ఫోటో కర్టసీ, ఇంపాక్ట్‌గురు. కామ్
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు చైనాలో తొలి భారతీయ మహిళ ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న ఆమె వైద్య ఖర్చులు ఇప్పటికే కోటి రూపాయలు దాటడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనా, భారత ప్రభుత్వాలను సంప్రదించడంతో పాటు క్రౌడ్‌ఫండింగ్ కూడా మొదలు పెట్టారు.
షెన్‌జెన్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ప్రీతి మహేశ్వరి (45)కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైద్యులు సోమవారం ధృవీకరించారని ఆమె భర్త అశుమాన్ ఖోవాల్ షెన్‌జెన్‌కు చెందిన పీటీఐకి తెలిపారు. న్యుమోనియా, టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ డైస్ఫంక్షన్ సిండ్రోమ్ (మోడ్స్), సెప్టిక్ షాక్‌తో ఆమె బాధపడుతున్నారు. చైనాలోని షెన్‌జెన్‌లోని షెకౌ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్లు, డయాలసిస్ చికిత్స జరుగుతోంది. అయితే ఈ వైద్యానికవుతున్న ఖర్చును సమకూర్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ఈ నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు మనీష్ థాపా.. ఆర్థిక సహాయం కోసం బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అలాగే ఆమె ఆసుపత్రి ఖర్చుల సహాయార్థం భారతదేశంలోని హెల్త్‌కేర్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ద్వారా సహాయాన్ని కోరారు. ప్రీతి అనారోగ్యం పాలైన జనవరి 11వ తేదీ నుంచి చికిత్స ఖర్చు రోజు రోజుకు పెరుగుతోందని థాపా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చికిత్సకు 10 లక్షల చైనీస్ యువాన్లు అంటే.. భారత కరెన్సీలో కోటి రూపాయలు ఖర్చయిందని, దీంతో హెల్త్‌కేర్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ఇంపాక్ట్‌గురు.కామ్‌కు సంప్రదించామని, గత నాలుగు రోజుల్లో 410 మంది దాతల నుండి 15.27 లక్షలు విరాళం వచ్చినట్టు చెప్పారు. (ఇంపాక్ట్‌గురు.కామ్ ప్రకారం ప్రస్తుతం ఇది 844 మంది దాతల నుండి రూ. 27 లక్షలుగా సేకరించింది) దీనిపై భారత ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామన్నారు. సహాయం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందన్నారు.
బంధువుల క్షేమ సమచారంపై హుబీ ప్రావిన్స్‌లోని చాలామంది తమను సంప్రదిస్తున్నారనీ భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చైనాలో నెలకొన్న ఈ ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్న వుహాన్, హుయాంగ్ గాంగ్, ఎఝౌ, ఝిజియాంగ్, ఖియాన్ జింగ్‌లో నివసిస్తున్న భారతీయులకు అన్నివిధాలా సహాయం చేస్తామని వెల్లడించింది. అక్కడ ఆహార కొరత రాకుండా చూసుకుంటున్నామని చైనా అధికారులు భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు. చైనా నగరం వుహాన్‌లో 500 మందికి పైగా భారతీయ వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలుస్తోంది. మరోవైపు చైనాలో తమ బంధువుల గురించి తెలుసుకోవాలనుకునే భారతీయుల కోసం ఎంబసీ రెండు హాట్‌లైన్‌లు +8618612083629 , +8618612083617ను ఇప్పటికే ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment