
అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ దేశాధినేతలు, రాజకుటుంబాలు
లక్షల్లో హాజరైన పోప్ అభిమానులు, సాధారణ పౌరులు
వాటికన్ స్క్వేర్‌లో మొదలై రోమ్‌లోని
మేరీ మేజర్ బాసిలికాలో నిరాడంబరంగా ముగిసిన ఖనన కార్యక్రమం
వాటికన్ సిటీ: నిరుపేదలు, అణగారిన వర్గాలకు ఆపన్నహస్తం అందించిన మానవతామూర్తి, విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది క్యాథలిక్‌ల అత్యున్నత మతాధికారి పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రపంచాధినేతలు, లక్షలాది మంది అభిమానులు నేరుగా వందల కోట్ల మంది క్రైస్తవులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ తుది వీడ్కోలు పలికారు. అభిమానులు, ఆప్తులు శోకతప్త హృదయాలతో వీడ్కోలు పలికాక తాను సదా స్మరించే మేరీమాత చిత్రపటం ఉన్న సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి భూగర్బంలో 88 ఏళ్ల పోప్ శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు.
శనివారం వాటికన్ సిటీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ అంతిమయాత్ర కొనసాగింది. పోప్ కోరిక మేరకు వాటికన్ శివారులోని రోమ్ పరిధిలోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అత్యంత నిరాడంబరంగా ఈ కడసారి క్రతువు కొనసాగింది. ఆయన కోరిక మేరకు పోప్ సమాధి మీద లాటిన్ పదమైన ‘ఫ్రాన్సిస్‌క్యూస్’అనే పదాన్ని చెక్కారు. శ్వాససంబంధ వ్యాధి ముదిరి చివరకు బ్రెయిన్‌స్టోక్, గుండె వైఫల్యంతో ఈ నెల 21వ తేదీన పోప్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
బరువైన హృదయాలతో బారులు తీరిన జనం
అంతకుముందు సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో పోప్ ముఖంపై వాటికన్ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ ఆర్చ్‌బిషప్ డియాగో గియోవన్నీ రవెల్లీ దవళవర్ణ పట్టు వ్రస్తాన్ని కప్పారు. తర్వాత జింక్ పూత పూసిన శవపేటిక మూతను పెట్టి సీల్‌వేశారు. తర్వాత పోప్ పార్థివదేహాన్ని భద్రంగా ఉంచిన శవపేటికను చర్చి సహాయకులు సెయింట్ పీటర్స్ స్వే్కర్ భారీ బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చారు.
అక్కడే ప్రపంచ దేశాల అధినేతలు, పలు రాజ్యాల రాజులు, పాలకులు, అంతర్జాతీయ సంస్థల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 2,50,000 మంది పోప్ అభిమానులు ఆయనకు చివరిసారిగా ఘన నివాళులర్పించారు. అక్కడ ఉన్నవారిలో చాలా మంది కన్నీరుమున్నీరుగా విలపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, బ్రిటన్ యువరాజు విలియం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ దంపతులు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ దంపతులు, ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ సలేహ్ షరియతా, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ, స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ఐర్లాండ్ అధ్యక్షుడు హిగ్గిన్స్‌సహా 160 మంది వీవీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోప్‌కు అంజలి ఘటించారు.
భారత్ తరఫున ముర్ముతోపాటు కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు, సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డెప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలు హాజరయ్యారు. పోటెత్తిన లక్షలాది మంది పోప్ అభిమానులు, క్రైస్తవులతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ కిక్కిరిసిపోయింది. తోపులాట ఘటనలు జరక్కుండా అధికారులు నగరవ్యాప్తంగా భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేసి మొత్తం అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిదాకా ప్రత్యక్ష ప్రసారాలుచేశారు.
సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద అధినేతలు నివాళులర్పించాక శవపేటికను ప్రత్యేకవాహనంలోకి ఎక్కించాక అంతిమయాత్ర మొదలైంది. నగరంలో దారి పొడవునా వీధుల్లో లక్షలాది మంది జనం బారులు తీరి ప్రియతమ పోప్‌కు ‘‘పాపా ఫ్రాన్సిస్కో’’అని నినాదాలు చేస్తూ తుది వీడ్కోలు పలికారు. పోప్‌గా బాధ్యతలు చేపట్టాక ఈ 12 ఏళ్ల కాలంలో పోప్‌చేసిన మంచి పనులను గుర్తుచేసుకున్నారు. అంత్యక్రియలు మొత్తం 91 ఏళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే మార్గదర్శకత్వంలో నిర్వహించారు. వేలాది మంది ఇటలీ పోలీసుల పహారా మధ్య ఈ అంతిమయాత్ర ముందుకు సాగింది. గగనతల రక్షణ కోసం హెలికాప్టర్లను వినియోగించారు.
స్వాగతం పలికిన ఖైదీలు, ట్రాన్స్‌జెండర్లు
ఈ అంతిమయాత్రలో స్థానికులతోపాటు ప్రపంచదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది జనం రహదారికి ఇరువైపులా నిలబడి కడసారి తమ పోప్‌ను చూసుకోగా శవపేటికను తీసు కొచ్చిన వాహనశ్రేణి ఎట్టకేలకు సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అక్కడే వేచి ఉన్న ఖైదీలు, లింగమారి్పడి వ్యక్తులు, నిరాశ్రయులు, శరణార్థులు, వలసదారులు స్విస్ గార్డ్స్ బలగాల నుంచి పోప్ అంతిమయాత్ర బాధ్యతలను తీసుకున్నారు.
పోప్ మొదట్నుంచీ అణగారిన వర్గాలతోపాటు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ఖైదీ లు, ట్రాన్స్‌జెండర్లు, నిరాశ్రయులు, శరణార్థుల అభ్యున్నతి కోసం పాటుపడటం తెల్సిందే. చర్చి అంతర్భాగంలోని భూగర్భంలో శవపేటికను ఉంచే కార్యక్రమంలో ప్రధానంగా ఖైదీ లు, వలసదారులే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కార్డినళ్లు, పోప్ అత్యంత సన్నిహితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ కవరేజీకి మీడియాను అనుమతించలేదు. వాటికన్ సిటీలో కాకుండా వేరే చోట పోప్‌ను ఖననం చేయడం గత వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.