సాక్షి, హైదరాబాద్ : ఇండోనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన బృందం మొత్తానికి కోవిడ్ వైరస్ సోకింది. మొదట ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ రాగా, ఆ తర్వాత గురువారం ఏడుగురికి, శుక్రవారం మిగిలిన ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతోపాటు లండన్‌లో చదువుకుంటున్న 18 ఏళ్ల యువతికి కూడా శుక్రవారం కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరినట్లయింది. ఇండోనేసియా బృందంతో పాటు గైడ్‌గా వచ్చిన ఉత్తరప్రదేశ్ వ్యక్తికి మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో కరీంనగర్‌లో, రాష్ట్రంలోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లండన్ నుంచి వచ్చిన యువతి ఈనెల 17న హైదరాబాద్ వచ్చింది. అప్పటికే ఆమెలో కోవిడ్ అనుమానిత లక్షణాలున్నాయి. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే ఉంచి నమూనాలను సేకరించి గాంధీ ఆస్పత్రిలో పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
జవాన్‌కు నెగెటివ్..
సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన 19 కేసుల్లో 10 మంది ఇండోనేసియా దేశస్తులు కాగా, దుబాయ్ నుంచి వచ్చిన వారు ఇద్దరు, లండన్ నుంచి వచ్చిన వారు ఇద్దరు, స్కాట్లాండ్ నుంచి వచ్చిన వారు ముగ్గురు, ఇటలీ, నెదర్లాండ్ నుంచి వచ్చిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. విదేశీయులు 10 మంది కాగా, మన రాష్ట్రానికి చెందిన వారు విదేశాల్లో ఉంటూ ఇక్కడకు వచ్చిన వారు 8 మంది ఉన్నారు. మరొకరు ప్రవాస భారతీయుడు. మొదటి కోవిడ్ బాధితుడికి నయమై ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. మిగిలిన 18 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరు న్యుమోనియాతో బాధపడుతున్నాడు. కాగా, ఇండోనేసియన్లు కాకుండా మిగిలిన తొమ్మిది మందితో కాంటాక్ట్ అయిన 351 మంది వ్యక్తులందరికీ నెగెటివ్ రావడం ఊరట కలిగించే అంశం. ఇక ఇండోనేసియన్లతో కాంటాక్ట్ అయిన 25 మందిని వైద్యాధికారులు శుక్రవారం గాంధీకి తీసుకొచ్చారు. వారికి పరీక్షలు జరుగుతున్నాయి. ఆ వివరాలు తెలియాల్సి ఉంది.
గాంధీకి ఇద్దరు అనుమానితులు
మన్సూరాబాద్ : కోవిడ్ అనుమానితుడు ఎల్‌బీ నగర్‌లో బస్సు ఎక్కడం కలకలం సృష్టించింది. ఏపీలోని భీమవరానికి చెందిన వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి ముంబైకి వచ్చాడు. అక్కడి నుంచి బస్సులో నగరానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం భీమవరం వెళ్లేందుకు ఎల్‌బీనగర్‌లో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిం చాడు. అతని ఎడమ చేతిపై కోవిడ్ అనుమాని తుడిగా సూచిస్తూ సింబల్ ఉండటంతో దాన్ని చూసిన ఆర్‌టీసీ అధికారులు బస్సు ఎక్కేం దుకు అభ్యంతరం తెలిపారు. వెంటనే ఎల్‌బీ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. అతడిని గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
మరో అనుమానితుడు సైతం..
చింతల్‌కుంట మల్లికార్జున్‌నగర్ నార్త్ కాలనీలో ఉండే ఓ వ్యక్తి దుబాయ్ నుంచి 3 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపును చేపడుతున్న బృందం అతని ఇంటికి వెళ్లి వివరాలు సేకరించింది. అతను జ్వరం, దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో గాంధీలోని ఐసోలేషన్ వార్డుకు తరలించింది.
Comments
Please login to add a commentAdd a comment