ఉక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు.. ఆ దేశాల మీదుగా ఇండియాకు! | All possible steps to bring back Indians from Ukraine says Foreign Secretary Shringla | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు.. ఆ దేశాల మీదుగా ఇండియాకు!

Published Fri, Feb 25 2022 4:50 AM | Last Updated on Fri, Feb 25 2022 9:48 AM

All possible steps to bring back Indians from Ukraine says Foreign Secretary Shringla - Sakshi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. రష్యన్‌ భాష మాట్లాడే అధికారులను ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు, అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు పంపిస్తున్నామని అన్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు. ఉక్రెయిన్‌లోని మన దేశస్తులను భద్రంగా తీసుకురావాలని ప్రధాని మోదీ ఆదేశించారని హర్షవర్దన్‌ ఉద్ఘాటించారు. భారత వైమానికి దళం విమానాలతోపాటు వాణిజ్య విమానాలను వాడతామన్నారు. ఉక్రెయిన్‌తోపాటు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. భారత విద్యార్థులతో సహా ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో 4 వేల మంది తిరిగి వచ్చేశారు.  

మాకు రక్షణ కల్పించండి
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి భారతీయ విద్యార్థులు గురువారం పోటెత్తారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, వారి కోసం భారత ఎంబసీ రక్షణపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంబసీ కల్పించిన వసతి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 200 మందికి పూర్తి భద్రతతో కూడిన తగిన వసతి కల్పించినట్లు సమాచారం.  

విద్యార్థులకు అడ్వైజరీ
ఉక్రెయిన్‌లో విధించిన మార్షల్‌ లాతో రాకపోకలు కష్టతరంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించే వారు తమ సమీపంలోని బాంబు షెల్టర్లకు చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ‘ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు గూగుల్‌ మ్యాప్‌ల సాయంతో సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించండి. చాలా వరకు బాంబు షెల్టర్లు భూగర్భ మెట్రోల్లోనే ఉన్నాయి. చుట్టుపక్కల చోటుచేసుకునే పరిణామాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. అన్ని సమయాల్లోనూ గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలి’అని పేర్కొంది.

మరోవైపు, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులందరినీ కాపాడేయత్నం చేస్తున్నామని భారత్‌లో ఆ దేశ రాయబారి ఇగోర్‌ పోలిఖ తెలిపారు.  భారత్‌ ప్రకటనలు సరిపోవని, శాంతిని నెలకొల్పే యత్నం చేయాలని ఇగోర్‌ పేర్కొన్నారు. రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వం తన గగనతలాన్ని మూసివేయడంతో, ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గమధ్యంలోనే వెనుదిరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎయిరిండియా విమానం గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి కీవ్‌లోని బోరీస్పిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.

అప్పటికే రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పౌర విమానసేవలు చాలా ప్రమాదకరంగా మారినందున ఉక్రెయిన్‌ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ సమయంలో ఇరాన్‌ గగనతలంపై ఉన్న ఆ విమానం తిరిగి వెనుదిరిగింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో 182 మంది భారతీయులు గురువారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది విద్యార్థులేనన్నారు. ఈ నెల 22వ తేదీన ఎయిరిండియా పంపిన మొదటి విమానంలో కీవ్‌లో ఉన్న 240 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.  

ఆఖరి క్షణంలో ఆగిపోయారు
ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి బయలుదేరిన ఇద్దరు భారత విద్యార్థులు రష్యా దాడుల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్‌లోని గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన రోణక్‌ షెరాసియా(18), అతడి స్నేహితుడు మహావీర్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు 500 కిలోమీటర్ల దూరంలో చెర్నివిట్సీలో ఉన్న బుకోవినియన్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ(బీఎస్‌ఎంయూ)లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారు గురువారం ఉదయం భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తెల్లవారుజామునే కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టు చెక్‌–ఇన్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లగా విమానం రద్దయ్యిందని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదిలేక మళ్లీ బస్సులో యూనివర్సిటీకి బయలుదేరారు. కీవ్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా, పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు పలుమార్లు వినిపించాయని రోణక్‌ షెరాసియా చెప్పాడు. ఆ భీకర శబ్దాలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement