
పాకిస్తానీయుల నిర్వేదం
సొంత దేశంపై సెటైర్లు, మీమ్స్
పెహల్‌గావ్‌లో మూష్కరమూకల మారణహోమం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఉగ్రవాదులతో రాక్షస కాండకు అండగా నిలిచిందన్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంది. సింధూ నది ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు వీసాల రద్దుతో పలు కఠిన చర్యలు చేపట్టింది. అమాయక పర్యాటకులను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.
పెహల్‌గావ్ (pahalgam) దాడితో భారత దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తన పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బదులిచ్చేందుకు తంటాలు పడుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదురవడం తలనొప్పిగా మారుతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్వయంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బయటా సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయకత్వంపై తమ వ్యతిరేకతను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. తమ ప్రభుత్వం ఎలా విఫలమైందో సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తున్నారు.
రాత్రి 9 తర్వాత వార్ వద్దు
భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తానీయులు తమ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు ఎలా విఫలమయ్యారో ఎత్తిచూపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇండియాతో యుద్ధం వస్తే తట్టుకోగలదా అని తమను తామే ప్రశ్నించుకున్నారు. ఒకవేళ తమతో యుద్ధం చేయాల్సివస్తే రాత్రి 9 గంటలకు ముగించాలని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని చావు కబురు చల్లగా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మరో యూజర్ తమ దేశార్థిక దారుణావస్థను బయటపెట్టారు.
ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో?
పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒకరు ప్రశ్నించగా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మరొకరు సమాధానం ఇచ్చారు. మన బాధల కంటే బాంబు దాడే బెటర్ బ్రో అంటూ ఇంకొకరు స్పందించగా.. ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో అంటూ మరో యూజర్ నిట్టూర్చారు. తమ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫన్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.
చదవండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
మా ప్రభుత్వమే చంపుతోంది..
సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజర్లు స్పందిస్తూ.. ఇప్పటికే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఉందని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవసరం లేదు. ఇప్పటికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.