సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘తబ్లిగీ జమాత్’కేసులో మరో ముందడుగు పడింది. మత ప్రార్థనల కోసం భారత్‌కు వచ్చిన 2,300 మంది విదేశీయుల్లో ఇండోనేసియన్లే అధికశాతం ఉన్నారు. వీరంతా విజిటింగ్ వీసా నిబంధనలను ఉల్లంఘించడంతో కేంద్ర హోంశాఖ వీరిని బ్లాక్‌లిస్టులో పెట్టింది. వీరికి దేశంలో 10 ఏళ్ల పాటు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని కరీంనగర్‌లో ఇండోనేసియన్లు సంచరించడం, వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 15న ఈ విషయం బయటికి తెలిసింది. వెంటనే తెలంగాణకు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు వీరంతా విజిటింగ్ వీసాపై వచ్చారని, ఇది అక్రమమని పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోగా ఎగతాళి చేశారు.
కానీ, ఆయన పట్టు వదలకుండా మార్చి 24న ఇండోనేసియాలోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందులో 2019 ఆగస్టు నుంచి 2020 మార్చి 19 వరకు ఎంతమంది ఇండోనేసియన్లకు విజిటింగ్ వీసాలు ఇచ్చారో తెలపాలని కోరాడు. అక్కడ నుంచి నాలుగు రోజుల్లోనే సమాధానం వచ్చింది. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని భారత దౌత్యకార్యాలయం ద్వారా 1,405 మంది ఇండోనేసియన్లకు భారత్‌లో పర్యటించేందుకు విజిటింగ్ వీసాలను మాత్రమే ఇచ్చామని, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన మతపరమైన లేదా మిషనరీ వీసాలు ఇవ్వలేదని సమాధానంలో పేర్కొంది.
ఆధారాలు చూపినా.. వద్దన్నారు!
ఈ వివరాలు పట్టుకుని కూడా సదరు ఉద్యమకారుడు చాలామంది ఉన్నతాధికారులను కలిశాడు. వారు అతన్ని పట్టించుకోకపోగా.. ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. విచిత్రంగా కేంద్ర హోంశాఖ దేశంలో అక్రమంగా పర్యటిస్తోన్న విదేశీయులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఏప్రిల్ మొదటివారంలో హుటాహుటిన సదరు ఉద్యమకారుడిని అధికారులు సంప్రదించి అతని వద్ద ఉన్న వివరాలను అడిగి తీసుకోవడం కొసమెరుపు. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటేంటే.. దాదాపు 2 వేలకు పైగా ఇండోనేసియన్లు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. 1,400 మందికి మాత్రమే తాము వీసాలు జారీ చేశామని చెబుతుండగా.. మిగిలిన 600లకుపైగా వీసాలన్నీ ఆన్ అరైవల్‌గా తీసుకున్నవిగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment