Embassy of India
-
2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు
సాక్షి, న్యూఢిల్లీ: 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలను జారీ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. 2022తో పోలిస్తే ఇది 60 శాతం ఎక్కువని వివరించింది. ఏ దేశానికీ ఇన్ని వీసాలు జారీ కాలేదని పేర్కొంది. విజిటింగ్ వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ సమయం 1,000 రోజుల నుంచి 250 రోజులకు (75 శాతం) తగ్గిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులేనని ప్రకటించింది. బీ1, బీ2 కేటగిరీల విజిటర్ వీసాల కోసం మునుపెన్నడూ లేనంతగా 7 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపింది. స్టూడెంట్ వీసాల జారీలో దేశంలో ముంబై, డిల్లీ, హైదరాబాద్, చెన్నై టాప్‌లో ఉన్నాయంది. అమెరికాలో చదివే 10 లక్షల పైచిలుకు అంతర్జాతీయ విద్యార్థుల్లో 2.5 లక్షల మంది భారతీయులేనని ఢిల్లీ ఎంబసీ తెలిపింది. -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇజ్రాయెల్ ఎంబస్సీపై బాంబులు వేస్తామంటూ పోలీసులకు దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు గుర్తు తెలియని వ్యక్తి అగ్ని మాపకశాఖ పోలీసులకు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించనుందని పేర్కొన్నాడు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేయడంతో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఫోన్ కాల్‌పై సమగ్ర విచారణ జరుగుతోంది. ఢిల్లీలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఉంది. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
నగరవాసికి 'జపాన్' జాబ్ కలకలం! బెంగళూరు జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో ఉద్యోగం ఉందంటూ నగరవాసిని నట్టేట ముంచారు సైబర్ నేరస్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.29.27 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూసాపేటకు చెందిన యువతి గత జులైలో ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతకగా.. ఓ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఈ–మెయిల్ వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థలో సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం ఉందని మెయిల్ సారాంశం. ఆగస్టు నెలలో కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న కోజిన్ నాకాకిత బాధితురాలిని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశాడు. ఆ మర్నాడు ఉదయం ఆమె మెయిల్‌కు కంపెనీ నుంచి జాబ్‌కు సెలెక్ట్ అయ్యావంటూ జీతభత్యాలు, బెనిఫిట్స్‌తో కూడిన ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే డాక్యుమెంటేషన్, జీఎస్టీ ఇతరత్రా చార్జీల కోసం రూ.33,780 డిపాజిట్ చేయాలని ప్రతినిధులు సూచించడంతో.. నిజమేనని నమ్మిన ఆమె సొమ్మును బదిలీ చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికి పెట్టుబడుల మీద 40 శాతం బోనస్‌తో కలిపి వస్తాయని ఆశ చూపించడంతో రూ.29,27,780 పెట్టుబడులు పెట్టింది. జీ–20 సదస్సుతో క్యాన్సిల్ అంటూ.. ఢిల్లీలో జపాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని బాధితురాలిని నమ్మించారు. రోజులు గడుస్తున్నా మీటింగ్ ఖరారు కాకపోవడంతో ఆరా తీయగా.. ఢిల్లీలో జీ–20 సమావేశాల నేపథ్యంలో మీటింగ్ వాయిదా పడిందని మాయమాటలు చెప్పారు. ఈసారి సమావేశం బెంగళూరులో అక్టోబర్ నెలలో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశం కూడా జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు బెంగళూరులోని జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి ఖంగుతింది. అసలు సదరు జపాన్ కంపెనీ ఎలాంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టలేదని తెలిసింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. ఇవి చదవండి: సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే? -
Ukraine: భారతీయులకు తీవ్ర హెచ్చరికలు
న్యూఢిల్లీ/కీవ్: ఉక్రెయిన్‌లో మళ్లీ దాడులు ఉధృతం కావడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ వెళ్తున్నవాళ్లకు, ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు సోమవారం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. అనవసర ప్రయాణాలొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని వారిని కోరింది. రాజధాని కీవ్ నగరంతో పాటు ఉక్రెయిన్‌లోని పలు చోట్ల రష్యా మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. భారత్ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. సుమారు 84కిపైగా మిస్సైల్స్ ఉక్రెయిన్ భూభాగంలో విధ్వంసం సృష్టించగా.. సుమారు పది మంది పౌరులు మృతి చెందారని, మరో 60 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం పెరుగుతున్న దాడుల దృష్ట్యా.. భారతీయ పౌరులు ఉక్రెయిన్‌కు, ఉక్రెయిన్ లోపల కూడా అన్ని అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉక్రెయిన్ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసిన రక్షిత, భద్రతా మార్గదర్శకాలను వారు ఖచ్చితంగా పాటించాలి అని ఉక్రెయిను్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి అడ్వైజరీ విడుదల అయ్యింది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులు వాళ్ల వాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎంబసీకి తెలియజేయాలని, తద్వారా సాయం విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని పేర్కొంది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా ఉక్రెయిన్‌లో సంఘర్షణ తీవ్రతరం కావడంపై భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. యుద్ధవిరమణకు తక్షణ పిలుపు ఇచ్చారాయన. మరోవైపు.. ఇప్పటిదాకా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను భారత్ ఖండించింది లేదు. దౌత్యం-చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ వస్తోంది. -
కువైట్‌లో చిక్కుకున్న మహిళకు ఏపీఎన్ఆర్టీఎస్ చేయూత
కడప కార్పొరేషన్: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన మహిళకు ఏపీఎన్ఆర్టీఎస్ చేయూతనందించింది. వివరాలిలా ఉన్నాయి.. వెంపటపు ప్రశాంతి అనే మహిళ జీవనోపాధి కోసం 2020లో కువైట్‌కు వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ప్రతినెలా జీతం పంపుతూ, కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఇటీవల తన వీసా గడువు ముగిసినా ఇండియాకు పంపకపోవడంతో ఆమె ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సాయం చేయమని అభ్యర్థించింది. స్పందించిన ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ మహేశ్వర్‌రెడ్డి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించి, ఆమెకు 10 రోజుల పాటు ఉచితంగా వసతి కల్పించటంతోపాటు తిరిగి ఇండియాకు తీసుకురావటానికి అవసరమైన పేపర్ వర్క్ అంతా పూర్తి చేయించారు. దీంతో ఆమె సోమవారం క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ.. తాను ఇండియాకు తిరిగి రావటానికి సాయపడిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, సీఈవో దినేష్‌కుమార్, డైరెక్టర్ బీహెచ్ ఇలియాస్, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి, ఎన్.మహేశ్వర్‌రెడ్డి, భారత రాయబార కార్యాలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఉక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు.. ఆ దేశాల మీదుగా ఇండియాకు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. రష్యన్ భాష మాట్లాడే అధికారులను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు, అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు పంపిస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇందుకోసం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు. ఉక్రెయిన్‌లోని మన దేశస్తులను భద్రంగా తీసుకురావాలని ప్రధాని మోదీ ఆదేశించారని హర్షవర్దన్ ఉద్ఘాటించారు. భారత వైమానికి దళం విమానాలతోపాటు వాణిజ్య విమానాలను వాడతామన్నారు. ఉక్రెయిన్తోపాటు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. భారత విద్యార్థులతో సహా ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో 4 వేల మంది తిరిగి వచ్చేశారు. మాకు రక్షణ కల్పించండి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి భారతీయ విద్యార్థులు గురువారం పోటెత్తారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, వారి కోసం భారత ఎంబసీ రక్షణపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంబసీ కల్పించిన వసతి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 200 మందికి పూర్తి భద్రతతో కూడిన తగిన వసతి కల్పించినట్లు సమాచారం. విద్యార్థులకు అడ్వైజరీ ఉక్రెయిన్‌లో విధించిన మార్షల్ లాతో రాకపోకలు కష్టతరంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించే వారు తమ సమీపంలోని బాంబు షెల్టర్లకు చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ‘ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు గూగుల్ మ్యాప్‌ల సాయంతో సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించండి. చాలా వరకు బాంబు షెల్టర్లు భూగర్భ మెట్రోల్లోనే ఉన్నాయి. చుట్టుపక్కల చోటుచేసుకునే పరిణామాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. అన్ని సమయాల్లోనూ గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలి’అని పేర్కొంది. మరోవైపు, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులందరినీ కాపాడేయత్నం చేస్తున్నామని