
చారిత్రకంగా చూస్తే... పోప్స్ మృతదేహాలను వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం రివాజు. ఈ సంప్రదాయాన్ని కాదని 1903లో పోప్ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో పూడ్చిపెట్టారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఆఖరి కోరిక ఏంటో తెలుసా?
తన భౌతిక కాయాన్ని వాటికన్ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి(రోమ్)లో ఖననం చేయాలనేది ఆయన మనోవాంఛ. 2023 డిసెంబరు 12న మెక్సికన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలకు సంబంధించి మనసులోని మాట బయటపెట్టారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో అంతకుముందే చర్చించినట్టు తెలిపారు.
సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి విషయానికొస్తే... ఆరుగురు పోప్స్ మృతదేహాలను అక్కడ ఖననం చేశారు. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9 అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు. శిశువైన జీసస్ ను కన్య మేరీ ఎత్తుకున్న ‘సేలస్ పోపులి రోమని’ (రోమ్ ప్రజలకు రక్షణ) పెయింటింగ్ ఆ చర్చిలో ఉంది. ఆ చిత్రంతో పోప్ ఫ్రాన్సిస్ ది ప్రత్యేక అనుబంధం. పోప్ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన దాని ఎదుట ప్రార్థనలు చేసేవారు.
:::జమ్ముల శ్రీకాంత్
(Source: AmoMama.com. Photo Credit: The Catholic Weekly).