
మళ్లీ నువ్వే కావాలి రాజా!
రాచరికానికే కొందరు నేపాలీయుల మొగ్గు
మాజీ రాజు జ్ఞానేంద్రకు పెరుగుతున్న మద్దతు
బూజు పట్టిన రాజరికాన్ని నేపాల్ ప్రజలు 19 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారు. నాటి నాటకీయ పరిణామాలతో రాజు జ్ఞానేంద్ర షా (77) చేసేది లేక గద్దె దిగాడు. కిరీటం పక్కన పెట్టి, సింహాసం దిగి, రాజదండం వదిలేసి మాజీ అయ్యాడు. రాజభవనం ‘నారాయణ్ హితి ప్యాలెస్’ను ఖాళీ చేశాడు. సాధారణ పౌరుడిగా జీవనం ఆరంభించాడు. ఇదంతా పాత ముచ్చట. కొందరు నే’పాలితులు’ మళ్లీ ఇప్పుడు ‘రాజరికమే ముద్దు’ అంటున్నారు. రాజు పరిపాలనే కావాలని కోరుకుంటున్నారు.
మాజీ రాజు జ్ఞానేంద్ర షా(Gyanendra Shah) ఇటీవలి కాలంలో దేశంలో పర్యటిస్తున్నారు. పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకుని రెండు నెలల అనంతరం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆదివారం పది వేల మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ‘దేశాన్ని మీరే కాపాడాలి’ అంటూ ఆయనను ఉద్దేశించి నినాదాలతో హోరెత్తించారు. ‘రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలి. రాజు మళ్లీ రావాలి. మాకు రాజరికమే(Monarchy) కావాలి. మా రాజు చిరకాలం జీవించాలి’ అని వారంతా గళమెత్తారు. హిందూ మతాన్ని మళ్లీ దేశ అధికారిక అభి‘మతం’గా మార్చాలని డిమాండ్ చేశారు. జ్ఞానేంద్ర ఎలాంటి వ్యాఖ్యలూ లేకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.
జ్ఞానేంద్ర మామూలోడు కాదు
రాజభవనంలో తమ కుటుంబ సభ్యుల ఊచకోత దుర్ఘటన దరిమిలా.. 2002లో జ్ఞానేంద్ర షా నేపాల్ రాజు అయ్యారు. అప్పటినుంచి దేశ రాజ్యాంగాధినేతగా నామమాత్ర అధికారాలతో నెట్టుకొచ్చిన ఆయన.. 2005లో రాజకీయ, కార్యనిర్వహణాధికారాలను కూడా సొంతం చేసుకుని సంపూర్ణాధికారం చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని, పార్లమెంటును రద్దు చేయడమే కాకుండా రాజకీయ నాయకులు, జర్నలిస్టులను జైళ్లలో పెట్టించారు. సమాచార వ్యవస్థలను స్తంభింపజేసి, అత్యయిక పరిస్థితి ప్రకటించారు. తన ఏలుబడికి వీలుగా సైన్యాన్ని రంగంలోకి దింపారు.

ఈ ఘటనలు ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎగదోశాయి. 2006లో దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు మిన్నుముట్టడంతో జ్ఞానేంద్ర సింహాసనం దిగారు. దేశంలో 240 ఏళ్లుగా కొనసాగుతున్న హిందూ రాజరికాన్ని రద్దు చేయాలని నేపాల్ పార్లమెంటు 2008లో నిర్ణయించడంతో ఆయన రాయల్ ప్యాలెస్ విడిచిపెట్టారు. అలా నేపాల్ 2008లో లౌకిక, గణతంత్ర రాజ్యమైంది. అయితే..
తమ గణతంత్ర రాజ్యం అనుకున్నంత ‘ఘన’తంత్రంగా లేదంటూ నేపాల్ ప్రజల్లో తాజాగా అసమ్మతి పెచ్చరిల్లుతోంది. దేశంలో రాజకీయ అస్థిరత వేళ్లూనుకుందని, అవినీతి అర్రులు చాచి విచ్చలవిడిగా పెరిగిందని, ఆర్థిక రంగం కుదేలైందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజరికం రద్దయిన 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశంలో 13 ప్రభుత్వాలు మారడమే రాజకీయ అస్థిరతకు తార్కాణమని అసంతృప్తవాదులు మండిపడుతున్నారు. దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వారు అభిలషిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో రాజరిక వ్యవస్థకు మళ్లీ అవకాశం లేదని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి సహా పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మావోయిస్టు ప్రధానిగా ప్రచండ!
ఇప్పుడు మనం చూస్తున్న హిమ రాజ్యం నేపాల్(Nepal) ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఆ చిన్న ముక్కలన్నిటిని రాజు పృథ్వీనారాయణ్ షా 1768లో ఏకీకృతం చేసి ‘నేపాల్ సామ్రాజ్యం’గా మార్చారు. 1800 సంవత్సరం నుంచి రాజప్రతినిధులు, ప్రధానమంత్రులు నియమితులై షా వంశ రాజుల పేరిట అధికారం చెలాయిస్తూ వచ్చారు. అప్పట్లో రాజు పదవి లాంఛనప్రాయం. తన పూర్వీకుల మాదిరిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే రాజు త్రిభువన్ షా 1950లో ‘రాజకీయ పాత్ర’ను కూడా కొత్తగా తలకెత్తుకున్నారు. ఇక నాటి నుంచి 2006లో ‘రాజు పదవీచ్యుతి ఉద్యమం’ కొనసాగే వరకు షా వంశ రాజులు రాజకీయాధికారం కూడా చెలాయించారు.
త్రిభువన్ షా కుమారుడు మహేంద్ర షా ఆధునిక నేపాల్ రూపశిల్పి. ‘హిందూ రాజరికం’ భావనకు కూడా ఆయనే మార్గదర్శి. తదనంతర కాలంలో ప్రజల నుంచి ఎదురైన నిరసనలను దృష్టిలో ఉంచుకున్న రాజు బీరేంద్ర షా 1990లో ‘సంపూర్ణ రాజరికం నుంచి రాజ్యాంగ రాజరికానికి’ నేపాల్ పరివర్తన చెందేందుకు అంగీకరించి, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుతో అధికారం పంచుకోవడానికి సంసిద్ధుడయ్యాడు.
ఇలా రాజీ కుదిరినా ప్రజల్లో అసమ్మతి సెగ మాత్రం చల్లారలేదు. 1990వ దశకం మధ్యలో దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం విస్తరించింది. ‘ప్రచండ’గా సుప్రసిద్ధుడైన మావోయిస్టు ఉద్యమ నేత పుష్పకమల్ దహాల్ ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయ్యాడు.
రాజకుటుంబంలో రక్తపాతం!
2001లో నేపాల్ రాజభవనంలో చోటుచేసుకున్న మారణకాండలో రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, మరో ఎనిమిది మంది రాజ కుటుంబీకులు హత్యకు గురయ్యారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి పెద్దలు అంగీకరించకపోవటంతో యువరాజు దీపేంద్ర ఆగ్రహించి మద్యం మత్తులో తన కుటుంబ సభ్యులను చంపడమే కాకుండా తానూ తుపాకితో కాల్చుకుని మరణించాడు. ఈ పరిణామం తర్వాత జ్ఞానేంద్ర షా రాజు అయినప్పటికీ ఆయన పదవీకాలం స్వల్పమే. జ్ఞానేంద్రకు తాజాగా ఖాట్మండు విమానాశ్రయం వద్ద స్వాగతం పలకాలని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా సామాజిక మాధ్యమాల వేదికగా నేపాలీలకు పిలుపునివ్వడం కొసమెరుపు! దేశంలో ఎన్నికైన తొలి ప్రధానమంత్రి బి.పి.కొయిరాలాకు మనీషా స్వయానా మనవరాలు.
::జమ్ముల శ్రీకాంత్
(Courtesy: CNN, The Times of India, WION, India Today, Al Zazeera)
Comments
Please login to add a commentAdd a comment