భారత్‌లో ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖ తెలిపారు. భారత్ ప్రకటనలు సరిపోవని, శాంతిని నెలకొల్పే యత్నం చేయాలని ఇగోర్ పేర్కొన్నారు. రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం తన గగనతలాన్ని మూసివేయడంతో, ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గమధ్యంలోనే వెనుదిరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎయిరిండియా విమానం గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి కీవ్‌లోని బోరీస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. అప్పటికే రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పౌర విమానసేవలు చాలా ప్రమాదకరంగా మారినందున ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ సమయంలో ఇరాన్ గగనతలంపై ఉన్న ఆ విమానం తిరిగి వెనుదిరిగింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో 182 మంది భారతీయులు గురువారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది విద్యార్థులేనన్నారు. ఈ నెల 22వ తేదీన ఎయిరిండియా పంపిన మొదటి విమానంలో కీవ్‌లో ఉన్న 240 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఆఖరి క్షణంలో ఆగిపోయారు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి బయలుదేరిన ఇద్దరు భారత విద్యార్థులు రష్యా దాడుల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్‌లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రోణక్ షెరాసియా(18), అతడి స్నేహితుడు మహావీర్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 500 కిలోమీటర్ల దూరంలో చెర్నివిట్సీలో ఉన్న బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ(బీఎస్ఎంయూ)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారు గురువారం ఉదయం భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తెల్లవారుజామునే కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టు చెక్–ఇన్ కౌంటర్ వద్దకు వెళ్లగా విమానం రద్దయ్యిందని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదిలేక మళ్లీ బస్సులో యూనివర్సిటీకి బయలుదేరారు. కీవ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా, పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు పలుమార్లు వినిపించాయని రోణక్ షెరాసియా చెప్పాడు. ఆ భీకర శబ్దాలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని పేర్కొన్నాడు. -
యూఎస్ వీసా కోసం నిరీక్షణ తప్పదు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: విదేశీ ప్రయాణికులపై కోవిడ్–19 ఆంక్షల్ని అమెరికా ఎత్తేయడంతో చాలా మంది అగ్రరాజ్యానికి ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వీసా అపాయింట్మెంట్ కోసం మరింత కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వలసేతర వీసా కేటగిరీలో ఈ నిరీక్షణ తప్పదని పేర్కొంది. నవంబర్ 8 నుంచి అమెరికా ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు టీకా డోసులు వేసుకున్న దాదాపుగా 30 లక్షల మంది భారతీయులు అమెరికాకు ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపింది. ‘‘కోవిడ్ వల్ల ఏర్పడిన అంతరాయం నుంచి ఇప్పుడే కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నాం. అందువల్ల రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో పనులు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. వీసా అపాయింట్మెంట్ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి. వీలైనంత త్వరగా ఆ పనులు జరిగేలా చూస్తాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకే పెద్ద పీట వేస్తాం’’అని పేర్కొంది. రాయబార కార్యాలయ సిబ్బంది, ప్రయాణికులు భద్రంగా ఉండడానికే ప్రాధాన్యతనిస్తూ వీసా మంజూరు ప్రక్రియని వేగవంతం చేస్తామని స్పష్టం చేసింది. లక్షల మంది భారతీయులు వీసాల పునరుద్ధరణ/ కొత్త వీసాల జారీకి ఎదురుచూస్తుండడంతో యూఎస్ ఎంబసీల నుంచి అపాయింట్మెంట్లు అంత సులువుగా లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ వెళ్లేందుకు నిరీక్షిస్తున్న తెలుగువారు సైతం మరికొంత కాలం వేచిఉండాల్సి రావచ్చని యూఎస్ ఎంబసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉందని, ఆంక్షల నుంచి ఉపశమనం లభించినా వెంటనే యూఎస్ ప్రయాణాలు సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నాయి. -
అన్నీ విజిటింగ్ వీసాలే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘తబ్లిగీ జమాత్’కేసులో మరో ముందడుగు పడింది. మత ప్రార్థనల కోసం భారత్‌కు వచ్చిన 2,300 మంది విదేశీయుల్లో ఇండోనేసియన్లే అధికశాతం ఉన్నారు. వీరంతా విజిటింగ్ వీసా నిబంధనలను ఉల్లంఘించడంతో కేంద్ర హోంశాఖ వీరిని బ్లాక్‌లిస్టులో పెట్టింది. వీరికి దేశంలో 10 ఏళ్ల పాటు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని కరీంనగర్లో ఇండోనేసియన్లు సంచరించడం, వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 15న ఈ విషయం బయటికి తెలిసింది. వెంటనే తెలంగాణకు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు వీరంతా విజిటింగ్ వీసాపై వచ్చారని, ఇది అక్రమమని పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోగా ఎగతాళి చేశారు. కానీ, ఆయన పట్టు వదలకుండా మార్చి 24న ఇండోనేసియాలోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందులో 2019 ఆగస్టు నుంచి 2020 మార్చి 19 వరకు ఎంతమంది ఇండోనేసియన్లకు విజిటింగ్ వీసాలు ఇచ్చారో తెలపాలని కోరాడు. అక్కడ నుంచి నాలుగు రోజుల్లోనే సమాధానం వచ్చింది. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని భారత దౌత్యకార్యాలయం ద్వారా 1,405 మంది ఇండోనేసియన్లకు భారత్‌లో పర్యటించేందుకు విజిటింగ్ వీసాలను మాత్రమే ఇచ్చామని, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన మతపరమైన లేదా మిషనరీ వీసాలు ఇవ్వలేదని సమాధానంలో పేర్కొంది. ఆధారాలు చూపినా.. వద్దన్నారు! ఈ వివరాలు పట్టుకుని కూడా సదరు ఉద్యమకారుడు చాలామంది ఉన్నతాధికారులను కలిశాడు. వారు అతన్ని పట్టించుకోకపోగా.. ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. విచిత్రంగా కేంద్ర హోంశాఖ దేశంలో అక్రమంగా పర్యటిస్తోన్న విదేశీయులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఏప్రిల్ మొదటివారంలో హుటాహుటిన సదరు ఉద్యమకారుడిని అధికారులు సంప్రదించి అతని వద్ద ఉన్న వివరాలను అడిగి తీసుకోవడం కొసమెరుపు. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటేంటే.. దాదాపు 2 వేలకు పైగా ఇండోనేసియన్లు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. 1,400 మందికి మాత్రమే తాము వీసాలు జారీ చేశామని చెబుతుండగా.. మిగిలిన 600లకుపైగా వీసాలన్నీ ఆన్ అరైవల్‌గా తీసుకున్నవిగా సమాచారం. -
స్నాతకోత్సవం.. వర్చువల్‌గా
వాషింగ్టన్: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భారత విద్యార్థులు, కుటుంబీకులు, మిత్రులు పాల్గొన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరిగే అన్ని స్నాతకోత్సవాలు రద్దవడం తెల్సిందే. దీంతో ఎంబసీ ఆఫ్ ఇండియా స్టూడెంట్ హబ్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించింది. అనుకోని ఘటనలే అంతులేని అవకాశాలను కల్పిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విద్యార్థుల్లోనే భవిష్యత్ ఆవిష్కరణ కర్తలు, ఎంటర్ ప్రెన్యూర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్, ఎంటర్ప్రెన్యూర్ లాలిత్య మున్షా, నటి గౌతమి తడిమెల్ల, తబలా మాస్టర్ దివ్యాంగ్ వాకిల్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణు గోపాల్, ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్లైన్ ఫారం నింపాలి
మస్కట్ : ఒమన్ నుండి భారత్‌కు ప్రయాణించేవారికి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ ప్రకటన జారీ చేసింది. భారత్‌కు విమానాలు తిరిగి ప్రారంభించడం లేదా భారతదేశానికి అత్యవసరంగా ప్రయాణించడానికి ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ ఒమన్‌లోని ప్రవాస భారతీయులు చాలామంది కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. కోవిడ్-19 పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి 14 ఏప్రిల్ 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయులు ఒమన్‌లో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుందని, విమానాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఒమన్ నుండి భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్‌సైట్‌లోని ఈ లింకు ను క్లిక్ చేయాలని పేర్కొంది. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం డేటా (సమాచార) సేకరణ కోసం మాత్రమే అని రాయబార కార్యాలయం తెలిపింది. https://docs.google.com/forms/d/e/1FAIpQLSe5f6iMNMfovllq_6q0BRao8MAXKzcnzCfCnWc9ZVLtvBLfKA/viewform భారత్‌కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ ఎయిర్ పోర్టులో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుందని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు భారత్‌కు చేరుకున్నాక, వారిని నేరుగా వారివారి ఇళ్లకు పంపి 'సెల్ఫ్ క్వారంటైన్' (స్వీయ నిర్బంధం) చేయడమా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడమా అనే దానిపై భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు. 'గల్ఫ్ తదితర దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది చిన్న ఇండ్లు కలిగిన పేద, దిగువ మధ్యతరగతి వారే. తమ ఇండ్లలో 'సెల్ఫ్ క్వారంటైన్' కొరకు ప్రత్యేకంగా విడిగా ఉండటానికి సరైన గదులు, వసతి సౌకర్యాలు లేవు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రాలలో తగినన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండవచ్చని' భీరెడ్డి అన్నారు. ఆర్ధిక మాంద్యం వలన భవిష్యత్తులో లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ నుండి స్వరాష్ట్రం తెలంగాణాకు వాపస్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రవాసుల పునరావాసం, పునరేకీకరణ కొరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా "గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ" కి రూపకల్పన చేయాలని మంద భీరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు చైనాలో తొలి భారతీయ మహిళ ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న ఆమె వైద్య ఖర్చులు ఇప్పటికే కోటి రూపాయలు దాటడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనా, భారత ప్రభుత్వాలను సంప్రదించడంతో పాటు క్రౌడ్‌ఫండింగ్ కూడా మొదలు పెట్టారు. షెన్జెన్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ప్రీతి మహేశ్వరి (45)కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైద్యులు సోమవారం ధృవీకరించారని ఆమె భర్త అశుమాన్ ఖోవాల్ షెన్జెన్కు చెందిన పీటీఐకి తెలిపారు. న్యుమోనియా, టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ డైస్ఫంక్షన్ సిండ్రోమ్ (మోడ్స్), సెప్టిక్ షాక్‌తో ఆమె బాధపడుతున్నారు. చైనాలోని షెన్జెన్లోని షెకౌ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్లు, డయాలసిస్ చికిత్స జరుగుతోంది. అయితే ఈ వైద్యానికవుతున్న ఖర్చును సమకూర్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు మనీష్ థాపా.. ఆర్థిక సహాయం కోసం బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అలాగే ఆమె ఆసుపత్రి ఖర్చుల సహాయార్థం భారతదేశంలోని హెల్త్‌కేర్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ద్వారా సహాయాన్ని కోరారు. ప్రీతి అనారోగ్యం పాలైన జనవరి 11వ తేదీ నుంచి చికిత్స ఖర్చు రోజు రోజుకు పెరుగుతోందని థాపా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చికిత్సకు 10 లక్షల చైనీస్ యువాన్లు అంటే.. భారత కరెన్సీలో కోటి రూపాయలు ఖర్చయిందని, దీంతో హెల్త్‌కేర్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ఇంపాక్ట్‌గురు.కామ్‌కు సంప్రదించామని, గత నాలుగు రోజుల్లో 410 మంది దాతల నుండి 15.27 లక్షలు విరాళం వచ్చినట్టు చెప్పారు. (ఇంపాక్ట్‌గురు.కామ్ ప్రకారం ప్రస్తుతం ఇది 844 మంది దాతల నుండి రూ. 27 లక్షలుగా సేకరించింది) దీనిపై భారత ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామన్నారు. సహాయం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందన్నారు. బంధువుల క్షేమ సమచారంపై హుబీ ప్రావిన్స్‌లోని చాలామంది తమను సంప్రదిస్తున్నారనీ భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చైనాలో నెలకొన్న ఈ ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్న వుహాన్, హుయాంగ్ గాంగ్, ఎఝౌ, ఝిజియాంగ్, ఖియాన్ జింగ్‌లో నివసిస్తున్న భారతీయులకు అన్నివిధాలా సహాయం చేస్తామని వెల్లడించింది. అక్కడ ఆహార కొరత రాకుండా చూసుకుంటున్నామని చైనా అధికారులు భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు. చైనా నగరం వుహాన్‌లో 500 మందికి పైగా భారతీయ వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలుస్తోంది. మరోవైపు చైనాలో తమ బంధువుల గురించి తెలుసుకోవాలనుకునే భారతీయుల కోసం ఎంబసీ రెండు హాట్లైన్లు +8618612083629 , +8618612083617ను ఇప్పటికే ప్రారంభించింది. చదవండి : అచ్చం ఆ సినిమాలో లాగనే చనిపోతున్నారు! -
దీపావళి వేడుకలకు నాట్స్ కు ప్రత్యేక ఆహ్వానం
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా భారతీయులకోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను రాయబార కార్యాలయం ఆహ్వానించింది. తెలుగువారి మేలు కోసం అనేక సేవాకార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ను దీపావళి వేడుకల్లో పాలుపంచుకోవాలని కోరుతూ భారత రాయబార కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. దీంతో నాట్స్ కూడా వాషింగ్టన్ డీసీ దీపావళివేడుకల్లో భాగస్వామి అయింది. ఈ సందర్భంగా భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా ప్రవాస భారతీయ ప్రతినిధులకువిందు ఇచ్చారు. ఇందులో నాట్స్ ప్రతినిధిగా నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని హాజరయ్యారు. నాట్స్ చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలను తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం నాట్స్ కు ఆహ్వానాన్ని పంపడంపై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది.