రాంతంలో ఈ మేటలు కనిపిస్తున్నాయి. ఇందులో పెద్ద విశేషం ఏముందంటారా? ఇక్కడే విస్తు గొలిపే, ఆసక్తిరేపే నేపథ్యం దాగి ఉంది. ఇవి వేల ఏళ్ల కిందట నాటివి!! పైగా సుమారు 3,200 కి.మీ. దూరం నుంచి గాలివాటానికి తరలి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చాయి!!
Comments
Please login to add a commentAdd a comment