ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్‌ అణుబాంబులు! | Nuclear sites In Iran the US and Israel could hit If Talks Fail | Sakshi
Sakshi News home page

ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్‌ అణుబాంబులు!

Published Wed, Apr 2 2025 10:25 AM | Last Updated on Wed, Apr 2 2025 11:14 AM

Nuclear sites In Iran the US and Israel could hit If Talks Fail

ఇరాన్ ‘యురేనియం సరుకు’ లెక్క. 

నతాంజ్.. ఫర్దో.. ఇస్ఫహాన్.. 

ఇరాన్ ‘అణు’ ఆయువుపట్లు. 

అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలు ఇవే. 

అమెరికాతో చర్చలకు ఇరాన్ రాని పక్షంలో.. ఒకవేళ మంతనాలకు ఇరాన్ వచ్చినా చర్చలు విఫలమయ్యే పక్షంలో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపేందుకు ఇరాన్ భూభాగంపై లక్ష్యాలుగా ఎంచుకునే మూడు కీలక అణు స్థావరాలు.. నతాంజ్, ఫర్దో, ఇస్ఫహాన్. ఒక చోట అని కాకుండా ఇరాన్ గడ్డపై పలు ప్రాంతాల్లో అణు కార్యక్రమం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నుంచి వైమానిక దాడుల ముప్పు పొంచివున్న నేపథ్యంలో రక్షణ కోసం కొన్ని అణు స్థావరాలను భూగర్భంలో ఇరాన్ నిర్మించుకుంది. 

అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఇరాన్ 2015లో పీ5 (పర్మినెంట్5/ఐరాసలో శాశ్వత సభ్యత్వం గల) దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అణు కార్యక్రమాన్ని చాలావరకు నిలిపివేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది. అంతేకాకుండా తమ అణు స్థావరాల్లో అంతర్జాతీయ తనిఖీలను అనుమతించేందుకు అంగీకరించింది. ఒప్పందం అమల్లో ఉన్నా ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేక్ పడలేదన్న కారణంతో ట్రంప్ తొలి హయాంలో 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇదే అదనుగా ఇరాన్ కూడా తమ అణు కార్యక్రమంపై ఆయా దేశాలు విధించిన ఆంక్షలను ఆ మరుసటి ఏడాది నుంచి విస్మరించడం ఆరంభించింది. అలా ఒప్పందం విచ్ఛిన్నమవడంతో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ విస్తరించింది. 

భారీ అణుశక్తి..
2015 నాటి ఒప్పందం అమలైతే ఇరాన్ అణుబాంబు తయారీకి కావాల్సిన వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి కనీసం సంవత్సర కాలం పట్టేది. ఎప్పుడైతే ఒప్పందం విఫలమైందో ఆ వెంటనే యురేనియం శుద్ధిని ఇరాన్ వేగవంతం చేసింది. ఫలితంగా వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తి కాలాన్ని ఏడాది నుంచి కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వ్యవధికి ఇరాన్ గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇరాన్ ప్రస్తుతం రెండు ప్రదేశాల్లో యురేనియంను 60% ఫిజైల్ ప్యూరిటీ వరకు శుద్ధి చేస్తోంది. దీని అర్థం 90% వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి ఇరాన్ చేరువైనట్టే. శుద్ధితో యురేనియం స్వచ్ఛత పెరిగేకొద్దీ కేంద్రక విచ్ఛిత్తి (విస్ఫోటన) సామర్థ్యం అధికమవుతుంది. సైద్ధాంతికంగా చూస్తే.. యురేనియం శుద్ధిని మరింత కొనసాగిస్తే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు ఇరాన్ దగ్గరున్న యురేనియంతో ఆరు అణుబాంబులు రెడీ అవుతాయి!.

నతాంజ్.. భూగర్భంలో మూడంతస్తులు! 
రాజధాని టెహ్రాన్ నగరానికి దక్షిణంగా నతాంజ్ వద్ద భూగర్భంలో ఒకటి (ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్), భూమి ఉపరితలంపై ఒకటి (పైలట్ ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్) చొప్పున రెండు యురేనియం శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో భూగర్భ ప్లాంటులో ప్రస్తుతం 16 వేల సెంట్రీఫ్యూజెస్ ఉండగా 13 వేల సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. ఇవి యురేనియంను 5% స్వచ్ఛత వరకు శుద్ధి చేస్తున్నాయి. భూగర్భంలో మూడు అంతస్తుల్లో ఈ ప్లాంట్ ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ భూగర్భ స్థావరాన్ని ఎంతవరకు నాశనం చేయగలవనేది ప్రశ్నార్థకం. ఇక భూ ఉపరితలంపై ఉన్న ప్లాంటులో వందల సెంట్రీఫ్యూజెస్ మాత్రమే ఉన్నప్పటికీ 60% స్వచ్ఛత వరకు యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోంది. 

ఏమిటీ సెంట్రీఫ్యూజెస్? 
యురేనియం శుద్ధి ప్రక్రియలో సెంట్రీఫ్యూజెస్ పాత్ర కీలకం. సహజ యురేనియంలో యురేనియం-238 అధికంగా, యురేనియం-235 స్వల్పంగా (0.7%) ఉంటాయి. అణు ఇంధనం తయారీకి ఎక్కువ గాఢతతో కూడిన యురేనియం-235 కావాలి. యురేనియం-238 నుంచి యురేనియం-235ను వేరుచేయడానికి అపకేంద్ర బలాన్ని సెంట్రీఫ్యూజెస్ ఉపయోగించుకుంటాయి. సెంట్రీఫ్యూజెస్ నిమిషానికి 50 వేల రౌండ్లు తిరుగుతాయి. ఈ ప్రక్రియలో భార అణువులు కేంద్రానికి దూరంగా తోసివేయబడితే, తేలికపాటి అణువులు కేంద్రానికి దగ్గరగా వస్తాయి. యురేనియంను వాయువు (యూఎఫ్6)గా మార్చి వేగంగా తిరిగే సిలిండర్ల (సెంట్రీఫ్యూజెస్)లోకి పంపుతారు. అధిక సాంద్రతతో కూడిన యురేనియం-238 గల భార యూఎఫ్6 అణువులు ఆ సిలిండర్ల వెలుపలి అంచుల వద్దకు, అల్ప సాంద్రతతో కూడిన యురేనియం-235 గల తేలికపాటి యూఎఫ్6 అణువులు కేంద్రం వద్దకు చేరతాయి. అలా యురేనియం-235ను వేరుచేసి తర్వాత దశకు పంపుతారు. బాగా శుద్ధి అయిన (హైలీ ఎన్రిచ్ద్) యురేనియంను అణ్వాయుధాల తయారీలోనూ, అల్ప శుద్ధి (లో ఎన్రిచ్ద్) యురేనియంను అణు రియాక్టర్లలో వినియోగిస్తారు. 

ఫర్దో.. పర్వతగర్భంలో! 
భద్రత పరంగా నతాంజ్ భూగర్భ ప్లాంటు కంటే ఫర్దోలోని యురేనియం శుద్ధి కేంద్రం ఉత్తమమైనది. ఎందుకంటే దీన్ని పర్వతాన్ని తొలిచి నిర్మించారు. ఇక్కడ రెండు వేల దాకా సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మూడో తరానికి చెందిన అత్యాధునిక ఐఆర్-6 సెంట్రీఫ్యూజ్ యంత్రాలను వినియోగిస్తుండటం విశేషం. 

ఇస్ఫహాన్.. శుద్ధి చేసిన యురేనియం నిల్వ!  
దేశంలో రెండో అతి పెద్ద నగరం ఇస్ఫహాన్. ఇరాన్ ఇక్కడ భారీ న్యూక్లియర్ టెక్నాలజీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఫ్యూయెల్ ప్లేట్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీలో యురేనియంను ‘యురేనియం హెక్సాఫ్లోరైడ్ (యూఎఫ్6)గా మార్చి సెంట్రీఫ్యూజెస్ యంత్రాల్లోకి పంపుతారు. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఇక్కడే నిల్వ చేస్తుంది.
-జమ్ముల శ్రీకాంత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement