సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్‌నగర్‌లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్‌ఘాట్‌కు చెందిన యువతితో వివాహమైంది.
ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు.
భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు.
అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వంశీకృష్ణ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment