basilica church
-
ప్రజా పోప్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు
వాటికన్ సిటీ: నిరుపేదలు, అణగారిన వర్గాలకు ఆపన్నహస్తం అందించిన మానవతామూర్తి, విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది క్యాథలిక్‌ల అత్యున్నత మతాధికారి పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రపంచాధినేతలు, లక్షలాది మంది అభిమానులు నేరుగా వందల కోట్ల మంది క్రైస్తవులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ తుది వీడ్కోలు పలికారు. అభిమానులు, ఆప్తులు శోకతప్త హృదయాలతో వీడ్కోలు పలికాక తాను సదా స్మరించే మేరీమాత చిత్రపటం ఉన్న సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి భూగర్బంలో 88 ఏళ్ల పోప్ శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. శనివారం వాటికన్ సిటీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ అంతిమయాత్ర కొనసాగింది. పోప్ కోరిక మేరకు వాటికన్ శివారులోని రోమ్ పరిధిలోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అత్యంత నిరాడంబరంగా ఈ కడసారి క్రతువు కొనసాగింది. ఆయన కోరిక మేరకు పోప్ సమాధి మీద లాటిన్ పదమైన ‘ఫ్రాన్సిస్క్యూస్’అనే పదాన్ని చెక్కారు. శ్వాససంబంధ వ్యాధి ముదిరి చివరకు బ్రెయిన్‌స్టోక్, గుండె వైఫల్యంతో ఈ నెల 21వ తేదీన పోప్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.బరువైన హృదయాలతో బారులు తీరిన జనం అంతకుముందు సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో పోప్ ముఖంపై వాటికన్ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ ఆర్చ్‌బిషప్ డియాగో గియోవన్నీ రవెల్లీ దవళవర్ణ పట్టు వ్రస్తాన్ని కప్పారు. తర్వాత జింక్ పూత పూసిన శవపేటిక మూతను పెట్టి సీల్‌వేశారు. తర్వాత పోప్ పార్థివదేహాన్ని భద్రంగా ఉంచిన శవపేటికను చర్చి సహాయకులు సెయింట్ పీటర్స్ స్వే్కర్ భారీ బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చారు. అక్కడే ప్రపంచ దేశాల అధినేతలు, పలు రాజ్యాల రాజులు, పాలకులు, అంతర్జాతీయ సంస్థల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 2,50,000 మంది పోప్ అభిమానులు ఆయనకు చివరిసారిగా ఘన నివాళులర్పించారు. అక్కడ ఉన్నవారిలో చాలా మంది కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, బ్రిటన్ యువరాజు విలియం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ దంపతులు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ దంపతులు, ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ సలేహ్ షరియతా, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ, స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ఐర్లాండ్ అధ్యక్షుడు హిగ్గిన్స్సహా 160 మంది వీవీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోప్‌కు అంజలి ఘటించారు. భారత్ తరఫున ముర్ముతోపాటు కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు, సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డెప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలు హాజరయ్యారు. పోటెత్తిన లక్షలాది మంది పోప్ అభిమానులు, క్రైస్తవులతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ కిక్కిరిసిపోయింది. తోపులాట ఘటనలు జరక్కుండా అధికారులు నగరవ్యాప్తంగా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేసి మొత్తం అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిదాకా ప్రత్యక్ష ప్రసారాలుచేశారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద అధినేతలు నివాళులర్పించాక శవపేటికను ప్రత్యేకవాహనంలోకి ఎక్కించాక అంతిమయాత్ర మొదలైంది. నగరంలో దారి పొడవునా వీధుల్లో లక్షలాది మంది జనం బారులు తీరి ప్రియతమ పోప్‌కు ‘‘పాపా ఫ్రాన్సిస్కో’’అని నినాదాలు చేస్తూ తుది వీడ్కోలు పలికారు. పోప్‌గా బాధ్యతలు చేపట్టాక ఈ 12 ఏళ్ల కాలంలో పోప్చేసిన మంచి పనులను గుర్తుచేసుకున్నారు. అంత్యక్రియలు మొత్తం 91 ఏళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే మార్గదర్శకత్వంలో నిర్వహించారు. వేలాది మంది ఇటలీ పోలీసుల పహారా మధ్య ఈ అంతిమయాత్ర ముందుకు సాగింది. గగనతల రక్షణ కోసం హెలికాప్టర్లను వినియోగించారు. స్వాగతం పలికిన ఖైదీలు, ట్రాన్స్జెండర్లు ఈ అంతిమయాత్రలో స్థానికులతోపాటు ప్రపంచదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది జనం రహదారికి ఇరువైపులా నిలబడి కడసారి తమ పోప్‌ను చూసుకోగా శవపేటికను తీసు కొచ్చిన వాహనశ్రేణి ఎట్టకేలకు సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అక్కడే వేచి ఉన్న ఖైదీలు, లింగమారి్పడి వ్యక్తులు, నిరాశ్రయులు, శరణార్థులు, వలసదారులు స్విస్ గార్డ్స్ బలగాల నుంచి పోప్ అంతిమయాత్ర బాధ్యతలను తీసుకున్నారు. పోప్ మొదట్నుంచీ అణగారిన వర్గాలతోపాటు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ఖైదీ లు, ట్రాన్స్జెండర్లు, నిరాశ్రయులు, శరణార్థుల అభ్యున్నతి కోసం పాటుపడటం తెల్సిందే. చర్చి అంతర్భాగంలోని భూగర్భంలో శవపేటికను ఉంచే కార్యక్రమంలో ప్రధానంగా ఖైదీ లు, వలసదారులే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కార్డినళ్లు, పోప్ అత్యంత సన్నిహితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ కవరేజీకి మీడియాను అనుమతించలేదు. వాటికన్ సిటీలో కాకుండా వేరే చోట పోప్‌ను ఖననం చేయడం గత వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. -
పోప్ స్పృహలోనే ఉన్నారు
రోమ్: ‘పోప్ ఫ్రాన్సిస్(88) స్పృహలోనే ఉన్నారు. అయితే, సంక్లిష్టమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కార ణంగా ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది’అని వాటికన్ ఆదివారం తెలిపింది. శనివారం రాత్రి శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతోపాటు, రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయాయి. పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోలేని కారణంగా ప్రారంభించిన ఆక్సిజన్ సరఫరాను ఆదివారం కూడా కొనసా గించారు. రక్తం ఎక్కించినట్లు వాటి కన్ వర్గాలు వివరించాయి. ‘రాత్రి ప్రశాంతంగా గడి చింది. ఆయన విశ్రాంతి తీసుకున్నారు’అని పేర్కొ న్నాయి. మరికొన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన ట్లు వెల్లడించింది. పోప్ బెడ్‌పై నుంచి లేచారా, ఏమైనా ఆహారం తీసుకున్నారా అనే విషయాలను మాత్రం వాటికన్ ప్రస్తావించలేదు. బ్రాంకైటిస్ తీవ్ర రూపం దాల్చడంతో పోప్ ఈ నెల 14వ తేదీన గెమెల్లి ఆస్పత్రిలో చేరడం తెలిసిందే.వాటికన్లో ప్రత్యేక ప్రార్థనలుఆదివారం ఉదయం సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ ఫ్రాన్సిస్ హోలీ ఇయర్ ప్రారంభ వేడుకలను ప్రారంభించాల్సి ఉంది. ఆయన ఆస్పత్రిలో ఉన్న కారణంగా ఆర్చ్ బిషప్ రినో ఫిసిచెల్లా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం చేపట్టారు. ‘ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నా పోప్ ఫ్రాన్సిస్ మనకు సన్నిహితంగా మనమధ్యే ఉన్నట్లుగా ఉంది’అని ఫిసిచెల్లా అన్నారు.ఫ్రాన్సిస్ రాజీనామా చేయబోరుతీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో పోప్ ఫ్రాన్సిస్ పదవికి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వదంతులను వాటికన్ అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పోప్ తన విధులను నిర్వహించలేని సమయంలో ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఇలాంటి సందర్భం తలెత్తినప్పుడు ఏం చేయాలన్న దానిపై పోప్ స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నాయి. వైద్యపరమైన అశక్తత ఏర్పడితే రాజీనామా లేఖ రాసి ఉంచినట్లు గతంలోనే పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్‌ను వాటికన్ ఉన్నతాధికారులు కొందరు రహస్యంగా కలిసినట్లు వస్తున్న వార్తలను సైతం తోసిపుచ్చాయి. ఫ్రాన్సిస్ ఆరోగ్యం, ఆయన కోలుకోవడం, తిరిగి వాటికన్ రావడంపైనే మాట్లాడుకోవాలే తప్ప, ఇటువంటి అవసరం లేని అంశాలంటూ స్పష్టం చేశాయి. -
ఆయుధాల గర్జనలు ఆగిపోవాలి
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారు. ప్రపంచమంతటా ఘర్షణలు ఆగిపోవాలని, శాంతి సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. బుధవారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు తరలివచి్చన వేలాది మందిని ఉద్దేశించి పోప్ బాసిలికా చర్చి బాల్కనీ నుంచి ప్రసంగించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఆశీస్సులు అందజేశారు. అమాయకుల ఉసురు తీస్తున్న యుద్ధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయుధాలు నిప్పులు కక్కుతున్న చోట ఇకనైనా కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఇప్పటికైనా ముగించాలని ఇరుపక్షాలకు హితవు పలికారు. జరిగిన నష్టం చాలని అన్నారు. సుదీర్ఘ శాంతిని నెలకొల్పే దిశగా చర్చలకు రెండు దేశాలూ చొరవ తీసుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ముగించి, సంప్రదింపులకు తలుపులు తెరవాల్సిన సమయం వచి్చందన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల పోప్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలో ఆయుధాల గర్జనలు ఆగిపోవాలని, నిశ్శబ్దం తిరిగి రావాలని పేర్కొన్నారు. గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వారి క్షుద్బాధ తీర్చాలని, మానవతా సాయం విరివిగా అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గాజాలో కాల్పుల విరమణకు సిద్ధం కావాలని హమాస్, ఇజ్రాయెల్‌కు పోప్ సూచించారు. బందీలను విడుదల చేయాలని, తద్వారా శాంతికి బాటలు వేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. లెబనాన్, మయన్మార్, సిరియా, ఆఫ్రికా తదితర దేశాల్లో సంఘర్షణల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపైనా పోప్ మాట్లాడారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో వ్యాధుల బారినపడి పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చికిత్స అందించాలని, సాంత్వన కలిగించాలని మానవతావాదులను కోరారు. -
ప్రజలు లేకుండానే పోప్ ప్రార్థనలు
వాటికన్ సిటీ: కరోనా కారణంగా వాటికన్ సిటీ వెలవెలబోయింది. ఏటా గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్) ఆదివారం ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఈ ఏడాది వాటికన్ సిటీని మూసివేయడంతో, భక్తులు లేకుండానే పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్ పీటర్స్ బసిలికా లోపలే నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ అతి తక్కువ మంది హాజరు కాగా, వారు కూడా భౌతిక దూరాన్ని పాటించారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి ఆశలపై గండి కొట్టిందని, హృదయాలపై మోయరాని భారాన్ని పెట్టిందని అన్నారు. -
600 ఏళ్ల నాటి చర్చి.. కుప్పకూలింది
ఇటలీలో కనీవినీ ఎరుగని స్థాయిలో వచ్చిన భూకంపం.. అక్కడ పెను విలయాన్ని సృష్టించింది. ఈ భూకంప ప్రభావానికి 600 సంవత్సరాల నాటి సుప్రసిద్ధ బాసిలికా చర్చి కూడా నేలమట్టం అయ్యింది. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని జాతీయ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. అయితే అదృష్టవశాత్తు ఇంత పెద్ద ఎత్తున భూకంపం వచ్చి, భవనాలు కూలిపోయినా ప్రాణనష్టం మాత్రం మరీ అంత తీవ్రంగా లేదు. అయితే చాలా భవనాలు శిథిలం అయిపోయాయని, చారిత్రక కేంద్రాలు కూడా పాడయ్యాయని, ప్రస్తుతం అక్కడ విద్యుత్తు, నీటిసరఫరాలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని పౌర సంరక్షణ సంస్థ అధినేత ఫాబ్రిజియో కర్షియో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) భూకంపం రావడంతో.. చాలామంది ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఉంబ్రియా ప్రాంతంలో తొలుత ప్రారంభమైన భూకంపం.. ఆ తర్వాత అక్కడకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోమ్, వెనిస్లలోకూడా కనిపించింది. ఇంతకుముందు 1980 సంవత్సరంలో ఇటలీలో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 3వేల మంది మరణించారు. దాని తర్వాత ఇదే అత్యంత తీవ్రమైన భూకంపంగా నమోదైంది. మొదటి భూకంపం వచ్చిన తర్వాత పగలంతా చిన్న చిన్న ఆఫ్టర్ షాక్స్ కనిపిస్తూనే ఉన్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 -5 పాయింట్ల మధ్య నమోదైంది. ఇది దేశానికి చాలా కష్టకాలమని ఇటలీ ప్రధానమంత్రి మాటెయో రెంజి అన్నారు. పాడైన ప్రతి ఒక్క ఇంటినీ ప్రభుత్వమే పునర్నిర్మిస్తుందని చెప్పారు. 14వ శతాబ్దం నాటి సెయింట్ బెనెడిక్ట్ బాసిలికా కూడా కూలిపోవడం దారుణమన్నారు. ఇన్ని శతాబ్దాలలో వచ్చిన చాలా భూకంపాలను తట్టుకుని నిలబడిన ఈ మహా నిర్మాణం.. తాజా భూకంపానికి మాత్రం పూర్తిగా కూలిపోయింది. ఇక్కడకు ప్రతియేటా ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు.